నమ్మకాలు-నిజాలు: ప్రసవం తరువాత కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు ఎందుకు? ఏమిటీ రుగ్మత

గర్భధారణ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ శైలజ చందు
    • హోదా, బీబీసీ కోసం

ప్రసవానంతరం కొందరు మహిళలు వింతగా ప్రవర్తిస్తారు. లేనివి ఉన్నట్లుగా.. ఉన్నవి లేనట్లుగా భావిస్తుంటారు. దీన్నే పోస్ట్ పార్టం సైకోసిస్‌గా పిలుస్తారు. ఇదొక మానసిక సమస్య. దీనితో బాధపడే ప్రసన్న కథ ఇది.

"రాధికా, ఆ ఇస్త్రీ పెట్టె పారెయ్యవే".

"ఏం అక్కా, కొత్తది తెస్తానన్నారా బావగారు, అమెరికా నుంచి?"

"పారెయ్యి ముందు" అక్క గొంతులో కఠినత్వం చూసి ఆశ్చర్యపడింది రాధిక.

"అక్కా" అంటూ దగ్గరకు రాబోయింది. పాపనెత్తుకున్న ప్రసన్న కేకలువేసి లోపలికెళ్లి తలుపేసుకుంది.

ధన్ మని తలుపు చప్పుడయింది.

ఆ చప్పుడుకు గదిలోపల పాప లేచి ఏడుస్తుంటే అందరూ వచ్చారు.

ఎంతో బుజ్జగించాక కానీ ప్రసన్న తలుపు తియ్యలేదు.

ఈ మధ్యనే ప్రసన్నకు డెలివరీ అయింది.

అప్పటినుంచి నీరసంగా వుంటోంది. రాత్రంతా పాప పనులతో నిద్రపోలేక ఇబ్బంది పడుతోంది.

అత్తగారు, బంధువులు పలకరించడానికొస్తే వారితోనూ అంటీ ముట్టనట్టు ముభావంగా ప్రవర్తించింది. బిడ్డ పక్క బట్టలు సవరిస్తూనో, అలమారులో వస్తువులు సర్దుతూ కూర్చుంది తప్ప మాట్లాడలేదు.

బిడ్డ రాత్రిపూట ఏడవడం వల్లే నిద్రలేదని, తలనొప్పి వల్ల అలా డల్‌గా వుందనీ తల్లే సర్దుకొచ్చింది.

బాబు

ఇవాళ కొత్తగా చెల్లెలితో గొడవ పెట్టుకుని ఏడుస్తోంది.

"ఏవైందమ్మా?" తండ్రి పక్కనే కూర్చుని తలమీద చెయ్యిపెట్టాడు.

ఆ చెయ్యి తలమీదే ఉంచుకుని " నాన్నా , ఒట్టేయండి. నేను చెప్పేది నమ్ముతానని" అంది

"నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు?"

" ఆ ఐరన్ బాక్స్ బయట పడేయండి నాన్నా. మా అత్తగారు బాగా కాలిన ఇస్త్రీ పెట్టెతో నా పాప మీద దాడి చేయాలని చూస్తున్నారు. ఇది, ఇది వాళ్లకు సహాయం చేస్తోంది." అంటూ చెల్లెలి వైపు చూపించింది.

"అక్కా!" అంటూ నిర్ఘాంతపోయింది రాధిక.

"సిగ్గు లేదే నీకు. నీ ఉద్దేశం నాకు తెలుసే." చెల్లెలి వంక కోపంగా చూస్తూ..

"ఏవైందే నీకు, మంచీచెడ్డా లేకుండా తయారయ్యావు. దెయ్యం పట్టిందా ఏం?" పెద్ద కూతుర్ని మందలించింది తల్లి.

"మొదటినుంచీ నువ్వు దాని పక్షమే. అది నాకెంత అన్యాయం చేయబోతుందో చెప్పినా నీకర్థం కాదు" అంటూ తల్లితో చెప్పి ఏడుస్తూ లోపలికెళ్లి మళ్ళీ తలుపేసుకుంది.

అందరి మనసులూ కలతబారాయి.

తల్లికి కూడా పనెక్కువైంది. ఇంటికి వచ్చే పోయేవారు. వారికి మర్యాదలు. రాత్రి పూట ఆమెకు కూడా నిద్ర వుండడం లేదు. దానికి తోడు పెద్ద కూతురి ప్రవర్తన.

ఈ హడావుడికి బిడ్డ ఏడుపు లంకించుకుంది. తల్లి తలుపు తట్టి పిలిచింది.. బిడ్డకు పాలివ్వడానికి రమ్మని. లోపల్నుండి జవాబు లేదు. డబ్బా పాలు కలుపుతుంటే చంకలో బిడ్డ ఆకలికి ఆగడం లేదు.

రాధిక వెళ్లి "ఇలా ఇవ్వు అమ్మా, నేను పట్టుకుంటా" అని సాయం చేయబోయింది.

"వద్దులే అది చూస్తే మళ్లీ అదో గోల. నువ్వు కాలేజీకి పో. అక్కడే కాంటీన్లో ఏదైనా తిను. ఇవాళ వంట పని కాలేదు."

రాధిక ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. .

ఆశిమా ఛిబ్బర్

లెక్చర్ జరుగుతోంది. రాధిక మనసు మనసులో లేదు. అక్కా తనూ ఎంత స్నేహంగా ఉండేవాళ్లు. సినిమాలకు, షాపింగులకూ అన్నీ కలిసే. అమ్మా నాన్నలతో చెప్పుకోని విషయాలు కూడా ముందు తన తోనే చెప్పేది. అటువంటిది ఇవాళ కొత్తగా తనమీద అనుమానం! అదీ చిన్న పాపకు హాని చేస్తానని అనుమానపడుతోంది.

కళ్లు నిండాయి.

ఏమైంది అక్కకు.

పక్కనున్న క్లాస్‌మేట్ మోచేత్తో పొడిచింది. ఏవిటోనని చూస్తే క్లాసంతా తనవేపే చూస్తోంది. ప్రొఫెసర్ ఏదో ప్రశ్న అడిగారు. తను వినలేదు.

లేచి నిలబడింది.

"పాఠం వినడం లేదు కదా. ఏం చేస్తున్నావు?"

రాధిక క్లాసులో చాలా చురుగ్గా వుంటుంది. ఇలా జరగడం మొదటి సారి.

తల వంచుకుంది.

క్లాసయ్యాక నన్ను కలువు అంటూ వెళ్లారు ప్రొఫెసర్.

'ప్రొఫెసర్ నీరజ.'

నేం ప్లేట్ వంక చూస్తూ నిలబడింది. తనొచ్చిన అలికిడి విని కాబోలు "కమిన్." అన్నారు.

లోపలికి వెళ్లి నిలబడి " సారీ మేడం." అంది.

"ఏమైంది. ఎందుకలా వున్నావు?"

కళ్ల వెంట నీళ్లు జారాయి.

బేబీ బ్లూస్

ఫొటో సోర్స్, Getty Images

"అక్కకు డెలివరీ అయి ఒక వారం అవుతోంది మేడం. తన వింతగా మాట్లాడుతోంది. విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇవాళ నాపైనే అనుమానపడింది" అంటూ విషయం చెప్పింది.

"వింటుంటే ప్రసవం తర్వాత వచ్చే మానసిక సమస్యలా ఉంది. ఓ సారి చూస్తాను తనని చూస్తాను" అన్నారు ప్రొఫెసర్.

"ఎక్కడికి తీసుకురమ్మంటారు మేడం. రేపు ఓపీలో చూస్తారా?"

"వెళ్లే దారిలోనే చూస్తా."

ఇద్దరూ కార్లో వెళ్తున్నారు.

"ఇదివరకెప్పుడైనా ఇలాంటి సమస్య వుండేదా? పోనీ కుటుంబంలో ఎవరికైనా?"

"ఎవరికీ ఏ ప్రాబ్లం లేదు మేడం. డెలివరీ తర్వాత ఏమైనా సమస్య వస్తుందా? "

"ప్రసవం తర్వాత మొదటి వారంలో బేబీ బ్లూస్ అనే స్థితి వుంటుంది. కొంచెం దిగులు, నిరాశగా వుండడం లాంటి స్థితిఇది. ఇదొక తాత్కాలిక సమస్య. తల్లికి మూడ్ స్వింగ్స్ కనిపిస్తుంటాయి. ఒకోసారి అమితోత్సాహం చూపుతారు. మరోసారి ఏడుస్తారు. ఇది దానంతట అది తగ్గిపోయే స్థితి."

" ఇలా ఎన్నాళ్లు వుంటుంది?"

"బేబీ బ్లూస్ అయితే త్వరలోనే తగ్గిపోతుంది. అదే పోస్ట్ పార్టం సైకోసిస్ ( ప్రసవానంతర మానసిక రుగ్మత) అయితే మాత్రం కొద్దిగా తీవ్రమైన స్థితి."

"సైకోసిస్ అంటే, అది ఎలా గుర్తు పట్టడం? "

"మనసుకు జబ్బు చేస్తే ప్రవర్తనలో తేడా వస్తుంది. ఆ లక్షణాలను గురించడం కూడా కష్టమే.

  • లేనివి ఉన్నట్టు భ్రమ కలుగుతుంది.. ఎవరో పిలిచినట్లు, ఎవరో తమతో మాట్లాడినట్లు భ్రాంతి కలగడం.
  • డెల్యూజన్స్ అంటే , వాస్తవానికి దూరంగా వుండే విషయాలను సృష్టించుకుని నిజమనుకుంటారు. వాటి పట్ల గట్టి నమ్మకంతో వుంటారు."
గర్భధారణ

ఫొటో సోర్స్, Getty Images

"డెల్యూజన్స్ అంటే?"

"సొంత చెల్లెలే తన బిడ్డని గాయపరుస్తుందని నమ్మడం, అలాంటిదే. నిజం కాదని నిరూపించినా నమ్మరు. అలాంటప్పుడు తప్పని సరిగా మానసిక వైద్య నిపుణులతో చికిత్స అవసరం."

"ఇంకా యేమైనా లక్షణాలున్నాయా మేడం?"

"విచారంగా వుంటారు. లేదా ఎక్కువ సంతోషంగా కూడా వుండొచ్చు. ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. తన వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించడం, సంకోచాలు లేకపోవడం."

"అంటే?"

"మీ అక్క ప్రవర్తన ఇప్పుడు వింతగా వుందంటున్నావు. మామూలుగా ఎలా వుండేది?"

"అక్క చాలా నెమ్మది మేడం. పెద్దగా మాట్లాడదు. నవ్వడం కూడా మెల్లగానే. మనుషులంటే ప్రేమ. ఆడంబరాల జోలికి పోదు."

"ఇప్పడు తన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు అనిపిస్తోందా?"

అవునన్నట్లు తలూపి,

"మరి సంకోచాలు లేక పోవడమంటే?" అని అడిగింది.

"అందరి ముందూ చేయలేని కొన్ని పనులు ఏ మాత్రం సంకోచం లేకుండా చేస్తారు. ఉదాహరణకు బట్టలు మార్చుకోవడం లాంటివి."

"ఈ పోస్ట్ పార్టం సైకోసిస్ అంటే సీరియస్ జబ్బా ఏమిటి మేడం?"

"బేబీ బ్లూస్ కన్నా ఆందోళకరమైన స్థితి. తీవ్రమైన మానసిక రుగ్మత. అశ్రద్ధ చేయకూడదు. ఎమర్జెన్సీ పరిస్థితిలా పరిగణించాలి. హాస్పిటల్లో వుంచి అత్యవసరంగా చికిత్సనందించాలి. లేదా పరిస్థితి చెయ్యి జారిపోయే ప్రమాదముంది. "

"తీవ్రమైన స్థితి? అంత అపాయం ఏం జరుగుతుంది మేడం?"

"బిడ్డకు హాని కలిగించడం. లేదా తమకు తాము హాని చేసుకుంటారు. ఆందోళన ఎక్కువైతే ఆత్మహత్య కూడా చేసుకునే అవకాశం వుంది."

ఇంతలో రాధికా వాళ్ల ఇల్లొచ్చింది.

సింబాలిక్

ఫొటో సోర్స్, Getty Images

పోస్ట్ పార్టం సైకోసిస్ (ప్రసవానంతరం మానసిక సమస్య)

  • వెయ్యి మంది బాలింతల్లో ఒకరికి వచ్చే అవకాశం. (1 : 1000)
  • ఈ వ్యాధి వచ్చిన మహిళల్లో 50% మందికి , అంతకు మునుపు ఎలాంటి మానసిక సమస్యా వుండదు.
  • ప్రసవానంతరం మానసిక సమస్యను ప్రేరేపించే అంశాలు. (మొదటి కాన్పు, నెలలు నిండక ముందే అయిన కాన్పు, కష్టతరమైన కాన్పు ( ఫోర్సెప్స్), సిజేరియన్ కాన్పు)

రాబోయే కాన్పుల తర్వాత కూడా మళ్లీ ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ కనుక గర్భం దాల్చబోయే ముందు, మానసిక నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి.

రాధిక, ప్రొఫెసర్ ఇద్దరూ లోనికెళ్లారు.

ఒక యువతి గోల్డ్ స్పాట్ రంగు జరీ చీర కట్టుకుని హడావుడిగా తిరుగుతోంది. డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతోంది.

"వచ్చావా రాధీ? రండి. భోజనం వడ్డిస్తాను. అమ్మా , కొంచం మజ్జిగ పులుసు చేద్దామమ్మా, కర్వేపాకు లేదు. వెళ్లి తెస్తావా? ప్లీజమ్మా" తల్లితో చెప్పి వంటింట్లోకి, హాల్లోకి హడావుడిగా తిరుగుతోంది.

అదేమీ భోజనాల వేళ కాదు.

రాధిక తల్లి, వుయ్యాల పక్కనే బిడ్డ పనులతో సతమవుతూ వుంది.

కంగారుగా తిరుగుతున్న యువతిని చూసి "మీ అక్కయ్యా?"అని అడిగారు ప్రొఫెసర్.

అవునని రాధిక తలూపింది.

"ఉదయం చాలా దిగులుగా చూశాను మేడం. ఇప్పుడే ఇలా!" అంది రాధిక, అక్క మామూలుగా తిరగడం చూసి!

రాధిక వాళ్లమ్మ వీళ్ల వైపు వచ్చి, "వద్దన్నకొద్దీ మిట్ట మధ్యాహ్నం తలస్నానం చేసి పట్టు చీర కట్టుకుంది." గొంతు తగ్గించి చెప్పింది.

ప్రసన్నని చూస్తే నాలుగు రోజుల క్రితం డెలివరీ అయినట్లు లేదు.

పెళ్లికెళుతున్నట్లు ముస్తాబైంది.

గర్భం

ఫొటో సోర్స్, Getty Images

ఆమె ప్రవర్తనలో అసహజత ప్రొఫెసర్‌కు తెలుస్తూనే వుంది.

అటూఇటూ కంగారుగా తిరుగుతున్న ప్రసన్నని "ఇలా రండి." అంటూ తీసుకెళ్లి తన పక్కనే కూర్చో బెట్టుకున్నారు ప్రొఫెసర్.

"అక్కా , మేడం మా కాలేజి ప్రొఫెసర్"అంటూ పరిచయం చేసింది.

ప్రసన్న కళ్లు లోపలికి పీక్కుపోయి వున్నాయి. ముఖం నీరసంగా వుంది.

"పాప పుట్టడంతో చాలా సంతోషంగా వున్నాను. అసలు నేనెంత ఆనందంగా వున్నానో మీకెవ్వరికీ అర్థం కావట్లేదు." తరుముకొస్తున్నట్లు మాట్లాడుతోంది.

"మీకు నిద్ర పడుతోందా?" అడిగారు ప్రొఫెసర్.

"నిద్రేవిటి మేడం. ఇప్పుడు పాప పుట్టింది కదా, నా చీరలన్నీ అమ్మగారికే. కొత్త చీరలు కూడా కొనాలిగా."

అంటూ గలగలా నవ్వింది.

"ఆయన అమెరికా నుండి వచ్చేస్తారండీ. రాగానే పెద్ద ఫంక్షన్ చేస్తాం. తప్పకుండా రావాలి మీరు."

హడావుడిగా కబుర్లు చెప్తోంది. "అయ్యో నా మతి మండా" అని నిద్రపోతున్న బిడ్డని, ఒళ్లో అడ్డం వేసుకుని అందరి ఎదుటా చెంగు పక్కకు తీసి పాలివ్వబోయింది.

"అలా వద్దమ్మా, లోపల కూర్చో." తల్లి వారించి నందుకు బిడ్డని ఒళ్లోంచి తోసినంత పని చేసి ఏడుస్తూ కూర్చుంది.

రాధిక వాళ్ల తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి ప్రసన్నని హాస్పిటల్లో చేర్పించారు ప్రొఫెసర్.

గర్భం

ఫొటో సోర్స్, iStock

మానసిక వైద్యుల సంరక్షణలో కొన్ని వారాల పాటు చికిత్సనందించాక, ప్రసన్న కోలుకుంది.

డిశ్చార్జ్ చేశాక, రాధిక ప్రొఫెసర్‌ని కలిసింది.

" అక్క బాగయినట్లే కదా మేడం, ఇక అంతా మామూలుగానే వుంటుంది కదా?"

"కోలుకున్న వెంటనే, వారు పూర్తి ఆరోగ్యవంతులైనట్టు కాదు. కొద్దిగా దిగులు, విచారం, వుంటుంది. పూర్తి ఆత్మవిశ్వాసం వుండదు. బిడ్డతో అనుబంధం పెంచుకోవడంలో ఇబ్బంది పడతారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయం చేయాలి."

"సహాయమంటే, ఏం చేయాలి మేడం?"

"వారి పట్ల శాంతంగా వ్యవహరించడం చాలా అవసరం.

ఆమె చెప్పే విషయాలు వినే టైమివ్వాలి.

ఆమెకు తగిన విశ్రాంతి నివ్వాలి.

రాత్రి పూట పాప ఫీడింగ్ టైములో సహాయం చేయండి. ఆమె తగినంత నిద్రపోయేలా చూడాలి. ఇంటికి వచ్చే బంధువుల సంఖ్య తక్కువగా వుంటే మంచిది. ఇంటి పనులతో, పాప పనులతో ఆమె అలిసిపోకుండా చూసుకోవాలి.

ఇంటి వాతావరణం ప్రశాంతంగా వుండేట్లు చూసుకోవాలి."

శరీరానికి వ్యాధి వస్తే చెప్పుకోగలిగినంత స్వేచ్ఛ, మానసిక వ్యాధి కలిగినపుడు వుండదు. మనసుకి వ్యాధి వస్తే, అర్థం చేసుకోవడం కష్టం. అది వారి సహజ ప్రవర్తన అనుకుని కుటుంబ సభ్యులు కూడా అపార్థం చేసుకుంటారు. ఆ మనిషిని దూరం పెడతారు.

తాము జబ్బుతో వున్న విషయం రోగికి తెలిసే అవకాశమే లేదు. ఒక వేళ కుటుంబ సభ్యులకు తెలిసినా వ్యాధి సంగతి తెలిస్తే సమాజమెలా స్పందిస్తుందోనని, చికిత్స చేయించకుండా దాచి పెడతారు. రోగికెంతో నష్టం జరుగుతుంది.

మానసిక వ్యాధుల పట్ల, ఆ వ్యాధి వున్న రోగి పట్ల సమాజం దయగా వుండాలి.

(సైంటిఫిక్ ఎలిమెంట్‌ను సులభంగా వివరించడానికి ఈ కథనం చేయడమైనది. ఇందులోని పాత్రలన్నీ కల్పితం. రచయిత్రి వైద్యురాలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)