సంకల్ప్ ఆర్ట్ విలేజ్: సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ హస్త కళలతో ఓ గ్రామాన్ని సృష్టించిన యువతి

- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
ఒకవైపు చరఖా, మగ్గాల సవ్వడీ, మరోవైపు చెక్కబొమ్మల తయారీ, ఇటు వ్యవసాయం చేసే రైతులు, వారికి సాయం చేస్తూ కూలీలు ఇలా ఒకటా రెండా.. కుటీర పరిశ్రమల నుంచి పాడిపంటల వరకూ అన్నీ ఉన్న అందమైన గ్రామీణ వాతావరణం అక్కడ కనిపిస్తుంది.
ఇన్ని ప్రత్యేకతలున్న ఆ గ్రామం ఎక్కడో మారుమూల పల్లె కాదు. విశాఖ మహానగరంలో ఉంది. దీని పేరు సంకల్ప్ ఆర్ట్ విలేజ్. దీన్ని తీర్చిదిద్దింది ఓ అమ్మ, నాన్న, వాళ్ల అమ్మాయి.
పల్లెల వాతావరణం ఇప్పుడు కనుమరుగవుతోంది. పల్లెలున్నా అవి పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితుల్లో అసలైన గ్రామీణ వాతావరణాన్ని పునర్నిర్మించేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది.
విశాఖపట్టణానికి చెందిన చలపతిరావు, పార్వతి దంపతులు ఔషధ మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలను సేంద్రీయ పద్ధతిలో పండిస్తూ నర్సరీలు నిర్వహిస్తుంటారు.
వీరి కుమార్తె జమీల్యా నర్సరీలకు డిజైనింగ్ హెడ్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి సంకల్ప్ ఆర్ట్ విలేజ్‌ను నిర్మించారు.

నగరంలో గ్రామం
విశాఖ నగర పరిధిలో ఈ కళా గ్రామం ఉంది. వేపగుంట, పెందుర్తి పరిసరాలకు దగ్గరగా ఉండే ఈ కళాగ్రామానికి వెళ్తే మనం నగరంలో ఉన్నామా ? పక్కా పల్లెటూరికి వచ్చామా అన్న సందేహం వచ్చి తీరుతుంది.
కేవలం పల్లె వాతావారణాన్ని సృష్టించడమే కాక గ్రామీణ వృత్తులు, హస్తకళలు తెలిసిన కొందరు అక్కడ ఉపాధి పొందుతున్నారు కూడా. చేనేత, చెక్కబొమ్మల తయారీ, కోళ్ల పెంపకం, రంగుల తయారీ, కుట్టు పనులు చేస్తూ కొందరు కనిపిస్తారు.
"మాది తూర్పుగోదావరి. చేనేత పనులు తగ్గిపోయాయి. దాంతో ఇక్కడకు వచ్చాం. ఆరేళ్లుగా మా కుటుంబమంతా ఇక్కడే ఉపాధి పొందుతున్నాం. యంత్రాలతో తయారైనది ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ అది మంచిది కాదు. చేనేత వాడితే ఆరోగ్యం, రసాయన దారాలతో తయారు చేసిన దుస్తులు వాడితే అనారోగ్యం. ఈ సూత్రమే దేనికైనా వర్తిస్తుంది" అని చేనేత కార్మికురాలు లక్ష్మి బీబీసీతో అన్నారు.

'నిజమైన గ్రామాన్ని సృష్టించాను'
ఈ గ్రామంలో రెండు విభాగాలుంటాయి. ఒకటి వ్యవసాయ క్షేత్రం, రెండు సంప్రదాయ వృత్తి, కళల గ్రామం. వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లగానే అక్కడ పల్లె పదాలను పాటల్లోకి మారుస్తూ పనిలో నిమగ్నమైన కూలీలు కనిపిస్తారు.
ఆర్ట్ విలేజ్‌లో ఆసు, మగ్గం శబ్ధాలకు అనుగుణంగా కూని రాగాలు తీస్తూ పనుల్లో నిమగ్నమైన కళాకారులు ఉంటారు. ఈ గ్రామాన్ని తయారు చేసేందుకు రెండేళ్లు పరిశోధన చేశానని జమీల్యా ఆకుల చెప్పారు.
"నేను డార్జిలింగ్‌లో బ్యాచిలర్స్ ఇన్ డిజైనింగ్ కోర్సు చేశాను. మా అమ్మానాన్న అప్పటికే 'ఎకోఫ్రెండ్స్' పేరుతో సేంద్రీయ పద్ధతిలో అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కల వ్యాపారం చేస్తున్నారు. దీనికి ఇంకా ఏదైనా జత చేస్తే బాగుంటుందని భావించాను. అలా పుట్టిందే ఈ 'సంకల్ప్ఆర్ట్ విలేజ్' ఆలోచన" అన్నారు జమీల్య.
"పల్లెల్లో కనుమరుగైపోయిన, పోతున్న కళలకు చేయూత ఇద్దామనుకున్నాను. వాటితో కొందరికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నాను. మా నర్సరీ పక్కనే కొంత భూమి తీసుకుని అందులో ఒక గ్రామాన్ని డిజైన్ చేశాను’’ అని తెలిపారు.
స్థానికులు, స్కూల్ డ్రాప్‌అవుట్స్‌తో పాటు కొందరు బయటి కళాకారులను తీసుకుని వచ్చాం. వారి ద్వారా ఆసక్తి ఉన్న వారికి ఈ కళలను నేర్పిస్తున్నాం. తద్వారా మరో తరానికి ఈ వృత్తులు, కళలను అందించగలుగుతున్నాం" అని జమీల్యా వెల్లడించారు.
బంతిపువ్వులతో సహజ సిద్ధమైన పసుపు రంగుని తయారు చేస్తూ జమీల్యా కళాగ్రామం పనితీరు వివరించారు.
"మన చుట్టూ అనేక సహజసిద్ధమైన వనరులున్నాయి. వాటిని వినియోగించడం ద్వారా అందమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు. తూర్పు కనుమల్లో దొరికే అంకుడు కర్ర, కొబ్బరి చిప్పలతో అద్భుతమైన బొమ్మలు మా వద్ద తయారవుతున్నాయి. వాటికి దిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌వంటి ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది’’ అని చెప్పారు.
‘‘మా కళాగ్రామంలో సంప్రదాయ కళాకారులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులతో అక్కడక్కడా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. దీని వలన మన కళాకారులు తయారు చేసే ఉత్పత్తులపై వినియోగదారులకి అవగాహనతో పాటు మరింత మంది కళాకారులకి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ కోళ్లు, బాతులు, చేపలు, పశువుల పెంపకం కూడా నిర్వహిస్తున్నాం. పశువుల గడ్డి కూడా సేంద్రీయ పద్దతిలోనే పెంచుతాం" అని చెప్పారు జమీల్యా.

అద్దెకు మొక్కలు
నర్సరీలలో అనేక రకాలైన మొక్కలు కనిపిస్తాయి. అందులో ఏ రకం మొక్కని చూసినా ఇంటికి తీసుకుని వెళ్లాలనిపిస్తుంది. అయితే అన్నింటినీ మనం కొనలేం. కొనగలిగినా వాటిని పెంచుకునే స్థలం ఉండకపోవచ్చు.
సంరక్షణ కూడా చాలా పెద్ద పనే. అందుకే అవసరమైనప్పుడు మొక్కలను అద్దెకు తీసుకుని వెళ్లే కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని నర్సరీల నిర్వహణ చూస్తున్న జమీల్యా తల్లి పార్వతి చెప్పారు.
"వినియోగదారులను ఆకర్షించేందుకు హోటళ్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లను నిర్వాహకులు వెరైటీ మొక్కలతో అలంకరిస్తున్నారు. వారికి అవసరమైన సమయంలో మేం మొక్కలను అద్దెకు ఇస్తాం. మొక్కనుబట్టి అద్దె ఉంటుంది. కొనుక్కోవడం కంటే అద్దెకు తీసుకోవడం సులభం" అన్నారు పార్వతి.
"రోడ్లకు ఇరువైపుల, డివైడర్లపై పెంచే 240 రకాల డిజైనింగ్ ప్లాంట్స్‌తో పాటు 32 రకాల ఔషధ మొక్కలను కూడా మా నర్సరీలలో రసాయన ఎరువులు వాడకుండా పెంచుతున్నాం. అడిగిన వారికి నర్సరీల పెంపకం, సంప్రదాయ కళల వంటి వాటిలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం" అని చెప్పారామె.

సేంద్రీయ ఉత్పత్తుల ధర ఎక్కువే. కానీ...
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్గానిక్ ట్రెండ్ కనిపిస్తోంది. తినే పదార్ధాల నుంచి అలంకరణ వస్తువుల వరకూ ఆర్గానిక్ పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే మనం కొంటున్నది నిజంగా సేంద్రీయ ఉత్పత్తా? కాదా? అని తెలుసుకోవడం కష్టం. దాంతో అనేక చోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయి.
"ప్రారంభంలో ఆరేడు ఎకరాలలో 'ఎకో ఫ్రెండ్స్' పేరుతో నర్సరీ ప్రారంభించాం. క్రమంగా అది విస్తరించుకుంటూ ఇప్పుడు సంకల్ప్ ఆర్ట్ విలేజ్, సహజ ఉత్పత్తుల అంగళ్ల వరకూ వచ్చింది. నర్సరీలతో పాటు 200 ఎకరాల్లో భారీ ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతోంది. ఈ పద్ధతిలో తొలి రోజుల్లో లాభాలు ఉండవు. పెట్టుబడి కూడా ఎక్కువే. రెండేళ్ల తరువాత క్రమంగా లాభాలు వస్తాయి’’ అని చలపతిరావు చెప్పారు.
‘‘అయితే ఖచ్చితంగా సేంద్రీయ ఎరువులతో పండించే వాటినే అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందితే ధర పెద్ద విషయం కాదు. ఆరోగ్యాన్ని అందించే కాయగూరలను పది రూపాయలు ఎక్కువైనా కొనుక్కోడానికి వినియోగదారులు సిద్ధంగా ఉంటారు" అని సేంద్రీయ వ్యవసాయంలో లాభనష్టాలను వివరించారు.
"ఆర్గానిక్ వ్యవసాయం మీద మోజుపడిన కొందరు కొన్నాళ్లకే దాన్ని వదిలేస్తారు. సేంద్రీయ ఉత్పత్తులపై ప్రజలకు ఆసక్తి పెరగడంతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు పెరిగాయి. అయితే ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడిన కొన్నిరోజులకే ఏదీ నిజమైనదో, ఏది కాదో వినియోగదారుడు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. రుచి విషయంలో అంత తేడా ఉంటుంది" అని ఆయన చెప్పారు.

అందంతో పాటు ప్రయోజనం కూడా...
'ఎకో ఫార్మింగ్' నుంచి ఆర్ట్ విలేజ్ నిర్మాణం వరకూ ప్రకృతికి హాని చేయని విధానాలే ఇక్కడ కనిపిస్తాయి.
ఒకవైపు నర్సరీలలో మొక్కలు, వ్యవసాయ క్షేత్రాల్లో పండే కాయగూరలు, కళాగ్రామంలో వివిధ కళాకృతులు తయారవుతున్నాయి. వీటికి మార్కెంటింగ్ కల్పించేందుకు నగరంలో స్టాల్స్‌తో పాటు, వివిధ రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తున్నారు జమీల్యా.
"మేం మా వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ తీసుకుంటున్నాం. అలాగే చాలామందికి ఆర్గానిక్ ఉత్పత్తులను వాడాలని, సంప్రదాయ వృత్తి కళాకారులు తయారు చేసిన వస్తువులను కొనాలని ఉంటుంది. కానీ అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు. అటువంటి వారికి అవగాహన కల్పించేందుకు మేం ఎగ్జిబిషన్‌లు నిర్వహిస్తున్నాం’’ అని ఆమె చెప్పారు.
‘‘అందం, ఆరోగ్యం, వినియోగం.. ఈ మూడింటి కాంబినేషనే మా సంకల్ప్ ఆర్ట్ విలేజ్ ప్రొడక్ట్స్’’ అని జమీల్యా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- హాథ్రస్: అమ్మాయిని వేధించి జైలుకెళ్లారు.. తిరిగొచ్చాక ఆమె తండ్రి ప్రాణం తీశారు - గ్రౌండ్ రిపోర్ట్
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









