హాథ్‌రస్: అమ్మాయిని వేధించి జైలుకెళ్లారు.. తిరిగొచ్చాక ఆమె తండ్రి ప్రాణం తీశారు - గ్రౌండ్ రిపోర్ట్

సాస్నీ కొత్వాలీ పోలీస్ స్టేషన్
ఫొటో క్యాప్షన్, సాస్నీ కొత్వాలీ పోలీస్ స్టేషన్
    • రచయిత, చింకీ సిన్హా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వరుస బెదిరింపుల్లో ఇది ఒకటి. ఆయనకు అలాంటి బెదిరింపులు అలవాటైపోయాయి. కానీ, భయపెట్టి, బెదిరించేవారు ఈసారి తుపాకులతో వచ్చారు. పొలాల మధ్యలో కాల్చి చంపేశారు. అదంతా ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలోనే జరిగింది.

నోజార్‌పూర్ వెళ్లడానికి ఎలాంటి సైన్ బోర్డులు కనిపించవు. చుట్టూ పొలాలే కనిపించే ఆ ఊరికి ఇప్పుడు వచ్చివెళ్తున్నవారి సంఖ్య చాలా పెరిగింది. కూతురిని ఏడిపించిన వాళ్లు, ఆమె తండ్రినే కాల్చి చంపిన తర్వాత నుంచి అక్కడికి జనాల రాకపోకలు మొదలయ్యాయి.

నీలం రంగు తలుపున్న ఆ ఇంట్లోకి కొత్తగా ఎవరైనా వస్తే, ఆ యువతి లేచి నిలబడుతున్నారు. తన ముఖానికి గుడ్డ చుట్టుకుని, ఏం జరిగిందో, తండ్రిని ఎలా చంపారో చెప్పడం ప్రారంభిస్తున్నారు.

గోడకు ఆనించి ఉన్న మంచానికి పైన మూడు ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటోలో హత్యకు గురైన ఆ యువతి తండ్రి ఉన్నారు. అది ఆయన పెద్ద కూతురి పెళ్లి సమయంలో తీశారు.

ఇంకో ఫొటోలో పెద్ద కూతురు, ఆమె భర్త ఉన్నారు. మధ్యలో ఉన్న ఫొటోలో 23 ఏళ్ల యువతి నవ్వుతూ కనిపిస్తున్నారు.

అవనీశ్ శర్మ ఇల్లు
ఫొటో క్యాప్షన్, అవనీశ్ శర్మ ఇల్లు

నాకు న్యాయం కావాలి

"అంతా అయిపోయింది. నేను ఈ ఘటన గురించి పదే పదే అందరికీ చెప్పాల్సి వస్తోంది. నాకు న్యాయం కావాలి. మాటిమాటికీ అదే చెప్పడం నాకు చాలా కష్టంగా ఉంది. కానీ, ఈ బాధను భరించాలనే విషయం నాకు తెలుసు. నాకు జరిగిన ఈ దారుణాన్ని ప్రజలందరికీ చెప్పాల్సిందే" అన్నారు ఆ యువతి.

50 ఏళ్ల అవనీశ్ కుమార్ శర్మ వ్యవసాయం చేసేవారు. మార్చి 1న బహ్రయిచ్‌కు చెందిన గౌరవ్ శర్మ ఆయన్ను హత్య చేశారు.

నిందితుడు మరో ఐదుగురితో కలిసి వచ్చి అవనీశ్ కుమార్‌ను కాల్చి చంపాడని సాస్నీ కొత్వాలీ పోలీసులు చెప్పారు.

"ఈ హత్య చేయడానికి గౌరవ్ లైసెన్స్ లేని తుపాకులు ఉపయోగించాడు. నిందితులపై ఐపీసీలోని చాలా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం" అన్నారు.

బాధితుడి కుటుంబం నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరుకుంటోంది. తండ్రిపై దాడిచేసిన నలుగురిని యువతి గుర్తించింది. వారి పేర్లు గౌరవ్ శర్మ, నిఖిల్ శర్మ, లలిత్ శర్మ, రోహితాష్ శర్మ.

వీరితో వచ్చిన మరో ఇద్దరిని ఆమె గుర్తించలేకపోయారు.

తర్వాత రోజు ఆమె తండ్రి శవాన్ని తన పెదనాన్న కొడుకులు, మిగతావారితో కలిసి తీసుకొచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ స్వయంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించానని చెప్పారామె.

అవనీశ్ శర్మ ఇల్లు

బెదిరింపుల తర్వాత...

మార్చి 1న నిందితుడి భార్య, పిన్ని గుడికెళ్లారు. వాళ్లు అవనీశ్ శర్మ పొలంలోంచి ఉన్న దారిలోనే వెళ్తున్నారు. దాంతో తన పొలంలోంచి కాకుండా బయట నుంచి వెళ్లమని అవనీశ్ వాళ్లకు చెప్పారు. గొడవ అక్కడి నుంచి మొదలైంది.

అవనీశ్ ఇద్దర కూతుళ్లు కూడా అదే సమయంలో గుడికి వెళ్తున్నారు. పెద్ధ కుమార్తె గర్భవతి. తల్లిదండ్రులను చూడ్డానికి పుట్టింటికి వచ్చింది.

తర్వాత ఆ మహిళలు ఇద్దరూ తమను తిట్టారని, గౌరవ్ శర్మ భార్య మీ నాన్నను చంపుతానని తనను బెదిరించిందని యువతి చెప్పింది.

ఈ గొడవ తర్వాత, కూడా నిందితుడి కుటుంబం అవనీశ్ పొలంలోంచే గుడికి వెళ్లింది. ఈసారీ వాళ్లు గౌరవ్‌ను కూడా అక్కడికి పిలిపించారు.

యువతి తండ్రిని మధ్యాహ్నం సమయంలో ఈరోజే నీ ప్రాణం తీస్తామని బెదిరించాడు. దాంతో, అవనీశ్ తన ఇద్దరు కూతుళ్లను గుడి నుంచి వెంటనే తిరిగి వచ్చేయాలని చెప్పాడు. తర్వాత తలుపు లోపలనుంచి గడియ పెట్టి కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండిపోయారు.

తర్వాత ఆయన పొలానికి వెళ్లారు. తల్లి, కూతురు కూడా మధ్యాహ్నం దాదాపు మూడు గంటలకు పొలాలవైపు వెళ్లారు. "నేను అమ్మతోపాటూ భోజనం తీసుకుని పొలానికి వెళ్లాను. గౌరవ్ ఫోన్ వచ్చిన వెంటనే నేను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది జరిగి కూడా కొన్ని గంటలైపోయింది" అన్నారు..

అవనీశ్ శర్మ ఇల్లు

కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది...

కానీ, గౌరవ్ మధ్యాహ్నం దాదాపు మూడున్నర సమయంలో అవనీశ్ ఉన్న పొలం దగ్గరికి చేరుకున్నారు. తన చేతిలో తుపాకీ ఉంది. ఆయనతో మరో ఐదుగురు కూడా ఉన్నారు.

వాళ్లు తన తండ్రిపై చాలాసార్లు కాల్పులు జరిపారని, తల్లి మీద కూడా కాల్పులు జరిపారని, కానీ తల్లి ఒక గుంతలో పడిపోవడంతో ఆమెకు బుల్లెట్లు తగల్లేదని మృతుడి చిన్న కూతురు చెప్పింది.

అదే సమయంలో అవనీశ్ తన పొలంలో పనిచేయడానికి వేరే ప్రాంతాలనుంచి పిలిపించిన కొంతమంది కూలీలు కూడా ఉన్నారు. నిందితులు గాల్లో కాల్పులు జరపగానే, వాళ్లంతా పారిపోయారు.

‘‘మా నాన్నను కాల్చి చంపగానే, నిందితులు అందరూ పరారయ్యారు. వాళ్ల మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. ఇళ్లకు తాళాలు వేసి వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా పారిపోయారు’’ అని ఆ యువతి చెప్పారు.

ఇప్పుడు ఈ కేసుపై చాలా రాజకీయాలు జరుగుతోంది. నిందితులకు విపక్ష సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలు ఉందని బీజేపీ కార్యకర్తలు, వారు చాలామంది బీజేపీ నేతలతో ఫొటోలు తీసుకున్నారని విపక్షాల వారు చెబుతున్నారు. ఆ ఫొటోల్లో కొన్నింటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.

అవనీశ్ శర్మ హత్య తర్వాత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. దర్యాప్తు కూడా ప్రారంభించింది. కానీ, మార్చి 1న పోలీసులకు ఫోన్ చేసి గౌరవ్ శర్మ బెదిరింపుల గురించి చెప్పినప్పుడు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితుడి కుటుంబం అంటోంది.

పోలీసులు ఆరోజు ఎమర్జెన్సీ నంబర్ 112కు కాల్ చేయమని వారికి సలహా ఇచ్చారు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ సాస్ని కొత్వాలీ దీవాన్‌కు కూడా ఫోన్ చేశారు. గౌరవ్ శర్మ బెదిరించాడని కూడా చెప్పారు. కానీ, పోలీస్ స్టేషన్ నుంచి ఎవరూ రాలేదు.

తండ్రి అంత్యక్రియల సమయలో

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, అవనీశ్ అంత్యక్రియలు

బిక్కుబిక్కుమంటూ ఇంట్లో...

రెండేళ్లుగా అవనీశ్ చిన్న కూతురు తన ఇంట్లోనే నిర్బంధం లాంటి జీవితం గడుపుతున్నారు. ఎవరైనా తనకు తోడుంటే తప్ప ఆమె బయటకు వెళ్లడం లేదు. ఆమెకు గౌరవ్ శర్మ నుంచి చాలా బెదిరింపులు వచ్చేవి. బీఎస్సీ తర్వాత బీఎడ్ చేసి టీచర్ కావాలనుకున్న ఆ యువతి గౌరవ్ శర్మ అదేపనిగా వెంటాడడంతో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపేవారు.

గౌవర్ శర్మ ఆమెను వేధించేవాడు. అతడు మొదట 2017లో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి బుట్టలో వేసుకోవాలని చూశాడు. దాంతో, కుటుంబం ఆమెను ఒంటరిగా బయటకి పంపడానికి భయపడింది. 2018లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని గౌరవ్ ప్రతిపాదన పంపాడని యువతి పెదనాన్న చెప్పారు.

గౌరవ్ శర్మ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే నోజార్‌పూర్ వచ్చి స్థిరపడింది. తర్వాత వాళ్లు గ్రామం వదిలి వేరే ఎక్కడికో వెళ్లిపోయారు. గౌరవ్ పిన్ని, చిన్నాన్న మాత్రం గ్రామంలోనే ఉండిపోయారు. గౌరవ్ పెళ్లి ప్రస్తావన తెచ్చినపుడు అమ్మాయి నాన్న, చిన్నాన్న కుదరదని చెప్పారు. అయినా, గౌరవ్ వాళ్లను వదల్లేదు.

ఆ తర్వాత ఎప్పుడు తమకు కనిపించినా, తమ కుటుంబ సభ్యులను నానామాటలూ అనేవాడని, ఫోన్ చేసి బెదిరించేవాడని ఆయన చెప్పారు. 2018 జులైలో ఒకరోజు తమ ఇంట్లోకి హఠాత్తుగా చొరబడి అమ్మాయిని మంచంపై తోసి ఆమెతో దురుసుగా ప్రవర్తించాడని అన్నారు.

నౌజార్పూర్

బెయిల్ మీద బయటకు వచ్చాడు

అవనీశ్ శర్మ గౌరవ్ మీద కేసు పెట్టడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని జైలుకు పంపింది. సుమారు 29 రోజులు జైల్లో ఉన్న అతడు తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు. తర్వాత కోర్టులో ఆ కేసు విచారణ మొదలైందని యువతి చెప్పింది.

కానీ, నిందితుడు ఎప్పుడూ విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యేవాడు కాదు. అతడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 452, 354, 506 ప్రకారం కేసులు నమోదు చేశారు.

కేసు వాపసు తీసుకోవాలని యువతి కుటుంబంపై గౌరవ్ ఒత్తిడి తెస్తూనే వచ్చాడని, అతడితో తమకు దూరపు బంధుత్వం కూడా ఉందని యువతి తండ్రికి తలకొరివి పెట్టిన ఆమె పెదనాన్న కొడుకు సచివ్ శర్మ చెప్పారు.

2019 ఫిబ్రవరిలో అవీనీశ్ శర్మను తుపాకీతో భయపెట్టిన గౌరవ్ ఆయన్ను పరుగులు పెట్టించాడు. కానీ ఆయన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. బీబీసీ దగ్గర అప్పుడు ఆ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు కాపీ కూడా ఉంది.

పోలీస్ స్టేషన్లో నిందితుడు లలిత్ శర్మ
ఫొటో క్యాప్షన్, పోలీస్ స్టేషన్లో నిందితుడు లలిత్ శర్మ

సాస్నీ కొత్వాలీ పోలీసులు ఏమంటున్నారు

ఫిబ్రవరి 19న ఉదయం దాదాపు పదిన్నరకు గౌరవ్ శర్మ తుపాకీతో ఒక కార్లో అవనీశ్ పొలాల వైపు వెళ్లాడు. ఆ సమయంలో ఆయన పొలంలో పనిచేసుకుంటున్నారు. పోలీసులకు అవనీశ్ చేసిన ఫిర్యాదులో కూడా గౌరవ్ తనకు పిస్టల్ చూపించి గ్రామం సరిహద్దుల వరకూ తరిమాడని ఉంది. అందులో ఆయన గౌరవ్ మీద చర్యలు తీసకోవాలని కూడా కోరారు. కానీ పోలీసులు తమకు అలాంటి ఏ ఫిర్యాదూ అందలేదని చెప్పారు. సాస్నీ కొత్వాలీలో ఉన్న పోలీసులు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు.

పరారైన నిందితులను పట్టుకోడానికి పోలీసులు ఒక టీమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను అరెస్ట్ కూడా చేశారు.

"కేసు పరిశీలనలో ఉంది. దర్యాప్తుకు సంబంధించి మేం అప్పుడే మీకు ఎలాంటి సమాచారం ఇవ్వలేం. అయినా, మేం ఏం చేస్తున్నామో మీకెందుకు చెప్పాలి. మా దగ్గర బాధిత కుటుంబం 2019లో ఇచ్చిన ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదు" అని సాస్నీ కొత్వాలీ డే షిఫ్ట్ ఇంఛార్జ్ సతీశ్ చంద్ర అన్నారు.

ఈ ఘటన తర్వాత కూడా బెదిరింపులు కొనసాగాయి. చాలాసార్లు గౌరవ్ శర్మ, యువతి ఇంటి ఇనుప గేటును గట్టిగా బాదేవాడు. ఆమె పేరు పెట్టి అరిచేవాడు. ఆ కుటుంబాన్ని భయపెట్టడానికి ఆ ఇంటి చుట్టూ తిరుగుతుండేవాడు.

పోలీసులు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC

పదేపదే బెదిరింపులు

"మీకలా పదేపదే బెదిరింపులు వస్తుంటే, ఏమని అనుకుంటారు. అలా చాలాసార్లు బెదిరించాడులే, ఏం చేయడు అనుకుంటారు" అని యువతి పెదనాన్న సుభాష్ చంద్ర శర్మ అన్నారు.

సుభాష్ చంద్ర శర్మ ముంబయిలో ఉంటారు. తమ్ముడి హత్య వార్త తెలీగానే ఆయన తర్వాత రోజు గ్రామానికి చేరుకున్నారు. నిందితులు అందరినీ జైల్లో పెడతామని పోలీసులు భరోసా ఇచ్చేవరకూ తన తన తమ్ముడి అంత్యక్రియలు చేసేది లేదని ఆయన అప్పుడు గట్టిగా చప్పారు.

అలీగఢ్‌లో పనిచేస్తున్న అవనీశ్ శర్మ మరో అన్న సునీల్ కుమార్ శర్మ తన తమ్ముడి హత్య తనకు ఒక పెద్ద షాక్ లాంటిదని చెప్పారు.

గ్రామంలో అవనీశ్ కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉంది. అందులో వాళ్లు బంగాళాదుంప, ఇతర పంటలు పండిస్తున్నారు. చిన్న కూతురికి కూడా పెళ్లి చేయాలని ఆ కుటుంబం ఎప్పటినుంచే ప్రయత్నిస్తోంది. కానీ. గౌరవ్ కేసు కోర్టులో ఉండడంతో పెళ్లి పెట్టుకుంటే, అతడు ఆ రోజు కూడా ఏదైనా కొత్త సమస్య తెచ్చిపెడతాడేమోనని వాళ్లు భయంతో ఉన్నారు.

"గౌరవ్ తరచూ మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని బెదిరించేవాడు. అందుకే మేం తన చదువు కూడా ఆపేయాల్సి వచ్చింది" అని సునీల్ కుమార్ శర్మ చెప్పారు.

ఫిర్యాదు కాపీ
ఫొటో క్యాప్షన్, పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ

జీవితం చీకటైపోయింది

2020లో నిందితుడు గౌరవ్‌కు మరో అమ్మాయితో పెళ్లైంది. వాళ్లకు ఒక పాప కూడా పుట్టింది. తర్వాత అవనీశ్, ఆయన కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కనీసం, ఇకనైనా గౌరవ్ నుంచి బెదిరింపులు ఆగుతాయని అనుకుంది. కానీ, గౌరవ్ మారలేదు. ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా, వాళ్లను తిట్టడం బెదిరించడం చేసేవాడు.

ఇప్పుడు ఆ కుటుంబంలో చీకటి కమ్మేసిందని యువతి పిన్ని మీరా శర్మ చెప్పారు.

"ఒక రోజు ఈ జనం అంతా వెళ్లిపోతారు, వెళ్లి తమ పనుల్లో పడిపోతారు. అప్పుడు వీరి పరిస్థితి ఏమవుతుందో" అన్నారు.

అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా, నిందితుడికి 2018లో బెయిల్ ఎలా దొరికిందని మీరా శర్మ ప్రశ్నిస్తున్నారు.

బెయిల్ మీద బయటికొచ్చాక కూడా అతడు బహిరంగంగా తిరిగేవాడని, తమ కుటుంబాన్ని ఏళ్ల తరబడి బెదిరిస్తూ వచ్చాడని, యువతి వెంట పడి, ఏడిపిస్తూ ఉండేవాడని చెప్పారు.

ఆమె అలా మాట్లాడుతున్న సమయంలో అవనీశ్ చిన్న కూతురు లేచి తన తల్లి దగ్గరకు వెళ్లారు.

"మేం ఎక్కడికెళ్తాం, అందరూ వెళ్లిపోతే, నేనూ మా అమ్మ ఒంటరి అయిపోతాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)