కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?

- రచయిత, షకీల్ అఖ్తర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఉన్న కుతుబ్ మినార్, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు భారతదేశంలో ముస్లింలు నిర్మించిన తొలి కట్టడాల్లో ఒకటి. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ తొలుత నిర్మించారు.
అనేక హిందూ, జైన దేవాలయాల స్తంభాలను, రాళ్లను ఈ కట్టడ నిర్మాణంలో ఉపయోగించారు.
కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు నిజానికి ఒక హిందూ దేవాలయమని, అక్కడ పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతించాలని కొన్ని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కోర్టులో దావా కూడా వేశాయి.
దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న కుతుబ్ మినార్ కట్టడ సముదాయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది.
కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు ప్రాంగణంలో ఉన్న స్తంభాలపై, రాళ్లపై హిందూ దేవతల శిల్పాలు, హిందూ మతానికి చెందిన ఆకృతులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి.
27 హిందూ, జైన దేవాలయాల శిథిలాలు పడి ఉన్న చోట ఈ మసీదును నిర్మించినట్లు కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న శిలాశాసనంలో రాసి ఉంది.

అక్కడ నిజంగానే దేవాలయం ఉండేదా?
"కచ్చితంగా ఇవన్నీ దేవాలయాల్లోని భాగాలే. అయితే ఈ దేవాలయాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నవా లేక చుట్టు పక్కల ఉండేవా అన్నది స్పష్టంగా తెలీదు. దీనిపై చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే, 25 లేదా 27 దేవాలయాలు ఒకే చోట ఉండడం అనేది వాస్తవదూరంగా తోస్తోంది. వీటిని చుట్టుపక్కల దేవాలయాల్లోంచి సేకరించి ఇక్కడకు తీసుకొచ్చి ఉండాలి" అని సుప్రసిద్ధ చరిత్రకారులు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ అంటున్నారు.
అయితే, 'కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్' పుస్తకం రాసిన బీఎం పాండే అక్కడ మందిరం ఉండేదని విశ్వసిస్తున్నారు.
"మసీదుకు తూర్పు వైపున ఉన్న ఆకృతిని పరిశీలిస్తే మూల దేవాలయం అక్కడే ఉండేదని అర్థమవుతుంది. నా ఉద్దేశంలో ప్రధాన దేవాలయం అక్కడే ఉండేది. చుట్టుపక్కల ఉన్న దేయాలయల్లోని స్తంభాలను, రాళ్లను కూడా సేకరించి ఉంటారు" అని పాండే చెప్పారు.
రాజపుత్ర వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించిన తరువాత మహమ్మద్ గోరీ.. తన ఉన్నతాధికారి కుతుబుద్దీన్ ఐబక్‌ను దిల్లీ పాలనాధికారిగా నియమించాడు.
1200 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్, ఆయన వారసుడు షంషుద్దీన్ ఇల్తుత్మిష్ కుతుబ్ మినార్‌ను నిర్మించారు.

కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు కుతుబుద్దీన్ కాలంలోనే నిర్మించారు. తరువాత, దీని విస్తరిస్తూ వచ్చారు. మసీదు పడమటి భాగాన్ని పూర్వపు ఇస్లామిక్ శైలిలో నిర్మించారు.
మెహ్రాబ్ (ఇమాం నిలబడి నమాజు చదివించే చోటు) గోడలపై ఖురాన్‌కు సంబంధించిన గుర్తులు, పువ్వులు చెక్కి ఉంటాయి.
అయితే, మసీదులో పురాతన దేవాలయాల ఆనవాళ్లు కూడా ఆనేకం కనిపిస్తాయి. అక్కడక్కడా మందిరం పూర్తి నిర్మాణం కనిపిస్తుంది.
ఇక్కడ పురాతన దేవాలయం ఉండేదని హిందూ ధార్మిక సంస్థలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి.
హిందూ జాగరణ్ సంఘటన్ కార్యకర్తలు ఇటీవలే ఈ విషయమై కోర్టులో దావా వేశారు. ఆ ప్రదేశంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని, పూజలు చేసుకునేందుకు అనిమతించాలని పిటీషన్ పెట్టారు.
"అక్కడ ఇప్పటికీ విరిగిపోయిన హిందూ దేవతల విగ్రహాలే ఉన్నాయి. ఇది దేశానికి ఎంతో సిగ్గుచేటు. అక్కడ పూజలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని మేము దావా వేశాం" అని హిందూ మత కార్యకర్త, న్యాయవాది శంకర్ జైన్ బీబీసీకి తెలిపారు.

కోర్టు వ్యవహారం
ఈ దావా ఏప్రిల్ మొదటి వారంలో దిల్లీలోని ఒక కోర్టులో విచారణకు రానుంది.
పురాతన కట్టడాలను నేటి దృష్టితో చూడరాదని, వాటిని యథాతథంగా ఉంచేందుకే ప్రయత్నించాలని పురావస్తు శాస్త్రవేతలు అభిప్రాయపడుతున్నారు.
"కళ, వాస్తుశిల్పానికి చెందిన అంశాలు..అవి ఏ మతానికి చెందినవైనా సరే, వాటిని అలాగే ఉండనివ్వాలి. గత చరిత్ర ఆనవాళ్లను యథాతథంగానే ఉంచాలి. ఎందుకంటే భవిష్యత్తు తరానికి ఇవి గొప్ప చరిత్ర పాఠాలుగా నిలుస్తాయి. వాటి కళ, శిల్ప విశేషాలను తెలుసుకునేందుకు తోడ్పడతాయి. ఇది గుప్తుల శైలి, ఇది మౌర్యుల శైలి లేదా మొఘల్ శైలి అని వాటిని చూసి నేర్చుకుంటారు. మనం చేయాల్సిందన్నా ఆనాటి శిల్ప కళ ఆనవాళ్లను పదిలంగా కాపాడుకోవడమే" పురావస్తు శాఖ మాజీ అధిపతి సయ్యద్ జమాల్ హసన్ అంటున్నారు.
అయితే, తాజ్‌మహల్, పురానా ఖిల్లా, జామా మసీదుతో సహా ముస్లిం పాలకులు నిర్మించిన అనేక కట్టడాల కింద హిందూ దేవాలయాలు ఉన్నాయని హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు, కొందరు చరిత్రకారులు కూడా భావిస్తారు.

ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలను కూల్చి వేసి, ఆ ప్రదేశాల్లో తమ శైలితో కొత్త నిర్మాణాలు చేపట్టారని వీరి వాదన.
"భారతదేశంలో ఎక్కడెక్కడ హిందూ దేవాలయలాను కూల్చివేసి మసీదులు కట్టారో వాటన్నిటినీ పునరుద్దరించాలని మేము శపథం చేపట్టాం. వాటిని పునరుద్ధరించి భారతదేశ గౌరవాన్ని నిలబెడతాం" అని వృత్తిరీత్యా లాయర్, హిందూ సంస్థల కార్యకర్త రంజనా అగ్నిహోత్రి తెలిపారు. ఈమె కూడా కుతుబ్ మినార్ విషయంలో దావా వేశారు.
"ఇలాంటి చర్యలన్నీ కూడా భారతదేశ వారసత్వ సంపదను నాశనం చేస్తాయి. చరిత్రను పరిశీలిస్తే బౌద్ధ మఠాలను హిందూ దేవాలయాలుగా మార్చేసిన సంఘటనలు ఉన్నాయి. మరిప్పుడు వాటిని ఏం చేస్తారు? మహాబోధి ఆలయంలో ఉన్న విగ్రహం, నాకు తెలిసినంతవరకు శివుడి విగ్రహం. ఇలా తవ్వుకుంటూ పోతే దీనికి అంతే లేదు" అని ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.

మతాలకు సంబంధించిన పురాతన కట్టడాల విషయంలో పురావస్తు శాఖ విధానం చాలా స్పష్టంగానే ఉందని చరిత్రకారులు బీఎం పాండే అంటున్నారు.
"ఏ పురాతన కట్టడాలలోనైతే పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకునేటప్పుడు ఆరాధనలు, పూజలు జరగట్లేదో, వాటిల్లో ధార్మిక కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు అనుమతించరు. ధార్మిక కార్యక్రమాల కోసం ఉద్దేశంచిన కట్టడాలలో అవి జరగకుండా ఎవరూ ఆపలేరు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌ను పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుంటున్నప్పుడు అక్కడ ఏరకమైన ఆరాధనలు, పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలు జరగుతూ లేవు. ఇప్పుడు ఆ మసీదులో హిందూ పూజలు పునరుద్ధరించాలని కోరడం సమంజసం కాదు. అది పూర్తిగా తప్పు" అని పాండే తెలిపారు.

కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌ను పురావస్తు శాఖ ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ వస్తోంది. అనేక సంవత్సరాలుగా, దిల్లీ వచ్చే వేలాది పర్యటకులకు ఈ ప్రదేశం ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
చరిత్రలో కుతుబ్ మినార్ కట్టడ సముదాయం అనేక సామ్రాజ్యాలకు ముఖ్య కేంద్రంగా నిల్చింది. భారత ప్రభుత్వం దీన్ని జాతీయ వారసత్వంగా పరిగణించి పరిరక్షిస్తోంది.
ఈ కట్టడాన్ని మతపరమైన చిహ్నంగా చూసే బదులు, చరిత్ర స్మారకంగా చూడడం మంచిదని చరిత్రకారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండం జాడ 375 ఏళ్లకు దొరికింది, దాని రహస్యాలెన్నో
- సర్ ఆర్థర్ కాటన్: ఈ ‘బ్రిటిష్ దొర’కు ఇంట్లో పూజలు చేస్తారు, పూర్వీకులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో ‘కనిపించిన’ ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








