Khadija - Prophet Muhammad Wife: ఇస్లాం మతం పుట్టుకలో కీలక పాత్ర పోషించిన మహిళ కథ

ఖదీజా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మార్గరిటా రోడ్రిగెజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఆధునిక మహిళలు ఎలాంటి కలలు కంటున్నారో 1400 ఏళ్ల క్రితమే ఖదీజా అలా జీవించారని బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరంలో ఇమామ్‌గా పనిచేస్తున్న అసద్ జమాన్ అంటున్నారు.

ఆయన చెబుతున్న ఖదీజా అనే మహిళ ఆరో శతాబ్దంలో ఇప్పుడు సౌదీ అరేబియాగా చెబుతున్న ప్రాంతంలో పుట్టారు.

అప్పట్లో ఖదీజాకు సమాజంలో చాలా గౌరవం ఉండేది. ఆమె శక్తిమంతురాలు, ధనికురాలు కూడా. గొప్ప గొప్ప వాళ్లు పెళ్లి ప్రతిపాదనలు తెచ్చినా, తిరస్కరించారామె.

ఆ తర్వాత ఆమెకు రెండు సార్లు వివాహం జరిగింది. మొదటి భర్త చనిపోయారు. రెండో భర్త నుంచి ఆమె కోరుకుని విడిపోయినట్లు చెబుతుంటారు.

ఆ తర్వాత మరోసారి పెళ్లి చేసుకోకూడదని తీర్మానించుకున్నారు ఖదీజా. కానీ, ఓ వ్యక్తిని కలిసిన తర్వాత ఆమె మనసు మారింది.

ఆ వ్యక్తిలో ఖదీజా గొప్ప లక్షణాలు చూశారని, అందుకే మనసు మార్చుకున్నారని జమామ్ అన్నారు.

స్వయంగా ఖదీజానే ఆ వ్యక్తి ముందు తమ పెళ్లి గురించి ప్రతిపాదన తెచ్చారు. అప్పటికి ఖదీజాకు 40 ఏళ్లు. ఆ వ్యక్తికి 25 ఏళ్లు.

కానీ, వీరిది సాధారణ జంట గురించిన కథ కాదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మతం ఏర్పడేందుకు మూలమైన కథ.

ఖలీదా మూడో వివాహం చేసుకున్న ఆ వ్యక్తి పేరు మహమ్మద్. ఆయనే ఆ తరువాత ఇస్లాం ప్రవక్త అయ్యారు.

ఒంటెలు

ఫొటో సోర్స్, Getty Images

ధృడ సంకల్పం కలిగిన మహిళ

ఖదీజా మరణం తర్వాత చాలా ఏళ్లకు చరిత్రకారులు ఆమె గురించి రాయడం మొదలుపెట్టారని, అందుకే, ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కష్టమని న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రాచీన మిడిల్ ఈస్ట్ చరిత్ర ప్రొఫెసర్‌గా ఉన్న రాబర్ట్ హాయ్‌లాండ్ అన్నారు.

స్వేచ్ఛను కోరుకున్న, దృఢ సంకల్పం ఉన్న మహిళగా ఆమెను వర్ణిస్తూ చాలా చోట్ల రాశారని ఆయన చెప్పారు.

ఉదాహరణకు, సంప్రదాయం ప్రకారం ఖదీజా తమ బంధువుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబం కోరుకుంది. కానీ, ఆమె తిరస్కరించారు. తనకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లాడతానని చెప్పారు.

ఖదీజా తన తండ్రి చేస్తున్న కుటుంబ వ్యాపారాన్ని పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మలిచిన ఓ పెద్ద వ్యాపారవేత్త.

ఓ యుద్ధంలో తండ్రి చనిపోయిన తర్వాత, ఖదీజా వ్యాపార బాధ్యతలు తీసుకున్నారు.

''తనకు కావాల్సింది సాధించుకోవడం ఎలాగో ఆమెకు తెలుసు. ఓ విధంగా ఆమె వ్యాపార చతురత ప్రపంచ చరిత్రనే మలుపు తిప్పింది'' అని చరిత్రకారిణి, రచయిత్రి బెటానీ హ్యూస్ అభిప్రాయపడ్డారు.

ఖదీజా మక్కా నగరం నుంచి తమ వ్యాపార కార్యలాపాలు నడిపేవారు. మధ్యప్రాచ్యంలోని పెద్ద నగరాల మధ్య సరుకుల రవాణా కోసం ఆమె వ్యాపారానికి బండ్లు అవసరమయ్యేవి.

దక్షిణ యెమెన్, ఉత్తర సిరియా వంటి సుదూర ప్రాంతాలకు కూడా ఆ బండ్లు వెళ్లేవి.

ఫోజియా బోరా

ఫొటో సోర్స్, Fozia Bora

ఫొటో క్యాప్షన్, ఫోజియా బోరా

ఖదీజాకు కుటుంబం నుంచి ఆస్తి బాగానే వచ్చినప్పటికీ, ఆమె స్వయంగా చాలా సంపాదించారని బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్సిటీలో ఇస్లామిక్ చరిత్ర ప్రొఫెసర్‌గా ఉన్న ఫోజియా బోరా అన్నారు.

ఖదీజా తన సిబ్బందిని తానే ఎంచుకునేవారు. నైపుణ్యాలను బట్టి తన వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేసేవారు.

బాగా నిజాయితీగా ఉంటారని, కష్టపడి పనిచేస్తారని ఓ వ్యక్తి గురించి తెలిసి, ఖదీజా ఆయనకు తమ బండ్లలో ఒకదాని బాధ్యతను అప్పగించారు.

సమయం గడిచిన కొద్దీ ఆ వ్యక్తి పనితీరు ఖదీజాకు బాగా నచ్చింది. ఆయనను పెళ్లి చేసుకున్నారు. ఆయనే మహమ్మద్.

''అనాథగా ఉన్న మహమ్మద్‌ను చిన్నాన్న పెంచి పెద్ద చేశారు. అలాంటి మహమ్మద్‌కు ఖదీజాను పెళ్లాడటంతో జీవితంలో స్థిరత్వం, ఆర్థికంగా మంచి పరిస్థితి వచ్చాయి'' అని ఫోజియా బోరా అన్నారు.

ఈ జంటకు నలుగురు సంతానం కలిగారని, అయితే, వారిలో ఓ కుమారుడు బాల్యంలోనే చనిపోయాడని చెబుతారు.

''అప్పట్లో చాలా మంది పురుషులు బహుభార్యత్వం పాటించేవారు. కానీ, ఖదీజా బతికి ఉన్న సమయంలో మహమ్మద్ ఏకపత్నీత్వమే పాటించారు'' అని ముస్లిం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ రనియా హఫాజ్ అన్నారు.

బెటానీ హ్యూస్

ఫొటో సోర్స్, David Levenson/Getty Images

ఫొటో క్యాప్షన్, బెటానీ హ్యూస్

మహమ్మద్ ఖుర్యష్ తెగలో పుట్టి పెరిగారు. ఖదీజాది కూడా అదే తెగ. అప్పట్లో ఆ ప్రాంతంలోని తెగలన్నీ బహు దైవారాధన చేసేవి.

పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత మహమ్మద్‌లో ఆధ్యాత్మిక చింతన పెరిగింది. మక్కాలోని కొండల్లో ఆయన ధ్యానం చేశారు.

ఇస్లాం మతవిశ్వాసాల ప్రకారం మహమ్మద్‌కు దైవ దూత జిబ్రాయిల్ ద్వారా దైవ సందేశాలు అందాయి. ఈ సందేశాల సమాహారమే ఖురాన్.

మొదటి సారి దైవ సందేశం అందినప్పుడు, ఏం జరుగుతుందో అర్థం కాక మహమ్మద్ భయపడ్డారని చెబుతారు.

''మహమ్మద్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బహు దైవారాధన వాతావరణంలోనే ఆయన పెరిగారు. 'దైవం ఒక్కటే' అన్న భావన వారికి లేదు. దీంతో ఈ ఘటన మహమ్మద్‌ను తీవ్ర అయోమయానికి గురిచేసింది. ఈ విషయంలో తాను ఆధారపడతగ్గ ఒకే ఒక్క వ్యక్తి అయిన ఖదీజాకు ఆయన విషయం చెప్పారు'' అని ప్రొఫెసర్ హోయ్‌లాండ్ అన్నారు.

మహమ్మద్‌ను ఖదీజా సముదాయించారు. ఇది మంచి విషయమే కావొచ్చని, ఆయనకు సర్దిచెప్పారు.

క్రైస్తవ మతం గురించి బాగా తెలిసిన బంధువు వరఖా ఇబ్న్ నఫాల్ నుంచి ఖదీజా సలహా తీసుకున్నారు. మహమ్మద్‌కు దైవ సందేశాలు అందినట్లుగానే, మోసెస్‌కు కూడా గతంలో అందాయని అబ్రహమిక్ మతాల వాళ్లు విశ్వసిస్తారు.

''ఇదివరకటి మత గ్రంథాల గురించి మహమ్మద్ తెలుసుకున్నారు. దీంతో తనకు అందుతున్న సందేశాలకు ఒకరకమైన ధ్రువీకరణ లభించినట్లైంది. మొదట్లో మహమ్మద్‌కు తనపై తనకు సందేహం ఏర్పడింది. కానీ, ఆయన ప్రవక్త అన్న భరోసాను ఖదీజా ఆయనకు కల్పించారు'' అని హార్వర్డ్ యూనివర్సిటీలో ఇస్లాం పరిశోధకులుగా ఉన్న లీలా అహ్మద్ చెప్పారు.

మక్కా

ఫొటో సోర్స్, Getty Images

‘మొదటి ముస్లిం’

మహమ్మద్‌కు అందిన దైవ సందేశాలు మొదటగా విన్నది ఖదీజానే కాబట్టి, ఆమెను తొలి ముస్లింగా చరిత్ర గుర్తించాలని చాలా మంది పరిశోధకులు అభిప్రాయపడుతుంటారు.

''ఆ సందేశాన్ని ఆమె స్వీకరించారు. నమ్మారు. మహమ్మద్‌కు దాన్ని ప్రచారం చేసేందుకు అవసరమైన ఆత్వవిశ్వాసం అలాగే వచ్చి ఉంటుంది'' అని ఫొయిజా బోరా అన్నారు.

ఆ సమయంలోనే ఆయన అప్పటి తెగల అధిపతతులను సవాలు చేయడం ప్రారంభించారని, అల్లా తప్ప మరో దైవం లేదని, మిగతవారిని ఆరాధించడం దైవ దూషణే అంటూ ప్రచారం సాగించారని చరిత్ర పరిశోధకురాలైన బెటానీ హ్యూస్ చెప్పారు. .

మహమ్మద్ ఇస్లాం బోధించడం మొదలుపెట్టినప్పుడు మక్కా సమాజంలో ఏకేశ్వరవాదాన్ని వ్యతిరేకించేవారు ఆయన పట్ల వివక్ష చూపించారని ఫొయిజా బోరా అన్నారు. ఈ సమయంలో మహమ్మద్‌కు అత్యంత అవసరమైన సహకారం, రక్షణ ఖదీజానే కల్పించారని చెప్పారు.

''ఆ మరుసటి పదేళ్లు ఖదీజా తన కుటుంబానికి ఉన్న సంబంధాలు, తన సంపదను ఉపయోగించి భర్తకు అండగా నిలిచారు. ఆ కొత్త మతాన్ని వ్యాప్తి చేసేందుకు తోడ్పడ్డారు'' అని హ్యూస్ చెప్పారు.

ఖురాన్

ఫొటో సోర్స్, Getty Images

భర్త కోసం, ఇస్లాం వ్యాప్తి కోసం శాయశక్తులా కృషి చేసిన ఖదీజా 619 సంవత్సరంలో అనారోగ్యం బారినపడి చనిపోయారు.

మహమ్మద్‌తో ఖదీజా వివాహ బంధం 25 ఏళ్లు కొనసాగింది. ఆమె మరణం తర్వాత మహమ్మద్ బాధలో కూరుకుపోయారు.

''ఖదీజా మరణం నుంచి మహమ్మద్ ఎప్పటికీ కోలుకోలేదు. అబూ బాకర్, ఒమర్‌ల కన్నా ఖదీజానే మహమ్మద్‌కు దగ్గరి స్నేహితురాలిగా గ్రంథాలు వర్ణిస్తాయి'' అని ప్రొఫెసర్ హాయ్‌లాండ్ అన్నారు.

ఖదీజా చనిపోయిన సంవత్సరాన్ని ముస్లింలు 'బాధాకరమైన సంవత్సరం'గా పిలుచుకుంటారని చరిత్రకారిణి బెటానీ హ్యూజ్స్ చెప్పారు.

ఆ తర్వాత మహమ్మద్ మళ్లీ వివాహం చేసుకున్నారు. బహుభార్యత్వం కూడా పాటించారు.

‘‘ఖదీజా గురించి మనకు తెలిసిన చాలా విషయాలు ఇస్లాంలోని హడిత్‌ల్లోనే ఉన్నాయి. మహమ్మద్ జీవితం గురించిన కథలు, సంప్రదాయాలు, బోధనలు ఈ హడిత్‌ల్లో ఉంటాయి. మొదట్లో మహమ్మద్‌కు సన్నిహితులైన అనుచరులు చెప్పిన విషయాలను తర్వాత తర్వాత రాయడం మొదలుపట్టారు. మహమ్మద్ భార్యల్లో ఒకరైన అయిషా చెప్పిన విషయాలు కూడా వీటిలో ఉన్నాయి. మహమ్మద్ జీవితంలో మొదటగా ఏం జరిగిందో అయిషాకు నేరుగా తెలియదు. మహమ్మదే ఆయనకు ఖదీజా గురించి చెప్పి ఉంటారు'' అని ఖదీజా గురించి పిల్లల కోసం పుస్తకం రాసిన ఫాతిమా బర్కతుల్లా అన్నారు.

మసీదులో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ముస్లిం సమాజంలో మహిళల పాత్ర ఇళ్ల వరకే పరిమితమన్న వాదనను తిప్పికొట్టేందుకు ఖదీజా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఫోయిజా బోరా అన్నారు.

ఖదీజా కోరుకున్నది చేశారని, మహమ్మద్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదని ఆమె వ్యాఖ్యానించారు.

''ఒక ముస్లింగా, చరిత్రకారిణిగా ఖదీజా నుంచి నేను స్ఫూర్తి పొందుతాను. మహమ్మద్, ఖదీజాల కుమార్తె ఫాతిమా, మహమ్మద్ మరో భార్య అయిషా కూడా స్ఫూర్తినిచ్చే వ్యక్తులే. వాళ్లు మేధావులు. రాజకీయంగా క్రీయాశీలంగా ఉన్నారు. ఇస్లాం మత వ్యాప్తిలో, ఇస్లాం సమాజం రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇస్లాంను నమ్మేవారైనా, కాకపోయినా నా విద్యార్థులకు వీరి గురించి బోధించడం నాకు గొప్పగా అనిపిస్తుంది'' అని బోరా చెప్పారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)