గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు: ‘ఇక్కడ మాకేం భయం లేదు.. మాపై వివక్ష లేదు’

వీడియో క్యాప్షన్, నూపుర్ శర్మ వివాదంతో గల్ఫ్‌లో తమపైన ఎలాంటి ప్రభావం పడలేదన్న ప్రవాస భారతీయులు

మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ అధికార ప్రతినిధుల వివాదాస్పద వ్యాఖ్యలు అరబ్‌ గల్ఫ్ దేశాల్లో ఆందోళన సృష్టించాయి.

ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని గల్ఫ్ దేశాలు భారత్‌ను కోరాయి. ఈ సమస్యపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. మరి గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఏంటి? అక్కడ ఉంటున్న స్థానికులు ఈ సమస్య గురించి ఏమంటున్నారు?

ముస్లింలు పవిత్రంగా భావించే మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో ఉంటున్న కోటి మంది భారతీయుల భవిష్యత్ ప్రమాదంలో పడింది.

నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాయి. ఈ వ్యవహారం ముదురుతున్నా... అక్కడున్న భారతీయుల రోజువారీ జీవితంపై మాత్రం ఇప్పటికి ఎలాంటి ప్రభావం చూపలేదు.

బీబీసీ రెడ్ లైన్ Red Line

బీబీసీతో మాట్లాడిన పలువురు భారతీయులు ఇలా అన్నారు..

  • ‘‘భారతీయుల పట్ల వివక్ష చూపిస్తున్నట్లు నాకెక్కడా అనిపించలేదు. ఇక్కడి ప్రజలంతా కలిసే ఉంటున్నారు.’’
  • ‘‘కొంత మంది ఆందోళనలు, ప్రకటనలు చేస్తున్నా, మాకెలాంటి విచారం కానీ, భయం కానీ లేదు. బహ్రెయిన్‌లోని మనమాలో ఉన్న ఆలయానికి స్థానికులు కూడా వస్తున్నారు.’’
  • ‘‘మా పరిస్థితి బాగానే ఉంది. ఇక్కడున్న ప్రజలు అందరి పట్ల సాదరంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిలోనూ మతపరమైన భేదభావాలు కనిపించడం లేదు.’’
  • ‘‘ఇక్కడ ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు హాయిగా జీవిస్తున్నారు.’’

గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లోకి వలస వచ్చిన భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ, వారి భద్రత గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితులేమీ కనిపించడం లేదు.

గల్ఫ్‌ జాతీయులు పలువురు బీబీసీతో మాట్లాడుతూ ఇలా అన్నారు..

  • ‘‘వాళ్లు, మేము ఒకటే. విదేశాల్లో ఏం జరిగినా అది మా బంధాలను ప్రభావితం చెయ్యదు’’
  • ‘‘మరీ నాసిరకంగా ఉంటే తప్ప.. ఇక్కడి ప్రజలు భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్ చెయ్యలేరు. ఎందుకంటే భారతీయ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తాయి.’’
బీబీసీ రెడ్ లైన్ Red Line

గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో ఈ వివాదం ఇలాగే కొనసాగితే భారత్ చాలా నష్టపోతుందని నిపుణులు అంటున్నారు.

ఈ దేశాల్లో ఉంటున్న భారతీయులు తమ సంపాదనలో 55 శాతం స్వదేశానికి పంపిస్తారు. అలాగే ఈ వివాదం భారత్‌తో ఆయా గల్ఫ్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

గల్ఫ్ ఫోరమ్ ఫర్ సెక్యూరిటీ అండ్ పీస్ చైర్మన్ ఫహద్ అల్ షిల్మీ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఒప్పందాలు రద్దైతే భారత్ ఎక్కువగా నష్టపోతుంది. అయితే, గల్ఫ్ నాయకత్వం తెలివైందని నా నమ్మకం. వాళ్లు ఇలాంటి సంఘటనలను ఇంతకు ముందు కూడా చూశారు. వాటిలో మహమ్మద్ ప్రవక్త మీద కార్టూన్లు వెయ్యడం, డెన్మార్క్‌లో విమర్శలు, ఫ్రాన్స్ ఆంక్షలు లాంటి ఘటనలు చాలానే ఉన్నాయి’’ అన్నారు.

గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి రసాయన పదార్ధాలు, ఔషధాల ఫార్ములాలు, ఆభరణాలు, విలువైన రాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఆ దేశాల నుంచి భారత్ గ్యాస్, చమురు దిగుమతి చేసుకుంటోంది. సహజవాయువు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉంది. అలాగే ముడి చమురు విషయంలో మూడో స్థానంలో ఉంది. చమురు, సహజవాయువు విషయంలో భారత్‌కు గల్ఫ్ దేశాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)