Mohammad Hamid Ansari: ‘నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలపై భారత ప్రధాని, హోం మంత్రి, విదేశాంగ మంత్రి ఎందుకు స్పందించలేదంటే..’

వీడియో క్యాప్షన్, గల్ఫ్ ప్రభుత్వాల ఆగ్రహం వెనుక అక్కడి ప్రజల ఆక్రోశం ఉందన్న హామిద్ అన్సారీ

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ప్రధాని మోదీ మౌనం వహించడం వెనక వేరే అర్థాలున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి మహమ్మద్ హామిద్ అన్సారీ వ్యాఖ్యానించారు. బీబీసీ ప్రతినిధి ఇక్బాల్ అహ్మద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

రిపోర్టర్: భారత దేశంలో ఉన్న నేతలే కాదు, భారత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఖతర్ కూడా అంటోంది? దీనిపై మీరు ఏం అంటారు?

హామిద్ అన్సారీ: ఏ మతానికైనా కొన్ని సున్నితమైన అంశాలుంటాయి. ఇస్లాంకు కూడా సున్నితమైన అంశాలుంటాయి. ఒక దేశానికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ విధానాల గురించి మనం మాట్లాడవచ్చు. కానీ కోట్లాది ముస్లింలు పవిత్రంగా భావించే ఒక దైవదూత గురించి తప్పుగా మాట్లాడడాన్ని ముస్లింలు సహించలేరు. గతంలోనూ సహించలేదు.

రిపోర్టర్: దీనిపై భారత్‌లో రెండు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌లో ముస్లింలపై దాడి జరిగినప్పుడు, వేధింపులు లేదా మైనారిటీలకు వ్యతిరేకమైనవిగా భావించే చట్టాలు చేసినప్పుడు స్పందించని ముస్లిం దేశాలు ఇప్పుడు స్పందిచడాన్ని మీరెలా చూస్తారు?

హామిద్ అన్సారీ: దీనిలో రెండు విషయాలున్నాయి. ఏ దేశంలో ఏ విధానాలపై వివాదం ఉన్నా అది ఆ దేశానికి సంబంధించిన వ్యవహారం. కానీ ఇది మాట్లాడకుండా ఉండలేని సున్నితమైన అంశం. లేదంటే అక్కడి ప్రజల ఆక్రోశాన్ని చవి చూడాల్సి ఉంటుంది. కొద్ది నెలల కింద యూఏఈకి చెందిన ఓ రాకుమారి ఒక ప్రకటన చేశారు. కువైట్‌కు చెందిన కొందరు ఎంపీలు కూడా ప్రకటన చేశారు. అవి ప్రభుత్వేతర ప్రకటనలే. కానీ వారి ప్రకటనలకు ఆ ప్రభుత్వాల ఆమోదం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశాల్లో ఏదో మేరకు ప్రభుత్వ ఆమోదం లేకుండా ప్రకటనలు చేయడం సాధ్యం కాదు.

రిపోర్టర్: దీనిపై భారత విదేశాంగ మంత్రి కానీ, ప్రధాని కానీ ఇంకా స్పందించలేదు. వారు స్పందించాల్సిందని మీరు భావిస్తున్నారా?

హామిద్ అన్సారీ: విదేశాంగ మంత్రి కానీ, హోం మంత్రి కానీ, ప్రధాని కానీ ఎవ్వరూ స్పందించలేదు. దానర్థం ఏంటి? ఇందులోంచి ఈ వ్యాఖ్యలను వారు వ్యతిరేకించడం లేదనే అర్థాన్ని తీసుకోవచ్చు. లేదా వాటికి వాళ్ల ఆమోదం ఉందనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)