అంటే సుందరానికీ! సినిమా రివ్యూ: నాని, నజ్రియాల ప్రేమాయణం ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Insta/Nani
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కొత్త కథలు, కొత్త ఎమోషన్లు పుట్టుకురావు. ఉన్న కథల్ని కొత్తగా చెప్పాలి. అందులోనే భావోద్వేగాల్ని పండించాలి. పాత కథనే ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడం ఓ టెక్నిక్. అది తెలిస్తే... సరిపోతుంది.
ఈ తరంలో నిలదొక్కుకోవాలని ఆశ పడుతున్న దర్శకులు ఈ విషయంలో కొత్త దారులు వెదుక్కొంటున్నారు. కొత్త తరహా స్క్రీన్ ప్లేతో.. పాత కథకే హంగులు అద్దుతున్నారు. వివేక్ ఆత్రేయ అలాంటి దర్శకుడు.
తను తీసిన `మెంటల్ మదిలో`, `బ్రోచేవారెవరురా` రెండూ కథలుగా చూస్తే, సాదా సీదాగానే ఉంటాయి. కానీ... వాటిని తెరపై చెప్పిన విధానం కొత్తగా అనిపిస్తుంది. అందుకే హిట్లు పడ్డాయి.
ఇప్పుడు `అంటే సుందరానికీ..` కూడా తాను ఎంచుకొన్న దారి అదే. సుందరంగా నాని కనిపించడం, మలయాళంలో మంచి పేరు తెచ్చుకొన్న నజ్రియా ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టడం.. `అంటే...`పై అంచనాలు పెంచాయి. మరి ఈ సుందరం ఎలా ఉన్నాడు? వాడి కథా కమామిషూ ఏమిటి?

ఫొటో సోర్స్, Insta/Nani
`సీతాకోక చిలుక`లా ఎగిరిన కథ!
భారతీ రాజా తీసిన సీతాకోక చిలుక సినిమా గుర్తుంది కదా? వేర్వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, వాళ్ల సంప్రదాయాలు అడ్డు పడడం, వాటిని దాటుకొచ్చి ఒక్కటవ్వడం... ఇదీ కథ.
ఇంచుమించుగా `అంటే.. సుందరానికీ` కథ కూడా అదే. కానీ.. భారతీరాజా అడ్డుగోడల్ని బద్దలు కొట్టడానికి ఓ మార్గం ఎంచుకొంటే, వివేక్ ఆత్రేయ మరో మార్గం ఎంచుకొన్నాడు. టూకీగా కథ చెప్పుకోవాలనుకొంటే...
సుందరం (నాని)ది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి (నరేష్)కి పట్టింపులు ఎక్కువ. లేకలేక పుట్టిన సంతానం కావడంతో, వంశోద్ధారకుడు సుందరం ఒక్కడే అవ్వడంతో.. పెంపకంలో మరింత జాగ్రత్త పడిపోతాడు.
జాతక రీత్యా గండాలు ఉండడంతో.. యజ్ఞాలూ, యాగాలు చేయిస్తూ ఉంటాడు. విదేశీ యానం వాళ్ల కుటుంబంలో నిషిద్ధం. విమానం ఎక్కాలన్నా చాలా తంతు ఉంటుంది. చిన్నప్పుడే అమెరికా వెళ్లే అవకాశం వస్తుంది సుందరానికి. అది చేజారిపోవడంతో.. ఎలాగైనా సరే, అమెరికా వెళ్లాలని ఫిక్సయిపోతాడు.
మరోవైపు.. లీల (నజ్రియా) కథ. తను క్రీస్టియన్. చిన్నప్పటి నుంచీ ఒంటరిగా ఎదగాలని తపన పడుతుంటుంది. ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ... తను చేయిస్తాడు. ఈలోగా చిననాటి మిత్రుడు సుందరం కలుస్తాడు. వారిద్దరి మధ్యా ప్రేమాయణం మొదలవుతుంది. కానీ.. ఇంట్లో చెబితే.. పెళ్లికి ఒప్పుకోరు. అందుకే తమ ఇంట్లో ఒకొక్క అబద్ధం చెబుతారు. ఆ అబద్ధాలేంటి? వాటి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది తెరపై చూడాలి.

ఫొటో సోర్స్, Insta/Nani
అదే... స్క్రీన్ ప్లే మ్యాజిక్కు!
కథ ఇలా నాలుగు లైన్లలో చెప్పుకొంటే `మామూలుగానే ఉంది కదా` అనిపిస్తుంది. కానీ.. ఇక్కడే వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేశాడు.
కథని ఇలా నేరుగా చెప్పలేదు. స్క్రీన్ ప్లేలో ఒక్కో ముడీ వేస్తూ, విప్పుతూ, ఒకొక్కరికి ఒక్కోలా కథ చెబుతూ - పాత కథనే కొత్త ఫ్లేవర్‌కి తీసుకొచ్చాడు.
అనుపమ పరమేశ్వరన్ (గెస్ట్ రోల్)కి తన కథ చెప్పుకోవడంతో `అంటే.. సుందరానికీ.` కథ మొదలవుతుంది. సుందరం చిన్నప్పటి ఎపిసోడ్లతో.. తమది ఎంత సంప్రదాయ కుటుంబమో చెప్పేశాడు. ఆఫీసు వ్యవహారాలు నవ్వుతెప్పిస్తాయి. అక్కడ హర్షవర్థన్ పాత్రని బాగా వాడుకొన్నారు.
ఆ తరువాత ఆమెరికా ఎందుకు వెళ్లాలనుకొంటున్నాడో.. ఓ కథ చెబుతాడు. అది.. సుందరం - లీలల ప్రేమకథ. సుందరం జీవితంలోకి లీల ఎప్పుడొచ్చింది? అసలు వాళ్లెలా ప్రేమలో పడ్డారు? అనేది మరో ఎపిసోడ్.

ఫొటో సోర్స్, Insta/Nani
తొలిసగం దాదాపుగా గంటన్నర సాగింది. నిడివి ఎక్కువే. కాకపోతే.. అక్కడక్కడ కొన్ని సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.
నాని బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. రాస్తున్నప్పుడు ఓ మాదిరి సీన్ పుట్టినా నాని దాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాడు. ఈ సినిమాలో అదే జరిగింది. నాని - నరేష్ మధ్య నడిపిన ట్రాక్ - ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. వీళ్లిద్దరూ ఎప్పుడు మాట్లాడుకొన్నా.. ఫన్ లేదా ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది.
తొలి సగంలో హర్ష, రెండో సగంలో రాహుల్ రామకృష్ణన్‌ని కూడా పర్‌ఫెక్ట్‌గా వాడుకొన్నాడు. నరేష్ పాత్రని కఠినంగా చూపిస్తూ ఫన్ పండించాడు. తను తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధ పడినప్పుడు (ఆటో సీన్).. ప్రేక్షకుల గుండె కూడా కరుగుతుంది. ఇలాంటి సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. పెళ్లి గురించి రెండు కుటుంబాల వాళ్లూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు పుట్టిన కన్‌ఫ్యూజన్ డ్రామా.. హిలేరియస్‌గా ఉండింది.

ఫొటో సోర్స్, Insta/Nani
హిందూ - క్రిస్టియన్
హిందూ - క్రిష్టియన్ పెళ్లి కథే ఇది. అలాగని మూలాల్లోకి వెళ్లి, స్పీచులు ఇవ్వలేదు. ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్పారు. ఎక్కడ ఎమోషన్ పండించాలో అక్కడ పండించారు. ముఖ్యంగా రోహిణి తన ఇంట్లో భర్త, అత్తల ముందు కొడుకుని, తన పరిస్థితినీ వెనకేసుకొచ్చే సన్నివేశం.. బాగా కుదిరింది.
అక్కడ... సంప్రదాయాల్ని మనిషి తన అవసరాలకు తగ్గట్టుగా ఎలా వాడుకుంటున్నాడో చెప్పిన విధానం ఆకట్టుకొంది. రచయితగా వివేక్ ఆత్రేయ అక్కడ బాగా నచ్చుతాడు. తల్లిదండ్రుల క్యారెక్టర్‌ని, ఆఖరికి బామ్మ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం బాగుంది. ఎక్కడా తూకం చెడకుండా చూసుకున్నాడు.
అయితే... ఈ క్రమంలో నిడివి గురించి ఆలోచించకపోవడం పెద్ద మైనస్. అటూ ఇటుగా మూడు గంటల కథ. ఇంత సింపుల్ పాయింట్‌ని సుదీర్ఘంగా చెప్పాలనుకోవడం రిస్కే. సీన్లు ఎంత బాగున్నా అంత ఓపిక ఎవరికీ ఉండడం లేదు.
చెల్డ్ ఎపిసోడ్, లీలా లవ్ ట్రాక్... ఇలా అనవసరమైన ఎపిసోడ్లు కొన్ని ఉన్నాయి. వాటిని బాగా కుదించుకోవాల్సింది. పాటలు కూడా సరిగా వినపడలేదు. కథ ప్రకారం సాగాయే తప్ప.. మనసుని హత్తుకొన్న పాట దొరకలేదు.
అంతా నేచురల్!
నానిని నేచురల్ స్టార్ అని ఎందుకంటారో ఈ సినిమాతో మరోసారి అర్థమవుతుంది. సుందరం పాత్రలో పర్‌ఫెక్ట్ గా కుదిరాడు. అసలు ఈ పాత్రని నాని తప్ప మరెవ్వరూ ఇంత సమర్థంగా నడిపించలేరేమో అనిపిస్తుంది.
తను ఫన్ చేయడు. కానీ తన వల్ల ఫన్ వస్తుంది. ఆ పాత్రని అంత బాగా రాసుకోగలిగాడు దర్శకుడు. లీలా పాత్ర కూడా అంతే. తను చాలా సహజంగా నటించింది. లీలాని చిన్నప్పటి నుంచీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్‌గా మలచుకొంటూ వచ్చాడు. అందుకే కొన్నిసార్లు నానిని లీలా డామినేట్ చేస్తున్నట్టు అనిపించినా చూడబుద్ధేసింది.
ఈ సినిమాలో మరో హీరో.. నరేష్. తనకు సరైన పాత్ర పడాలే గానీ, నూటికి నూరుపాళ్లూ న్యాయం చేస్తారాయన. సంప్రదాయాలు పాటించే తండ్రిగా తొలి సగంలోనూ, కొడుకు కోసం ఆరాట పడే తండ్రిగా రెండో సగంలోనూ.. ఆయన నటన ఆకట్టుకుంటుంది. చివరి సన్నివేశాల్లో రోహిణి నటన నచ్చుతుంది. నదియా కూడా పర్‌ఫెక్ట్‌గా కుదిరిపోయారు.
వివేక్ సాగర్ పాటలు వినగానే ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. వివేక్ ఆత్రేయ కలం చాలా చోట్ల పరుగులు పెట్టింది. సంప్రదాయాల గురించి చెప్పినప్పుడు తను చాలా మెచ్చూర్డ్‌గా రాశాడనిపిస్తుంది. కాకపోతే.. రాసిందల్లా తీయాలి, తీసిందల్లా చూపించాలి అనే తపనతో నిడివి పెంచుకుంటూ పోయారు. ఈ సినిమాని సరిగా `కట్` చేసి ఉంటే.. ఇంకా మంచి ఫలితం వచ్చేది.
నవతరం దర్శకులు మోడ్రన్ థాట్స్‌తో వస్తున్నారు. అయితే.. వాళ్లకు సంప్రదాయాలకు ఎక్కడ విలువ ఇవ్వాలో, ఎక్కడ ప్రశ్నించాలో బాగా తెలుసు.
ఎక్కడ భావోద్వేగాల్ని పలికించాలో, ఎక్కడ నవ్వించాలో ఇంకా బాగా తెలుసు. ఈ లక్షణాలు మెండుగా ఉన్న దర్శకుడికి.. మంచి టీమ్ దొరికింది. అందుకే.. సుందరం అందరికీ నచ్చేలా తయారయ్యాడు.
ఇవి కూడా చదవండి:
- భూ పరిరక్షణ ఉద్యమం, వివాదాస్పద అంశాలపై జగ్గీ వాసుదేవ్‌తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ..
- మ్యాపుల్లో ఉత్తరం దిక్కునే పైభాగంలో చూపుతారెందుకు? నార్త్ అంటే ఆధిపత్యమా? పేదవాళ్లంతా సౌత్‌లోనే ఉంటారా?
- జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














