కేజీఎఫ్ 2 రివ్యూ: చాప్టర్ 2లో అసలు కథ ఎంత? యష్, ప్రశాంత్ నీల్ విజయం సాధించారా?

ఫొటో సోర్స్, facebook/kgfmovie
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఓ కన్నడ సినిమా బాక్సాఫీసుని షేక్ చేసింది. అది కూడా బాలీవుడ్‌కే బీటలు వాలేలాంటి... విజయం. దేశమంతా అవాక్కయి కన్నడ సీమ వైపు ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరాన్ని సృష్టించింది కేజీఎఫ్. ఆ సినిమా విడుదలకు ముందు.. ఎవ్వరూ ఎలాంటి అంచనాలూ పెట్టుకోలేదు. కొడితే.. ఏనుగు కుంభస్థలం కొట్టాలంటారు కదా.. అలాంటి వసూళ్లు సాధించింది కేజీఎఫ్.
కేజీఎఫ్ 2... వస్తోందనగానే అంచనాలు ఆకాశాన్ని మేఘాలు కమ్మేసినట్టు ముంచెత్తాయి. కేజీఎఫ్‌ని మించిన బడ్జెట్, కేజీఎఫ్‌లో లేని కొత్త స్టార్లు... తీసుకొచ్చి `కేజీఎఫ్ చాప్టర్ 2`ని ముస్తాబు చేశాడు ప్రశాంత్ నీల్. అందుకే... ఈ సినిమా కోసం దేశమంతా ఎదురు చూసింది. మరి... ఈ చాప్టర్ లో.. ప్రశాంత్ నీల్ ఏం రాశాడు? ఎలా తీశాడు? రాకీ భాయ్.. ప్రేమలో మరోసారి సినీ ప్రేమికులు పడిపోయారా?
కథ కనిపించదు..
ముంబై నగరంలోని ఓ మామూలు కుర్రాడు.. బంగారు గనుల సామ్రాజ్యం నరాచీని ఎలా కైవసం చేసుకున్నాడన్నది కేజీఎఫ్ 1లో చూశాం. సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తరవాత.. ఏం జరిగిందో... చాప్టర్ 2లో చూపించాడు దర్శకుడు. ఇక్కడ రాకీకి కొత్తగా శత్రువులు పుట్టుకొస్తారు.
ఎప్పుడో చనిపోయాడనుకున్న అధీరా (సంజయ్‌దత్)... రాకీని మట్టుబెట్టడానికి నరాచీని కైవసం చేసుకోవడానికి కంకణం కట్టుకుంటాడు.
ప్రభుత్వాలు మారిపోవడం వల్ల.. ప్రధాని పీఠం రమికా సేన్ (రవినా టాండన్) చేతికి చిక్కుతుంది. తను.. కేజీఎఫ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఈ ఇద్దరి నుంచి రాకీ తనని తాను ఎలా కాపాడుకున్నాడు..? వాళ్లని ఎలా ఎదిరించాడు? అనేదే అసలు కథ.
చాప్టర్ 1తో పోలిస్తే... చాప్టర్ 2లోనే అసలు కథంతా దాగుంది అని దర్శకుడు ప్రశాంత్ నీల్ మాటిమాటికీ చెబుతూనే ఉన్నాడు. కానీ.. చాప్టర్ 2లో పెద్దగా కథేం కనిపించదు. కేవలం అధీరాని ఎలా అడ్డుకున్నాడు, తన శత్రువులకు ఎలా చెక్ పెట్టాడు? అనేది మాత్రమే పార్ట్ 2లో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, facebook/kgfmovie
మూడు గంటల సినిమా చూసొచ్చాక.. కథ చెప్పాలంటే... కష్టమే. అంత రేఖామాత్రమైన కథ ఇది. కాకపోతే... ఎప్పటిలానే దర్శకుడు ఎలివేషన్లని నమ్ముకున్నాడు. యష్ ఇంట్రడక్షన్ గానీ, ఇంట్రవెల్ సీక్వెన్స్ గానీ, బంగారం బిస్కట్ ని తిరిగి తెచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లే సీన్ గానీ... వేరే లెవెల్‌లో తీశాడు. కేజీఎఫ్ ని చూడ్డానికి ప్రేక్షకులు ఎలాంటి అంచనాలతో వెళ్తారో.. అవన్నీ ఈ మూడు సీన్లతో భర్తీ చేశాడు ప్రశాంత్ నీల్.
రాకీ అనే పాత్రని ప్రేక్షకులు ప్రేమించడానికి ప్రధానమైన కారణం...దర్శకుడు ఆ పాత్రని మలిచిన విధానమే. చాప్టర్ 1లో ఆ పాత్రని ఎంత ఇష్టంగా తీర్చిదిద్దాడో, చాప్టర్ 2లోనూ అంతే ప్రేమ కురిపించాడు. అందుకే రాకీ పాత్రని ఎలివేట్ చేసినప్పుడల్లా.. ప్రేక్షకులు ఆస్వాదిస్తుంటారు.
అధీరా లాంటి బలమైన విలన్ పాత్ర రాసుకోవడం, ఆ పాత్రలో సంజయ్ దత్‌ని తీసుకురావడం కలిసొచ్చిన అంశాలు. రాకీ లాంటి బలమైన పాత్రని ఢీ కొట్టే సామర్థ్యం.. అధీరాకి మాత్రమే ఉందన్న విషయాన్ని సైతం బాగా ఎలివేట్ చేయడానికి స్కోప్ దొరికింది.

ఫొటో సోర్స్, facebook/kgfmovie
అమ్మ సెంటిమెంటే ట్రంప్ కార్డ్..
ఓ సామాన్యమైన, సాధారణమైన కుర్రాడు కేజీఎఫ్ సామ్రాజ్యానికి ఎలా రాజు అయ్యాడన్నది చాప్టర్ 1లో చూపించాడు. నిజానికి జీరో నుంచి హీరోగా ఎదిగే ప్రయాణం మంచి కిక్ ఇస్తుంది. ఆ పాత్రతో ప్రేక్షకుడు ట్రావెల్ చేయడానికి కావల్సినంత స్కోప్ ఉంటుంది.
హీరో అయిపోయిన తరవాత... అన్ని మెట్లూ ఎక్కేసిన తరవాత... ఇంకేం చేస్తాడు? ఇంకేం సాధిస్తాడన్నదే ఆసక్తి. అయితే అది.. చాప్టర్ 2లో లేదు. ఎమోషన్ పరంగా చూసినా.. లోటు పాట్లే కనిపిస్తాయి. ఎలివేషన్ల మోజులో పడి.. ఎమోషన్‌ని దర్శకుడు వదిలేశాడేమో అనిపిస్తుంది.
కథానాయిన పాత్రని హైలెట్ చేద్దామని చూసినా కుదర్లేదు. అమ్మ సెంటిమెంట్ ని దర్శకుడు ట్రంప్ కార్డ్‌లా చాలా తెలివిగా వాడుకున్నాడు. హీరో తన ఆశయ సాధనలో అడుగులు వేస్తున్నప్పుడో, వెనుక బడినప్పుడో.. అమ్మ పాత్రని ప్రవేశ పెట్టడం బాగుంది. దాంతో.. హీరో ఏం చేసినా కరెక్టే... అన్న ఫీలింగ్‌ని ప్రేక్షకుడిలో ఇంజెక్ట్ చేయడానికి కుదిరింది.
ఎలివేషన్ల మోజులో.. కొన్ని ఓవర్ ది బోర్డ్ సీన్లు కూడా పడిపోయాయి. పార్లమెంటుకి ఆయుధాలతో వెళ్లి, ఓ ఎంపీని ప్రధాని ముందే చంపడం, ప్రధాని ముందే కూర్చుని హీరో సవాళ్లు విసరడం.. మరీ టూమచ్‌గా అనిపిస్తాయి. కానీ అప్పటికే.. `రాకీ ఏమైనా చేయగలడు.` అని ఫిక్సయిపోయినవాళ్లు మాత్రం.. వాటినీ ఎంజాయ్ చేస్తారు.
సాధారణంగా సీక్వెల్స్ తో ఓ ఇబ్బంది ఉంటుంది. పార్ట్ 1 చూడకపోతే.. పార్ట్ 2 అర్థం కాదు. ఆ సమస్య... కేజీఎఫ్ చాప్టర్ 2కీ ఉంది. పార్ట్ 1 చూడనివాళ్లకైతే ఆ రాకీ బాయ్ ఏంటో, వాడి గోలేంటో ఏమాత్రం అర్థం కాదు. ఒకవేళ పార్ట్ 1 చూడకుండా.. పార్ట్ 2 చూద్దామనుకున్నవాళ్లు, కచ్చితంగా చాప్టర్ 1పై ఓ లుక్కు వేసి, అప్పుడే చాప్టర్ 2లోకి వెళ్లాలి.

ఫొటో సోర్స్, facebook/kgfmovie
తలలు మారతాయి.. కిరీటాలు కాదు..
యష్ చాలా స్టైలీష్‌గా ఉన్నాడు. తన డ్రసింగ్ స్టైల్ నచ్చుతుంది. చూపుల్లో. బాడీ లాంగ్వేజ్‌లోనూ.. తన మార్క్ కనిపిస్తుంది. అధీరాగా.. సంజయ్ దత్ చక్కగా అమిరాడు. తన ఎలివేషన్లు కూడా బాగున్నాయి. కాకపోతే.. ఆ పాత్రని ఇంకాస్త విస్తరించాల్సింది. ఇందిరాగాంధీని పోలిన పాత్రలో రవీనా కనిపించారు. ఆమె పాత్ర హుందాగా, శక్తిమంతంగా ఉంది. రావు రమేష్, ప్రకాష్ రాజ్.. సీనియర్లు కాబట్టి.. వాళ్ల వాళ్ల పాత్రల్ని చాలా ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయారు.
ప్రశాంత్ నీల్ రాసుకున్న సంభాషణలు చాలా సన్నివేశాల్ని నిలబెట్టాయి. `ఇక్కడ తలలే మారతాయి.. కిరీటాలు కాదు` అనే డైలాగ్ రాజకీయాలకు పర్‌ఫెక్ట్ గా సరిపోతుంది. చేప - ఎర.. వీటి గురించి చెప్పిన సంభాషణలు హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి. ఇదనే కాదు.. హీరోయిజాన్ని ఆకాశమంత ఎత్తునచూపించాలి అనుకున్నప్పుడల్లా.. డైలాగుల్లో పవర్ కనిపించింది.
సాంకేతికంగా.. ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. ఈ సినిమా కలర్ టోన్.. ఇది వరకెప్పుడూ చూసి ఉండరు. కెమెరా, ఆర్ట్ విభాగాలు పోటీ పడి పనిచేశాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే.. సగం బలం. యాక్షన్ సీన్లలో.. వినిపించే థీమ్ మ్యూజిక్, మ్యాజిక్ చేసినట్టు కట్టిపడేస్తుంది.
దర్శకుడి విజన్.. పార్ట్ 1లోనే చూశాం. ఇది దానికి కొనసాగింపు అంతే. తను సీన్లను కట్ చేసిన పద్ధతి.. రెండు మూడు సీన్లని ఒకేసారి ఇంటర్ కట్ లో చూపించిన విధానం ఆశ్చర్యపరుస్తాయి. ఈ ట్రిక్కులకు తోడుగా బలమైన కథ ఉండుంటే.. కచ్చితంగా కేజీఎఫ్ 1ని మించిపోయే ఉండేది. ఇప్పటికీ... తక్కువేం కాదు. కేజీఎఫ్ నుంచి ఎలాంటి ఎలివేషన్లు చూడాలని, ఎలాంటి డైలాగులు వినాలని కోరుకుంటారో... అవన్నీ కేజీఎఫ్ 2లో పుష్కలంగా అందించాడు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు చేసి శిక్షలు పడకుండా తప్పించుకోవడం చాలా తేలికా?
- ఆంధ్రప్రదేశ్: ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో పేలుడు.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య
- బాబా సాహెబ్ అంబేడ్కర్: పారిశ్రామికవేత్త బిర్లా రూ.10 లక్షలు ఇస్తానంటే ఎందుకు తిరస్కరించారు? ‘నేను ఎవరికీ అమ్ముడు పోవడానికి పుట్టలేదు’ అని ఎందుకు అన్నారు?
- అలియా భట్, రణబీర్ కపూర్ ల లవ్‌స్టోరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















