ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరిలో ఎన్ఎండీసీ బంగారం అన్వేషణ: ప్రెస్ రివ్యూ

బంగారం ముడి లోహం, ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, AussieGoldHunters/DiscoveryChannel

ఆంధ్రప్రదేశ్‌లోని బంగారు గనుల్లో తవ్వకాలపై ఎన్ఎండీసీ ఆసక్తి చూపిస్తోందని ఈనాడు దిన పత్రిక ఒక వార్త ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని బంగారు నిక్షేపాలపై జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) దృష్టి పెడుతోంది.

ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని చిగురుగుంటలో బంగారు గనుల తవ్వకాలను దక్కించుకున్న ఆ సంస్థ తాజాగా అనంతపురం జిల్లాలోని రామగిరి గనుల్లో నిక్షేపాలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

రామగిరి మండల కేంద్రంలోని 130 హెక్టార్లలో బంగారు గనులున్నాయి. గతంలో ఇక్కడ భారత్‌ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్‌ సంస్థ (బీజీఎం) తవ్వకాలు నిర్వహించేది.

అప్పట్లో బంగారు ధరతో పోలిస్తే ఖనిజం తవ్వి తీసి, ప్రాసెసింగ్‌కు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల కిందట ఇక్కడ తవ్వకాలను ఆపేశారని పత్రిక చెప్పింది.

ఇప్పుడు బంగారం ధరలు పెరగడంతో.. ఆ గనుల్లో ఎంత మేరకు నిల్వలున్నాయి? ఖనిజాన్ని తవ్వితీస్తే గిట్టుబాటు అవుతుందా? లేదా? తదితర అంశాలను అధ్యయనం చేస్తామంటూ రాష్ట్ర గనులశాఖకు ఎన్‌ఎండీసీ ప్రతిపాదనలు చేసింది.

వందల అడుగుల లోతున ఉండే ఈ గనుల నుంచి తవ్వితీసే మట్టిలో టన్నుకు 2-3 గ్రాముల మేర బంగారు ఖనిజం ఉంటుందని అంచనా వేస్తున్నారని ఈనాడు వివరించింది.

కోర్టు తీర్పు

ఫొటో సోర్స్, Getty Images

భర్తను హత్య చేసినా భార్యకు పెన్షన్ ఇవ్వచ్చు-కోర్టు తీర్పు

భర్తను హత్య చేసినా భార్యకు పింఛన్ ఇవ్వచ్చని పంజాబ్, హరియాణా కోర్ట్ సంచలన తీర్పు వెలువరించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త ప్రచురించింది.

కట్టుకున్న భర్తను హత్య చేసినా ఆ భార్య ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే అవుతుంది అని పంజాబ్‌, హరియాణా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

తర్సెమ్‌ సింగ్‌, బల్జీత్‌ కౌర్‌ దంపతులది హరియాణా. ప్రభుత్వ ఉద్యోగి అయిన తర్సెమ్‌ సింగ్‌ 2008లో మృతిచెందారు.

ఆయన్ను భార్య బల్జీతే చంపారంటూ 2009లో కేసు నమోదైంది. 2011లో ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది. భర్త మృతిచెందినప్పటి నుంచి 2011 దాకా బల్జీత్‌ కౌర్‌ ఫ్యామిలీ పెన్షన్‌ను పొందారు.

భర్తను హత్యచేసిందని కోర్టు ద్వారా రుజువైన వెంటనే ఆమెకు అప్పటిదాకా వస్తున్న పెన్షన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది.

దీనిపై ఆమె పంజాబ్‌, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జనవరి 25న విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించిందని పత్రిక రాసింది..

'భర్తను హత్యచేసిందనే కారణంతో ఫ్యామిలీ పెన్షన్‌కు భార్యను దూరం చేయరాదు. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమే ఫ్యామిలీ పెన్షన్‌. భార్య క్రిమినల్‌ కేసులో దోషిగా తేలినా సరే ఫ్యామిలీ పెన్షన్‌కు ఆమె అర్హురాలే అవుతుంది' అని వ్యాఖ్యానించింది. బల్జీత్‌కు ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును కొట్టివేసింది.

ఆమెకు 2011 నుంచి రావాల్సి ఉన్న బకాయిలను రెండు నెలల్లోగా చెల్లించాలని పేర్కొందని ఆంధ్రజ్యోతి వివరించింది.

చైనాలోని ఒక థియేటర్‌లో క్రిమి నివారణ రసాయనాలు చల్లుతున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

నేటి నుంచి థియేటర్లకు హౌస్ ఫుల్ పర్మిట్

ఇవాళ్టి నుంచి దేశంలోని సినిమా హాళ్లలో పూర్తి సామర్థ్యంతో ప్రదర్శనలు ప్రారంభం కానున్నట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దేశవ్యాప్తంగా వంద శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు.

కోవిడ్‌-10 ప్రోటోకాల్స్‌ పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చని పేర్కొన్నారని పత్రిక రాసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటించాలని చెప్పారు.

శానిటైజేషన్‌ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంలో సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎంఏఐ) స్వాగతించాయని సాక్షి వివరించింది.

విద్యార్థులు, అమ్మాయిలు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

పదినెలల తర్వాత సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. కరోనా లాక్‌డౌన్‌తో మూగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి.

తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా విద్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కరోనా నేపథ్యంలో బడుల్లో ప్రార్థనలు, స్కూల్‌ అసెంబ్లీలు జరుపొద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల డీఈవోల సమావేశంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీచేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారని పత్రిక చెప్పింది.

విద్యార్థులు నేరుగా తరగతి గదికి వెళ్లాలని, అక్కడినుంచి ఇంటికే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా వెళ్లే క్రమంలో గుంపులుగా కాకుండా.. భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు.

పాఠశాల ప్రాంగణాల్లో సమావేశాలు, వేడుకలు, రాజకీయ సభలను జరుపరాదని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని, దీన్ని పాటించాలని స్పష్టంచేశారు.

65 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించేందుకు సుముఖత వ్యక్తంచేసినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారని పత్రిక రాసింది.

సోమవారం తర్వాత వీరిసంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. బెంచీకొక్కరు చొప్పున గదికి 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టనున్నారు.

దీనివల్ల పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్య ఏర్పడనున్నది. దీన్ని అధిగమించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో ఉన్నత పాఠశాలల్లో విద్యా బోధన చేయించనున్నారు.

విద్యాసంస్థల్లో రెండు ఐసొలేషన్‌ గదులు ఏర్పాటుచేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు పాఠ్యపుస్తకాలు అందనివారికి పుస్తకాలు ఇవ్వనున్నారు.

ప్రత్యక్ష తరగతులతోపాటే ఆన్‌లైన్‌ క్లాసులు సైతం కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ప్రత్యక్ష తరగతులు లేదంటే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావొచ్చని అధికారులు చెప్తున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)