బడ్జెట్ 2021: కేంద్ర ప్రభుత్వ ఖజానా ఎలా నిండుతుంది? రుణాలు చెల్లింపు ఎప్పుడు సులభమవుతుంది?

డబ్బు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలోక్ జోషి
    • హోదా, సీఎన్‌బీసీ ఆవాజ్, మాజీ సంపాదకులు

కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం అధికంగా పన్నుల నుంచి వస్తుంది. పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు (డైరెక్ట్ టాక్సులు), పరోక్ష పన్నులు (ఇన్‌డైరెక్ట్ టాక్సులు) ఉంటాయి.

ప్రత్యక్ష పన్ను అంటే వ్యక్తుల సంపాదనపై విధించే పన్ను. ఆదాయ పన్ను, కార్పొరేట్ టాక్స్ అంటే కంపెనీలకు వచ్చే ఆదాయంపై పన్ను, క్యాపిటల్ గెయిన్స్, ఆస్తి మీద పన్ను (ప్రోపర్టీ టాక్స్) మొదలైనవి.

వెల్త్ టాక్స్, ఎస్టేట్ డ్యూటీ టాక్స్, డెత్ టాక్స్‌లాంటి డైరెక్ట్ టాక్సులు కూడా ఉండేవి, కానీ వీటిని చాలాకాలం క్రితమే రద్దు చేశారు.

ప్రత్యక్ష పన్నులను ప్రభుత్వానికి నేరుగా చెల్లించాలి. వీటిని మరొకరికి బదిలీ చేయలేరు.

పరోక్ష పన్ను అంటే కొనుగోలుదారుని నుంచి వసూలు చేసేది. ఉదాహరణకు సేల్స్ టాక్స్. ఇప్పుడు దీని స్థానంలో జీఎస్టీ వచ్చింది. ఎక్సైజ్, కస్టమ్ డ్యూటీలు కూడా పరోక్ష పన్నులే.

గత ఏడాది బడ్జెట్ ప్రకారం, ఈ ఏడాది ప్రభుత్వానికి లభించే ప్రతి రూపాయిలోనూ 18 పైసలు కార్పొరేట్ టాక్స్‌నుంచీ, 17 పైసలు ఆదయపు పన్ను నుంచి వస్తాయి. అంటే ప్రత్యక్ష పన్నుల నుంచి 35 పైసల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. జీఎస్టీ నుంచి 18 పైసలు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి 7 పైసలు, కస్టం డ్యూటీల నుంచి 4 పైసలు వస్తాయి. అంటే పరోక్ష పన్నుల నుంచి 29 పైసలు లభిస్తాయి. మొత్తంగా 64 పైసలు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి.

పన్ను రాబడి

న్నులు కాకుండా ఇతర ఆదాయ మార్గాలు

ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం బడ్జెట్‌లో ఈ లెక్క ప్రకారం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 20 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఖర్చు 30 లక్షల కోట్ల రూపాయలు. మిగిలిన పది లక్షల కోట్ల ఖర్చుకు సరిపడే డబ్బు ఎక్కడనుంచి వస్తుంది?

పన్నుల ద్వారా కాకుండా ప్రభుత్వానికి ఇతర మార్గాల ద్వారా కూడా కొంత ఆదాయం లభిస్తుంది. వీటిని నాన్-టాక్స్ రెవెన్యూ అంటారు.

ప్రభుత్వం అందించే సేవలకు మనం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్, టెలిఫోన్, గ్యాస్ బిల్లుల్లో ఒక చిన్న మొత్తం ప్రభుత్వానికి చేరుతుంది.

అనేక అంశాలలో చెల్లించే రాయల్టీ, లైసెన్స్ ఫీజు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ, రేడియో, టీవీల లైసెన్స్ ఫీజులు, రోడ్లు, వంతెనలపై విధించే టోల్ టాక్స్, పాస్‌పోర్ట్, వీసా వగైరాలకు చెల్లించవలసిన ఫీజు మొదలైనవాటి ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరుతుంది.

ప్రభుత్వ సంస్థల లాభాల్లో వాటా, మధ్య మధ్యలో రిజర్వ్ బ్యాంకునుంచీ వచ్చే డబ్బు కాకుండా మరి కొన్ని మార్గాల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.

ఇంకా, నాన్-డెబ్ట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ప్రభుత్వ మూలధనం ఖాతాలోకి చేరే డబ్బు.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా విదేశీ ప్రభుత్వాలకు ఇచ్చిన రుణాలు వెనక్కు తిరిగి వస్తే వాటిని నాన్-డెబ్ట్ క్యాపిటల్ రిసీట్స్ అంటారు. ఇది కూడా ప్రభుత్వానికి ఆదాయమే.

ఈ ఖాతా గత కొద్ది సంవత్సరాలుగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రభుత్వ సంస్థల వాటాలను అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ ఖాతాలోకే చేరుతుంది. ఏదైనా ఒక కొత్త కంపెనీని ప్రభుత్వం మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలలో నమోదు చేసినా లేదా బోనస్ షేర్లు వచ్చినా.. ఆ సొమ్మంతా ప్రభుత్వ ఖజానాలోకే చేరుతుంది.

వీటల్లో ఏవి పెరిగినా ప్రభుత్వ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. 2019-20 బడ్జెట్లో ఈ ఖాతా ద్వారా మూడు శాతం ఆదాయం లభించేది. 2020-21లో అది ఆరు శాతానికి పెరిగింది.

జీఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం ఎప్పుడు రుణాలు తీసుకుంటుంది?

ఇప్పటివరకూ మనం 80 శాతం ఆదాయాన్ని లెక్కించాం. మిగిలిన 20 శాతం ఎక్కడినుంచి వస్తుంది?

ఈ ఇరవై శాతాన్ని ప్రభుత్వం అప్పుగా తీసుకుంటుంది. ప్రభుత్వ బాండ్లను అమ్మడం నుంచీ అంతర్జాతీయ సంస్థలు లేదా విదేశీ ప్రభుత్వాల నుంచీ తీసుకునే రుణాలవరకూ ఈ అప్పులో భాగమే.

రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం అనేది దేశ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంటే అంత మేరకు రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం సులభమవుతుంది.

చాలావరకూ అభివృద్ధి చెందుతున్న దేశాలు (డెవలపింగ్ కంట్రీస్) లోటు బడ్జెట్‌తోనే నడుస్తుంటాయి. అవి తమ అభివృద్ధిని పెంచుకుంటూ రుణాలను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తుంటాయి.

కానీ అభివృద్ధి కుంటుపడి, సంపాదన తగ్గుతూ ఉంటే రుణాలు పీకలకు చుట్టుకుంటాయి. ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)