మంజురాణి: బాక్సింగ్ గ్ల‌వ్స్ కొనే శక్తి లేదు.. కానీ భారత ఒలింపిక్స్ ఆశాకిరణంగా మారారు- BBC ISWOTY

పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం మంజురాణి ముందున్న లక్ష్యం
ఫొటో క్యాప్షన్, పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డం మంజురాణి ముందున్న లక్ష్యం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ, విజయం అనేది పెద్ద విషయంకాదని మంజురాణి నిరూపించారు.

చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఏ ఆటనైనా దీక్షతో, నిబద్ధతో ఆడేవారు మంజురాణి.

హరియాణాలో రితాల్ ఫోగట్ గ్రామానికి చెందిన మంజురాణి తన తోటి పిల్లలంతా కబడ్డీ ఆడటం చూసి తాను జట్టులో చేరిపోయారు.

తాను మంచి కబడ్డీ ప్లేయర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె భావించేవారు. కొన్నాళ్లు కబడ్డీలో కొనసాగారు. కానీ తర్వాత విధి ఆమెను మరో బాటలో నడిపించింది.

ఆర్ధిక వనరుల లేమి ఉన్నా పట్టుదలగా ప్రాక్సీస్ చేశారు మంజురాణి
ఫొటో క్యాప్షన్, ఆర్ధిక వనరుల లేమి ఉన్నా పట్టుదలగా ప్రాక్సీస్ చేశారు మంజురాణి

కొత్త స్వ‌ప్నం

ఆమె కబడ్డీలో చూపుతున్న ప్రతిభను గుర్తించిన ఆమె కోచ్ స‌హాబ్ సింగ్‌ నర్వాల్ ఆమెలో ఇంకెంతో శక్తి ఉందని భావించారు. ఇలా టీమ్‌గా కాకుండా, వ్య‌క్తిగ‌త క్రీడ‌ల్లో ఆమె ఇంకా రాణిస్తారని అంచనా వేశారు. అదే విషయం ఆమెకు చెప్పారు.

తర్వాత ఆమె మనసు బాక్సింగ్ మీదకు మళ్లింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున కాంస్య పతకం సాధించిన మేరీకోమ్‌ ఆమెలో స్ఫూర్తి ర‌గిలించారు. మేరీకోమ్‌ స్ఫూర్తి, కబడ్డీ కోచ్ ప్రోత్సాహంతో ఆమె బాక్సింగ్ క్రీడ‌కు మారారు.

నిర్ణయమైతే మార్చుకున్నారుగానీ అందుకు అవసరమైన శిక్షణ విషయంలో ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. ఆర్ధికంగా వనరులు అవసరమయ్యాయి.

సరిహద్దు భద్రతా దళంలో పని చేసిన ఆమె తండ్రి 2010లో మరణించారు. ఇంట్లో ఆమెతోపాటు ఆరుగురు పిల్లలున్నారు. వీరంతా తండ్రికి ప్ర‌భుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి జీవించాల్సిందే.

బాక్సింగ్‌లో రాణించాలని కోరుకుంటున్న తన కూతురి కలలను ఎలా సాకారం చేయాలో తల్లికి అర్ధం కాలేదు. ఆమెకు శిక్షణ ఇప్పించడం తల్లికి పెద్ద సవాలుగా మారింది.

ఆహార నియమాలు పాటిస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్న మంజురాణికి అప్పట్లో బాక్సింగ్‌ గ్లవ్స్‌ కొనడానికి కూడా చేతిలో డబ్బులుండేవి కావు.

కబడ్డీలో శిక్షణ ఇచ్చిన సహాబ్‌ సింగ్‌ నర్వాల్‌ బాక్సింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తన ఊర్లోని పొలాల్లోనే మంజురాణి ప్రాక్టీస్ చేసేవారు.

విమెన్ బాక్సింగ్ కు మంజురాణి ఆశాకిరణంగా మారారు
ఫొటో క్యాప్షన్, విమెన్ బాక్సింగ్ కు మంజురాణి ఆశాకిరణంగా మారారు

‘స్వర్ణ’యుగం మొదలు

రాణి కుటుంబం దగ్గర ఆర్ధిక వనరులు లేకపోయినా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఉన్న కొద్దిపాటి వనరులతో శిక్షణ తీసుకున్న మంజురాణి, 2019లో జరిగిన సీనియర్‌ నేషనల్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు.

అలా తొలి పతకాన్ని గెలుచుకుని క్రీడా ప్రపంచంలోకి తొలి అడుగును ఘనంగా వేశారు మంజురాణి. నేషనల్ ఛాంపియన్ షిప్‌ స్ఫూర్తిని కొనసాగించిన మంజురాణి రష్యాలో జరిగిన వరల్డ్‌ విమెన్ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌ వరకు వెళ్లారు. ఎంతో కష్టమైన ఈ పోటీలో ఆమె వెండిపతకం సాధించారు.

అదే సంవత్సరంలో బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జా మెమోరియాల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో కూడా సిల్వర్ మెడల్‌ గెలుచుకున్నారు.

ఆరంభంలో సాధించిన విజయాలతో హరియాణా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆమెకు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ గేమ్ లో బంగారు పతకం గెలవడం లక్ష్యంగా పెట్టింది.

కుటుంబ సహకారం ఉంటే భారతదేశంలో ఏ క్రీడాకారుడైనా, క్రీడాకారిణైనా అద్భుతమైన విజయాలను సాధిస్తారని రాణి బలంగా నమ్ముతారు. తన లక్ష్య సాధనలో కుటుంబం పాత్ర ఎనలేనిదని ఆమె చెప్పారు.

(బీబీసీ పంపిన ప్రశ్నావళికి మంజురాణి ఇచ్చిన సమాధానాలు ఈ కథనానికి ఆధారం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)