బడ్జెట్ 2021: ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఒక నాణానికి రెండు పార్శ్వాలా

మోదీ

ఫొటో సోర్స్, Ani

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎనమిక్ ఫోరం సదస్సులో శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతదేశాన్ని స్వయం సమృద్ధి గల (ఆత్మనిర్భర్) దేశంగా మలచాలన్న తన సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించారు.

"భారతదేశం ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భరత ఆకాంక్ష గ్లోబలిజానికి కొత్త ఉద్దీపనగా నిలుస్తుంది. ఇండస్ట్రీ 4.0 (నాలుగో పారిశ్రామిక విప్లవం) నుంచి కూడా ఈ ప్రచారానికి మద్దతు లభిస్తుందని నేను ఆశిస్తున్నాను" అని మోదీ అన్నారు.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ ఆత్మనిర్భరత విధానాన్ని అధికారికంగా విస్తరించింది. ఈ విధాన మార్పు తరువాత రాబోతున్న మొదటి బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు.

ఈ బడ్జెట్‌తో పాటు రానున్న సంవత్సరాలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రణాళికలు కూడా ఆత్మనిర్భరత మీదే దృష్ణి కేంద్రీకరిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

GETTY IMAGES
ఫొటో క్యాప్షన్, GETTY IMAGES

ఈ బడ్జెట్‌లో.. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా దిగుమతులపై సుంకాలను పెంచే ప్రతిపాదన ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ఆత్మనిర్భరత విధానాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తున్నట్లు తోస్తోంది.

30 ఏళ్ల ఆర్థిక విధానాన్ని ప్రస్తావిస్తూ గత ఏడాది మే 12న స్వావలంబన దిశగా మోదీ 20 లక్షల ప్యాకేజీని ప్రకటించడమే కాక స్థానిక ఉత్పత్తులపై దృష్టి సారించాలని సూచించారు. అంతే కాకుండా 'వోకల్ ఫర్ లోకల్' అనే నినాదాన్ని ఇచ్చారు.

జాతీయ ఉత్పత్తుల ఆవశ్యకతను నొక్కి చెప్తూ దేశీయ ఉత్పత్తిని పెంచి, విదేశాలకు ఎగుమతి చేసే దిశగా కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధంగా ఇండియా.. ప్రపంచవ్యాప్త ఉత్పత్తుల సరఫరా గొలుసు (సప్లయ్ చైన్)లో ఇంతకుముందు కన్నా బలోపేతం కాగలదని, ముఖ్య భూమిక పోషించగలదని మోదీ అన్నారు.

కాగా, శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో భారతదేశం స్వయం సమృద్ధి దిశగా కదులుతోందని చెప్తూ, ఉదాహరణగా కరోనా వ్యాక్సీన్లను ప్రస్తావించారు. కరోనవైరస్‌ను అరికట్టేందుకు భారతదేశం రెండు వ్యాక్సీన్లను అభివృద్ధి చేసిందని, వాటిని పేద దేశాలకు పంపిణీ చేసిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

GETTY IMAGES
ఫొటో క్యాప్షన్, GETTY IMAGES

స్వావలంబన భారత్ ప్రచారం

మే 12 తరువాత 'స్వావలంబన భారత్'కు విస్తృత ప్రచారం కల్పించారు. ఈ రెండు పదాలను పారిశ్రామికవేత్తల, వ్యాపరవేత్తల చెవుల్లో మారుమోగిపోయేలా ప్రచారం చేశారు. ఆర్థిక శాఖ కూడా దీన్ని ప్రభుత్వ మిషన్‌గా పరిగణిస్తూ ముందుకు తీసుకెళ్లే పనిలో పడింది.

సోమవారం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయం, రాయితీలు, కొత్త విధానాలు కూడా స్వావలంబనపైనే దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి పెట్టుకున్న లక్ష్యాలను నెరవేర్చే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వంతు ప్రయత్నం చేస్తారని అనిపిస్తోంది.

స్వావలంబన దిశగా గత ఏడాదే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తూ.. 'ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు' '(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్) పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకం కింద దేశీయ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు వచ్చే ఐదేళ్ల వరకు 4 నుంచి 6 శాతం రాయితీలను మంజూరు చేశారు.

ముందుగా ఎలక్ట్రానిక్, ఫార్మా రంగాలను ఈ పథకం కిందకు తీసుకువచ్చారు. తరువాత నవంబర్ 11న మరో పది రంగాలను కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ పథకానికి ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్ల సహాయం ప్రకటించింది.

పారిశ్రామిక రంగం ఈ విధానాలపై సంతోషం ప్రకటించింది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ పథకాన్ని "గేమ్ ఛేంజర్" అని ప్రశంసిస్తూ వరుసగా మూడు ట్వీట్లు చేశారు. ఇది పరిశ్రమల వైఖరిలో మంచి పరిణామాలను తీసుకొస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

మేక్ ఇన్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఆత్మనిర్భర భారత్ - మేక్ ఇన్ ఇండియా

స్వావలంబన, మేక్ ఇన్ ఇండియా...ఆ రెండు పదాలనూ పలు కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు కూడా పర్యాయపదాలుగా ఉపయోగిస్తున్నారు.

రెండు విధానాలు ఒకటే అన్నట్లు మాట్లాడుతున్నారు.

2014 ఆగస్ట్ 15న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ 'మేక్ ఇన్ ఇండియా' గురించి ప్రస్తావించారు. కానీ తరువాత అది విఫలయత్నంగానే మిగిలిపోయింది.

ప్రధాని విదేశీ పెట్టుబడిదారులను ఉద్దేశిస్తూ "కం, మేక్ ఇన్ ఇండియా" అని పిలుపునిచ్చారు.

చైనాలాగ ఇండియాను కూడా ఒక తయారీ రంగ కేంద్రం (మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌)గా తీర్చిదిద్దాలని ఆశించారు.

కానీ గత ఆరేళ్లుగా ఈ ఆలోచన కాగితంపైన మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది.

"గత ఆరు సంవత్సరాలుగా ఉత్పాదక రంగం ప్రధాన పరామితులు, ప్రమాణాల్లో ఎటువంటి వృద్ధి కనిపించలేదు" అని సిటీ గ్రూప్ రీసెర్చ్ తయారుచేసిన ఒక నివేదికలో వెల్లడించారు.

ఈ నివేదికలో మేక్ ఇన్ ఇండియా వైఫల్యానికి కారణాలను ఎత్తి చూపుతూ "ఏదో ఒక ముఖ్యమైన రంగంపై దృష్టి కేంద్రీకరించకుండా 25 రంగాలను ఈ పథకం కిందకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు" అని తెలిపారు.

సింబాలిక్

ఫొటో సోర్స్, Getty Images

స్వావలంబన భారత్ లేకా లైసెన్స్ రాజ్ భారత్?

అయితే, ఆత్మనిర్భరత విధానంలో లోపాలను పలువురు ఎత్తి చూపుతున్నారు.

ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియం మీడియాతో మాట్లాడుతూ స్వావలంబన ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రక్షణవాద యుగాన్ని తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నం అని ఆయన అన్నారు.

రక్షణ వాద యుగం అంటే...విదేశీ కంపెనీలను దేశంలోకి రాకుండా అడ్డుకుంటూ, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశలో దిగుమతులపై అధిక సుంకాలను విధించడం. అలా చేస్తే కంపెనీలు పోటీని ఎదుర్కొనే అవకాశం తగ్గిపోతుంది. అలాంటప్పుడు దేశీయ ఉత్పత్తుల ధరలు అధికమై, నాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

అవినీతి సర్వ సాధారణం అయిపోతుంది. ఏదైనా కొత్త కంపెనీ ప్రారంభించాలంటే లైసెన్స్‌కోసం అనేక విభాగాలనుంచీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీనివల్ల కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం ఆలస్యమవుతుంది.

ఇలాంటి పరిస్థితులు తిరిగి వచ్చే దిశగా భారత్ ప్రయాణిస్తుందేమోనని అరవింద్ సుబ్రమణియం ఆందోళన వ్యక్తం చేశారు.

"1991 తరువాత ఇండియా పాటిస్తున్న రెండు ప్రధాన సూత్రాలు - 1) ఎగుమతులను విస్తరించడం, 2) నెమ్మదిగా, స్థిరంగా ఆర్థిక సరళీకరణ (లిబరలైజేషన్).

ఇప్పుడు ఈ ఆత్మనిర్భరత విధానంతో గత మూడు దశాబ్దాలుగా మన దేశం పాటిస్తున్న విధానాలకు వ్యతిరేక దిశలో పయనిస్తున్నట్లు అవుతుంది" అని ఆయన అన్నారు.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఇది పోటీని చంపుతుంది

'బ్యాడ్ మనీ', 'ఈజీ మనీ' పుస్తకాల రచయిత వివేక్ కౌల్ కూడా ఆత్మనిర్భరత విధానం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

"ఆత్మనిర్భరత వలన దిగుమతులపై సుంకాలు పెరుగుతాయి. అంతే కాకుండా, భారతీయులను దేశీయ ఉత్పత్తులు మాత్రమే కొనే దిశలో భారతీయులను బలవంతం చేసినట్లు అవుతుంది.

ఇండియా ప్రపంచ సప్ప్లై చైన్‌లో బలోపేతం కావాలని కోరుకుంటున్నారు కానీ పోటీ లేకుండా ఇది ఎలా సాధ్యం?

స్వయం సమృద్ధితో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. పోటీ లేకుండా ఉంటే ఉత్పత్తుల నాణ్యత తగ్గుతుంది. ధరలు పెరుగుతాయి. అవినీతి పెరుగుతుంది. లైసెన్స్ రాజ్ వ్యవస్థ పైకి వస్తుంది. 1991 తరువాత ఆర్థిక విధానాలలో వచ్చిన మార్పుల వల్లే మనం పురోగతి సాధించామని గుర్తు పెట్టుకోవాలి" అని వివేక్ కౌల్ అభిప్రాయపడ్డారు.

అయితే, ప్రస్తుత భారత దేశం లైసెన్స్ రాజ్ ఉన్నప్పటి వ్యవస్థకన్నా భిన్నమైనదనీ, ఆ కాలానికి తిరిగి వెళ్లడం అసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈరోజు భారతదేశం ఆహారంలో స్వయం సమృద్ధి సాధించింది. టెక్నాలజీలో అనేక దేశాలకన్నా ముందుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో ఇండియాది ఒక విజయగాథ. గత రెండేళ్లలో ఎగుమతులు 6.4 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపై 11.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి అని కొందరు నిపుణులు అంటున్నారు.

సింబాలిక్

ఫొటో సోర్స్, Getty Images

చైనా దిగుమతులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారమా?

భారతదేశ సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో, చైనా వసువులను, యాప్‌లను బహిష్కరిస్తూ, చైనా వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలోనే ఆత్మనిర్భరత ప్రచారం ఊపందుకుంది.

అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలలో మూడింట రెండితులు చైనా ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

2018లో చైనా నుంచి దిగుమతుల విలువ 70 బిలియన్ డాలర్లని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని గణనీయంగా తగ్గించాలని భారత్ కోరుకుంటోంది.

అయితే, ఆత్మనిర్భరత ప్రచారం చైనాకు వ్యతిరేకం కాదని దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో చైనా వ్యవహారాల నిపుణులు డాక్టర్ ఫైసల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

"దేశీయ పోటీ ప్రయోజనాలను పెంపొందించేదుకు స్వావలంబన ఉపయోగపడుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుంచీ ఈ ఆలోచనా విధానం చర్చల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడం, సప్ప్లై చైన్ తీవ్ర ప్రభావాలకు లోనవ్వడం కారణంగా స్వావలంబనకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.

చైనాకు దిగుమతులను తగ్గించడమే కాకుండా, మిషినరీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ ఉత్పత్తి, భారీ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్‌తో సహా అనేక రంగాల్లో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వావలంబన విధానాన్ని ముందుకు తీసుకువచ్చారని" ఆయన అన్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది వ్యాపారులు సభ్యులుగా ఉన్న భారత వ్యాపారస్థుల సంస్థ (సీఏఐటీ).. చైనా వస్తువులను వ్యతిరేకించడం, ఆ వస్తువులను ఇండియాలోనే తయారుచేసుకోవడం లక్ష్యంగా 'ఇండియన్ గూడ్స్ అవర్ ప్రైడ్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

ప్రస్తుతం చైనానుంచి దిగుమతి చేసుకుంటున్నవి, కానీ దేశీయంగా కూడా ఉత్పత్తి చేయగలిగే 3,000 వస్తువుల జాబితాను ఈ సంస్థ తయారుచేసింది. వీటిల్లో పిల్లల ఆట వస్తువులు, వంట సామాన్లతో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 13 బిలియన్ డాలర్ల విలువ గల చైనా దిగుమతులను తగ్గించాలన్నది ఈ సంస్థ లక్ష్యం.

మరికొంతమంది ఇది మోదీ ప్రభుత్వ జాతీయవాదం, ఆర్ఎస్ఎస్ స్వదేశీ వాదమని అంటున్నారు.

వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP VIA GETTY IMAGES

ఆత్మనిర్భరత భారత భవిష్యత్తు

అయితే స్వావలంబన.. వోకల్ ఫర్ లోకల్ పథకం విజయవంతంవుతుందా? సమీప భవిష్యత్తులో భారతదేశం సంపూర్ణ ఆత్మనిర్భరత కలిగిన దేశంగా మారుతుందా? తన సొంత అవసరాలకు తగ్గ వస్తువులను తనే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుందా?

ఈ బ్రాండ్ భారతదేశానికి, స్వదేశీ సంస్థల అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటుంది అని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచాం) తెలిపింది.

దేశంలో నైపుణ్యతకు, ప్రతిభకు కొరతలేదని.. సరైన ప్రోత్సాహకాలు అందిస్తే స్వదేశీ ఉత్పత్తులను పెంచవచ్చని ఈ సంస్థ తెలిపింది. దీనిని పూర్తిగా అమలుచేయడానికి కొంత కాలం పడుతుంది కానీ ఇది మంచి ప్రయత్నం అని అసోచాం అభిప్రాయం వ్యక్తం చేసింది.

కానీ ప్రస్తుతం ఎలక్ట్రానిక్, కొన్ని ఇతర పరిశ్రమల విషయంలో భారతీయ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో, ముఖ్యంగా చైనా కంపెనీలతో పోటీ పడటంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.

ఉదాహరణకు ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తులను తీసుకుంటే, గత ఏడాది అక్టోబర్ వరకు దేశంలోని ఎయిర్ కండిషనింగ్ వస్తువుల వినియోగంలో 35 శాతం చైనా వాటా ఉంది. అలాగే మొబైల్ ఫోన్స్, టీవీలు మొదలైనవి అనేకం చైనానుంచి అధికంగా దిగుమతి అవుతున్నాయి.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి భారతీయ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను విస్తరిస్తున్నాయి. కానీ ముడి పదార్థాలను చైనానుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. పూర్తి ఆత్మనిర్భరత సాధించడానికి కొంత కాలం పట్టవచ్చు. కానీ ధరలు పెరిగి, నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే భారతీయులకు ఎంపిక తగ్గిపోయే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)