ప్రైవేటు కంపెనీలకు చోటివ్వకుండా భారత రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భరత’ సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లెఫ్టినెంట్ సతీశ్ దువా (రిటైర్డ్)
- హోదా, రక్షణరంగ నిపుణులు, బీబీసీ కోసం
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలలో తొలి విడతగా వచ్చిన ఐదు ఫైటర్‌జెట్‌లు అధికారికంగా భారత వైమానిక దళంలో చేరాయి.
భారత ఆయుధ సంపత్తిలో చాలాకాలంపాటు లోటులాగా ఉన్న ఈ విమానాలు ఎట్టకేలకు దేశ అవసరాలు తీర్చడానికి సిద్ధమయ్యాయి. లద్ధాక్‌లో చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల సమయంలో వీటికి ప్రాధాన్యత పెరిగింది.
అయితే ఇప్పటి వరకు భారతదేశానికి ఐదు రఫేల్ విమానాలు మాత్రమే వచ్చాయి. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం 36 విమానాలకు భారత్‌కు రావాల్సి ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి విమానాల అవసరం ఎక్కువగా ఉంది. కానీ వీటిని భారతదేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది సరైన విధానం కాదు.
ఇప్పుడు భారతదేశానికి 'మేక్ ఇన్ ఇండియా' ఉత్పత్తుల అవసరం ఉంది. స్వయం సమృద్ధ భారత్ దిశగా యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో భారత్ సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవాల్సి ఉంది.
స్వయం సమృద్ధంగా మారకుండా ఏ దేశమూ ప్రాంతీయ స్థాయిలో శక్తివంతం కావాలని కోరుకోదు. కానీ ఈ రోజుల్లో పూర్తి స్వయం సమృద్ధిని సాధించడం అంత సులభం కాదు.
ఇప్పటి పరిస్థితుల్లో భారత్ రఫేల్ ఫైటర్ జెట్లను విదేశాల నుంచి కొనడం సబబే. కానీ దేశీయంగా యుద్ధ విమానాలను తయారు చేసుకునే దిశగా రక్షణ రంగాన్ని నడిపించాలి. ఒక దేశీయ విమానం రక్షణ చర్యల్లో పాల్గొనాలి.

ఫొటో సోర్స్, Indian Air Force
స్వదేశీ నినాదం ఎందుకు పని చేయడం లేదు?
స్వదేశీ నినాదం, దాని కోసం తీసుకుంటున్న చర్యలు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. దీనికి కారణం కూడా ఉంది. ఇప్పటి వరకు భారతదేశం రక్షణ రంగంలో ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధి కోసం ప్రభుత్వరంగ సంస్థల పైనే ఆధారపడి ఉంది. అసలు ఈపాటికి ప్రైవేటురంగానికి పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించి ఉండాల్సింది.
ఆయుధాల ఉత్పత్తి విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పడుతున్నాయి. కానీ కలిసి పని చేస్తే దేశానికి మేలు కలుగుతుంది. పోటీ కొంత వరకు రెండు రంగాలకు మేలు చేస్తుంది.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తాయి. చైనా మోడల్‌ను గమనిస్తే, అక్కడ కూడా భారతదేశంలోలాగే ప్రభుత్వ రంగ సంస్థలే రక్షణ పరిశోధనలు నిర్వహిస్తుంటాయి.
ఇప్పుడు చైనా సహకార పద్దతిని అవలంబిస్తూ రక్షణ రంగంలో ప్రైవేటు ఉత్పత్తి, రూపకల్పనకు, అభివృద్ధికి ఒక మోడల్‌ను సిద్ధం చేసింది.
దేశంలో తయారు చేసిన రక్షణ ఉత్పత్తులనే చైనా సైన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత వాటిలో వారికి కావలసిన మార్పులు చేసుకుంటారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తేలికపాటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలు( లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్-ఎల్‌సీఏ) తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేయగలదు. అయితే ఇది ప్రపంచంలోని అత్యుత్తమ విమానాలలో ఒకటి కాకపోవచ్చు. కానీ తర్వాత దీనికి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1960లలో ఏర్పాటు చేసిన డిజైన్ డైరెక్టరేట్ భారత నౌకాదళానికి కావాల్సిన ఓడలను నిర్మిస్తుంది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉత్పత్తులను మెరుగుపరిచే బాధ్యతను ఎయిర్ ఫోర్స్ చీఫ్‌కు అప్పజెప్పాలి.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి విమానయాన పరిశ్రమకు సంబంధించిన మూడు ప్రధాన సంస్థలు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఏజెన్సీ (జీటీఆర్‌ఈ)లు తమ ప్రణాళికలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి ఆ అధికారం కూడా ఉంది.
అంతరిక్ష రంగంలో విజయవంతమైన భారతదేశం విమానయాన రంగంలో విజయం సాధించలేకపోవడానికి కారణాలు కనిపించవు. ఇస్రో, గోద్రేజ్‌ల మధ్య భాగస్వామ్యం కూడా ఒక ఉదాహరణ.

ఫొటో సోర్స్, DASSAULT RAFALE
ఉమ్మడి ప్రయోజనాలకు విమానయాన రంగం
భద్రతతోపాటు, అంతరిక్ష కార్యక్రమాలు, ఉపగ్రహ పరిశ్రమ వస్తువులను పౌర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించాలి. దానివల్ల విమానయాన రంగం కూడా ప్రయోజనం పొందుతుంది.
వచ్చే దశాబ్దంలో వెయ్యికి పైగా కొత్త వాణిజ్య విమానాలను భారత్ కొనుగోలు చేస్తుందని అంచనా. భారత సైన్యం కూడా అదే స్థాయిలో విమానాలను కొనాలనుకుంటోంది.
సైనిక, పౌర విమాన రంగాలు వేర్వేరుగా ఉన్న ఏకైక దేశం భారతదేశమే. మిగతా అన్ని దేశాలలో ఈ రెండు వ్యవస్థలు కలిసే ఉంటాయి.
భారతదేశంలో పెరుగుతున్న మార్కెట్ దృష్ట్యా, విదేశీ కంపెనీలు తమ కంపెనీలను ఇక్కడ స్థాపించడానికి ముందుకు వస్తున్నాయి. కానీ చాలా కంపెనీలు లాభాలు పొందడం లేదు..
భారత వైమానిక దళం 40 LCA MK-1 తేజస్ ఫైటర్ జెట్‌లకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి కాకుండా 83LCA MK-2 విమానాల కొనుగోలుకు కూడా రక్షణమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
వీటితోపాటు తేలికపాటి హెలికాప్టర్ల తయారీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనుమతి పొందింది. ఈ హెలికాప్టర్లు పాతతరం చీతా, చేతక్ హెలికాప్టర్ల స్థానాన్ని భర్తీ చేస్తాయి.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పని వేగాన్ని పెంచినా, నిర్ణీత సమయంలోగా వాటిని తయారు చేసి అందివ్వడంలో ఇబ్బంది పడుతోంది. ప్రైవేటు రంగానికి ఇందులో భాగస్వామ్యం కల్పించడమే దీనికి పరిష్కారం. ప్రైవేటు సంస్థలకు ఈ రంగంలో లైసెన్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం వల్ల భారత వైమానిక దళం తక్కువ సమయంలో తన అవసరాలు తీర్చుకోగలుగుతుంది. అలాగే విమానయాన రంగంలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యం కూడా నెరవేరుతుంది.
మారుతి సంస్థ తన ఉత్పత్తుల అమ్మకాలను కొన్ని చిన్న సంస్థలకు అప్పజెప్పినట్లే, విమానయాన రంగంలో కూడా ప్రైవేట్ ప్లేయర్లను అనుమతించడం ద్వారా ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్), ఎంఎస్‌ఎంఈ (మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ)లను ప్రోత్సహించినట్లవుతుంది. దీని ద్వారా ఆత్మనిర్భర భారత్ కల కూడా సాకారమవుతుంది.
సంస్కరణలు అవసరం
ప్రైవేటు పరిశ్రమలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేయడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచిన తర్వాత వారికి సాంకేతిక పరిజ్జానం కూడా అందించాల్సి ఉంది. ఈ లోపం ఇప్పుడు స్పష్టంగా ఉంది.
ఈ సాంకేతిక లోపాలను అధిగమించడానికి పెద్ద పెద్ద సంస్థలతో భారత దేశం 'వ్యూహాత్మక భాగస్వామ్యం' ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ప్రపంచంలోని పెద్ద రక్షణ సంస్థల సహకారంతో ప్రైవేట్ రంగం తమ సాంకేతికతను మెరుగు పరుచుకుంటుంది.
కేవలం దిగుమతుల మీద ఆధారపడే తత్వం నుంచి భారతదేశం బైటికి రావాలి. స్వదేశీకరణ అనేది చాలాకాలంగా ప్రభుత్వరంగంతోనే ముడిపడి ఉంది. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తే భారతదేశం మరింత సురక్షితంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఇండియాలో వాయు కాలుష్యం పెరిగితే కోవిడ్ కేసులు పెరుగుతాయా?
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్‌ను మళ్లీ గెలిపించగల ఐదు అంశాలు ఇవీ...
- కరోనా వైరస్: ఇండియాలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- టిక్ టాక్ వీడియోల మాటున ట్రంప్ వ్యతిరేక ప్రచారం - బీబీసీ పరిశోధన
- లద్దాఖ్‌లో మన భూమిపై కన్నేసినవారికి తగిన సమాధానం చెప్పాం’ - చైనా పేరెత్తకుండా వ్యాఖ్యలు
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- గల్వాన్ లోయ: సైనికులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత్‌తో ఘర్షణల్లో గన్స్ వాడకూడదన్న నిబంధన వల్లేనా?
- మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









