టిక్ టాక్ వీడియోల మాటున ట్రంప్ వ్యతిరేక ప్రచారం - బీబీసీ పరిశోధన

డబ్బులు తీసుకుని ట్రంప్ కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న టిక్ టాక్ యూజర్లు.

ఫొటో సోర్స్, TIKTOK

ఫొటో క్యాప్షన్, డబ్బులు తీసుకుని ట్రంప్‌కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న టిక్ టాక్ యూజర్లు
    • రచయిత, సోఫియా స్మిత్ గేలర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి వ్యతిరేకంగా టిక్ టాక్ సోషల్ మీడియా యాప్‌లో కొంత మంది యూజర్లు ఒక మార్కెటింగ్ కంపెనీ ఇచ్చే చెల్లింపులు తీసుకుని వీడియోలు ప్రచురిస్తున్న విషయాన్ని బీబీసీ పరిశోధన బయట పెట్టడంతో టిక్ టాక్ ఆ వీడియోలను తమ వేదిక నుంచి తొలగించింది.

కొన్ని రకాల స్కిట్లు, మీమ్స్, పాటలతో కలిపి ఓటు సందేశాలను జత చేసి టిక్ టాక్‌లో వీడియోలు తయారు చేసి ప్రసారం చేసేందుకు గాను బిగ్ టెంట్ క్రియేటివ్ సంస్థ సంబంధిత వ్యక్తులకు నిధులు సమకూరుస్తోంది.

కొన్ని నిస్పక్షపాతంగా చేసిన వీడియోలకు కూడాఈ సంస్థ చెల్లింపులు చేసినట్లు తేలింది. కానీ, కొన్ని వీడియోలు మాత్రం ట్రంప్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే సందేశాన్ని ఇస్తున్నాయి.

అయితే, అలా చేసేందుకు వీడియోలు తయారు చేసేవారికి డబ్బులు లభించాయని ఒక యూజర్ వెల్లడించారు.

టిక్ టాక్ రాజకీయ ప్రకటనలను బహిష్కరిస్తుంది. ఎవరైనా డబ్బులు తీసుకుని కంటెంట్ తయారు చేస్తే ఆ విషయాన్ని వెల్లడి చేయవలసి ఉంటుంది. టిక్ టాక్ లో ప్రచురించిన వీడియోలను బీబీసీ చూపించినప్పుడు ఆ సంస్థ చాలా వీడియోలను తొలగించింది. అప్పటికే ఈ వీడియోలకు కొన్ని వేల వ్యూస్ లభించాయి.

కంటెంట్ తయారు చేసేవారు ఒక వేళ ఎవరి దగ్గరి నుంచైనా డబ్బులు తీసుకుని వీడియోలు చేస్తే ఆ విషయాలను కచ్చితంగా బహిర్గతం చేయాలని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్ టి సి) నియమావళి చెబుతోంది.

"సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని తయారు చేసే వీడియోలకు కూడా ఇదే నియమావళి వర్తిస్తుంది. వారు ఈ నియమావళిని పాటిస్తారని మేము భావిస్తాం" అని టిక్ టాక్ ప్రతినిధి చెప్పారు.

"ఇలా డబ్బులు తీసుకుని వీడియోలు చేస్తున్న వారు ఆ విషయాన్ని వెల్లడి చేయని పక్షంలో మేము దానిని తొలగించి తగిన చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.

డబ్బులు తీసుకుని ట్రంప్ కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న టిక్ టాక్ యూజర్లు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకొక రెండు వారాల వ్యవధి ఉండగా, యువత ఓట్లు సంపాదించేందుకు రాజకీయ నాయకులు, మొదటి సారి ఓటు వేసేందుకు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేయించేందుకు యువత పోటీపడుతున్నారు.

అయితే, పైకి కేవలం సరదాగా కనిపించే కొన్ని టిక్ టాక్ వీడియోలు డబ్బులు తీసుకుని రాజకీయ ఉద్దేశాలను ప్రచారం చేసేందుకు తయారు చేస్తున్నవనే విషయం కొన్ని లక్షల మంది టిక్ టాక్ యూజర్లకు తెలియదు.

అమెరికా సెనేట్ సభ్యుడు ఎలిజబెత్ వారెన్ డెమొక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తున్నప్పుడు అతనికి మద్దతుగా మీమ్స్‌ తయారు చేసేందుకు బిగ్ టెంట్ కంపెనీ తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. క్రమంగా అది ప్రముఖులతో కలిసి పని చేసే మార్కెటింగ్ కంపెనీగా అవతరించింది.

ఈ సంస్థకు వివిధ డెమొక్రాట్ సంస్థల నుంచి, నిష్పక్ష సంస్థలైన వోట్ సింపుల్, పుష్ బ్లాక్, ప్రోగ్రెస్ పాప్ లాంటి సంస్థల నుంచి నిధులు వస్తాయని చెబుతోంది. ఈ సంస్థకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయో వెల్లడి చేయవలసిన అవసరం లేదు. అయితే, ఈ సంస్థకు నిధులు సమకూర్చే రాజకీయ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు, సంస్థలు మాత్రం ఆ వివరాలను వెల్లడి చేయవలసిన అవసరం ఉంటుంది.

ఓటు పొందడానికి తయారు చేసే సమాచారానికి డబ్బులు చెల్లించడం రాజకీయ చెల్లింపులలోకి రాదని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో, ఈ వివరాలను బయట పెట్టాల్సిన అవసరం లేదు. అయితే, అది నిష్పక్షపాత సమాచారానికి మాత్రమే వర్తిస్తుంది.

బిగ్ టెంట్ చెల్లించే చెల్లింపులు ఏవీ రాజకీయ ప్రచారంలో భాగం కావని వాదిస్తోంది. అయితే, ఈ సంస్థ చెల్లింపులు చేసిన కొంత మంది చేసిన వీడియోలు ట్రంప్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. టిక్ టాక్ ఈ వీడియోలను రాజకీయ ప్రచారంగా పరిగణిస్తోంది.

ఈ వీడియోలు సహజంగా ఉండటం కోసం #ప్రకటన అనే పదాన్ని తొలగించమని యూజర్లకు చెప్పినట్లు సంస్థ సిఇఓ బీబీసీకి తెలిపారు.

డబ్బులు తీసుకుని ట్రంప్ కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న టిక్ టాక్ యూజర్లు.

ఫొటో సోర్స్, TIK TOK

ఫొటో క్యాప్షన్, డబ్బులు తీసుకుని ట్రంప్ కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్న టిక్ టాక్ యూజర్లు.

ఈ వీడియోల్లో ఏముంది?

కేవలం ఈ వీడియోలను చూడటం ద్వారా అవి డబ్బులు తీసుకుని చేస్తున్నవా లేదా ఏదైనా సంస్థకు సంబంధించినవా అని నిర్ధరించలేము.

ఈ వీడియోలను కొంత మంది ప్రముఖ తయారీదారులు చేస్తారు. ఇందులో బాగా ప్రాచుర్యం పొందిన డాన్సులు, స్కిట్లు, లేదా ఏకపాత్రాభినయం లాంటివి ఉంటాయి. ఇవి వారు సాధారణంగా పోస్టు చేసే వీడియోల లాగే ఉంటాయి.

బిగ్ టెంట్ క్రియేటివ్ ప్రోత్సహించిన ఒక సిరీస్ లో , కొంత మంది ప్రముఖ టిక్ టాక్ తారలు ఒకరితో ఒకరు జత కట్టి ఓటరు నమోదు చేసుకోవాల్సిన లింక్ కి ప్రచారం చేశారు. అయితే, నిష్పక్షపాతమైన సందేశమిస్తుందని చెప్పే ఈ వీడియోలో కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా "ట్రంప్ టిక్ టాక్ ని బహిష్కరించాలని అనుకుంటున్నారు. మనం అతనికి ఓటు వేయకుండా ఆపుదామా" లాంటి సందేశాలు దాగి ఉన్నాయని కొంత మంది యూజర్లు చెబుతున్నారు.

ఈ వీడియో ఇంకా టిక్ టాక్ లో అందుబాటులో ఉంది. ట్రంప్ ని 'యాంగ్రీ ఛీటో , "ఆరంజ్ బ్రస్సెల్ స్ప్రౌట్", వేర్ స్క్రిడ్ 2020" లాంటి పేర్లతో అభివర్ణించిన వీడియోలను మాత్రం టిక్ టాక్ కమ్యూనిటీ నియమావళిని ఉల్లగించినందుకు గాను తొలగించారు.

వీడియోలు తయారు చేసేందుకు బిగ్ టెంట్ నుంచి నిధులు తీసుకుంటున్న విషయాన్ని వెల్లడి చేయాలనే విషయం గురించి తమకు తెలియదని వీడియోలు తయారు చేసే ఒక యూజర్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, 'టిక్‌టాక్‌లో ఇదే మా చివ‌రి వీడియో'

ఇప్పటి వరకు బిగ్ టెంట్ 25000 మంది ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు సహాయపడిందని, అందులో సగం మంది టిక్ టాక్ యూజర్లేనని తెలిపింది. వేరే ఏ సోషల్ మీడియా ద్వారా ఇంత మంది నమోదు అవ్వలేదని పేర్కొంది.

రాజకీయ ప్రకటనలను బహిష్కరించినప్పటికీ , టిక్ టాక్ లో రాజకీయ ప్రకటనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ లేకపోవడం వలన ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో ఈ ఒక్క అంశం తేటతెల్లం చేస్తోందని రాజకీయాల పై ధన ప్రభావం గురించి పరిశోధన చేసే సెంటర్ ఆఫ్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ కి చెందిన అనా మాసోగ్లియా అన్నారు.

"రహస్యంగా ఇంకా ఎంత జరుగుతుందో మాకు తెలియదు" అని ఆమె అన్నారు.

కొంత మంది యూజర్లు సహకార భాగస్వామ్యంతో చేసే ప్రకటనలను పట్టుకోవడం సులభం కావడంతో టిక్ టాక్ కొన్ని ప్రకటనలను బహిష్కరించగలిగింది అని అన్నారు. దీని పరిధిలోకి రాకుండా కూడా చాలా జరుగుతూ ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు.

సంప్రదాయ ప్రచార విధానాలతో పోల్చి చూస్తే డిజిటల్ మాధ్యమాల ద్వారా జరిగే ప్రచారంలో పాటించాల్సిన నిబంధనలు అంత స్పష్టంగా లేవు. 2006లో ఫెడరల్ ఎలక్షన్ కమీషన్ ప్రచార నియమావళిని రూపొందించే సమయానికి అమెరికాలో టిక్ టాక్ యూజర్లు గాని, టిక్ టాక్ సమాచారం తయారు చేసే వారు గాని కనీసం పుట్టి కూడా ఉండరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)