అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్‌‌ను మళ్లీ గెలిపించగల ఐదు అంశాలు ఇవీ...

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆంథోనీ జుర్చెర్
    • హోదా, ఉత్తర అమెరికా రిపోర్టర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బైడెన్‌, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ కన్నా ప్రజాదరణలో ముందున్నారని ఇటీవల జరిగిన పోల్‌ సర్వేలు తేల్చాయి. ముఖ్యంగా కీలకమైనవిగా భావించే రాష్ట్రాలలో కూడా బైడెన్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నట్లు తేలింది.

ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాల నుంచి రికార్డు స్థాయిలో వెల్లువెత్తుతున్న విరాళాలతో బైడెన్‌ కూడా ప్రచారాన్ని ఉధృతంగా సాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అధ్యక్షుడు ట్రంప్‌ ఓడిపోవడం ఖాయమని ఎన్నికల విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రస్తుతం బైడెన్‌కు ఓటర్ల నుంచి 87 శాతం మద్దతు ఉందని fivethirtyeight.com అనే బ్లాగ్‌ ప్రకటించగా, 83.5 శాతం మంది ఓటర్లను బైడెన్‌ ఆకట్టుకున్నారని decisiondeskhq.com అనే వెబ్‌సైట్ వెల్లడించింది.

అయితే డెమొక్రాట్లలో ఆందోళన కూడా ఉంది. సరిగ్గా నాలుగేళ్ల కిందట తమ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌కు కూడా ఇదే తరహాలో మద్దతు లభించింది. ఆమె గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ చివర్లో ఫలితం మారిపోయింది.

మరి చరిత్ర పునరావృతమై ట్రంప్‌ మళ్లీ గెలుస్తారా? ఒకవేళ ట్రంప్‌ తిరిగి అధికారంలోకి వచ్చి జనవరిలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే, దానికి కారణమయ్యే ఐదు కీలక అంశాలు ఏంటి?

హంటర్ బైడెన్, జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుమారుడు హంటర్ బైడెన్‌తో జో బైడెన్

మరో అక్టోబర్‌ షాక్‌

2016 ఎన్నికలకు సరిగ్గా 11 రోజుల సమయం ఉందనగా హిల్లరీ క్లింటన్‌పై ఎఫ్‌బీఐ డైరక్టర్‌ జేమ్స్ కామే కేసు ఓపెన్‌ చేశారు. ఆమె పదవిలో ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్‌ను వాడుకున్నారన్నది అభియోగం.

వారం రోజుల పాటు దేశం మొత్తం దీనిపైనే చర్చ నడిచింది. ఈ సమయంలో ట్రంప్‌ ప్రచారంలో దూసుకుపోయారు.

ఇక 2020 అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఇప్పుడు కూడా అలాంటి రాజకీయ భూకంపం ఏదైనా పుడితే ట్రంప్‌ గెలిచేందుకు అవకాశం ఉంటుంది.

ఇప్పటి వరకైతే తన కంపెనీల పన్ను ఎగవేత వ్యవహారం, కోవిడ్‌-19కు చికిత్స వంటి అంశాలే ట్రంప్‌ను కాస్త ఇబ్బంది పెట్టాయి.

ఒక ఉక్రేయిన్‌ గ్యాస్ కంపెనీ కోసం జో బైడెన్‌ కొడుకు హంటర్‌ చేసిన లాబీయింగ్‌ ప్రయత్నాలతో లింకున్న ఓ ఈ-మెయిల్‌, అది ఉన్న సీక్రెట్ ల్యాప్‌టాప్‌ గురించి న్యూయార్క్‌ పోస్ట్‌ పత్రిక ఒక కథనం రాసింది.

అయితే ఈ కథనం పెద్ద విషయంగా మారుతుందని కొందరు భావించినా సరైనా ఆధారాలు లేకపోవడంతో అది ఓటర్ల మీద ప్రభావం చూపించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

ముందు ముందు ఇలాంటివి చాలా విషయాలు బయటికి రావాల్సి ఉందని ట్రంప్‌ ఇటీవల హింట్‌ ఇచ్చారు. అదే నిజమై, బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా పని చేసిన కాలంలో అక్రమాలు బైటికొస్తే అది ఎన్నికల్లో సంచలనంగా, ట్రంప్‌కు లాభంగా మారడం ఖాయం. లేదంటే ప్రచారం సందర్భంగా మరేదైనా సంచలన విషయం బయటికి వచ్చినా ఆశ్చర్యం లేదు.

టెక్సస్‌లో ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

పోలింగ్‌లో అవకతవకలు

డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్‌ అయినప్పటి నుంచి ప్రజాదరణలో ట్రంప్‌ కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు బైడెన్‌. కీలకమైన రాష్ట్రాలు, హోరాహోరీ సాగే ప్రాంతాలలో కూడా కాస్త అటుఇటుగా బైడెన్‌దే పైచేయిగా ఉంటోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ల మనస్తత్వం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే జరుగుతోంది. గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతిచ్చేవారు ఎవరు అన్న అంశంలో పెద్దపెద్ద ఎన్నికల పండితుల అంచనాలు కూడా తప్పాయి.

బైడెన్‌కు ఇప్పుడున్న మద్దతునుబట్టి చూస్తే 2016లో ఆ పార్టీకి ఏర్పడిన పరిస్థితి ఈసారి ఎదురు కాకపోవచ్చన్నది “న్యూయార్క్‌ టైమ్స్‌’’ పత్రిక అంచనా. అయితే ఆయన సరి చేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయని పోలింగ్‌ నిపుణులు అంటున్నారు.

అమెరికాలో ఇప్పుడు చాలామంది పోస్టల్ ఓటుకే మొగ్గు చూపుతున్నారు. ఇందులో అవకతవకలు జరిగే అవకాశముందని, తేడా వస్తే తాము దీన్ని సవాల్ చేస్తామని రిపబ్లికన్‌లు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే రిపబ్లికన్లు ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారని బైడెన్‌ వర్గం అంటోంది.

ఓటర్లు తమ ఫారాలను తప్పుగా నింపినా, నియమాలు పాటించకపోయినా, మెయిల్ డెలివరీలో ఆలస్యం లేదా అంతరాయాలు కలిగినా ఈ విలువైన ఓట్లు కూడా చెల్లకుండా పోతాయి. తక్కువమంది సిబ్బంది, అసలు సిబ్బందే లేని పోలింగ్‌ కేంద్రాల దగ్గరకు వెళ్లి ఓటేయడం అమెరికన్లకు నిజంగానే ఇబ్బంది.

డోనల్డ్ ట్రంప్, జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

మలుపు తిప్పే చర్చలు

ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల మధ్య తొలి చర్చా కార్యక్రమం రెండు వారాల కిందటే ముగిసింది. ఇప్పుడు ఆ దుమారం కాస్త సద్దుమణిగినా, ధూళి మాత్రం ఎక్కువగా అధ్యక్షుడి మీదే పేరుకుపోయింది.

చర్చల్లో ట్రంప్‌ దూకుడు తనం, అవతలి వ్యక్తి మాట్లడుతుంటే అడ్డం తగిలి మాట్లాడే ప్రయత్నం చేయడం లాంటివి ఆయనకు మంచి పేరు తీసుకురాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల మహిళలకు ఆయన వైఖరి నచ్చలేదు. ఈ ఎన్నికల్లో వారే కీలక పాత్ర పోషిస్తారు. ట్రంప్‌కు భిన్నంగా బైడెన్‌ నెమ్మదిగా, అర్ధవంతంగా మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నారు.

మొదటి చర్చలో వెనకబడిన ట్రంప్‌, రెండో చర్చా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన వైరస్‌ బారిన పడటంతో ఈ చర్చను వర్చువల్ ఫార్మాట్‌లో నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ట్రంప్‌ వాటిని నిరాకరించారు. అయితే ఆయనకు ఇంకో చాన్స్‌ ఉంది.

గురువారం జరగబోయే చర్చలో ట్రంప్‌ తన ప్రతాపం చూపించేందుకు అవకాశముంది.

ఈసారి ట్రంప్‌ హుందాగా వ్యవహరించినా, అందుకు విరుద్ధంగా బైడెన్‌ దూకుడుతనం ప్రదర్శిస్తే వ్యవహారం ట్రంప్‌ వైపు మళ్లే అవకాశం ఉంటుంది.

అమెరికా ఎన్నికలు

కీలక రాష్ట్రాలలో ఏం జరగనుందో?

ఒకపక్క బైడెన్‌ పట్ల మొగ్గు కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ట్రంప్‌ ఆధిపత్యం ఇంకా కొనసాగుతోంది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే ఎలక్టోరల్ కాలేజ్‌ ఓట్లు ఆయనకు అనుకూలంగా పడే అవకాశం ఉంది.

గతంలో నేషనల్ పాపులర్‌ ఓటును నష్టపోయిన ట్రంప్‌, ఎలక్టోరల్ కాలేజ్‌ ఓట్లతో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. స్వింగ్‌ స్టేట్స్‌ మిచిగన్‌, విస్కాన్సిన్‌ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు ఆయన చేతిలో లేవు.

అయితే మిగిలిన రాష్ట్రాలలో ట్రంప్‌ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉంది. పెన్సిల్వేనియా, ఫ్లోరిడా లాంటి స్టేట్స్‌లో తెల్లజాతి ఓటర్ల నుంచి నాన్‌ కాలేజ్‌ ఓట్లను ట్రంప్‌ సాధించే అవకాశం ఉంది. విజయం సాధించాలంటే ట్రంప్‌కు 270 ఎలక్టోరల్ కాలేజ్‌ ఓట్లు అవసరముంటుంది.

ఇద్దరూ చెరి సమానంగా 269 ఓట్లు సాధించే పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇలా ‘టై’గా మారిన పరిస్థితిలో ప్రతినిధుల సభ నుంచి వచ్చిన ఓట్లలో ఎక్కువ ఓట్లను పొందగలిగినవారు విజయం సాధిస్తారు. అయితే ఇక్కడ ట్రంప్‌కే ఎక్కువ బలం కనిపిస్తోంది.

జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

బైడెన్‌ తబడితే...

బైడెన్‌ ఎన్నికల ప్రచారం అంతా సవ్యంగానే నడుస్తోంది. ముందే వేసుకున్న ప్రణాళిక కావచ్చు, కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితులు కావచ్చు మొత్తం మీద బిడియస్తుడైన బైడెన్‌ వీలైనంత తక్కువగా కనిపిస్తున్నారు. స్పాట్‌లైట్‌లో లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. తాను మాట్లాడాల్సిన పరిస్థితులను జాగ్రత్తగా దాట వేసుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతానికైతే బైడెన్‌ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ఆయన ఎంత ఎక్కువగా మాట్లాడితే ఎన్నికల్లో అది ఆయనకు అంత ఇబ్బందిని కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బైడెన్‌ లక్ష్యంగా పెట్టుకున్న ఓటర్లలో నానారకాల మనస్తత్వాలున్న ప్రజలున్నారు. ఏమాత్రం తేడాగా మాట్లాడినా ఆయన వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

అయితే ప్రచారంలో అలసిపోయినట్లు కనిపించినా ఆయనకు ఇబ్బందే. ఒకవేళ గెలిస్తే వయసురీత్యా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించగలరా అన్న సందేహాలు మొదలవుతాయి. దానికి ఏమాత్రం అవకాశం ఇచ్చినా, దాన్ని అందిపుచ్చుకుని బైడెన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ట్రంప్‌ వర్గం కాచుకు కూర్చుంది.

తాము అహర్నిశలు అలసిపోకుండా ప్రచారంలో పాల్గొంటున్నామని, అధ్యక్ష పీఠం తమదేనని బైడెన్ వర్గం గట్టిగా నమ్ముతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)