రేసిజం: 'మా నాన్నను చంపిన వ్యక్తిని గుండెలకు హత్తుకున్నాను'

క్యాండిస్ మమా

ఫొటో సోర్స్, Candice Mama

ఫొటో క్యాప్షన్, క్యాండిస్ మమా
    • రచయిత, లూసీ విల్లీస్‌
    • హోదా, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌

క్యాండిస్‌ మమాకు అప్పుడు తొమ్మిదేళ్లు. ఆమె తన ఇంట్లో ఉన్న ఒక పుస్తకాన్ని రహస్యంగా తెరిచారు. వాస్తవానికి ఆమె దాన్ని చూడకూడదు. కానీ చూశారు. క్యాండిస్‌కు అందులో భయంకరమైన ఫోటో కనిపించింది. హత్యకు గురైన తన తండ్రి అందులో కనిపిస్తున్నారు.

కొన్ని సంవత్సరాల తర్వాత క్యాండిస్‌ తన తండ్రిని చంపిన వ్యక్తిని కలుసుకోవడానికి, మిమ్మల్ని క్షమించాను అని ఆయనకు చెప్పడానికి వెళ్లారు. ఆ హంతకుడి పేరు యుజీన్‌ డి కాక్‌. ‘ప్రైమ్‌ ఈవిల్‌’ అనే పేరుతో ఆయన చాలామందికి తెలుసు.

‘వేర్ డిడ్‌ ది గర్ల్‌ గో ఫ్రం సొవెటో, వేర్ డిడ్‌ ది గర్ల్‌ గో ఫ్రం సొవెటో’’ అంటూ రేడియోలో పాట వినిపిస్తోంది.

‘ది గర్ల్‌ ఫ్రం సొవెటో ’ అనే ఆల్బంలో ఈ పాట విన్నప్పుడల్లా క్యాండిస్‌ పెదాలపై నవ్వు కనిపిస్తుంది. ఈ పాటంటే ఆమె తండ్రికి చాలా ఇష్టం. కానీ ఈ పాటకు తన తండ్రితో కలిసి ఆమె డ్యాన్స్‌ చేయలేకపోయింది

క్యాండిస్‌కు 8 నెలల వయసు ఉన్నప్పుడు తండ్రి గ్లెనాక్‌ మాసిలో మమా చనిపోయారు. అప్పటి నుంచి తన తండ్రి ఫోటోను, ఆయన గురించి ఇతరులు చెప్పే మాటలను వింటూ పెరిగారు క్యాండిస్‌.

“జీవితాన్ని బాగా ఆస్వాదించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. మంచి పాట వినిపించిందంటే తాను ఎక్కడున్నానన్న విషయం మరిచిపోయి స్టెప్పులేసేవారట’’ అని చెప్పారు క్యాండిస్‌.

1991 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో అప్పుడప్పుడే జాతి వివక్ష నీడలు అప్పుడప్పుడు తొలగుతున్న తరుణంలో జన్మించారు క్యాండిస్‌.

ఆమె తల్లి సాండ్రా మిశ్రమ జాతి సంతతికి చెందిన మహిళ. తండ్రి గ్లెనాక్‌ నల్లజాతి వ్యక్తి. ప్యాన్‌ ఆఫ్రికనిస్ట్‌ కాంగ్రెస్‌ సభ్యుడు. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌తోపాటు జాతి వివక్షపై పోరాడుతున్న పార్టీలో ఆయన ఉండేవారు.

తల్లితండ్రులతో చిన్నారి క్యాండిస్

ఫొటో సోర్స్, Candice Mama

ఫొటో క్యాప్షన్, తల్లితండ్రులతో చిన్నారి క్యాండిస్

క్యాండిస్ తండ్రి హత్యకు కారణమేంటి?

తన తండ్రి హత్యకు గురయ్యారన్న విషయం క్యాండిస్‌కు తెలుసు. చంపిన వ్యక్తి ఎవరో, అతని పేరేంటో కూడా ఆమెకు తెలుసు. యుజీన్‌ డి కాక్‌, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అత్యంత క్రూరంగా చంపే పోలీస్‌ గ్రూప్‌ వ్లాక్‌ప్లాస్‌కు అతను కమాండర్‌. కానీ క్యాండిస్‌ తల్లి ఈ వివరాలన్నీ చెప్పకుండా దాచారు.

తొమ్మిది సంవత్సరాల వయసులో క్యాండిస్‌కు ఒక పుస్తకాన్ని చదివే అవకాశం వచ్చింది. ఆ పుస్తకం పేరు “ఇంటు ద హార్ట్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌-కన్ఫెషన్స్ ఆఫ్‌ అపార్థీడ్‌ అసాసిన్స్‌’’. అందులో ఆమె తండ్రి హత్య, హంతకుడికి సంబంధించిన విషయాలున్నాయి.

“మా అమ్మను పరామర్శించడానికి మా ఇంటికి చాలామంది వస్తుండేవారు. వారు వచ్చినప్పుడల్లా అమ్మ నన్ను ఆ పుస్తకం తీసుకురమ్మనేది. ఆ పుస్తకం తెరిచినవారు పెద్దగా ఏడ్చేవారు’’ అని క్యాండిస్‌ గుర్తు చేసుకున్నారు.

“బహుశా ఈ పుస్తకంలో మా నాన్న గురించి ఉండి ఉంటుందని నేను అనుకునేదాన్ని’’ అన్నారు క్యాండిస్‌.

“ఒకసారి వాళ్లు ఓ పేజీ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. అవకాశం వస్తే ఆ పేజీలో ఏముందో చూడాలనుకున్నాను ’’ అని క్యాండిస్‌ వెల్లడించారు.

ఒక రోజు ఆమె తల్లి షాపింగ్‌కు వెళ్లడంతో బెడ్‌రూమ్‌ కప్‌బోర్డ్‌ మీదున్న ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నారు క్యాండిస్‌.

ఇంతకు ముందు విన్న ఆ పేజీని ఓపెన్‌ చేశారు. అందులో ఒక భయంకరమైన ఫోటో ఉంది. తన తండ్రి మృతదేహం కాలిపోయి స్టీరింగ్‌ మీద పడి ఉంది.

“చూడగానే అతనే నా తండ్రి అని అనుకున్నాను. నాన్న అలా ఎందుకు చనిపోయారో, ఇతను (యుజీన్‌ డి కాక్‌) నాన్నను ఎందుకు చంపారో అర్ధం చేసుకున్నాను. ఈ పుస్తకం నేను చూడకూడదు కాబట్టి, చూసిన విషయాన్ని నాలోనే దాచుకున్నాను’’ అని చెప్పారు క్యాండిస్‌.

తాను ఈ పుస్తకాన్ని చదివిన విషయం తల్లికి చెప్పలేదు క్యాండిస్‌. కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలన్న కోరిక మాత్రం ఆమెలో పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తన తండ్రి గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి ఆమెలో పెరిగింది.

“నా తండ్రి ఫోటో ఆల్బమ్‌ ఒకదాన్ని సేకరించగలిగాను. అందులో ఆయన ఫోటోలనుచూశాను. ఆయన రాసిన కోట్స్‌ చదివాను. ఆయన చాలా తెలివైన వ్యక్తిగా అనిపించింది’’ అని క్యాండిస్‌ చెప్పారు.

నల్లవాడివైనంత మాత్రాన జీవితంలో ముందుకు సాగలేనని భయపడవద్దు- అన్న ఆయన కొటేషన్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని క్యాండిస్‌ చెప్పారు. 25 ఏళ్ల వయసులో ఆయనలో ఇంత జ్జానం ఎలా వచ్చిందో ఆమెకు అర్ధంకాలేదు. ఆయనను అంత తెలివైనా వ్యక్తిగా మార్చిన అంశాలేంటో కనుక్కోవాలని భావించినట్లు క్యాండిస్‌ తెలిపారు.

యూజీన్ డి కాక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుజీన్ డి కాక్

తండ్రి హత్యతో రగిలిపోయిన క్యాండిస్

తన తండ్రికి జరిగిన అన్యాయంపై ఆమెలో ఆవేశం, ఆగ్రహం ఏర్పడ్డాయి. కానీ బయటకు రాకుండా మనసులోనే రగులుతున్న ఆ ఆలోచనలు ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం మొదలు పెట్టాయి.

పదహారేళ్ల వయసులో ఆమె ఒకసారి హాస్పిటల్‌కు పరుగుతీశారు. గుండెను మెలిపెట్టిన ఆ బాధకు కారణం హార్ట్‌ ఎటాక్‌ కావచ్చని భయపడి పోయారు క్యాండిస్‌.

“ ఇంత చిన్న వయసు వారికి గుండెపోటు రాదు. కానీ ఈ వయసులో నీలో ఉన్నంత మానసిక ఒత్తిడిని నేను నా 20 ఏళ్ల సర్వీసులో ఇంతకు ముందెప్పుడూ చూడలేదు’’ అని డాక్టర్‌ చెప్పారని క్యాండిస్‌ వివరించారు.

“డాక్టర్‌ అన్ని పరీక్షలు చేశారు. “నీకెలా చెప్పాలో అర్ధం కావడం లేదు. కానీ శరీరం నిన్ను చంపేస్తోంది. నువ్వు నీలో ఏదో దాస్తున్నావ్‌. దాన్ని మార్చుకోకపోతే నువ్వు నిజంగానే చచ్చిపోతావ్‌’’ అన్నారు డాక్టర్‌. నేను సంతోషంగా లేను. తప్పు చేస్తునన్న భావన నాలో ఉంది’’ అని తాను డాక్టర్‌కు చెప్పినట్లు వెల్లడించారు క్యాండిస్‌.

తనలోని సంక్షోభం నుంచి బైటపడటానికి క్యాండిస్‌ మార్గాలు వెతికారు. చనిపోయిన తన తండ్రిని ఆ స్థితిలో చూడటమే తన మానసిక స్థితికి కారణమని ఆమెకు అర్ధమైంది. దీనికి తగ్గించుకోవాలంటే తన తండ్రిని చంపిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఆమె భావించడం మొదలు పెట్టారు.

1995లో దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతరించింది. నెల్సన్‌ మండేలా ఆధ్వర్యంలో ఆఫ్రికన్‌ నేషనల్ కాంగ్రెస్‌ అధికారంలో రావడం, అంతకు ముందు జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారులపై జరిగిన మానవహక్కుల ఉల్లంఘన దాడులు, అరాచకాలపై విచారణ మొదలుకావడం ఒక్కొక్కటిగా జరిగిపోయాయి.

పారదర్శకత కోసం నెల్సన్‌ మండేలా ప్రభుత్వం ఈ వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పెట్టింది. తన తండ్రి హంతకుడు యుజీన్‌ డి కాక్‌ పేరును ఆన్‌లైన్‌లో వెతికిన క్యాండిస్‌, అతను ప్రభుత్వానికి చెప్పిన వాంగ్మూలాలన్నింటినీ శ్రద్ధగా చదివారు.

ఒకచోట క్యాండిస్‌కు తన తండ్రిని చంపిన ఘటనపై డి కాక్‌ ఇచ్చిన వాంగ్మూలం కనిపించింది. “అది చదివాక నా కడుపులో దేవినట్లయింది. నా శరీరం కంపించింది’’ అన్నారు క్యాండిస్‌. ఆ ఘటన మొత్తం చదివాక ఆమె ఆవేశంతో రగిలిపోయారు. ఒక మనిషి ఇంత ఘోరంగా ప్రవర్తించగలడా అని ఆమెకు అనిపించిందట.

క్యాండిస్ తండ్రి గ్లెనాక్ మాసిలో మమా

ఫొటో సోర్స్, Candice Mama

ఫొటో క్యాప్షన్, క్యాండిస్ తండ్రి గ్లెనాక్ మాసిలో మమా

క్షమించడమే సరైనా మార్గం

కానీ కొద్దికాలంలోనే క్యాండిస్‌ ఎవరూ ఊహించని పని చేశారు. తన తండ్రిని తన నుంచి దూరం చేసిన హంతకుడిని క్షమించాలన్న భావనలోకి వచ్చారామె.

“మొదట్లో నాకు కసి ఉండేది. అతని గురించి ఆలోచించినప్పుడల్లా అతను నన్ను కంట్రోల్ చేస్తున్నట్లు అనిపించేది. ఒక్కోసారి నేను వశం తప్పేదాన్ని. నాలో ఆవేశం కట్టలు తెంచుకునేది. ఇతను నా తండ్రిని చంపాడు. ఇప్పుడు నన్ను కూడా చంపుతున్నాడు అనిపించేది. కానీ అతన్ని క్షమించడం ఒక్కటే సరైన మార్గం అనిపించింది. అది నాకు చాలా ముఖ్యం కూడా’’ అని క్యాండిస్‌ చెప్పారు.

ఆమె అప్పటికీ ఇంకా టీనేజరే. కానీ తన భావోద్వేగాలను నియంత్రించుకోగలిగారు. “అతనిపట్ల నాకున్న ఆవేశాన్ని, ఆగ్రహాన్ని తగ్గించుకున్నాక, అతన్ని క్షమించాలన్న నిర్ణయానికి వచ్చాను. అలా చేయడం వల్ల నాలో ఉన్న భావోద్వేగాలన్నీ శాంతిస్తాయని అనిపించింది’’ అని వివరించారు క్యాండిస్‌.

ఆ తర్వాతనే ఆమె పూర్తి స్థాయిలో స్వేచ్ఛ పొందినట్లు ఫీలయ్యారు.

అది 2014 సంవత్సరం. దక్షిణాఫ్రికా ప్రభుత్వం కల్పించిన నిందితుడు-బాధితుల సమావేశంలో డి కాక్‌ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని క్యాండిస్‌ తల్లి నేషనల్‌ ప్రాసిక్యూటింగ్‌ అథారిటీకి పిటిషన్‌ పెట్టుకున్నారు.

క్యాండిస్‌కు అప్పుడు 23 సంవత్సరాలు. అతనితో సమావేశం కోసం ఆ గదిలో ప్రవేశించినప్పుడు అదొక అనిర్వచనీయమైన ప్రపంచంలా కనిపించిందని క్యాండిస్‌ అన్నారు.

పీఏసీ లీడర్ జెఫ్ మోథోపెంగ్‌తో గ్లెనాక్

ఫొటో సోర్స్, Candice Mama

ఫొటో క్యాప్షన్, పీఏసీ లీడర్ జెఫ్ మోథోపెంగ్‌తో గ్లెనాక్

షాకింగ్‌కు గురి చేసిన రెండు విషయాలు

అతను కాలంతోపాటు పెరగకుండా ఫ్రీజ్‌ అయినట్లు కనిపించారు. తాను చిన్నతనంలో ఆ ఫోటోలో చూసినట్లుగా ఏమాత్రం మారకుండా అచ్చంగా అలాగే ఉన్నారని క్యాండిస్‌ తెలిపారు.

‘ప్రైమ్‌ఈవిల్’ అని చెప్పుకునే అతని చుట్టూ ఈవిల్ నీడ ఉంటుందని నేను ఊహించుకున్నాను. కానీ అలాంటిదేమీ కనిపించలేదని చెప్పారు క్యాండిస్‌.

అక్కడున్న మతాధికారి క్యాండిస్‌ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా యుజీన్‌ డి కాక్‌కు పరిచయం చేశారు. డి కాక్‌ ముందుకు వంగి “మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

తన భర్త మరణించిన రోజు మార్చి 26, 1992లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా క్యాండిస్‌ తల్లి డి కాక్‌ను అడిగారు.

డి కాక్‌ ఆనాటి విషయాలను వివరించారు. “ మా నాన్న పని చేసే ప్యాన్‌ ఆఫ్రికన్‌ కాంగ్రెస్‌ బృందంలోకి ఒక వ్యక్తిని కోవర్ట్‌లాగా పంపించారట. ఆ కాంగ్రెస్‌ బృందంలో ఎవరు తీవ్రవాదిలాగా, ప్రమాదకరమైనవాడిలాగా, తెలివిగలవాడుగా కనిపిస్తున్నారో గుర్తించమని ఆ కోవర్ట్‌ను ఆదేశించారట.

ఆ కోవర్టు మా నాన్నతోపాటు మరో ముగ్గురి పేర్లను డి కాక్‌ చెప్పారట’’ అని క్యాండిస్‌ డి కాక్‌ చెప్పిన వివరాలను పంచుకున్నారు.

ఆ రోజు క్యాండిస్‌ తండ్రి జోహన్నెస్‌బర్గ్‌ (2014లో ఎంబొంబెలా అని పేరు మార్చారు)కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్స్‌ప్రుట్‌ అనే పట్టణానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న యుజీన్‌ డి కాక్‌ బృందం ఆ ప్రాంతంలో కాపుకాశారు.

“ మా నాన్న బ్రిడ్జ్‌ కింది నుంచి వెళుతుండగా, పై నుంచి డి కాక్‌ బృందం కాల్పులు ప్రారంభించింది. మా నాన్న నడుపుతున్న వాహనం ఆగకపోవడంతో కిందికి దిగివచ్చిన డి కాక్‌ రోడ్డు పక్కనుంచి కాల్పులు ప్రారంభించారట. తన తుపాకిలో బుల్లెట్లు అయిపోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారట. ఇంకా మా నాన్న ప్రాణాలతోనే ఉన్నారని అనుమానం రావడంతో వాహనం మీద పెట్రోలు పోసి తగలబెట్టారట’’ అని డి కాక్‌ చెప్పిన విషయాలను వివరించారు క్యాండిస్.

యూజిన్ డీకాక్‌ను కలిసి క్యాండిస్, ఆమె కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, Candice Mama

ఫొటో క్యాప్షన్, యూజిన్ డి కాక్‌ను కలిసి క్యాండిస్, ఆమె కుటుంబ సభ్యులు

మా నాన్న హంతకుడిని హత్తుకున్నాను: క్యాండిస్

మనిషన్న వాడెవడూ అలాంటి ఘాతుకాలకు పాల్పడడు అని మేం అనుకునే వాళ్లమని క్యాండిస్‌ చెప్పారు. అయితే అతన్ని అక్కడ కలిసిన తర్వాత డి కాక్‌ మామూలు మనిషిలా తమకు కనిపించారని, కాకపోతే భయంకరమైన దుర్మార్గాలకు పాల్పడిన మామూలు మనిషిలా కనిపించారని క్యాండిస్‌ అన్నారు.

“ఈ సమావేశం సందర్భంగా నిందితులను ఏదైనా అడగవచ్చని మాకు జైలు అధికారులు చెప్పారు. దీంతో నేను డి కాక్‌తో మాట్లాడటానికి సిద్ధమయ్యాను’’ అని వివరించారు క్యాండిస్‌.

“నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం చెప్పే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను’’ అని క్యాండిస్‌ అన్నారు

“ తప్పకుండా, అడగండి’’ అని డి కాక్‌ బదులిచ్చారు.

“ మిమ్మల్ని మీరు క్షమించుకోగలరా’’ అని క్యాండిస్‌ డి కాక్‌ను అడిగారు.

“ ఆయన కాస్త ఇబ్బందిగా కనిపించారు. “ప్రతి కుటుంబం నా దగ్గరికి వస్తుంది. ఈ ప్రశ్న నన్ను అడగవద్దని నేను వారిని కోరుతుంటాను’’ అని డి కాక్‌ చెప్పినట్లు క్యాండిస్‌ వెల్లడించారు.

ఈ సమావేశం ముగిసిన తర్వాత క్యాండిస్‌ లేచి నిలబడ్డారు. యుజీన్‌ డి కాక్‌ దగ్గరకు ఆమె నడిచి వెళ్లారు. నేను మిమ్మల్ని హత్తుకోవచ్చా? అని క్యాండిస్‌ అడిగారు.

డి కాక్‌ క్యాండిస్‌ను దగ్గరకు తీసుకున్నారు. “ జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు మీ నాన్న గర్వించే మహిళగా ఎదిగావు’’ అన్నారు

2015లో యుజీన్‌ పెరోల్‌ మీద విడుదలయ్యారు. దానికి తమ కుటుంబం ఎంతో సంతోషించినట్లు క్యాండిస్‌ చెప్పారు.

తర్వాత డి కాక్‌ నేషనల్ ప్రాసిక్యూటింగ్‌ అథారిటీకి సహాయకుడిగా పని చేశారు. జాతి వివక్ష కాలంలో సాగిన హత్యాకాండలో ఎవరు ఎక్కడ మరణించారో, ఎవరి మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని వారి బంధవులకు అప్పగించే విధిలో నిమగ్నమయ్యారు.

“అతను ఊరికే జైలులో కూర్చోవడంకన్నా బాధితులకు కాస్త ఊరటనిచ్చే పని చేయడం మంచిదే’’ అన్నారు క్యాండిస్‌.

యుజీన్‌ డి కాక్‌ పాల్పడిన అరాచకాలను అందరూ క్షమించలేకపోవచ్చు. కానీ అతన్ని క్షమించడం వల్ల క్యాండిస్‌కు మనశ్శాంతి మిగిలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)