సెక్స్ వర్కర్స్: ‘కలకత్తా’లో బలవంతంగా జననేంద్రియ పరీక్షలు.. బ్రిటిష్ పాలకుల కాలంలో వేశ్యల పేరుతో మహిళలను అవమానించే చట్టం

ఫొటో సోర్స్, HERITAGE IMAGES
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ఇండియా కరస్పాండెంట్
అది 1868 సంవత్సరం. దేశంలో బ్రిటిష్ వలస పాలన కొనసాగుతున్న కాలం. ఆ రోజుల్లో అమలవుతున్న ఒక చట్టాన్ని ధిక్కరించినందుకుగాను సుఖిమోని రౌర్ అనే మహిళను కలకత్తా( నేటి కోల్‌కతా) పోలీసులు జైలుకు పంపారు.
సుఖవ్యాధులు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు మహిళలకు నిర్వహించే జననేంద్రియాల పరీక్షలను తాను చేయించుకోవడానికి నిరాకరించడం ఆమె చేసిన నేరం.
అప్పటి వలస పాలకుల పరిపాలనలో ప్రతి సెక్స్ వర్కర్ విధిగా తమ పేరును సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలి.
తమ శరీరంలో ఎలాంటి సుఖవ్యాధులు లేవని నిర్ధరించేందుకు విధిగా జననేంద్రియ పరీక్షలు చేయించుకోవాలి.
అంటువ్యాధుల చట్టం( Contagious Diseases Act) పేరుతో అప్పటి బ్రిటిష్ పాలకులు దీన్ని తప్పనిసరి కార్యక్రమంగా మార్చారు.
తనను జైలులో బంధించడం అన్యాయమని, విడుదల చేయాలని సుఖిమోనీ రౌర్ పిటిషన్ దాఖలు చేశారు.
“నేను వేశ్యను కాను. నెలకు రెండుసార్లు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆమె వాదించారు. తనను పోలీసులు పొరపాటున సెక్స్‌వర్కర్‌గా రిజిస్టర్ చేసి ఉంటారని, తాను ఎప్పుడూ సెక్స్ వర్కర్‌గా పని చేయలేదని ఆమె అన్నారు.
1869లో కలకత్తా హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
సుఖిమోని రౌర్ రిజిస్టర్డ్ పబ్లిక్ ప్రాస్టిట్యూట్ కాదని తేల్చి చెప్పిన హైకోర్టు, అలా రిజిస్టర్ చేసుకోవడం స్వచ్ఛందమే తప్ప బలవంతంగా చేయించరాదని కూడా చెప్పింది.
అంటే సెక్స్ వర్కర్‌గా రిజిస్టర్ చేసుకోవాలని మహిళలను ఎవరూ బలవంత పెట్టరాదని ఆనాటి తీర్పు సారాంశం
అప్పట్లో ఈ చట్టం కింద అనేకమంది మహిళలను అరెస్టు చేశారని, జననేంద్రియాలకు పరీక్షల కోసం పోలీస్ స్టేషన్‌లలో రిజిస్టర్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని హార్వర్డ్ యూనివర్సిటీలో జెండర్ అండ్ సెక్సువాలిటీ డిపార్ట్ మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ దుర్బామిత్రా వెల్లడించారు.
బ్రిటిష్ కాలం నాటి అనేక పత్రాలలో ఇందుకు సంబంధించిన అంశాలపై పలు ఆధారాలను ఆమె వెలికితీశారు.
ప్రొఫెసర్ దుర్బా మిత్రా ఇటీవలే “ఇండియన్ సెక్స్ లైఫ్: సెక్సువాలిటీ అండ్ కొలోనియల్ ఆరిజిన్స్ ఆఫ్ మోడరన్ సోషల్ థాట్’’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు.
ప్రిన్సెటన్ యూనివర్సిటీ ప్రచురించిన ఈ పుస్తకం భారతీయ సమాజోద్ధరణ పేరుతో అప్పటి బ్రిటిష్ అధికారులు, భారతీయ మేధావులు మహిళలను లైంగికంగా ఎంత దారుణంగా అణచివేశారో అర్ధం చేసుకోవచ్చని ప్రొఫెసర్ దుర్బా నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Michael maslan
మహిళల ఆత్మగౌరవంపై దాడి
జననేంద్రియ పరీక్షల కోసం తమను బలవంత పెట్టడం ద్వారా మాలోని స్త్రీత్వాన్ని చంపేస్తున్నారంటూ 1869 జులైలో కొందరు సెక్స్‌వర్కర్లు బ్రిటిష్ అధికారులపై కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పరీక్షలు అత్యంత దారుణంగా ఉంటున్నాయని వారు ఆ పిటిషన్‌లో ఆరోపించారు. సెక్స్ వర్కర్లంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళలు అక్కడున్న డాక్టర్, అతని కింద పని చేసేవారందరి ముందు నగ్నంగా నిలబడాల్సి ఉంటుందని, ఇది మహిళల గౌరవానికి భంగమని వారు వాదించారు.
కానీ అధికారులు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
గుట్టుచప్పుడు కాకుండా వేశ్యావృత్తిని కొనసాగించే మహిళలు(clandestine prostitutes) చట్టం ప్రకారం సమాజానికి ప్రమాదకారులని అప్పట్లో బ్రిటీష్ ఇండియా ఉన్నతాధికారులు వాదించేవారు.
వారిని అలా వదిలేస్తే కలకత్తా నగరంలో వేశ్యావృత్తిని నియంత్రించడం కష్టమని అప్పట్లో ఆ నగరంలోని ఓ పెద్ద ఆసుపత్రికి హెడ్‌గా పని చేసిన రాబర్ట్ పేనే వ్యాఖ్యానించారు. ప్రతి సెక్స్‌వర్కర్ రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని, దానికి వారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని ఆయన అనేవారు.
ఈ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో 1870-1888 మధ్య కాలంలో ప్రతి రోజూ సరాసరిన 12మంది మహిళలను అరెస్టు చేశారని ప్రొఫెసర్ మిత్రా వెల్లడించారు.
తమను పోలీసులు గుర్తించారన్న అనుమానం రాగానే ఎంతోమంది మహిళలు నగరం విడిచి పారిపోయేవారని ఆమె తెలిపారు.
అబార్షన్లు, పుట్టిన బిడ్డలను చంపేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ కలకత్తా పోలీసులు ఈ జననేంద్రియ పరీక్షలు చేయించగలరా అని బ్రిటిష్ అధికారులు తరచూ చర్చించేవారు.
“జననేంద్రియ పరీక్షలు తప్పనిసరి చేయకపోతే అత్యాచారం, అబార్షన్‌ల పేరుతో తప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతా’’యని ఒక న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు.
మహిళ సమ్మతితోనే ఈ పరీక్షలు చేయడం అంటే అది సాధ్యమయ్యే పనికాదని, చట్టం లక్ష్యం నెరవేరదని మరో జడ్జి వ్యాఖ్యానించారు.
చట్టంలో ఉన్న చిన్నపాటి లొసుగుల వల్ల మహిళలు ఈ లైంగిక వ్యాధులను వ్యాపింపజేస్తారని కలకత్తా సిటీ పోలీస్ కమిషనర్ స్టూవర్ట్ హాగ్ అప్పటి బెంగాల్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
కానీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో 1888లో ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది.

ఫొటో సోర్స్, Durba Mitra
బ్రిటిష్ పాలకుల అసలు లక్ష్యం ఎవరు ?
కేవలం రహస్యంగా వృత్తిని కొనసాగించే వేశ్యలపై మాత్రమే పరీక్షల కోసం ఒత్తిడి చేయలేదని డాక్టర్ జెస్సీకా హించీ అన్నారు. ‘‘గవర్నరింగ్ జెండర్ అండ్ సెక్సువాలిటీ ఇన్ కొలోనియల్ ఇండియా’’ అనే పుస్తకం రాశారు డాక్టర్ హించి.
బ్రిటీషర్లు యూనఖ్(నపుంసకులు)లుగా పిలుచుకునే హిజ్రాలకు కూడా 1871నాటి చట్టం కింద పరీక్షలు నిర్వహించేవారని ఆమె తెలిపారు.
హిజ్రా అనే జెండర్‌ను భౌతికంగా, సాంస్కృతికంగా అంతం చేయాలనేది అప్పటి ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని డాక్టర్ హించీ వెల్లడించారు.
హిజ్రాలు మహిళల దుస్తులు ధరించకుండా నిషేధించడం, పోలీస్ స్టేషన్‌లలో రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం, వారి ఇళ్లలో ఉన్న పిల్లలను వేరు చేయడం, వారి నాయకత్వ వ్యవస్థ, వారసత్వాన్ని లేకుండా చేయాలని అప్పటి చట్టం లక్ష్యంగా పెట్టుకుందని డాక్టర్ హించి వెల్లడించారు.
చివరకు అంటువ్యాధుల చట్టం బ్రిటిష్ పాలకుల చరిత్రలో సిగ్గుమాలిన చర్యగా మిగిలిపోయింది.

ఫొటో సోర్స్, Hulton archive
వేశ్య అంటే ఎవరు ? ఎలా నిర్వచించాలి?
ఒక మహిళ వేశ్య అని నిర్వచించడానికి ఒక ప్రశ్నాపత్రాన్ని పోలీసులకు, డాక్టర్లకు అందించారు అప్పటి అధికారులు.
ఒకానొక సందర్భంలో బ్రిటిష్ అధికారులు భారతీయ మహిళలందరినీ వేశ్యలుగా తేల్చారు. పెళ్లయి, అగ్రవర్ణానికి చెందని ప్రతి మహిళను వేశ్య అనవచ్చని అప్పట్లో పోలీస్ ఉన్నతాధికారిగా పని చేసిన ఏహెచ్ గైల్స్ వాదించారు.
1875 నుంచి 1879 మధ్య రూపొందిన 20కి పైగా బెంగాల్ జనగణనకు సంబంధించిన పుస్తకాలలో వేశ్య అనే విభాగం తరచూ కనిపించేది.
భారత జాతీయ గీతాన్ని రాసిన బంకించంద్ర ఛటర్జీ అప్పట్లో ప్రభుత్వాధికారిగా పని చేసేవారు. కవిగా, రచయితగా, నవలాకారుడిగా ఆయనకు పేరుండేది. రహస్య వేశ్యల విభిన్న జీవన శైలి గురించి ఆయన తన పుస్తకాలలో ప్రస్తావించారు.
అప్పటి భారతీయ సమాజంలోని హిందూ అగ్రవర్ణ మహిళలను మిగతా అందరినీ వేశ్యలుగానే భావించేవారని ప్రొఫెసర్ మిత్రా అన్నారు.
నాట్యం చేసి పొట్ట పోసుకునేవారు, విధవలు, హిందూ, ముస్లిం కుటుంబాలలో రెండో భార్యగా వచ్చినవారు, బిచ్చగత్తెలు, వలస కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇళ్లలో పని మనుషులు ఇలా అనేకమందిని వేశ్యల క్యాటగిరీ కిందనే గుర్తించే వారు.
1881లో బెంగాల్ రాష్ట్రంలో జరిగిన జనగణన పుస్తకాలలో పెళ్లికాని ప్రతి మహిళను వేశ్యగానే పేర్కొన్నారు.
1881నాటికి కలకత్తా నగరంలో 145,000మంది మహిళలుంటే అందులో 12,228 మందిని వేశ్యలుగా పేర్కొన్నారు. 1891నాటికి ఈ మహిళల సంఖ్య 20,000 పెరిగింది.
“అప్పటి భారతీయుల లైంగిక జీవన విధానం బ్రిటిష్ వలస పాలకుల జ్జాన సముపార్జనకు మూల వస్తువుగా మారింది’’ అని ప్రొఫెసర్ మిత్రా అన్నారు.

ఫొటో సోర్స్, Royal photographic society
అయితే మగవాళ్ల లైంగిక జీవితం అన్న అంశం అప్పటి పాలకులకు అస్సలు పట్టని విషయంగా మారిపోయింది.“ భారతీయ మహిళ లైంగికతపై ఆంక్షలు అనేవి ప్రజల రోజువారి జీవితంలో వలస పాలకుల జోక్యానికి నిదర్శనంగా మారింది’’ అని ప్రొఫెసర్ మిత్రా వ్యాఖ్యానించారు.
“ అప్పటి భారతీయ పురుషులు కూడా స్త్రీల లైంగికతను తమదైన దృక్కోణంలో చూశారు. కులం ఆధారంగా హిందూ-ఏకస్వామ్య సమాజాన్ని నిర్మించడానికి, ముస్లింలు, ఇతర కింది కులాల వారిని ఈ లైంగికత ఆధారంగా పక్కకు తప్పించడానికి ప్రయత్నించారు’’ అన్నారు ప్రొఫెసర్ మిత్రా.
ఆమె పరిశోధన యావత్తు బెంగాల్ ప్రధాన కేంద్రంగా సాగింది.
మహిళలపట్ల సమాజంలో నెలకొని ఉన్న వికృత భావనే వీటన్నింటికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఈ వైఖరిని మనసుల నుంచి తొలగించడం అంత తేలిక కాదు. ఈ క్రమంలో మహిళలు ఎన్నో సమస్యలను, కష్టాలను అనుభవించారు. అనేక రూపాలలో వేధింపులకు గురయ్యారు.
ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఈ ధోరణులు కనిపిస్తూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- వీరప్పన్: గంధపు చెక్కల స్మగ్లర్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. వీరప్పన్ నేరాల్లో వారి పాత్రేమిటి
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








