గృహహింస: ‘వందల సిజేరియన్లు చేసిన నేనే ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను.. గర్భాశయం పగిలిపోవడంతో అనుమానం వచ్చింది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
ఆ రోజు గురువారం.. ఉదయం పదిగంటలు
ఆమె పేరు అమీనా.. వృత్తి సైన్స్ టీచర్
మూడో కాన్పు.. పక్కనే ఏడేళ్ల పిల్ల వుంది. తల్లి బ్యాగ్ పట్టుకుని నిలబడింది.
నేను వాళ్ల అమ్మను పరీక్ష చేయడానికి లేచినపుడు, మళ్లీ వచ్చి నా సీట్లో కూర్చునేటప్పుడు గమనించా.
నేను తనవైపు వస్తుంటే చేతిలోవున్న బ్యాగ్ నాకు అందనంత దూరంగా పెడుతూ మరింత గట్టిగా పట్టుకుంటోంది.
ముఖమంతా కళ్లే. కళ్లనిండా అనుమానమే.
"ఒకటి రెండు రోజుల్లో ఎడ్మిట్ కావాలి. కాన్పునొప్పులు రావడానికి మందు ఇస్తాం "
అమీనా నా పక్కనే కూర్చుని వుంది. బీపీ చూస్తుంటే గమనించాను. చేతి మీదా, చెక్కిలి మీదా కమిలిన గుర్తులున్నాయి.
బిడ్డని తీసుకెళ్ళమని నర్సుకు చేస్తే బయటికి తీసుకెళ్లింది.
"అమీనా, కొన్ని వ్యక్తిగతమైన వివరాలు ఇబ్బంది అయినా నేను అడగక తప్పదు. ఇంట్లో అంతా సరిగానే వుందా? సంతోషంగానే వున్నావా?"
జవాబు చెప్పకుండా తలొంచుకుంది.
"ఇప్పుడు గర్భంతో వున్నావు. ఎవరైనా నిన్ను శారీరకంగా బాధ పెడుతున్నారా ? ఇంట్లో నీకు సేఫ్ అనే అనిపిస్తోందా?"
"అయ్యో భలే వారే మేడం. అంతా బాగానే వుంది. ఆయన మంచివాడే. దెబ్బా, ఇదిగో ఈ పిల్ల గభాల్న కిటికీ తీసింది. అదొచ్చి పొడుచుకుంది. అంతే!”
అవి కిటికీ పొడుచుకున్న గాయాల్లాలేవు.
“నేనో మాట చెప్పాలి అమీనా. ప్రతి వారికీ సురక్షితంగా జీవించే హక్కు వుంది. ఎవరి దౌర్జన్యమూ భరించాల్సిన అవసరం లేదు. నువ్వు ఫిర్యాదు చేయాలనుకుంటే అవసరమైన సహాయం చేస్తాం.”

ఫొటో సోర్స్, Getty Images / Maria Ponomariova
“ప్రతి ఇంట్లో వుండేదే. చిన్నఆర్గ్యుమెంట్. రెట్టించడం తనకిష్టముండదు. కోపం తెప్పించాను. నేనే తగ్గాల్సింది. నాదే తప్పు ”
తప్పు తనదే!
గాయాలూ న్యాయమైనవే!
వారు ప్రవహింప చేసే క్షమానదుల వరదలో కొట్టుకుపోయేది కూడా వారే.
“అమీనా, అలా అనకు. దాడి చెయ్యడం తప్పు కదా ? ఇది మొదటిసారి అయ్యుండదని నా అంచనా. ఒకసారి ఆలోచించు. మేము సహాయం చేస్తాం లేదా హెల్ప్ లైన్ సహాయం తీసుకో ”
“అదేం లేదు డాక్టర్.” తలొంచుకుంది.
“కంప్లైంట్ ఇవ్వడం నీకిష్టం లేకపోతే సరే. కానీ సురక్షితమైన ప్రదేశంలో వుండాలి. ముందు హాస్పిటల్లో చేరు.”
“రేప్పొద్దున్నే వచ్చి చేరతాను మేడం. బట్టలూ అవీ తెచ్చుకోలేదు.”
“ఇంట్లో సేఫ్ అనుకుంటున్నావా అమీనా, ఒకసారి ఆలోచించు.”
“మీరు మరీ ఎక్కువ వూహిస్తున్నారు మేడం. అదేమీ లేదు.”
“సరే. ఏ ఇబ్బంది అనిపించినా సహాయానికి మేమున్నాం. తప్పక ఫోన్ చెయ్యి. రేపొచ్చి ఎడ్మిట్ అయిపో. కాన్పు నొప్పులు రావడానికి మందిస్తాను.

ఫొటో సోర్స్, Olha Khorimarko/GETTY IMAGES
శుక్రవారం
ఉదయం: పదిగంటలు
"మేడం , అమీనావచ్చింది"
“ఎడ్మిట్ కావడానికి నేనే రమ్మన్నాను.”
"బాగా నీరసంగా వుంది"
తన ఇంటి సంగతి నాకు తెలుసు. ఇంట్లో గొడవకు ఏమీ తిని వుండదు.
“సరే, సెలైన్ పెట్టండి. ”
"కాదు మేడం, తనకు బ్లీడింగ్ అవుతోంది. సీటీజీ గ్రాఫ్ కూడా ఏమీ బాగోలేదు. బిడ్డ హార్ట్ రేట్ పడిపోతోంది. ఆపరేషన్‌కు షిఫ్ట్ చేస్తున్నామ”ని చెప్పారు.
వందల కొద్దీ సిజేరియన్లు చేసిన నిపుణులైన డాక్టర్లు డ్యూటీలో వున్నారు. కానీ బ్లీడింగ్ కావడం, బిడ్డ హార్ట్ రేట్ పడిపోవడం వినడానికి వింతగా వుంది. వెళదామనుకుంటూ వుండగా కబురు రానే వచ్చింది.
వెళ్లి చూస్తే చనిపోయిన బిడ్డ పుట్టింది. అంతేకాదు. గర్భాశయం పగిలిపోయి రక్తమోడుతూ వుంది.
రక్తం ఎక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బిడ్డ మృతి, గర్భాశయం పగిలిన తీరు చూస్తే ఎన్నో అనుమానాలొచ్చాయి.
"రిపెయిర్ చేయండి. నేను కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తాన"ని బయటికి వచ్చాను.
హాస్పిటల్‌కు ఆమెను భర్త, ఆడపడుచు తీసుకువచ్చారట. వాళ్లని పిలిపించి పరిస్థితి వివరించాము.
“బిడ్డ చనిపోయిందని, గర్భాశయానికి దెబ్బతగిలిందని, వీలైతే తొలగించాల్సి వుంటుంద”ని చెప్పాము.
అటువంటి వార్త చెప్పినపుడు, సాధారణంగా కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందిస్తారు. కోపోద్రిక్తులవుతారు. ఎన్నో ప్రశ్నలతో డాక్టర్లని ఉక్కిరిబిక్కిరి చేస్తారు.
భర్త, ఆడపడుచు ఇద్దరూ శాంతంగానే విన్నారు.
ఇక నాకే కోపం వస్తోంది.
"నిన్ననే చూశాను. బిడ్డ , తనూ ఇద్దరూ బాగానే వున్నారు. ఇంతలో ఏం జరిగింది."
భర్త మౌనంగా వుంటే ఆడపడుచు జవాబిచ్చింది.
పొద్దున్నేలేచిందని, కబుర్లాడిందని, టిఫిన్ చేసి పడుకుందని, లేవగానే నొప్పి అంటే వెంటనే హాస్పిటల్‌కు తెచ్చామని చెప్పింది.
“దెబ్బలేమైనా తగిలాయా?
మెట్ల మీద నుండి జారిపడిందా?
దారిలో కారుకేమైనా యాక్సిడెంట్ జరిగిందా ?
గర్భాశయం అంత తీవ్రంగా గాయపడిందంటే ఏదో కారణముండాలి. ఏం జరిగింద”ని చుట్టూ నిలబడిన స్టాఫ్ ఎంత ప్రశ్నించినా ఇద్దరూ అదే స్థాయి శాంతం, మౌనం కొనసాగిస్తున్నారు.
ఇక వాళ్లని ప్రశ్నించడం ఆపి థియేటర్ లోపలికెళ్లి పోయాము.
గర్భాశయాన్ని రిపెయిర్ చేసినా రక్తమోడుతూనే వుంది. తొలగించాలని నిర్ణయించుకున్నాం.
యుటిరస్‌ను తొలగించాక కొద్దిసేపు తుఫాను వెలసినట్లయింది. అయిదు నిముషాలు అంతా బాగానే వుంది. ఇక ఆపరేషన్ పూర్తి అయిందని అందరం ఊపిరి పీల్చుకున్నాం.
‘హమ్మయ్య’ అనుకుంటూ వుండగా పొట్టపై భాగం నుండి బ్లీడింగ్ మొదలైంది.
మళ్లీ ఇదేమిటని చూస్తే, స్ప్లీన్ కూడా పగిలిపోయి వుంది. అక్కడ నుండి రక్తం కారుతోంది.
సర్జరీ విభాగాధిపతి, వాస్క్యులర్ సర్జన్ వచ్చారు. హాస్పిటల్లో కీలకమైన వ్యక్తులంతా అక్కడే వున్నారు. మెల్లగా చిన్న ప్రవాహంలా మొదలైన ఆ బ్లీడింగ్, నిముషాల్లో ఉధృతంగా మారింది. మా అందరి మీదా ఆగ్రహంగా దూకుతున్నజలపాతమైంది. రక్తం బాటిల్స్ ఎక్కిస్తూనే వున్నాం.
ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా బ్లీడింగ్ ఆగలేదు.
ఆపరేషన్ జరుగుతున్న సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడం, ఎన్నో పద్ధతుల్లో దాన్ని కంట్రోల్ చేయడం సర్వ సాధారణమే. కానీ ఆనాడు చూసినంతటి రక్తపాతం ఎన్నడూ చూడలేదు.
దాదాపు ఎనిమిదిమంది కీలకమైన వ్యక్తులు ఆపడానికి ప్రయత్నించి ఓడిపోయాము.
ఉదయం పదిగంటలకు మొదలైన యుద్ధం రాత్రి పన్నెండింటికి ఆగింది, ఆమె శ్వాసతో సహా.
బయటికి వచ్చాము
ఆడవాళ్లు గుంపుగా నిలబడి వున్నారు. ఓ పదిరోజుల్లో, అమీనా చెల్లెలి వివాహమట. బంధువులందరూ వచ్చారు. ఓపక్కన అమీనా ఏడేళ్ల కూతురు కూడా నిలబడి వుంది. నిన్నటిలానే, అదే మోస్తరుగా తల్లి బ్యాగ్ మోస్తోంది.
అందరి చేతులూ మెహెందీతో ఎర్రగా పండి వున్నాయి.
నా చేతులు కూడా.
వాళ్లందరూ ఆశగా మావంక చూస్తున్నారు. మేము చెప్పిన వార్త విన్నాక ఆడవాళ్లందరి రోదనలతో హాస్పిటల్ ప్రతిధ్వనించింది.
అనుమాస్పదమైన ఆమె మృతిని, అన్ని వివరాలతో రిపోర్ట్ చేశాము.

ఫొటో సోర్స్, Getty Images
గర్భిణులలో గృహహింస పరిశోధనలలో తేలిన నిజాలు.
భారతదేశంలో 30శాతంమంది గర్భిణులు శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.
విషయం వెల్లడి చేస్తే హింస ఎక్కువవుతుంది గనక ఫిర్యాదు చేసే స్త్రీలకన్నా, హింసను దాచిపెట్టే స్త్రీలే ఎక్కువ.
సామాజిక, ఆర్థిక స్థితిగతులకతీతంగా అన్నివర్గాల గర్భిణులలోనూ ఈ హింస నమోదయింది.
శారీరక, మానసిక వేధింపుల ప్రభావం తల్లి ఆరోగ్యం మీదే కాకుండా గర్భస్థ శిశువు పెరుగుదల పైనా వుంటుంది.
హింసకు గురయ్యే గర్భిణులలో నెలలు నిండక మునుపే కాన్పు అయ్యే అవకాశాలెక్కువ.
ఈ కింది పరిస్థితులు ఎదురువుతున్నాయేమో ఒకసారి పరిశీలించుకోండి.
గత పన్నెండు నెలలలో ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులు మీ మీద శారీరక దౌర్జన్యం చేశారా?
ఎ) కొట్టడం, కాలితో తన్నడం, నెట్టడం, పిడికిలితో మొహమ్మీదకొట్టడం, నేలమీదలాగడం, శరీర భాగాలు కాల్చడంవంటి బాధ కలిగించే చర్యలకు పాల్పడుతున్నారా ?
బి) కత్తి , గన్‌వంటి ఆయుధంతో దాడి చేయడం లేదా ఆయుధం చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారా?
సి) బయటికి వెళ్లనీయకుండా, ఆరోగ్య సహాయం తీసుకోనివ్వకుండా కట్టడి చేస్తున్నారా?
అయితే సహాయం తీసుకోండి...సురక్షితంగావుండండి.
గృహహింసకు లోనయితే ఈ నంబర్లను సంప్రదించండి:
* పోలీస్ హెల్ప్ లైన్: 1091/ 1291
* జాతీయ మహిళా కమిషన్ వాట్సన్ హెల్ప్ లైన్: 72177-35372
ఇవి కూడా చదవండి:
- ఇరాన్: 'నా భర్త నన్ను కొడుతుంటే చుట్టుపక్కల వాళ్లు ఇది మామూలే అన్నట్లు చూశారు...'
- అఫ్గానిస్తాన్ గృహహింస: 'నా భర్త నన్ను తోటలోకి బరబరా ఈడ్చుకెళ్లి కత్తితో నా ముక్కు కోశాడు'
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- అఫ్గాన్ ప్రసూతి వార్డుపై దాడి: తల్లులను కోల్పోయిన శిశువులకు పాలిచ్చి కాపాడిన మహిళ
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
- లాక్డౌన్లో పెరిగిన గృహహింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








