తెలంగాణ: పీఆర్‌సీ అంటే ఏంటి... దీనిపై ఉద్యోగులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?

కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGANACMO/FB

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీపై ఆందోళన చెందుతున్నారు. తమకు 7.5 శాతం జీతం పెంచడం సరిపోదనీ, మూల వేతనం (బేసిక్ శాలరీ) మీద కనీసం 43 శాతం జీతం పెంచాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం అయ్యారు.

పీఆర్‌సీ అంటే పే రివిజన్ కమిషన్. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి? ఎంత భత్యం ఇవ్వాలి వంటివి సిఫార్సు చేసే కమిటి.

ప్రతి అయిదేళ్లకోసారి ఈ సంఘాన్ని నియమిస్తారు. ఈ సంఘం ఇచ్చే సిఫార్సును విని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా జీతాలు పెంచడమే ఉంటుంది. పీఆర్‌సీ చెప్పిన దానికంటే కాస్త ఎక్కువే జీతాలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది.

కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని పే కమిషన్ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో పే రివిజన్ కమిషన్ అంటారు.

ఇప్పుడు వివాదం ఏంటి?

అయిదేళ్లకోసారి ప్రభుత్వం పీఆర్‌సీ వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2018 మేలో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సీఆర్ బిస్వాల్, ఉమామహేశ్వర రావు, మహమ్మద్ అలీ రఫత్‌లతో పీఆర్‌సీ ఏర్పాటు చేసింది.

అంతకుముందు 2013 నాటి పీఆర్‌సీ ప్రకారం 2014లో తెలంగాణ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. తెలంగాణ వచ్చాక ఇదే మొదటి వేతన సంఘం. తెలంగాణ మొదటి పీఆర్‌సీ 2020 డిసెంబరులో తన నివేదిక ఇచ్చింది.

నివేదిక ఆలస్యం అయినా, పెరిగే జీతం మాత్రం 2018 నుంచే పెంచాల్సి ఉంటుంది. (అంటే పాత బకాయిలు లెక్కించి ఇచ్చేస్తారు)

తాజా పీఆర్‌సీ నివేదికలో ఉద్యోగులకు మూల వేతనం మీద 7.5 శాతం జీతం పెంచాలని పేర్కొన్నారు. ఈ పెంపు చాలా తక్కువని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత పీఆర్‌సీలో అంటే, 2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో చేసిన పీఆర్‌సీ ఇప్పటి వరకూ చరిత్రలో అత్యధికం. అప్పటి వేతన సంఘం వారు 29 శాతం పెంచమంటే, కేసీఆర్ ఏకంగా 43 శాతం జీతం పెచారు. అది చూసి ఆంధ్రలో చంద్రబాబు 44 శాతం జీతం పెంచారు. (2013 నాటి పీఆర్‌సీ, 2014లో అమలు చేశారు)

తాజా పీఆర్‌సీ నివేదికలోని అంశాలు ఇవి:

  • ఫిట్‌మెంట్ 7.5 శాతం పెంచాలి. (ఫిట్‌మెంట్ అంటే మూల వేతనం మీద పెంపు)
  • ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 నుంచి 60 ఏళ్ళకు పెంచాలి
  • కనీసం జీతం అంటే కింది స్థాయి సిబ్బందికి ఇచ్చే కనిష్ఠ జీతం 19 వేలు, గరిష్ఠ జీతం ఒక లక్షా 62 వేలు
  • 2018 జూలై 1 నుంచి ఇప్పటి వరకూ పెరిగిన డీఏ 30.392 శాతం (ఇది కూడా ఇప్పుడు మూల వేతనంలో కలుపుతారు). డీఏ అంటే డియర్నెస్ ఎలవెన్స్ - జీతం పెరుగుదలతో సంబంధం లేకుండా, ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో కొంత శాతాన్ని డీఏగా పెంచుతూ వెళ్తారు. ఐదేళ్లకోసారి జీతం పెరిగినప్పుడు అది బేసిక్ పేలో కలుపుతారు.
  • గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు
  • పిల్లలు పుట్టినప్పడు ఇచ్చే సెలవు 3 నెలల నుంచి 4 నెలలకు పెంపు
  • ఇంటి అద్దె భత్యం తగ్గింపు
  • కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడాదికి వెయ్యి రూపాయల జీతం పెంచాలని సూచన
  • గ్రేడ్ 1, 2 ఉద్యోగులు ప్రైవేటు ఏసీ బస్సుల్లో వెళ్లడానికి కూడా అనుమతి
  • కారు అలవెన్స్ పెట్రోలు బండికి కిలోమీటరుకు రూ.16, డీజెల్ బండికి రూ.14, టూవీలర్‌ అలవెన్స్ కిలోమీటరుకు రూ.6 చొప్పున ఇవ్వాలి
  • మండలాల పరిధిలో ట్రావెల్ అలవెన్స్ రూ.1500, డివిజన్ స్థాయిలో రూ.2000
  • వివిధ అలవెన్సులు పెంచారు

ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలు కోపంతో ఉన్నాయి. ఇది చాలా తక్కువని వారు విమర్శిస్తున్నారు. దీన్ని ''పే రివిజన్ కాదు, పే డిడక్షన్'' అని వారు అంటున్నారు. నిన్న సాయంత్రం సచివాలయంలో ఉద్యోగులు ఆందోళన చేశారు. పీఆర్‌సీ ప్రతులు దహనం చేశారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/revanthofficial

దీనిపై రాజకీయంగానూ విమర్శలూ వచ్చాయి. పీఆర్‌సీ నివేదిక ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. 7.5 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించడం ఉద్యోగులను అవమానించడమే అని ఆయన అన్నారు.

తెలంగాణలో మొదటి పీఆర్‌సీ ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదని, ఉద్యోగులకు 43 శాతం మేర జీతాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉద్యోగులను నట్టేట ముంచేలా పీఆర్‌సీ ఉందని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. దీనిపై చర్చలకు కూడా ప్రభుత్వం తమకు అనుకూల ఉద్యోగ సంఘాలనే పిలుస్తున్నారని ఆరోపించారు సంజయ్.

ఉద్యోగ సంఘాల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ మూడు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అయింది.

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ - గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ సంఘాలు సీఎస్‌తో సమావేశం అయ్యాయి. వారి వాదన విన్న సీఎస్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KCR

''మాకు ఈ కమిటీ మీద నమ్మకం లేదు. మా అధ్యక్షులు చెప్పినట్టు ఇది పిసినారి కమిటీ. కానీ, మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మూడేళ్ల కాలయాపన చేసి ఈ నివేదిక ఇచ్చారు. మాకు కావలసింది మంత్రి శ్రీనివాస గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి నుంచి తీసుకుంటాం. మేం కోరేది ఒకటే. గత పీఆర్‌సీలో ఇచ్చినంత ఇవ్వాలని. కరోనా సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమంతా కష్టపడి పనిచేశాం. అదే విషయాన్ని సీఎస్ గారికి చెప్పాం. పరిస్థితి మీరు చూస్తున్నారుగా అన్నారు సీఎస్ గారు. ముఖ్యమంత్రి మంచి హృదయంతో పీఆర్‌సీ ఇస్తారని ఆశిస్తున్నాం'' అన్నారు హైదరాబాద్ జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘానికి చెందిన కృష్ణా యాదవ్.

''ఇన్నాళ్లకైనా రిపోర్టు రావడం హర్షనీయం. కానీ, అందులో విషయాలు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా లేవు. ఇది ప్రాతిపదిక మాత్రమే. ఇందులో అంశాలన్నీ చర్చించి, రాష్ట్ర ప్రభుత్వం ఒక గౌరవప్రద నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం ఉంది. గతంలో అనేక పీఆర్‌సీల విషయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెంచిన విషయం తెలిసిందే. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు'' అని బీబీసీతో చెప్పారు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద రావు అన్నారు. ఆయన గతంలో తెలంగాణ ఉద్యోగుల నేతగా పనిచేశారు.

''అయితే ఇంటి అద్దె భత్యం విషయంలో ఉద్యోగులకు కాస్త ఇబ్బంది ఉంది. కేంద్రం చేసినట్టుగానే మెట్రోపాలిటిన్ నగరాల హెచ్ఆర్ఏ 30 నుంచి 24 శాతానికి తగ్గించారు. కానీ, అది కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా జరిగిందని గమనించాలి. ఈ విషయం కూడా ఉద్యోగ సంఘాలు చర్చల్లో పరిష్కరించవచ్చు'' అని ఆయన అన్నారు.

''పీఆర్‌సీ గతంలో ఒకటి ఇస్తే, సీఎం ఇంకోటి ఇచ్చారు. సీఎం ప్రాక్టికల్‌గా ఆలోచించి, రియాల్టీతో ఇస్తారు. పీఆర్‌సీ సిఫార్సు ఎక్కువ ఉంటే ఆనందం వద్దు, తక్కువ ఉంటే బాధ వద్దు. నిజంగా సీఎం గారికి ఉద్యోగుల పట్ల ప్రేమ లేకపోతే, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వాళ్లకు కూడా వీళ్లతో పాటూ పీఆర్‌సీ ఇద్దాం అనరు కదా. 70 ఏళ్లలో ఏ సీఎం కూడా మాట్లాడని విధంగా వారి గురించి సీఎం ప్రస్తావించారు. పూర్తి అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటాం'' అని బీబీసీతో చెప్పారు తెలంగాణ రాష్ట్ర టూరిజం మంత్రి వి శ్రీనివాస గౌడ్. ఆయన గతంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)