తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై జీవో విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌లో నిరుద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, అందుకు తాజాగా జీవో విడుదల చేసింది.

2019లో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ లేని కులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చట్టాన్ని (రాజ్యాంగపు 124వ సవరణ చట్టం) తెచ్చింది.

అప్పటికే కులాల వారీగా అమలులో ఉన్న రిజర్వేషన్లకు అదనంగా మరో పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఈ చట్టం లక్ష్యం.

జనరల్ కేటగిరీ లేదా ఇతర కులాలు(ఓసీ)గా పిలిచే కులాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

తెలంగాణ ప్రభుత్వం జీవో

ఫొటో సోర్స్, TS GOVT.

ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్లు వారు ధ్రువపత్రం తెచ్చుకుంటే ఈ రిజర్వేషన్లు వారికి వర్తిస్తాయి.

అయితే ఈ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది తప్ప, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు తమ రాష్ట్ర ఉద్యోగాల్లో ఇంకా అమలు చేయలేదు.

ఈ విషయమై ఎప్పటి నుంచో బీజేపీ, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలనూ ప్రశ్నిస్తోంది.

ఇటీవల ఈ రిజర్వేషన్ అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై తాజాగా సోమవారం (ఫిబ్రవరి 8న) ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు మినహా మిగిలిన వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వం నియామకాల్లోనూ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే, పదోన్నతులకు వర్తించవు.

తాజా రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, విద్యా శాఖ త్వరలో విడుదల చేస్తాయని నిబంధనల్లో పేర్కొన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/kcr

రెండేళ్ల ఎదురుచూపులు నెరవేరాయి

''ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్రం ఈ చట్టం తెచ్చి రెండేళ్లయింది. అప్పటి నుంచీ దీని అమలు కోసం ఎదురుచూస్తున్నాం.

ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతున్నాం.'' అన్నారు రెడ్డి జాగృతి సంస్థ జాతీయ అధ్యక్షుడు పి శ్రీనివాస రెడ్డి.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

పెరగనున్న రిజర్వేషన్లు

ఇప్పటి వరకు కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్ప దేశమంతా రిజర్వేషన్లు 50 శాతం వరకే ఉండేవి.

మిగిలిన 50 శాతం ఉద్యోగాలూ అందరికీ అందుబాటులో ఉండేవి. కానీ తాజా 10 శాతంతో, తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతం చేరుతున్నాయి. అలాగే ఈ సవరణతో ఇక రిజర్వేషన్ వర్తించని కులం అంటూ ఉండదు.

గతంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీర్పు ఇచ్చింది.

అయితే ఆ తీర్పుతో సమస్య రాకుండా రాజ్యాంగాన్ని సవరించింది బీజేపీ ప్రభుత్వం. తాజా అగ్రకుల పేదల రిజర్వేషన్ల సవరణ చట్టానికి కూడా సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.

కేసీఆర్, మోదీ

ఫొటో సోర్స్, TelanganaCMO

బీజేపీ చెప్పినట్టు కేసీఆర్ చేస్తున్నారు

''బీజేపీ ఏది చెప్తే అది చేసే పరిస్థితికి వచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే మొన్న ఆయుష్మాన్ భారత్ అంగీకరించారు.

ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కాస్త మారుతున్నారు. తాజాగా ఈ అగ్రకుల రిజర్వేషన్లకు అంగీకరించారు.

ఇవే కాదు, మరో రెండు ముఖ్యమైన అమలు చేయాల్సిన విషయాలు ఉన్నాయి.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద, ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని కేంద్రం అందరికీ పక్కా ఇళ్లు ఇస్తోంది. దాన్ని అమలు చేయాలి. అలాగే ఫసల్ బీమా యోజన (రైతులకు పంట బీమా పథకం) విషయంలో కూడా ఇబ్బంది ఉంది. ఇది అమలు చేస్తే రైతులకు చాలా లాభం. దీంట్లో ప్రీమియం 85 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం, 5 శాతం రైతు కట్టాలి. మేం ఏం డిమాండ్ చేసినా తెలంగాణ ప్రజల కోసమే.

అసలు కే౦ద్ర పథకాలు అమలు చేయడానికి ప్రత్యేక శాఖ పెట్టి, మంత్రినీ ఐఎఎస్‌నీ కేటాయించాలని మేం డిమాండ్ చేస్తున్నం.'' అన్నారు బీజేపీ నేత పేరాల శేఖర రావు.

'బీజేపీ వాళ్లే అమలు చేయడం లేదు - మేమే చేస్తున్నాం'

''భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వమూ చేయని విధంగా, అందరి కంటే మిన్నగా తెలంగాణ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు అమలు చేస్తోంది. అగ్రవర్ణ పేదలైన బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, వెలమలు, కమ్మ వంటి కులాలకు చెందినవారికి విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించిందుకు అగ్రవర్ణ పేదలు కేసీఆర్‌కి రుణపడి ఉంటారు. బ్రాహ్మణ, రెడ్డి వంటి వివిధ కుల సంఘాలు దీనిపై పోరాటం కూడా చేశాయి. వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు.'' అన్నారు మాజీ కేంద్ర మంత్రి, టిఆర్ఎస్ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి.

''కేంద్రం చాలా పథకాలు తెస్తుంది. కానీ అవి అందరికీ అమలు అవ్వవు. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ సంగతి చూడండి. తెలంగాణలో 3.5 కోట్ల జనాభా, 2.5 కోట్ల పైగా తెల్ల కార్డుదారులు ఉంటే, ఆయుష్మాన్ భారత్ కేవలం 67 లక్షల మందికే వర్తిస్తుంది. అదే ఆరోగ్యశ్రీ అయితే తెల్లకార్డు ఉన్న అందరికీ వస్తుంది. కేంద్రం చెప్పినట్టు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. మాట పడాల్సి వస్తుంది. కొందరికి అంది, కొందరకి అందవు పథకాలు. అందుకే ఏది ఎలా చేయాలో పరిశీలించి చేస్తారు. మేం ఇటీవల జరిగిన సమావేశాల్లో కేసీఆర్ గారితో ఈ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించాం. ఆయన అంగీకరించారు. అసలు

ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ రాష్ట్రాలే దీన్ని అమలు చేయడం లేదు. కానీ కేసీఆర్ చేశారు.'' అన్నారు వేణుగోపాలాచారి.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)