భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు చేసి శిక్షలు పడకుండా తప్పించుకోవడం చాలా తేలికా?

విద్వేష వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, Facebook/Devbhoomi Raksha Abhiyan

    • రచయిత, శరణ్య రిషీకేశ్
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు చేసి శిక్షలు పడకుండా తప్పించుకోవడం చాలా తేలికా?

హిందువుల రామ నవమి వేడుకల్లో చోటుచేసుకున్న కొన్ని వరుస ఘటనలను పరిశీలిస్తే అదే భావన కలుగుతుంది.

రామ నవమి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కొన్ని కార్యక్రమాల్లో కొందరు విద్వేష వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మత ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.

దక్షిణ రాష్ట్రమైన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఒక శాసన సభ్యుడు విద్వేష వ్యాఖ్యలు చేయడంతో 2020లో ఆయన ఖాతాను ఫేస్‌బుక్ స్తంభింపచేసింది. అయితే, ‘‘రామ నామం జపించని వారు భారత్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ తాజాగా ఆయన మరో పాట పాడారు.

దీనికి కొన్ని రోజుల ముందు ఉత్తర్ ప్రదేశ్‌లో ముస్లిం మహిళలపై కిడ్నాప్, అత్యాచారం చేస్తామంటూ ఓ హిందూ నాయకుడు హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో వారం రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అరెస్టు చేశారు.

విద్వేష వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు విద్వేష వ్యాఖ్యల కేసులో బెయిల్‌పై ఉన్న హిందూ నేత యతి నరసింహానంద్ సరస్వతి దేశ రాజధాని దిల్లీలో మరోసారి విద్వేష వ్యాఖ్యలుచేశారు. హిందువులు ఆయుధాలు పట్టుకొని తమ మనుగడ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

యతి నరసింహానంద పాల్గొన్న ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులూలేవని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంతో నరసింహానంద తన బెయిల్ షరతులను ఉల్లంఘించారు. అయితే, ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

దశాబ్దాల నుంచి భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 1990ల్లో కశ్మీర్‌లోని కొన్ని మసీదుల్లో హిందువులకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలుచేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న వివాదాల నడుమ ముస్లిం మెజారిటీగా ఉండే ఈ ప్రాంతాలను హిందువులు వదిలివెళ్లిపోవాల్సి వచ్చింది.

అదే ఏడాది బీజేపీ నాయకుడు ఎల్‌కే అడ్వాణీ కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఓ ఉద్యమం తీసుకొచ్చారు. దీంతో శతాబ్దాల నాటి బాబ్రీ మసీదును హిందువులు కూలదోశారు. ఆ తర్వాత భయానక మత ఘర్షణలు చెలరేగాయి.

అక్బరుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్బరుద్దీన్ ఒవైసీ

ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. జనాలను మతపరంగా విభజించే, రెచ్చగొట్టే విద్వేష వ్యాఖ్యలు ఎప్పటికప్పుడే కనిపిస్తున్నాయి. చిన్నచిన్న నాయకులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లు మరింత ఎక్కువచేసి చూపిస్తున్నాయి.

పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచేందుకు కొందరు నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకుడు నీలంజన్ సిర్కార్ చెప్పారు. ‘‘ఇటీవల కాలంలో ఇవి చాలా ఎక్కువయ్యాయి. వీటిని అడ్డుకోవడం చాలా కష్టం అవుతోంది.’’

‘‘ఇదివరకు ఎన్నికలకు ముందు, ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు ఎక్కువగా చేసేవారు. కానీ, ఇప్పుడు ఒక ప్రాంతంలో చేసే వ్యాఖ్యలను మీడియా సాయంతో వేరే ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందేందుకు నాయకులు ఉపయోగించుకుంటున్నారు.’’

వీఐపీల విద్వేష వ్యాఖ్యలను 2009 నుంచి న్యూస్ ఛానెల్ ఎన్‌డీటీవీ ట్రాక్ చేస్తోంది. ముఖ్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల విద్వేష వ్యాఖ్యలపై సంస్థ దృష్టిపెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చాలా రెట్లు పెరిగాయని జనవరిలో విడుదలచేసిన ఒక నివేదికలో ఎన్‌డీటీవీ వెల్లడించింది.

కేంద్ర మంత్రి సహా చాలా మంది బీజేపీ నాయకులపై ఇలాంటి వ్యాఖ్యల కేసులున్నాయి. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, తాము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వారు ఖండించారు. మరోవైపు 2012నాటి విద్వేష వ్యాఖ్యల కేసు నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకి కూడా కోర్టు విముక్తి కల్పించింది.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

విద్వేష వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు మన దగ్గర సరిపడా చట్టాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

‘‘చట్టాలు అయితే ఉన్నాయి. కానీ, వాటిని అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా కేసుల్లో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతోంది’’అని సీనియర్ అడ్వొకేట్ అంజన ప్రకాశ్ అన్నారు. ఉత్తరాఖండ్‌లో గత డిసెంబరులో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలుచేసిన హిందూ నాయకులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేవారు.

భారత్‌లో విద్వేష వ్యాఖ్యలకు ప్రత్యేక నిర్వచనం అంటూ లేదు. అయితే, కొన్ని రకాల వ్యాఖ్యలు, రచనలపై కొన్ని చట్టాల్లో ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రెండు మతాల మధ్య విరోధభావాన్ని పెంచే చర్యలు, వ్యాఖ్యలతోపాటు మతపరమైన విద్వేషాలను పెంచే వ్యాఖ్యలపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి.

భారతీయ కోర్టుల దగ్గరకు విద్వేష వ్యాఖ్యల కేసులు తరచూ వస్తుంటాయి. అయితే, వీటిపై తీసుకునే చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలగకుండా కోర్టులు జాగ్రత్త పడుతున్నాయి.

వీడియో క్యాప్షన్, కర్నాటక: జై శ్రీరామ్ vs అల్లా హో అక్బర్

2014లో రాజకీయ నాయకులు, మతపెద్దలు చేసే విద్వేష వ్యాఖ్యలను కట్టడి చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ మార్గదర్శకాలతో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని భావించి... సుప్రీం కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అయితే, ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని లా కమిషన్‌కు సుప్రీం కోర్టు సూచించింది.

2017లో లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. విద్వేష వ్యాఖ్యలను నేరంగా పరిగణించేలా ప్రత్యేక నిబంధనలను ఐపీసీలో చేర్చాలని కమిషన్ సూచించింది.

అయితే, ఈ సూచనలతో అంత ప్రయోజనం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘‘విద్వేష వ్యాఖ్యలను నిర్వచించడం, ఆ పరిధి విస్తరించడంతో కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ చర్యలు ఇప్పటికే ఐపీసీలోని వేరే నిబంధనల కింద నేరాలుగా పరిగణిస్తున్నారు’’అని సుప్రీం కోర్టు నాయయవాది అదిత్య వర్మ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...

అసలైన సమస్య సంస్థలకు స్వయం ప్రతిపత్తి లేకపోవడమేనని ఆయన అన్నారు. ‘‘ఉదాహరణకు బ్రిటన్‌ను తీసుకోండి. అక్కడ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పార్టీలు చేసుకున్నందుకు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌పైనే అధికారులు చర్యలు తీసుకున్నారు’’అని ఆయన చెప్పారు.

అయితే, భారత్‌లో రాజకీయ ఒత్తిళ్ల నడుమ అలా చర్యలు తీసుకోవడం చాలా అరుదుగా మనకు కనిపిస్తుందని ఆయన అన్నారు.

‘‘చట్టాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ, వాటి అమలులోనే అసలు సమస్య ఉంది’’అని వర్మ అన్నారు.

‘‘విద్వేష వ్యాఖ్యలుచేసే వారిపై చర్యలు తీసుకోకపోతే.. మిగతా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎలా అడ్డుకోగలం?’’అని ప్రకాశ్ ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలు సాధారణం అయిపోతే మరింత ముప్పని ఆమె అన్నారు.

‘‘ఇలాంటి విద్వేష వాతావరణంలో ప్రజలు భయంతో బతకాల్సి ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది’’అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)