కర్ణాటక: 'హిజాబ్‌కు రియాక్షనే కాషాయ కండువా'-ఉడుపి నుంచి గ్రౌండ్ రిపోర్ట్

ముస్లిం విద్యార్థినులు
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఉడుపి నుంచి

నోటికి నల్లని మాస్క్, మెడలో కాషాయ కండువా, జై శ్రీరాం నినాదాలు. ఫిబ్రవరి 8న హిజాబ్ కోసం డిమాండ్ చేస్తున్న ముస్లిం విద్యార్థులకు ఎదురుగా నిలబడిన అలాంటి వందలాది విద్యార్థుల్లో ఆకాంక్ష ఎస్ హంచినామఠ్ ఒకరు.

కర్ణాటక తీర ప్రాంత జిల్లా ఉడుపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజీఎం) కాలేజీ క్యాంపస్‌లో తర్వాత క్లాస్ కోసం గంట మోగగానే ఆరోజు ఈ విద్యార్థులందరూ అమీతుమీకి సిద్ధమయ్యారు.

అదే రోజు ఎంజీఎం కాలేజీ సహా కర్ణాటకలోని ఎన్నో కాలేజీల్లో కాషాయ కండువా, తలపాగాలు ధరించిన విద్యార్థినీ విద్యార్థులు హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు.

మేం ఆకాంక్ష ఇంటికి వెళ్లి తనను కలిసినపుడు ఆమె కూడా తన కాషాయ కండువా చూపించారు. ఆరోజు తాను పూర్తి సన్నాహాలతో కాలేజీకి వెళ్లానని చెప్పారు.

"అది మేమంతా కలిసి నిర్ణయించుకున్నాం. నేను బ్యాగ్‌లో నా కాషాయ కండువా పెట్టుకున్నాను. మతాన్ని మధ్యలోకి తీసుకువస్తే.. ఫలితం ఎలా ఉంటుందో మేం చూపించాలనుకున్నాం" అన్నారు ఆకాంక్ష.

ఉడుపిలో కాలేజీ

ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి వస్తే, తాము కూడా కాషాయ కండువాలు వేసుకుని వస్తామని ముందు రోజు చాలా మంది హిందూ విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపల్‌కు చెప్పారు. దాంతో ముస్లిం విద్యార్థినులను కలిసిన ప్రిన్సిపల్ ఇక నుంచి క్లాస్‌రూంలో హిజాబ్ ధరించవద్దని వారిని కోరారు.

దానికి ఒక రోజు ముందు వరకూ ఎంజీఎం కాలేజీలోని క్లాస్‌రూమ్స్‌లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఉండేది.

తమ గుర్తింపు బయటపెట్టద్దనే షరతుతో ప్రిన్సిపల్‌తో ఆరోజు జరిగిన సంభాషణను కొంతమంది ముస్లిం అమ్మాయిలు ధ్రువీకరించారు. ప్రిన్సిపల్ అలా అడగడంతో తాము ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.

"ఆయన అడ్మిషన్ సమయంలో హిజాబ్ ధరించవచ్చని చెప్పారు. అందుకే, నేను వేరే కాలేజీల్లో అడ్మిషన్ తీసుకోలేదు. ఇప్పుడు కోర్స్ మధ్యలో కొత్త నిబంధనలు పెట్టారు. ఇది మా గుర్తింపు, రాజ్యాంగం మాకిచ్చిన హక్కుకు సంబంధించిన విషయం. అల్లా ఆదేశం" అన్నారు.

ఆకాంక్ష క్లాసులో కూడా ముగ్గురు విద్యార్థినులు హిజాబ్ ధరిస్తారు. వారితో తనకెప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదని ఆకాంక్ష చెబుతున్నారు.

"నేను నా ఫ్రెండ్స్‌ను మతం ఆధారంగా ఎప్పుడూ వేరుగా చూడలేదు. నాకు నచ్చిన వారితో స్నేహం చేశాను. హిందూ-ముస్లిం అనేది అసలు సమస్యే కాదు" అన్నారు.

అయితే, ఇది హఠాత్తుగా ఎలా సమస్యగా మారింది.

తన కాషాయ కండువాతో ఆకాంక్ష
ఫొటో క్యాప్షన్, ఆరోజు తను వేసుకున్న కాషాయ కండువాతో ఆకాంక్ష

వివాదం ప్రారంభం

ఉడుపి కాలేజీల్లో హిజాద్ ధరించడం గురించి ఒక విధానం లాంటిది ఏదీ లేదు.

ఎంజీఎం కాలేజీలాగే చాలా ప్రైవేటు కాలేజీలు తమ నిబంధనల్లో హిజాబ్‌ను అనుమతించడం లేదా నిషేధం గురించి స్పష్టంగా ప్రస్తావిస్తాయి. మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఈ నిబంధనలను ఏటా నిర్ణయిస్తారు.

హిజాబ్ కోసం డిమాండ్ అనేది గత ఏడాది డిసెంబర్లో ఉడుపి కాలేజీ నుంచి మొదలైంది. అక్కడ గత ఏడాది నుంచీ హిజాబ్ ధరించడంపై నిషేధం విధించారు.

కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వ 'పీయూ కాలేజ్ ఫర్ గాళ్స్' తెరిచినపుడు, సీనియర్లు హిజాబ్ ధరించేవారు కాబట్టి, తమను కూడా అనుతిస్తారని 11వ తరగతిలో(ప్రీ-యూనివర్సిటీ)లో చేరిన ముస్లిం విద్యార్థినులు అనుకున్నారు. హిజాబ్‌తో కాలేజీకి రావడానికి అనుమతి అడిగారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫాం గురించి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల అధ్యక్షతన ఏర్పాటైన కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

ముస్లిం విద్యార్థినుల హిజాబ్ డిమాండ్‌కు ఉడుపి బీజేపీ ఎమ్మెల్యే రఘువీర్ భట్ ఒప్పుకోలేదు. ఆయన దీనిపై బీబీసీతో మాట్లాడారు.

"ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయం. అందరూ ఒకే యూనిఫాం ధరించాల్సుంటుంది" అన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రఘువీర్ భట్
ఫొటో క్యాప్షన్, ఉడుపి బీజేపీ ఎమ్మెల్యే రఘువీర్ భట్

మీ పార్టీ భావజాలంతో ప్రభావితమై మీరీ నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్నకు ఆయన అంగీకరించలేదు.

"రాజకీయం చేయడానికి వేరే అంశాలు ఉన్నాయి. ఇది విద్యకు సంబంధించిన విషయం" అన్నారు.

అయితే, అఖిల భారత విద్యార్థి పరిషద్(ఏబీవీపీ), హిందూ జాగరణ్ వేదిక లాంటి హిందుత్వ సంస్థలు హిందూ విద్యార్థులతో మత గుర్తింపునును ప్రదర్శించడానికి తాను మద్దతిచ్చినట్లు ఆయన అంగీకరించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎన్నో వీడియోల్లో కాషాయ తలపాగాలను కొత్తగా అప్పుడే ప్యాకెట్ల నుంచి తీసి పంచుతుండడం మనం చూడవచ్చు.

"మేడమ్, యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది. 'క్యాంపస్‌ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' లాంటి మత సంస్థ అక్కడి వాతావరణం పాడుచేస్తుంటే, ముస్లిం అమ్మాయిలు నిబంధనలు ఉల్లంఘిస్తామని చెబుతుంటే, మా సంస్థ, మా హిందూ అమ్మాయిలు చూస్తూ కూర్చుంటారా" అన్నారు రఘువీర్.

ఒక కాలేజీలో మొదలైన ఈ వివాదం మొత్తం రాష్ట్రమంతటా వ్యాపించడానికి 'క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'నే కారణమని ఆయన చెప్పారు.

కర్ణాటకలో విద్యా సంస్థల నియమాలు

యాక్షన్, రియాక్షన్

యాక్షన్- రియాక్షన్ అనే ఈ మాట ఉడుపిలో పదే పదే వినిపించింది.

ఆలయాల పట్టణంగా పేరుపొందిన ఉడుపిలో పది శాతం ముస్లింలు, ఆరు శాతం క్రైస్తవులు ఉన్నారు.

ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు వేరు వేరు ప్రాంతాల్లో ఉండరు. అన్ని మతాలవారూ ఒకే ప్రాంతంలో కలిసి నివసిస్తున్నారు. ఎంతోమంది కలిసి పని చేస్తున్నారు. పట్టణంలో రోడ్లపై బురఖా, హిజాబ్ ధరించిన మహిళలు కనిపించడం చాలా సాధారణ విషయం.

కానీ, ప్రస్తుతం ఇక్కడి వాతావరణం ఉద్రిక్తంగా ఉండడంతో ముస్లిం, హిందూ విద్యార్థులను ఒకే చోట చేర్చి మాట్లాడాలనుకున్న మా ప్రయత్నాలు ఫలించలేదు.

ఫిబ్రవరి 8న జరిగిన ఆ ఘటనలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని ఎంజీఎం కాలేజీలోని ఒక ముస్లిం విద్యార్థిని చెప్పారు.

"వాళ్లందరూ మా కాలేజీవాళ్లే. వారిలో ఎక్కువ మంది నా క్లాస్ వాళ్లే. అది చూసి నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నాతో చదువుకునేవాళ్లే నాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు" అన్నారు.

ఫిబ్రవరి 8న ఎంజీఎంతోపాటూ ఇంకా చాలా ప్రాంతాల్లో విద్యార్థులు కాషాయ కండువాలతో నినాదాలు చేసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం అన్ని కాలేజీలను మూసేసింది.

"ఇలా చేయడం వల్ల విద్వేషాలు వ్యాపిస్తాయనేది తెలిసిందే. వాళ్లు హిందువులు అందుకే మాకు వ్యతిరేకం అయ్యారని మేం ఆలోచిస్తాం. మేం ముస్లింలు కాబట్టి వారికి వ్యతిరేకం అయ్యామని వాళ్లు అనుకుంటారు. దీంతో విద్వేష వాతావరణం ఏర్పడుతుంది" ఆ విద్యార్థిని అన్నారు.

‘కర్ణాటక కమ్యూనల్ హార్మొనీ ఫోరమ్’ ఆ రాష్ట్రంలో పెరుగుతున్న మతతత్వానికి వ్యతిరేకంగా త 30 ఏళ్లుగా పనిచేస్తోంది.

కర్ణాటకలో మెల్లమెల్లగా మతశక్తులు బలం పుంజుకున్నాయని, ప్రస్తుత వివాదంలో యాక్షన్-రియాక్షన్‌ను చారిత్రక కోణంలో చూడాల్సిన అవసరం ఉందని సంస్థ సీనియర్ సభ్యులు ప్రొఫెసర్ కె.ఫణిరాజ్ అన్నారు.

ప్రొఫెసర్ కె.ఫణిరాజ్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ కె.ఫణిరాజ్

మతతత్వం చరిత్ర

2010 నుంచి దక్షిణ కర్ణాటక, ఉడుపి జిల్లాలో జరిగిన మతపరమైన ఘటనల సమాచారాన్ని ఈ సంస్థ సేకరించింది.

ప్రతి సంవత్సరం తీసిన డేటాలో మోరల్ పోలీసింగ్, హేట్ స్పీచ్, శారీరక దాడులు, మత స్థలాల ధ్వంసం సహా దాదాపు వంద కేసులకు సంబంధించిన సమాచారం ఉంది.

‘‘1990 తర్వాత రామ జన్మభూమి ఉద్యమం తర్వాత ఇక్కడ ఏబీవీపీ వేగంగా పుంజుకోవడం, తర్వాత ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్‌యూఐ పతనం కావడం మనం చూడవచ్చు. దీంతో విద్యార్థుల్లో హిందుత్వ రాడికల్ భావజాలం వేళ్లూనుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి మరో రియాక్షన్ కూడా ఉంది. దానివల్ల కేవలం ముస్లిం విద్యార్థుల హక్కుల కోసమే 'క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' లాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి" అని ఆయన చెప్పారు.

సీఎఫ్ఐ నేత అస్వాన్ సాదిక్
ఫొటో క్యాప్షన్, సీఎఫ్ఐ నేత అస్వాన్ సాదిక్

రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి అంశాలకు ఆజ్యం పోశారని, కోర్టు వరకూ వెళ్లిన ముస్లిం విద్యార్థులకు రాజీకి రాకుండా అడ్డుకున్నారని రాడికల్ ఇస్లాం సంస్థ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' విద్యార్థి విభాగంగా భావించే సీఎఫ్ఐ మీద ఆరోపణలు ఉన్నాయి.

అయితే, సీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అస్వాన్ సాదిక్ ఈ ఆరోపణలను ఖండించారు. తమ వైపు నుంచి ఈ అంశంలో ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయలేదని చెప్పారు.

"కాషాయ కండువాలు ముందుకు వచ్చినపుడు, ఏబీవీపీ జోక్యం చేసుకున్నపుడు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజకీయ ప్రకటనలు చేయడం మొదలెట్టినపుడు ఇది మరింత వ్యాపించడం మొదలైంది" అని సాదిక్ చెప్పారు.

మొత్తం వాతావరణం పాడవడానికి రెండు ప్రకటనలే కారణం అని అస్వాన్ చెబుతున్నారు. ఒకటి "కర్ణాటకను మేం తాలిబాన్లుగా మారనివ్వం" అని మంత్రి సునీల్ కుమార్ చేసిన ప్రకటన. ఇంకొకటి బీజేపీ నేత వాసన్ గౌడ పాటిల్ చేసిన "హిజాబ్ కావాలంటే పాకిస్తాన్‌కు వెళ్లిపొండి" అనే ప్రకటన.

కన్నడ న్యూస్ చానళ్లలో దీనిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా ఇలాంటి భావనలను మరింత రెచ్చగొడుతున్నాయి.

వీడియో క్యాప్షన్, హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...

గతంలో కూడా హిజాబ్ గురించి ప్రశ్నలు

ఉడుపిలో ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి కాదు. కోస్టల్ కర్ణాటకలోని కాలేజీల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించడంపై 2005 నుంచీ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

కానీ, ఇప్పటివరకూ ఈ అంశాన్ని ప్రిన్సిపల్, కాలేజీ కమిటీలు, విద్యార్థి నేతలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటూ వచ్చారు. మీడియా కూడా దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

ఈసారీ, ఈ అంశం కోర్టు వరకూ వెళ్లేంత పెద్దదైంది. రాజ్యాంగం అందించిన మత స్వేచ్ఛకే ప్రశ్నగా మారింది.

హిజాబ్, కాషాయ కండువా ధరించాలనే ఈ 'ఇష్టం' వెనుక ఎంత స్వేచ్ఛ ఉంది అనే ప్రశ్న ఉంది.

అంటే, ఈ నిర్ణయాల్లో విద్యార్థులు తీసుకున్నవి ఎన్ని, సంప్రదాయాలు, సమాజం, కుటుంబం, మత పెద్దలు తీసుకున్నవి ఎన్ని అనే ప్రశ్న కూడా వస్తోంది.

కానీ, ఒక సమాజానికి తాము లక్ష్యంగా మారామని అనిపించినప్పుడే.. ఇలా మత చిహ్నాలు ఉపయోగించడం పెరుగుతుందని మహిళా మున్నాడే అనే మహిళా హక్కుల సంస్థకు చెందిన మాలిగె శ్రీమానె అంటున్నారు.

"కర్ణాటకలో బురఖా ఆచారం లేదు, తలపై దుపట్టా మాత్రమే వేసుకునేవారు. కానీ బాబ్రీ మసీదు ఘటన తర్వాత అది మారింది. యువత కూడా అదే నేర్చుకుంటోంది" అని మాలిగెచెప్పారు.

కర్ణాటకలో మతాంతర వివాహాలు, బీఫ్ తినడం, ఆవులను తీసుకెళ్లడం లాంటి అంశాలపై పదే పదే దాడులు జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తూనే ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, కర్నాటక: జై శ్రీరామ్ vs అల్లా హో అక్బర్

"హిజాబ్, బురఖా లాంటి మతపరమైన ఆచారాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కానీ, దీనిని మైనారిటీ సమాజాలపై జరుగుతున్న వరుస దాడుల కోణంలో కూడా చూడాల్సుంటుంది" అంటారు మాలిగె.

హిజాబ్ వల్ల మీకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా కలగనపుడు, ఆ రోజు కాషాయ కండువా వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను ఎంజీఎం కాలేజీలో చదివే ఆకాంక్షను అడిగాను.

"కాషాయ కండువా వేసుకోవడం మా వ్యతిరేకత కాదు, రియాక్షన్" అని ఆమె సమాధానం ఇచ్చారు.

ఏ రియాక్షన్ గురించి ఆమె మాట్లాడుతున్నారో, అది ఆమెను, ఆమె లాంటి మిగతా విద్యార్థులను చూస్తుంటే అర్థమవుతుంది.

ఇప్పుడు ఆమె సమానత్వం కోరుకుంటోంది. అంటే ఆమె దృష్టిలో ఒకేలాంటి యూనిఫాం వేసుకోవడం వల్ల అది వస్తుంది.

ఇక సమానత్వం చూపించే యూనిఫాం ముస్లిం విద్యార్థులకు మత వివక్షకు ప్రతీకగా నిలుస్తోంది.

"మేం క్యాంపస్‌లో మళ్లీ శాంతి ఏర్పడాలని, అన్నీ ముందులాగే ఉండాలని వేచిచూస్తున్నాం" అంటారు ఆకాంక్ష.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)