న్యూడ్ వీడియో కాల్స్: 'మీ ఇంట్లో కలుస్తారా? మేము చెప్పిన లొకేషన్‌కు వస్తారా? అని అడుగుతారు'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మీరెక్కడున్నారు?"
"మీరు చెప్పిన గుడి దగ్గర"
"నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. మిమ్మల్ని చూశాను. రూ.5000 ఒక నంబర్‌కు పంపిస్తే, మీరు చెప్పిన సమయానికి అక్కడకు వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకుని వెళతాను".
వెంటనే డబ్బు ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది.
"నేనిక్కడే ఉన్నాను. అయితే, మాకు మీరిచ్చిన డబ్బు సరిపోదు. సెక్యూరిటీ కోసం మరొక 5000 పంపండి."
"మీరు నాకు కనిపించటం లేదు. ఎక్కడున్నారు?
"గుడి పక్కనే ఉన్న స్కూల్ దగ్గర ఉన్నాను".
ఆ గుడి పక్కనే ఒక స్కూల్ ఉండటంతో కాస్త నమ్మకం కుదురుతుంది. మరి కొంత డబ్బు పంపిస్తారు.
ఆ అమ్మాయి మాత్రం ఎప్పటికీ రాదు. డబ్బు పంపడం ఆపగానే బ్లాక్ మెయిల్ మొదలవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
ఈ సంఘటన జరగడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రభాత్ (పేరు మార్చాం) గూగుల్‌లో కాల్ గర్ల్స్ కోసం సెర్చ్ చేశారు.
కొన్ని వెబ్‌సైట్లు ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత "కాల్ గర్ల్స్ నియర్ విశాఖపట్నం" అని సెర్చ్ చేశారు.
ఆ తర్వాతేమి జరిగిందో, ప్రభాత్ బీబీసీకి వివరించారు.
"ఒక వెబ్‌సైట్‌లో వివరాల ద్వారా ఒక ఫోన్ నంబర్‌కు కాల్ చేశాను. ఆ కాల్‌కు ఒకబ్బాయి స్పందించి ప్రభాత్ వివరాలు తీసుకుని, కాల్ గర్ల్స్ వివరాలు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించమన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించిన తర్వాత కొంతమంది అమ్మాయిల ఫోటోలను పంపించారు. అందులోంచి ఎంపిక చేసుకున్న అమ్మాయితో మాట్లాడాలంటే మరికొంత డబ్బు చెల్లించమని అడిగారు. వ్యక్తిగతంగా ఆ అమ్మాయిని కలవాలంటే మరికొంత రుసుము చెల్లించమని చెప్పారు"
"మీ ఇంటి దగ్గర కలుస్తారా? లేదా మేము చెప్పిన లొకేషన్‌లోనా అని అడిగారు"
మీ లొకేషన్ అనగానే, రూమ్ బుక్ చేయాలి, అందుకు అదనంగా మరిన్ని డబ్బులు చెల్లించమన్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత, ఊర్లో ఒక నిర్ణీత ల్యాండ్‌మార్క్ చెప్పి అక్కడకు ఆ అమ్మాయి వచ్చి తీసుకుని వెళుతుందని చెబుతారు.
ఈ ప్రక్రియలో ఫోన్ నంబర్, ఊరు పేరు లాంటి వివరాలన్నింటినీ సేకరిస్తారు.
అలా ఒకమ్మాయి తనను తీసుకుని వెలుతుందేమోననే ఆశతో వెళ్లినప్పుడు ప్రభాత్‌కు సదరు అమ్మాయితో జరిగిన సంభాషణే బ్లాక్ మెయిల్‌కు దారి తీసింది.
అమ్మాయి వస్తుందని ప్రభాత్ గుడి దగ్గరకు వెళ్లారు. కానీ, అక్కడికి ఆ అమ్మాయి రాలేదు. కానీ, డబ్బు కోసం ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది.
సంభాషణ కొనసాగుతూనే ఉంటుంది. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉంటాయి. కానీ, అమ్మాయి మాత్రం రాదు. సహనం నశించో, లేదా డబ్బులు అయిపోయి, ఇక డబ్బులు లేవని చెప్పగానే బ్లాక్ మెయిల్ మొదలవుతుంది.
అయితే, ఆ కాల్స్ చేస్తున్నది తాను ఎంపిక చేసుకున్న అమ్మాయి నుంచి మాత్రం కాదు.
"మన మానసిక బలహీనతతో ఆడుకుంటూ, వస్తున్నాం, వస్తున్నాం, అని చెబుతూ డబ్బు అడుగుతూనే ఉంటారు"
"ఒక రెండు మూడు సార్లు డబ్బును పంపిన తర్వాత, ఇక డబ్బులు లేవని చెప్పగానే, వాట్సాప్ యాప్‌లో వీడియో కాల్ వస్తుంది" అని ప్రభాత్ చెప్పారు.
ఆ కాల్‌కు ప్రభాత్ సమాధానం ఇవ్వలేదు.
అటువంటి కాల్స్ ఆన్సర్ చేసినప్పుడే మరింత పెద్ద ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుందని సైబర్ క్రైం మాజీ ఎస్పీ చెప్పారు. ఆయన తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో కాల్‌తో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి?
ఇటువంటి కాల్స్‌కు సమాధానం చెప్పడం వల్ల ఎటువంటి ఇబ్బందుల్లో చిక్కుకోవలసి వస్తుందో సైబర్ క్రైం మాజీ ఎస్పీ బీబీసీకి వివరించారు.
"వాట్సాప్ ద్వారా కాల్ చేసే వ్యక్తులు సాధారణంగా డీయాక్టివేటెడ్ అకౌంట్ నంబర్లను సేకరించి వాటిని తాత్కాలికంగా వాడుతూ ఉంటారు"
"వాట్సాప్ ద్వారా సదరు వ్యక్తులు వీడియో రికార్డింగ్‌తో ఉండే ఒక కాల్ చేస్తారు. అది న్యూడ్ కాల్. ఇవతలి వ్యక్తి కాల్ తీయగానే, వాటి స్క్రీన్ షాట్లు తీసి డబ్బులు పంపకపోతే అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేస్తామని, లేదా ఆ వీడియోను సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో షేర్ చేస్తామని బెదిరించడం మొదలుపెడతారు".
"దీంతో, సదరు వ్యక్తి ట్రాప్‌లో చిక్కుకుని, భయంతో అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యేవరకు పంపుతూనే ఉంటారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను తీయకుండా ఉండటం మంచిది. వయసులో పెద్దవారు కూడా ఇటువంటి ట్రాప్స్‌లో చిక్కుకుంటూ ఉంటారని" పోలీసు అధికారి చెప్పారు.
అలా బ్లాక్ మెయిల్ చేయగానే, ముందుగా ఆ నంబర్లను బ్లాక్ చేయడం ముఖ్యమని సూచించారు. తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఇలా బెదిరింపులు వస్తున్నట్లు ఒక అలెర్ట్ పోస్ట్ కూడా పెట్టవచ్చని చెప్పారు.
"ఆ సమయంలో స్నేహితులకు చెప్పడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తే, ఆ నంబర్ల గురించి వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది" అని ఆయన వివరించారు.
"వాట్సాప్ కాల్స్ ఆధారంగా నిందితులను పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సాధారణంగా ఆ సిమ్ కార్డులు వారి పేర్లపై ఉండవు. తీరా ఆ నంబర్‌కు చెందిన వ్యక్తి మరొక రాష్ట్రంలో ఉంటారు. ఆ సిమ్ కార్డు తీసివేసి, మరొక నంబర్ మార్చేస్తే, ఆ మనిషిని పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు" అని తెలిపారు.
కానీ, సంఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు ఇవ్వడంతో పాటు, పోలీసులు, వాట్సాప్ కూడా సత్వరమే స్పందిస్తే, కొంత వరకు సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది" అని ఆయన అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
'పరువు పోతుందని చాలామంది ఫిర్యాదు చేయరు'
కానీ, పరువు పోతుందేమోననే భయంతో చాలా మంది ఫిర్యాదు చేయరు.
"ఇలాంటి పని చేశావని నిందించటం లేదా, తప్పు చేసినవారిలా చూస్తారనే భయంతో ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేయరు" అని ప్రభాత్ అన్నారు. ఆయన కూడా తనకు ఎదురైన అనుభవం గురించి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
కానీ, సదరు వ్యక్తులు తనను వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి ఒక వారం రోజుల పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉన్నారని, కానీ, తాను మాత్రం తెలిసిన పోలీసు అధికారులకు వివరాలు తెలియచేసి నంబర్లను బ్లాక్ చేసినట్లు చెప్పారు.
"నిజంగానే ఫిర్యాదు చేస్తారేమోనని కొన్ని రోజుల పాటు భయంతో వణికిపోయాను. ఆ మానసిక వేదన ఎవరితోనూ చెప్పుకోలేనిది" అని అన్నారు.
ఫిర్యాదు చేయకపోవడంతో, నేరస్థుల ఆగడాలు కొనసాగుతూనే ఉంటాయి. ఫోన్ నంబర్లు కూడా తరచుగా మార్చేస్తుంటారు. అకౌంట్లో పడిన డబ్బులను వెంటనే విత్ డ్రా చేస్తారని పోలీసు అధికారి అన్నారు.
ఇటువంటి ఆన్‌లైన్ యాప్‌లు, సైట్లు గురించి అప్రమత్తంగా ఉండటం తప్ప, రహస్యంగా చోటు చేసుకునే కార్యకలాపాలను నిరోధించడం చాలా కష్టసాధ్యమైన పని అని అన్నారు.
ఇటీవల నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వరుసగా ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భరత్‌పూర్ నుంచి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిందితులను పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆరేడు నెలల్లో ఈ నిందితులు సుమారు రూ. 25 కోట్లను వసూలు చేశారు.
వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుతున్నది అమ్మాయిలే కాదని, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
"కొంత మంది నేరస్థులు మ్యాట్రిమోనియల్ సైట్ల నుంచి కూడా నంబర్లను సేకరించి, పెళ్లి పేరుతో న్యూడ్ కాల్స్ ట్రాప్‌లో పడేస్తూ ఉంటారు" అని పోలీసు అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిందితులు పట్టుబడితే శిక్ష ఏంటి?
"సాధారణంగా సైబర్ నేరాలకు మూడేళ్ళ వరకు శిక్ష విధించవచ్చు. కానీ, చట్టాలు కఠినంగా లేకపోవడంతో వారికి శిక్షలు కూడా పూర్తిగా పడవు. ఒక వేళ జైలులో కొంత కాలం గడిపినా కూడా బయటకు వచ్చిన తర్వాత తిరిగి అవే పనులను మొదలుపెడతారు. సమాజం అంటే భయం లేకపోవడం, ప్రత్యామ్న్యాయ ఉపాధి చేపట్టలేకపోవడం కూడా దీనికొక కారణం" అని సైబర్ క్రైం మాజీ ఎస్పీ అన్నారు.
"సైబర్ నేరాలను నిరూపించడం కూడా కష్టమే. ఒకే కేసుపై నిరంతరం దృష్టి పెట్టడం కూడా కష్టమే" అని అన్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంచనాల ప్రకారం 2020లో 50,035 సైబర్ కేసులు నమోదయ్యాయి. అందులో 60.2% కేసులు మోసాలకు సంబంధించినవి కాగా, 6.6% లైంగిక వేధింపులకు సంబంధించినవి, 4.9% దోపిడీకి సంబంధించినవి.
"మనుషుల్లో లైంగిక వాంఛల కోసం అడ్రెనలిన్ రష్ ఉన్నంతకాలం వీటిని నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చు. ఈ సైట్లను నిర్వహించే వారి కార్యకలాపాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. సైబర్ నేరాల పట్ల అవగాహనతో పాటు మానసికంగా స్థైర్యంగా ఉండేందుకు కల్పించాల్సిన అవగాహనే ముఖ్యం" అని ప్రభాత్ అంటారు.
"టెక్నాలజీని ఒక మాస్టర్‌లా వాడాలి కానీ, బానిసలా కాదు" అని అన్నారు పోలీసు అధికారి.
ఇవి కూడా చదవండి:
- బాయ్‌ఫ్రెండ్ ఆమె కొడుకుని చంపేశాడు.. కానీ, ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు?
- నిరుద్యోగం: ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోందా.. గణాంకాలు ఏం చెబుతున్నాయి..
- ‘మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. తల దించుకున్నంత పని అయింది’ - కేసీఆర్
- మొక్కల వ్యర్థాలు చేపలకు ఆహారం.. చేపల వ్యర్థాలు మొక్కలకు ఆహారం.. వృధా ఆహారాన్ని ఉపయోగించుకోవటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













