Cyber Crimes: న్యూడ్ చాట్‌లకు ఆహ్వానిస్తారు.. వీడియోలు తీసి బెదిరిస్తారు.. సైబర్ నేరస్థులు కొత్త టెక్నాలజీలు ఎలా నేర్చుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సైబర్ క్రైం కేసులు చేధించే తెలంగాణ పోలీసులకు విస్తు గొలిపే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎవరో బాగా టెక్నాలజీ తెలిసిన వాళ్లు ఇతరులను మోసం చేయడం ఒకప్పటి సైబర్ క్రైం టెక్నిక్.
కానీ ఇప్పుడు ట్రెండ్ అది కాదు. చదువుతో, ప్రాంతంతో సంబంధం లేకుండా పల్లెల నుంచే పెద్ద పెద్ద నెట్‌వర్క్ నడిపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీళ్లు ఒక్కొక్కరుగానే కాదు, కొంత మంది టీమ్‌లుగా ఏర్పడి ఇదే పని చేస్తున్నారు.
ఇటీవల కొన్ని సైబర్ క్రైం నేరాలతో సంబంధం ఉన్న వారిని అరెస్టుచేసే క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కనుగొన్నారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు.
జార్ఖండ్ రాష్ట్రం దేవగఢ్ జిల్లాలో ఇలాంటి సైబర్ నేరస్థుల అడ్డాలు కొన్ని ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే అక్కడకు వెళ్లిన రాచకొండ పోలీసుల బృందం అక్కడ వేర్వేరు కేసులు ఎదుర్కుంటొన్న 10 మంది సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ తీసుకువచ్చింది.

ఫొటో సోర్స్, RACHAKONDA PC
20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వీరంతా రకరకాల నేపథ్యాలు, గ్రామాల నుంచి వచ్చినా, అందరిదీ ఒకే జిల్లా. జమీల్ అన్సారీ, బర్జహాన్ అన్సారీ, అఖ్లక్ హుస్సేన్, సర్ఫరాజ్ అన్సారీ, సిరాజ్ అన్సారీ, సుశీల్ మండల్, సునీ కుమార్, శేఖర్ కుమార్, వినోద్ దాస్, రాంచరణ్ దాస్ అనే 10 మందినీ రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి ప్రత్యేకత ఏంటంటే నేరం చేసిన విధానాలు, అందులో కొత్త కొత్త పద్ధతులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తాము నేర్చుకున్న కొత్త పద్ధతులను ఇతరులకు నేర్పుతారు.
టెక్నాలజీ విషయంలో ఒకరికొకరు సహకరించుకుంటారు. అలా సహకరిస్తూ సైబర్ దొంగతనాల సంఖ్య, దోచే మొత్తాన్ని పెంచేస్తున్నారు. ముఖ్యంగా నకిలీ ఐడీలతో భారీ ఎత్తున సిమ్ కార్డులు కొనడంతో వీరి పని మొదలవుతుంది.
జార్ఖండ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో సిమ్ కార్డులు ఒకేసారి కొంటారు. పని అయిపోయాక ఆ సిమ్ కార్డులు పక్కన పడేస్తారు.

ఫొటో సోర్స్, Telangana state police
కష్టమర్ కేర్ తరహా మోసం
తాము తీసుకున్న నంబర్లను ఇంటర్నెట్లో కష్టమర్ కేర్ నంబర్లుగా అప్‌డేట్ చేస్తారు. జనం తరచూ వాడుతూ డబ్బు చెల్లింపుల్లో ఆలస్యం అవడం, లేదా రెండు మూడు రోజులు డబ్బు ఇరుక్కునే యాప్స్‌ని, షాపింగ్ సైట్స్‌నీ వీరు లక్ష్యంగా చేసుకుంటారు.
ఉదాహరణకు గూగుల్ పే, ఫోన్ పే, లేదా ఇతర ఈ కామర్స్ వెబ్‌సైట్లలో చాలా మందికి అప్పుడప్పడు డబ్బు స్ట్రక్ అయిపోతుంది. దీంతో వారు వెంటనే కష్టమర్ కేర్‌ని సంప్రదించాలనుకుంటారు. అప్పటికే ఆ కంపెనీల కష్టమర్ కేర్ల నంబర్లు ఇవే అంటూ కొన్ని నకిలీ నంబర్లను ఇంటర్నెట్లో సైబర్ నేరస్థులు ప్రచారంలో పెడతారు.
దీంతో గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఆ నకిలీ నంబర్లే కష్టమర్ కేర్ నంబర్లుగా చూసే వారికి కనిపిస్తాయి. దాన్ని సరిగ్గా గమనించకుండా ఆ నంబర్లకు కాల్ చేస్తే, అప్పుడు మొదలౌతుంది అసలు కథ.
అలా ఫోన్ చేసిన వారికి మాయ మాటలు చెప్తారు. తాము కష్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లమని కబుర్లు చెప్తారు. వారి డబ్బు వెనక్కు ఇచ్చే క్రమంలో లేదా సమస్యను పరిష్కరించే క్రమంలో వారికి కొన్ని నోటిఫికేషన్లు పంపి వాటిని క్లిక్ చేయమంటారు. లేదా వారి ఒరిజినల్ గూగుల్ పే, ఫోన్ పే నంబర్లు, యూపీఐ పిన్ నంబర్లూ తీసుకుంటారు. అప్పుడు వారి యాప్స్ ఓపెన్ చేసి తమ పర్సనల్ వివరాలు ఎంటర్ చేయమని చెప్పి అదే పద్ధతిలో తమ ఎక్కౌంట్లోకి డబ్బులు వేయించుకుంటారు. కొందరి విషయంలో ఒక అడుగు ముందు కేసి టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్ వంటి ప్రోగ్రాంల సాయంతో అవతలి వారి స్క్రీన్‌పై కంట్రోల్ తీసుకుంటారు. అక్కడి నుంచి వారి ద్వారా పిన్ నంబర్ ఎంటర్ చేయించి, లేదా ఓటీపీ చూసి, డబ్బు ట్రాన్సఫర్ చేయిస్తారు. అలా దొంగిలించిన డబ్బును ఒక ఎక్కౌంట్లో ఉంచకుండా తమవి, తమ వాళ్లవీ కలపి ముందే సిద్ధం చేసిన కొన్ని ఈ కామర్స్ సైట్ల వాలెట్లలోనూ, ఇతరత్రా బ్యాంకు ఎక్కౌంట్లలోనూ దాస్తారు. తరువాత వాటిని చిన్న మొత్తాలుగా పంచుకుంటారు. వాడుకున్న ఎక్కౌంట్లకు దోచుకున్న సొమ్ములో కొంత వాటా ఇస్తారు.

ఫొటో సోర్స్, Telangana state police
కేవైసీ మోసం
మీ కేవైసీ రద్దు అయింది లేదా బ్లాక్ అయింది. దీని వల్ల మీ బ్యాంకు ఎక్కౌంట్ పని చేయదు. లేదా మీ సిమ్ కార్డుకు సర్వీసులు ఆగిపోతాయి. వెంటనే మీ కేవైసీ లేదా పాన్ కార్డు అప్డేట్ చేయండి అంటూ మెసేజీలు పెడతారు. అక్కడ నుంచి మీ వివరాలు ఫలానా నంబరుకు పంపండి అప్‌డేట్ చేస్తాం అని చెబుతారు. అందుకోసం బ్యాంకు సైట్లో లాగిన్ అవ్వమంటారు. అందుకోసం సదరు బ్యాంకు ఆన్‌లైన్ పోర్టల్ లా కనిపించే నకిలీ పేజీ సృష్టిస్తారు. వారు పంపిన నకిలీ పేజీలో మన నెట్ బ్యాంకింగ్ వివరాలు ఎంటర్ చేయడంతో ఆ వివరాలు వారికి చేరతాయి. తరవాత ఓటీపీ లేదా స్క్రీన్ కంట్రోల్ ద్వారా మోసం చేస్తారు. కొన్ని సందర్భాల్లో కేవలం పాస్వర్డ్ ద్వారా కూడా మోసం చేయవచ్చు.
న్యూడ్ చాట్
కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపైనా, ఇతర డేటింగ్ వెబ్‌సైట్లలోనూ న్యూడ్ గాళ్స్, న్యూడ్ చాట్ అని యాడ్స్ పెడతారు. ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ముందే సిద్ధం చేసిన వ్యక్తి చేత చాటింగ్ లేదా వీడియో చాటింగ్ చేయిస్తారు. చాటింగ్ పూర్తయిన వెంటనే ఈ చాటింగ్ అంతా రికార్డ్ అయింది. మీరు డబ్బు ఇవ్వకపోతే దాన్ని నెట్లో అప్లోడ్ చేస్తాం లేదా మీ సోషల్ మీడియా ఎక్కౌంట్లలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరించి డబ్బ వసూలు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరుద్యోగులకు ఎర
నిరుద్యోగులను కూడా వదలరు వీరు. ఉద్యోగాలు భర్తీ అంటూ భారీ ఎత్తున యాడ్స్, మెసేజీలు పెడతారు. వేర్వేరు వెబ్ సైట్లలో ఉద్యోగాల కోసం రిజిష్టర్ అయిన నంబర్లను సేకరించి నోటిఫికేషన్లు పంపుతారు. ఒకవేళ అవతలి వ్యక్తి స్పందిస్తే అంతే సంగతులు, మీకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది, ఫార్మాలిటీ చార్జీల కింద డబ్బులు పంపాలంటూ ఒత్తిడి చేస్తారు.
గవర్నమెంటు పథకాలు ఇప్పిస్తామని కూడా మోసం చేస్తారు.
‘‘ఈ బృందం కేవలం హైదరాబాదే కాదు, ఆంధ్ర తెలంగాణలతో పాటూ దేశమంతా ఈ బృందంలోని వ్యక్తులు మోసాలు చేశారు. ఒక నేరం చేసిన వెంటనే ఆ సిమ్ కార్డు మార్చేస్తారు. పోలీసుల నుంచి తప్పించుకోవడాని కొన్ని సందర్భాల్లో ఫోన్ డివైజ్ కూడా మార్చేస్తారు. కొందరు ఆ రాష్ట్ర స్థానిక పోలీసు అధికారులతో కుమ్మక్కయి కూడా తప్పించుకుంటూ ఉంటారు వీరు.’’ అంటూ బీబీసీకి చెప్పారు రాచకొండ పోలీస్ అధికారి ఒకరు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతోన్న సైబర్ నేరాలు
ఏటేటా నమోదవుతోన్న సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. నిజంగా నేరాలు పెరగడం ఒకవైపు, జనాల్లో అవగాహన పెరిగి ఫిర్యాదులు చేయడం కూడా దీనికి కారణం అని చెబుతున్నారు పోలీసు అధికారులు. అంతేకాదు, వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా రికార్డు పెరగడానికి కారణమే. సైబర్ నేరాల్లో ఎక్కువ భాగం ఆర్థిక నేరాలే ఉంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై వేధింపులు, ఇతరత్రా వేధింపులు తరువాతి స్థానంలో ఉంటాయి.
2020వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50 వేల 35 సైబర్ నేరాలు నమోదు కాగా, 2019 తో పోలిస్తే 11.8 శాతం పెరిగాయి. 2020లో నమోదయిన సైబర్ నేరాల్లో 60 శాతం నగదు మోసాలకు సంబంధించినవే.
2020వ సంవత్సరంలో ఆంద్రలో 1899 సైబర్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 5024 నమోదయ్యాయి. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్లో 2553 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ విషయంలో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. 8892 కేసులతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Telangana state police
ఇలాంటి వారి బారిన పడకూడదంటే.. రాచకొండ పోలీసుల సలహా
- తెలియని ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్, మెసేజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- బ్యాంకు సిబ్బంది, కష్టమర్ కేర్ సిబ్బందిమి అని చెప్పినా కానీ క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వకూడదు.
- వేరే వాళ్లు ఫోన్ చేసి, మెసేజీ చేసి పంపిన లింక్స్ లో మీ కార్డుల వివరాలు, నెట్ బ్యాంకింగ్ వివరాలు ఎంటర్ చేయకూడదు.
- టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్ వంటివి ఇన్‌స్టాల్ చేయకూడదు.
- గుర్తు తెలియని లింకులు ఓపెన్ చేయవద్దు.
- క్యూఆర్ కోడ్ నుంచి డబ్బు తీసుకోవడానికీ, తెలియని లింకులు ఓపెన్ చేసినప్పుడూ యూపీఐ పిన్ ఎంటర్ చేయవద్దు. క్యూఆర్ కోడ్ లు స్కాన్ చేసేప్పుడు కూడా జాగ్రత్త.
- గూగుల్ సెర్చ్ లో కనిపించే నకిలీ కష్టమర్ కేర్ నంబర్ల పట్ల జాగ్రత్త
- ఆన్‌లైన్ ఎక్కౌంట్లకు పాస్‌వర్డ్‌తో పాటూ ఓటీపీ కలిపి వాడాలి – డబుల్ సెక్యూరిటీ.
- స్టాండర్డ్ రూల్: ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పకూడదు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 మూలం ఎక్కడ? తేల్చడానికి ‘ఇదే చివరి అవకాశం’ - ప్రపంచ ఆరోగ్య సంస్థ
- ఉత్తర, దక్షిణ కొరియా క్షిపణుల రేస్.. ఈ రెండు దేశాలూ ఆయుధాలను ఎందుకు పెంచుకుంటున్నాయి?
- అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉప రాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం, ధీటుగా బదులిచ్చిన భారత్
- ‘టాటా’కు ఎయిర్ ఇండియా భారమా? లాభదాయక బేరమా
- రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా: ఈ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ ఎందుకంత ప్రత్యేకం
- నాగచైతన్యతో విడాకులు.. సమంతపైనే రూమర్లు, విమర్శలు ఎందుకు? వివాహ బంధాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా మహిళదేనా?
- ఇంటర్నెట్ ఎందుకు తరచూ మొరాయిస్తోంది, ఇలా జరక్కుండా ఏం చేయాలి
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- వీర్ సావర్కర్‌కు ఆంగ్లేయులు నెలకు 60 రూపాయల పెన్షన్ ఎందుకు ఇచ్చేవారు? బ్రిటిషర్లతో ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












