కేరళ: సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెడితే జైలు శిక్ష తప్పదా... షేర్, లైక్, కామెంట్ చేసినా నేరమేనా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు చేస్తే జైలు శిక్ష విధించేలా పోలీసు చట్టానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ చట్టంలో 118 (ఏ) అనే కొత్త నిబంధనను చేర్చి ఆర్డినెన్సును ప్రవేశ పెట్టింది. ఈ ఆర్డినెన్సుకు కేరళ గవర్నరు మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ శుక్రవారం ఆమోదం తెలిపారు.
ఎవరినైనా అవమానపరుస్తూ, లేదా అవమాన పరిచే ఉద్దేశంతో కానీ, లేదా బెదిరింపులతో పోస్టులు చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా 10,000 రూపాయిల జరిమానా లేదా రెండూ కలిపి విధించాలని ఆర్డినెన్సు చెబుతోంది.
అంటే, ఏదైనా సోషల్ మీడియా పోస్టును అవమానకరంగా కానీ, పరువు నష్టం కలిగించే విధంగా రాసిన వారికి మాత్రమే కాకుండా ఆ పోస్టును షేర్ చేసినా ఆ పోస్టు పై వ్యాఖ్యానించినా ఇదే శిక్షను అనుభవించాల్సి వస్తుంది.
కేరళ పోలీసు చట్టంలోని ఈ కొత్త సెక్షన్‌ని సవాలు చేస్తూ కేరళలో ప్రతిపక్ష నాయకులు, బీజేపీతో సహా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళ హై కోర్టులో పిటిషన్ వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమే లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాలకు కళ్లెం వేయడానికే చట్టంలో ఈ సవరణ చేసినట్లు కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటన చేశారు.
ఈ ఆర్డినెన్సు రాజ్యాంగ, చట్ట విరుద్ధమని సౌత్ ఆసియన్ యూనివర్సిటీ లీగల్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సాయి రమణి గరిమెళ్ళ అన్నారు.
ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (1), (2) లో పొందు పరిచిన భావ ప్రకటనా స్వేచ్ఛను, వాక్స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తోందని ఆమె వివరించారు.
సమాచార చట్టంలోని సెక్షన్ 66 (ఏ) తో పాటు,కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 118 (డి)లో ప్రస్తావించిన బెదిరింపులు, ప్రమాదం, వేధించడం లాంటి పదాలను సమగ్రంగా నిర్వచించలేదని శ్రేయ సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ సెక్షన్లను కొట్టివేసింది కూడా.
ప్రస్తుతం కేరళ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త సెక్షన్ కూడా వీటిని నిర్వచించకుండా 118 (ఏ) పేరుతో కొత్త ఆర్డినెన్సును జారీ చేసిందని రమణి అన్నారు. గతంలో సుప్రీం కోర్టు కొట్టి వేసిన 118 (డి)కి ప్రస్తుతం అమలు చేసిన 118 (ఏ)కి మధ్య ఎలాంటి తేడా లేదని ఆమె అన్నారు.
అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు ఆన్‌లైన్ నేరాలను అదుపు చేయడానికి సరిపోవడం లేదని, దీని వల్ల ఎంతో మంది మహిళలు తీవ్ర వేదనకు గురయ్యారని, ఎన్నో కుటుంబాలు కూడా నాశనమైన ఉదంతాలు ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. వ్యక్తిగత గోప్యతకు సైబర్ దాడులు భంగం కలిగిస్తున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
సమాచార చట్టంలోని 66 (ఏ) ?ఏమి చెబుతోంది?
సమాచార చట్టంలోని 66(ఏ) ప్రకారం.. ఏదైనా సమాచార సాధనాన్ని ఉపయోగించి...
- ఎవరినైనా అవమానకరంగా, వేధించే విధంగా సోస్టులు, వ్యాఖ్యలు చేయకూడదు.
- ఎవరికైనా ఆగ్రహం తెప్పించేందుకు గాని, ఇబ్బంది పెట్టేందుకు గానీ, ప్రమాదం లేదా అంతరాయం కలిగించేందుకు గానీ, అవమాన పరచడానికి,. గాయపర్చడానికి గానీ, శత్రుత్వం, ద్వేషం, చెడు ఉద్దేశాలతో గానీ అసత్య సమాచారాన్ని ప్రచారం చేయకూడదు.
- ఎవరికైనా ఇబ్బంది కలిగించడానికి, ఆగ్రహం తెప్పించేందుకు, లేదా మోసం చేసి తప్పు దారి పట్టించేందుకు ఈ మెయిల్, లేదా ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా సందేశాలను పంపడం శిక్షార్హం.
ఇలాంటి నేరాలకు మూడు సంవత్సరాల జైలు శిక్ష,లేదా జరిమానా ఉంటుందని నిర్వచించింది.
ఆన్‌లైన్ కమ్యూనికేషన్‌కి మాత్రమే పరిమితమైన ఈ సెక్షన్‌ని పక్కన పెట్టేయాలని సుప్రీం కోర్టు సూచించింది.
కానీ, కేరళ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన పోలీసు చట్టంలోని 118 (ఏ) అన్ని రకాల కమ్యూనికేషన్ సాధనాలకూ వర్తిస్తుంది. ఇది ఆన్‌లైన్‌కి మాత్రమే పరిమితం కాదు.

సమాచార చట్టంలోని 66 (ఏ)నే కేరళ ప్రభుత్వం 118 (ఏ) అనే పేరుతో కొత్త సీసాలో అమర్చి ప్రవేశపెట్టిందని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఈ చట్టాన్ని ఉల్లఘించిన వారికి 5 సంవత్సరాలు జైలు శిక్షను విధించాలనే నియమం చాలా కఠినమైనదని, ఇది సమంజసం కాదని బెన్నెట్ లా కళాశాల ప్రొఫెసర్, మాజీ సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ చెప్పారు.
నేర పూరితమైన బెదిరింపులు, అవమానపర్చడం, పరువు నష్టానికి సంబంధించిన నేరాల గురించి భారత శిక్షా స్మృతిలో ఉండగా, పోలీసు చట్టంలో సవరణ తీసుకుని రావల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
"దీన్ని ఎవరైనా దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఈ సవరణలో పేర్కొన్న నేరపూరిత చర్యలకు నిర్వచనం ఇవ్వకుండా అమలు చేయడం సరైనది కాదు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలి" అని ఆయన అన్నారు.
అయితే ఈ కొత్త సవరణ ద్వారా ప్రజలు చిన్న చిన్న వాగ్వివాదాలలో కూడా ఒకరి పై ఒకరు కేసులు వేసుకునే అవకాశం ఉందని అనివర్ అరవింద్ అనే పబ్లిక్ ఇంటరెస్ట్ టెక్నాలజిస్ట్ ట్వీట్ చేశారు.
"ఇది కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాదు. ఈ చట్టం అమలులోకి వస్తే సోషల్ మీడియాలో చేసే మతపరమైన వ్యాఖ్యలు, లైకులు, బ్లాకులు, ఒకరి నొకరు అన్ ఫ్రెండ్ చేసుకోవడం వంటివి కూడా పోలీసు స్టేషన్లలో తేల్చుకునే పరిస్థితి వస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయని, వీటిని నిర్వహించడం న్యాయ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, పోలీసులకు ఎవరినైనా అరెస్టు చేయాలంటే వారంట్ కూడా అవసరం ఉండదని వ్యాఖ్యానించారు.
ఈ కొత్త సవరణ పోలీసులకు అపరిమిత అధికారాలను ఇస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఆన్‌లైన్‌లో దుష్ప్రచారాలు కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా దారి తీసిన ఘటనలు ఉన్నాయని విజయన్ చెబుతున్నారు. వీటిని చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు కూడా లేవనెత్తారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజా సవరణను తెచ్చామని ఆయన అన్నారు.
సమాజంలో అనేక వర్గాలపై ముఖ్యంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లను అవమానపరుస్తూ దాడులు జరగడంతోనే ఈ ఆర్డినెన్సును తీసుకొచ్చామని ఆయన సమర్ధించుకున్నారు.
అయితే , "పత్రికా స్వాతంత్ర్యం పేరుతో, వ్యక్తి గత స్వేచ్ఛను ఉల్లంఘించలేము. అలాగే, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించలేము. ఈ రెండిటినీ పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పోలీసు చట్టానికి తాజాగా తీసుకువచ్చిన సవరణ కూడా అంతర్జాతీయ ప్రమాణాలు, సూచనలను అనుసరించే చేశాం" అని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఒక ప్రకటన చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో రాశారు.
ముఖ్యంగా జర్నలిజం ముసుగులో కొన్ని ఆన్‌లైన్ చానెళ్లు, సోషల్ మీడియాని తప్పుగా వాడుకుంటూ కొంత మంది ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు.
అయితే, భావ ప్రకటనా స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా కఠినమైన అణిచివేసే చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కాంగ్రెస్ నాయకుడు కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, రమేష్ చెన్నిథల విమర్శించారు.

ఫొటో సోర్స్, AFP
"ఈ చట్టంలో ప్రవేశపెట్టిన కొత్త సెక్షన్ ద్వారా మీడియా నోరు మూయించాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేవారిని నోరు మూయించాలని చూస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అవినీతిని, బంధుప్రీతిని బయటపెడుతున్న మీడియా పై వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని జైలులో పెడతామని సీపీఎం సందేశాన్ని పంపిస్తోంది" అని చెన్నిథల అన్నారు.
కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులకు 5ఏళ్ల జైలు శిక్షను విధిస్తామంటూ చట్టాన్ని తేవడం చూసి దిగ్బ్రాంతికి లోనయ్యానని మాజీ కేంద్ర హోమ్ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి చిదంబరం ట్వీట్ చేశారు.
ఇలాంటి దురాగతాలను నా స్నేహితుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఎలా సమర్ధించుకుంటారని కూడా ఆయన ప్రశ్నించారు.
పత్రికా స్వేచ్ఛను, భావప్రకటన స్వాతంత్ర్యాన్ని ఈ ఆర్డినెన్సు హరిస్తుందని ప్రతిపక్షాలు, న్యాయ శాస్త్ర నిపుణులు అంటున్నారు.
''ఇది చాలా ప్రమాదకరమైన ఆర్డినెన్సు. దీంతో ప్రభుత్వానికి నిరంకుశ అధికారాలు దఖలు పడతాయి''అని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ అశ్వనీ కుమార్ వ్యాఖ్యానించారు.
అయితే, ఈ సవరణపై వెల్లువెత్తిన విమర్శలతో ప్రస్తుతానికి ఈ చట్టాన్ని నిలుపుదల చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సోమవారం ప్రకటించారు. అసెంబ్లీలో అన్ని పార్టీల సభ్యులతో చర్చించిన తరువాత దీని పై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
ఈ చట్టం నిజమైన భావ ప్రకటన స్వేచ్చకు , వాక్ స్వాతంత్ర్యానికి ముప్పు కలిగిస్తుందని, దీన్ని పునః పరిశీలించమని కేరళ ప్రభుత్వానికి ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అభ్యర్థించింది.
ఇవి కూడా చదవండి:
- 64 ఏళ్ల మిస్టరీని సోషల్ మీడియా సాయంతో ఛేదించిన ఇటలీ అధికారులు
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- కఠినమైన సవాళ్ల నడుమ ‘కమలం’ ఎలా వికసించింది
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








