ఎయిర్ ఇండియా: ‘టాటా సన్స్’కు ఈ టేకోవర్‌తో లాభమా, నష్టమా

ఎయిర్ ఇండియాను నష్టాల నుంచి బయటపడేయటం టాటా సన్స్ ముందున్న అతి పెద్ద సవాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ ఇండియాను నష్టాల నుంచి బయటపడేయటం టాటా సన్స్ ముందున్న అతి పెద్ద సవాలు
    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఉప్పు నుంచి విమానాల వరకు అన్ని వ్యాపారాలూ చేస్తారనే ప్రత్యేకతను 'టాటా గ్రూప్' మరోసారి నిలబెట్టుకుంది. ఎయిర్ ఇండియా 'మహారాజా' మస్కట్ టాటాల చేతిలోకి అధికారికంగా చేరబోతోంది.

'టాటా సన్స్' కూడా ఈ కొనుగోలు విషయంలో సంతోషంగా ఉంది. జేఆర్‌డీ టాటా స్థాపించిన ఈ సంస్థ 1953లో జాతీయం అయింది. ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా సన్స్ కొనసాగించారు.

డెబ్బైలలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతల నుంచి టాటాలు పూర్తిగా తప్పుకున్నారు. అయితే, 1993 వరకు టాటా సంస్థలోని సీనియర్ ఉద్యోగులే 'ఎయిర్ ఇండియా ఛైర్మన్‌లుగా పని చేస్తూ వచ్చారు.

1993 తర్వాతనే ఈ పోస్టుకు అధికారుల నియామకం మొదలైంది.

ఎయిర్ ఇండియా కొనుగోలును ‘‘ఒక చరిత్రాత్మక క్షణం'' అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశానికి చెందిన విమానయాన సంస్థను కొనుక్కోవడం గర్వకారణమని ఆయన అన్నారు.

''ప్రతి భారతీయుడు గర్వపడేలా ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం'' అని చంద్రశేఖరన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశంలో విమానయాన రంగానికి మార్గదర్శకుడైన జేఆర్‌డీ టాటా కుటుంబానికి ఎయిర్ ఇండియా మళ్లీ చేరడం ఆయనకు నిజమైన నివాళిగా చంద్రశేఖరన్ అభివర్ణించారు.

చేతిలో ఐటీ సంస్థ ఉండటం ఎయిర్ ఇండియా నిర్వహణలో టాటా సన్స్‌కు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేతిలో ఐటీ సంస్థ ఉండటం ఎయిర్ ఇండియా నిర్వహణలో టాటా సన్స్‌కు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.

రెండో అతిపెద్ద పౌర విమానయాన సంస్థ

ఎయిర్ ఇండియా కొనుగోలు తరువాత, 'టాటా సన్స్' చేతిలో మూడు విమానయాన సంస్థలు ఉన్నట్లయింది. 'ఎయిర్ విస్తారా' లో 'టాటా సన్స్' 'సింగపూర్ ఎయిర్‌లైన్స్' భాగస్వాములు కాగా, మలేసియాకు చెందిన 'ఎయిర్ ఏషియా'లోనూ టాటా సన్స్‌ వాటా ఉంది.

ఈ కొనుగోలు తర్వాత, 'టాటా సన్స్' భారతదేశంలో పౌర విమానయాన రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది.

మొదటి స్థానంలో 'ఇండిగో ఎయిర్‌లైన్స్' ఉంది. దేశీయ మార్కెట్‌లో ఇండిగో వాటా 57%. ఎయిర్ ఇండియా కొనుగోలుతో టాటా సన్స్ 27% మార్కెట్ వాటాను పొందుతారు.

ఎయిర్‌ ఇండియా కొనుగోలుతోనే అయిపోలేదని, 'టాటా సన్స్' ముందు కఠినమైన సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఇప్పటికే భారతదేశంలో మరో రెండు 'ఎయిర్‌లైన్స్'ను నిర్వహిస్తోంది.

''వారికి ఇప్పటికే రెండు ఉత్తమ విమానయాన సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మూడోది కొన్నారు. దాన్ని ఎలా నిర్వహించాలన్నది వారి ముందున్న మొదటి పెద్ద సవాలు'' అని సీనియర్ జర్నలిస్ట్ అశ్వినీ ఫడ్‌నిస్ బీబీసీతో అన్నారు.

''వారు ఎయిర్ ఇండియాను వరల్డ్‌ క్లాస్ సంస్థగా నడపగలరా అన్నది రెండో అతి పెద్ద సవాలు'' అన్నారు ఫడ్‌నిస్. అయితే, టాటా సన్స్ సర్వీసులు అత్యుత్తమంగా ఉంటాయన్న పేరు కూడా ఉంది.

రతన్ టాటా

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రతన్ టాటా

నష్టాల భర్తీ ఎలా ?

ఎయిర్ ఇండియాను నష్టాల నుంచి లాభాలలోకి మార్చడం కూడా పెద్ద సవాలేనని అశ్వినీ ఫడ్‌నిస్ అన్నారు.

''ఎయిర్ ఇండియా రోజుకు సగటున రూ.20 కోట్ల నష్టాన్ని చవి చూస్తోంది. ఈ కారణంగానే ప్రభుత్వం దానిని అమ్మేయాలని భావించింది. మరి టాటా సన్స్ ఆ నష్టాల నుంచి ఎలా బయటపడేస్తారన్నది చూడాలి'' అని ఫడ్‌నిస్ అన్నారు.

''ప్రభుత్వానికి భారం తగ్గింది. కానీ, టాటా సన్స్ దీన్ని సంపూర్ణంగా మార్చేయాల్సి ఉంటుంది'' అన్నారు ఫడ్‌నిస్

ఎయిర్ ఇండియా కొనుగోలు సమయంలో టాటా సన్స్‌కు ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. మొదటి సంవత్సరం ఒక్క ఉద్యోగిని కూడా తొలగించవద్దన్నది ఆ కండీషన్‌లలో ఒకటి.

ఏడాది తర్వాత తొలగించడం కాకుండా, స్వచ్ఛంద పదవీ విరమణకు ఆప్షన్ ఇవ్వాలి. దీనితోపాటు ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్ ఇండియా మహారాజా మస్కట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ ఇండియా మహారాజా మస్కట్

ప్రస్తుతం 'ఎయిర్ ఇండియా' మూడు భాగాలుగా ఉంది. ఇందులో మొదటిది 'ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్'. ఇది విదేశీ విమానాలను నడుపుతుంది.

రెండోది 'ఎయిర్ ఇండియా'. ఇది దేశీయ విమానాల బాధ్యతను చూసుకుంటుంది.

మూడోది 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్'. ఇది గల్ఫ్ దేశాలతోపాటు మరికొన్ని దేశాలకు విమానాలను నడుపుతుంది. కేరళ నుంచి నిర్వహిస్తున్నారు.

పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ చెప్పినదాని ప్రకారం ఎయిర్ ఇండియాలో 12,085మంది ఉద్యోగులుండగా, అందులో 8084 మంది పర్మినెంట్, 4,000మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 1434 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి, వీరందరినీ మెయింటెయిన్ చేయడం టాటా సన్స్‌కు సవాలే.

ఇక విమానయాన సముదాయాల నిర్వహణ కూడా పెద్ద సవాలేనని అశ్విని ఫడ్‌నిస్ అన్నారు.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

''ఈ సంవత్సరం మార్చి 31 నాటికి ఎయిర్ ఇండియాలో 107 విమానాలు ఉన్నాయి. వీటిలో ఎయిర్‌బస్, బోయింగ్‌లాంటి ఆధునిక విమానాలతోపాటు, చిన్నా పెద్దా విమానాలు ఉన్నాయి. 1971లో 'జంబో జెట్' విమానాన్ని కొనేనాటికి 'ఎయిర్ ఇండియా' టాటా సన్స్ నిర్వహణలోనే ఉంది'' అని అశ్విని ఫడ్‌నిస్ వెల్లడించారు.

దేశంలోని ఏర్‌లైన్స్‌ సంస్థలు విమానాలను అద్దెకు తీసుకుని నడుపుతున్నాయని అశ్విని ఫడ్‌నిస్ అన్నారు. దీనివల్ల ఆయా సంస్థలపై కొనుగోలు భారం ఉండదని, కేవలం అద్దె చెల్లించి మెయింటెయిన్ చేస్తే సరిపోతుందని ఫడ్‌నిస్ అన్నారు.

పెద్ద పెద్ద విమానాలైన బోయింగ్ లాంటి వాటికే నెలకు అద్దె కేవలం రెండున్నర కోట్ల వరకు ఉంటుందని, దాదాపు అన్ని విమానయాన సంస్థలు ఈ మోడల్‌ను అనుసరిస్తున్నాయని ఫడ్‌నిస్ చెప్పారు.

టాటా సన్స్‌కు ఉన్న మరో ప్రయోజనం ఏంటంటే సుమారు 1500 మంది శిక్షణ పొందిన పైలట్‌లు, 2,000మంది ఇంజినీర్లు వారికి దక్కబోతున్నారు. ఇక దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో వారికి సొంత స్లాట్‌లు ఉన్నాయి.

ఎయిర్ ఇండియా టేకోవర్ పట్ల టాటా గ్రూప్ సంతృప్తిగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ ఇండియా టేకోవర్ పట్ల టాటా గ్రూప్ సంతృప్తిగా ఉంది.

'స్లాట్' అంటే ఏంటి?

విమానాశ్రయాలలో ప్రయాణికుల సంఖ్యా, విమానాల సంఖ్యా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో 'ఎయిర్‌లైన్స్' సంస్థలు వారి విమాన సర్వీసులు సజావుగా నడవడానికి ప్రతి విమానాశ్రయంలో స్లాట్‌లను కొనుక్కుంటాయి. ఇది ఒక రకంగా స్థలాన్ని లీజుకు తీసుకోవడం.

దీని కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 'ఎయిర్ ఇండియా'కు దేశీయంగా 6200 , విదేశాలలో 900 పైగా స్లాట్‌లు ఉన్నాయి.

ఈ స్లాట్‌ల కొనుగోలు కోసం విమానయాన సంస్థల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతుందని ఫడ్‌నిస్ వెల్లడించారు. 'జెట్ ఎయిర్‌వేస్' లండన్ విమానాశ్రయంలోని తన స్లాట్‌ను 'ఎతిహాద్ ఎయిర్‌వేస్' కి కొన్ని బిలియన్ డాలర్లకు విక్రయించింది'' అని ఫడ్‌నిస్ చెప్పారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' లాంటి కంపెనీ చేతిలో ఉండటం 'టాటా సన్స్' అతి పెద్ద కలిసొచ్చే అంశం'' అని ఫడ్‌నిస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)