అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..

తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడం గర్భిణులకు శాపంగా మారింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడం గర్భిణులకు శాపంగా మారింది
    • రచయిత, ఎలైన్ జంగ్, హఫీజుల్లా మరూఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తూర్పు అఫ్గానిస్తాన్‌లో నంగర్‌హార్ ప్రాంతంలోని ఒక చిన్న ఆస్పత్రిలో రబియా ప్రసవించారు. రోజుల బిడ్డను ఒడిలో లాలిస్తూ.. "ఇది మూడోసారి నేను ఓ బిడ్డకు జన్మనివ్వడం. ఈసారి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. భయంకరమైన అనుభవాలు చవిచూశాను" అని రబియా అన్నారు.

రబియాకు కాన్పు జరిగిన ఆస్పత్రిలో కొన్ని వారాల్లోనే పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఆస్పత్రి సదుపాయన్నిటినీ కుదించేశారు. చాలా ప్రాథమికమైన వసతులు మాత్రమే ఉన్నాయి.

రబియాకు నొప్పి తగ్గడానికి, ఇతరత్రా ఎలాంటి మందులూ ఇవ్వలేదు. భోజనం కూడా పెట్టలేదు. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 43C దగ్గర ఉన్నాయి. ఆసుపత్రిలో కరంట్ లేదు. జనరేటర్లు వేయడానికి ఇంధనం లేదు.

"చెమటతో ఒళ్లు ముద్దయిపోయింది. నా ఉద్యోగ జీవితంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. చాలా బాధలు పడ్డాం. కానీ, ఇదే మా జీవితం. తాలిబన్ పాలన మొదలైన దగ్గర నుంచీ ప్రతీ పగలు, రాత్రి ఇలాగే గడుస్తోంది" అని రబియాకు కాన్పు చేసిన నర్స్ అబిదా చెప్పారు.

చీకట్లో మొబైల్ ఫోన్ లైట్ సహాయంతో, చెమటలు చిందిస్తూ రబియాకు కాన్పు చేశారు. కాన్పు తర్వాత కూడా రబియా జీవించి ఉన్నారంటే ఆమె అదృష్టవంతురాలి కిందే లెక్క.

చికిత్స సమయంలోఅవసరమైన పరికరాలను గర్భిణులు స్వయంగా కొనుక్కోవాల్సి వస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చికిత్స సమయంలోఅవసరమైన పరికరాలను గర్భిణులు స్వయంగా కొనుక్కోవాల్సి వస్తోంది

అఫ్గానిస్తాన్‌లో శిశు మరణాల రేటు, కాన్పు సమయంలో మరణించే తల్లుల సంఖ్య అత్యంత అధికంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు చెబుతున్నాయి. కాన్పు సమయంలో ప్రతీ 10,000 మహిళలకూ 638 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

గతంలో పరిస్థితులు ఇంతకన్నా ఘోరంగా ఉండేవి. అయితే, 2001లో అమెరికా దళాలు తాలిబన్లకు తరిమికొట్టిన తరువాత అఫ్గానిస్తాన్‌లో తల్లి, నవజాత శిశు సంక్షేమ పథకాలు ఊపందుకున్నాయి. ఆ ప్రయోజనాలన్నీ మళ్లీ ఇప్పుడు వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి.

"పరిస్థితులు చాలా నిరాశాజనకంగా మారుతున్నాయి. ఆ ఒత్తిడి నాకు స్పష్టంగా తెలుస్తోంది" అని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కానెం అన్నారు.

తక్షణం పరిస్థితుల్లో మార్పు రాకపోతే, మహిళలకు, బాలికలకు తగిన సౌకర్యాలు అందకపోతే, 2025 నాటికి అదనంగా 51,000 మంది తల్లులు కాన్పు సమయంలో ప్రాణాలు కోల్పోతారని, 48 లక్షల అవాంఛిత గర్భాలు, కుటుంబ నియంత్రణ సదుపాయాలు దక్కని పరిస్థితులు రెట్టింపు అవుతాయని యూఎన్ఎఫ్‌పీఏ అంచనా వేసింది.

"అఫ్గానిస్తాన్ అంతటా ప్రాథమిక ఆరోగ్య వసతులు క్షీణిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే కాన్పు సమయంలో తల్లుల మరణాల రేటు, శిశు మరణాల రేటు అనూహ్యంగా పెరిగిపోతాయి" అని పబ్లిక్ హెల్త్ చీఫ్ డాక్టర్ వాహిద్ మజ్రూహ్ అన్నారు. కిందటి నెల తాలిబాన్ కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత కూడా పదవిలో ఉన్న ఏకైక మంత్రి ఈయనే.

అఫ్గానిస్తాన్ ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి డాక్టర్ మజ్రూహ్. కానీ, ఆయన ముందున్నది ముళ్లబాట.

ఆరోగ్య వ్యవస్థకు విదేశీ సహాయం అందట్లేదు

అఫ్గానిస్తాన్ నుంచి పాశ్చాత్య దళాలు వెనుదిరిగినప్పటి నుంచీ, ఆ దేశానికి అందే విదేశీ సహాయం నిలిచిపోయింది. అఫ్గాన్ ఆరోగ్య వ్యవస్థ ఎక్కువగా విదేశీ నిధులపైనే ఆధారపడి ఉంది.

తాలిబాన్‌కు నిధులను, వైద్య సామాగ్రిని అందించడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అస్తవ్యస్తంగా మారిన కాబుల్ విమానాశ్రయానికి సామాగ్రిని పంపడం కష్టంగా మారిందని అమెరికాతో సహా విదేశీ దాతలు, డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు పేర్కొన్నాయి.

ప్రాణాలను కాపాడే మందులు, మహిళల ప్రసవానికి అవసరమైన వైద్య సామాగ్రి అందట్లేదు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తితో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.

"కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ఎలాంటి సన్నాహాలు జరగట్లేదు" అని డాక్టర్ మజ్రూహ్ చెప్పారు.

అబిదా పనిచేస్తున్న ఆసుపత్రిలో నిధుల కొరత కారణంగా అంబులెన్స్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. వాహనాల్లో ఇంధనం నింపడానికి డబ్బు లేదు.

"కొన్ని రోజుల క్రితం, ఒకామెకు విపరీతంగా నొప్పులు మొదలయ్యాయి. ప్రసవం దగ్గరపడింది. అత్యవసరంగా అంబులెన్స్ పంపమని అడిగారు. లేదని చెప్పాల్సివచ్చింది. టాక్సీ తీసుకుని ఆసుపత్రికి రమ్మని చెప్పాం. కానీ, అవి కూడా అందుబాటులో లేవు.

చివరికి ఎలాగోలా ఒక టాక్సీ దొరికింది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. కారులోనే ఆమెకు ప్రసవం జరిపోయింది. విపరీతమైన నొప్పి, ఉక్కపోత కారణంగా ఆమె స్పృహ కోల్పోయారు.

‘‘ఆమె బతుకుతారని మేం అనుకోలేదు. పుట్టిన బిడ్డ కూడా చాలా ప్రమాద స్థితిలో ఉంది. ఆ తల్లీబిడ్డలకు సరైన వైద్యం అందించేందుకు మా దగ్గర సామాగ్రి లేదు" అని అబిదా వివరించారు.

అదృష్టవశాత్తు ఇద్దరూ బతికి బయటపడ్డారు. మూడు రోజుల తరువాత తల్లి, బిడ్డ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

"వ్యవస్థతో పాట్లు పడుతూ మేము రాత్రనక పగలనక పని చేస్తున్నాం. కానీ, మాకు నిధులు కావాలి. అఫ్గాన్‌లో తాజా పరిణామాలను మినహాయించినా, ప్రతీ రెండు గంటలకు ఒక అఫ్గాన్ మహిళ కాన్పు సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు" అని డాక్టర్ కానెం అన్నారు.

అఫ్గాన్ మహిళల, బాలికల ప్రాణాలను కాపాడే అత్యవసరాలను సమకూర్చుకునేందుకు 29.2 మిలియన్ డాలర్ల నిధులు కావాలని యూఎన్ఎఫ్‌పీఏ కోరింది. కీలక వైద్య సామాగ్రి, హెల్త్‌కేర్ వస్తువులను రవాణా చేయడానికి మానవతా దృక్పథంతో సురక్షితమైన మార్గం మంజూరు చేస్తారని యూఎన్ఎఫ్‌పీఏ విశ్వాసం వ్యక్తం చేసింది.

అఫ్గానిస్తాన్‌ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక కాన్పు సమయంలో తల్లుల మరణాల రేటు, శిశు మరణాల రేట్లు పెరిగిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక కాన్పు సమయంలో తల్లుల మరణాల రేటు, శిశు మరణాల రేట్లు పెరిగిపోతున్నాయి

మహిళలపై తాలిబాన్ ఆంక్షలతో క్షీణిస్తున్న పరిస్థితులు

తాలిబాన్‌ల పాలనలో బాల్య వివాహాలు పెరిగే ప్రమాదం ఉందని, అదే జరిగితే మరణాల రేటు మరింత పెరుగుతుందని యూఎన్ఎఫ్‌పీఏ ఆందోళన వ్యక్తం చేసింది.

పేదరికం, బాలికలు విద్యకు దూరం అయిపోతారనే ఆందోళన, మిలిటెంట్లకు, బాలికలకు బలవంత వివాహాలు జరగవచ్చనే భయం సమస్యను మరింత జటిలం చేస్తోంది.

"వయసులో చిన్నవారైన తల్లుల విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది" అని డాక్టర్ కానెం తెలిపారు.

మహిళలపై తాలిబాన్ కొత్త ఆంక్షలు ఇప్పటికే ఎంతో సున్నితంగా మారిన ఆరోగ్య వ్యవస్థను మరింత దిగజారుస్తున్నాయి. అఫ్గాన్ మహిళలు నికాబ్ లేదా బుర్ఖాలు ధరించాల్సి వస్తోంది.

ఆసుపత్రుల్లో, క్లినిక్కుల్లో మహిళా రోగులకు వైద్యం అందించడానికి మహిళా వైద్యులను మాత్రమే అనుమతించాలనే ఆంక్షలు పెట్టినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఒక ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్న ఓ మహిళకు వైద్యం అందించేందుకు వెళ్లిన ఒక వైద్యుడిని తాలిబాన్‌లు చితకబాదారని ఒక ఆఫ్గాన్ నర్స్ తెలిపారు.

"ఆసుపత్రిలో వైద్యురాలు లేకపోతే, మహిళకు వైద్యం అందించే సమయంలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది వ్యక్తులు సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడు చికిత్స చేయాలి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ నర్స్ చెప్పారు.

అలాగే, మగ తోడు లేకుండా ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు రాకూడదని తాలిబాన్ నియమం విధించింది.

"నా భర్త రోజంతా పనిచేసి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు, నాతో పాటు ఆస్పత్రికి రమ్మని ఎలా అనగలను?" అని అయిదు నెలల గర్భంతో ఉన్న జర్మీనా ప్రశ్నిస్తున్నారు.

కచ్చితంగా మగతోడు ఉండాలంటే జర్మీనా లాంటి ఎందరో ముఖ్యమైన చెకప్స్‌కు హాజరు కాలేరు. అలాగే, ఎందరో మహిళా హెల్త్‌కేర్ వర్కర్లు విధులకు హాజరు కాలేరని అబిదా అన్నారు.

ప్రతీ 10,000 మంది అఫ్గాన్లకు కేవలం 4.6 మంది వైద్యులు, నర్సులు ఉన్నారని డబ్ల్యూహెచ్ఓ లెక్కలు కట్టింది. తాలిబాన్ రాకతో చాలామంది ఉద్యోగాలు మానేశారు. ఎంతోమంది విదేశాలకు పారిపోయారు. దాంతో, ఈ సంఖ్య మరింత తగ్గింది.

హెల్త్‌కేర్ రంగంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని విధులకు హాజరు కమ్మని ఆగస్టు చివర్లో తాలిబాన్ ఆదేశించినప్పటికీ, "మళ్లీ నమ్మకం ఏర్పడడానికి, ఎలాంటి ఇబ్బందులూ రావని విశ్వసించడానికి కొంత సమయం పడుతుందని" డాక్టర్ మజ్రూహ్ అన్నారు.

"ఒక్క రాత్రితో అంతా మారిపోయింది. మా పక్కింటావిడ 35 వారాల గర్భంతో ఉన్నారు. సిజేరియన్ కోసం తేదీ ఖరారు చేసుకోవాల్సి ఉంది. కానీ, ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆమె చాలా కంగారు పడ్డారు. కడుపులో బిడ్డ కదలికలు తెలియట్లేదని ఆందోళన పడ్డారు" అని గైనకాలజిస్ట్ డాక్టర్ నబిజాదా చెప్పారు.

తాలిబాన్ రాకతో డాక్టర్ నబిజాదా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేశం నుంచి పారిపోవడానికి కాబుల్ విమానాశ్రయం బయట 24 గంటలపాటు ఆందోళనతో వెయిట్ చేశారు. ఆమెతో పాటు పని చేసిన వారంతా దేశం విడిచి పారిపోయారు. కొందరు భద్రత కోసం ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే ఉండిపోయారు.

తాలిబాన్ల పాలన కారణంగా బాల్య వివాహాలు తద్వారా ప్రసవ సమయంలో మరణాలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాలిబాన్ల పాలన కారణంగా బాల్య వివాహాలు తద్వారా ప్రసవ సమయంలో మరణాలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది

హెల్త్‌కేర్ సిబ్బందికి జీతాలు లేవు, ఆసుపత్రులలో వసతులు లేవు

హెల్త్‌కేర్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందలేదు. జీతం రాకపోయినా మరో రెండు నెలలైనా పనిచేస్తానని నబిజాదా చెప్పారు.

"మా ప్రజల కోసం, నా రోగుల కోసం ఇది చేయాలనుకుంటున్నాను. కానీ నిధులు లేకపోతే మా డాక్టర్లకు, రోగులకూ కూడా కష్టమే. పాపం వారంతా చాలా పేదవారు" అని ఆమె అన్నారు.

"యుద్ధ సమయంలో దుర్భర పరిస్థితుల గురించి అఫ్గాన్లు వింటుంటారు. కానీ, కాన్పు సమయంలో నిరోధించగల మరణాల గురించి ఎవరూ మాట్లాడరు" అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లో మహిళా హక్కుల విభాగం అసోసియేట్ డైరెక్టర్ హెదర్ బార్ అభిప్రాయపడ్డారు.

మే నెలలో తాను కాబుల్ వచ్చినప్పుడు, ఒక ఆసుపత్రిలో సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం మిగతా ఖర్చులన్నీ తగ్గించేసుకున్నారని, ప్రసూతి వార్డులో ఉన్న మహిళలకు కాన్పుకు కావాల్సిన సామాగ్రిని సొంతంగా కొనుక్కోమన్నారని ఆమె తెలిపారు.

ఇది మహిళలకు చాలా ఖరీదైన, కష్టమైన వ్యవహారమని హెదర్ బార్ అన్నారు.

ఇప్పుడు మందులు, వైద్య సామాగ్రి కొరత ఏర్పడడంతో సమస్య మరింత జటిలం అవుతుంది. ప్రైవేటుగా వీటన్నిటినీ కొనుక్కోవడం చాలామంది అఫ్గాన్లకు తలకు మించిన భారం అవుతుంది.

"ఎందరో గర్భవతులు మందుల కోసం వేచి చూసి నిరాశతో వెనుదిరగడం చూశాను. ఏ వసతులూ లేని ఆసుపత్రిలో నా బిడ్డకు జన్మనివ్వడం కన్నా ఇంట్లోనే పురుడు పోసుకోవడం మేలు. కానీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి నాకు దిగులుగా ఉంది" అని జర్మీనా చెప్పారు.

అఫ్గానిస్తాన్ జనాభాలో 54.5% జాతీయ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. వీరిలో చాలామంది మారుమూల ప్రాంతాలకు చెందినవారు.

"మేం విపత్కర ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం" అని డాక్టర్ లోదీ అన్నారు. ఆయన మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సహాయం అందిస్తారు.

తాలిబాన్ రాక తరువాత పొషకాహార లోపం, రక్తహీనత, మానసిక రుగ్మతలు, ప్రసవం సమయంలో సమస్యలు గణనీయంగా పెరిగాయని డాక్టర్ లోదీ చెప్పారు.

" నాకు రక్తహీనత, పోషకాహార లోపం ఉన్నాయని తాలిబాన్ రాక ముందు డాక్టర్లు చెప్పారు. తాలిబాన్ రాకతో నా భర్త ఉపాధి కోల్పోయారు" అని గర్భవతి అయిన 28 ఏళ్ల లీనా చెప్పారు. ఆమె హెరాత్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నారు.

చేతిలో తగినంత సొమ్ము లేకపోవడంతో ఆమె డాక్టర్ చెకప్‌కు వెళ్లలేదు. ఇంతలో ఉమ్మనీరు బయటకు రావడంతో ఆసుపత్రికి వెళ్లాల్సిన అత్యవసర పరిషితి ఏరపడింది.

"నా భర్త నన్ను గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఎలాగోలా కష్టపడి నాకు కాన్పు చేశారు. కానీ, నా బిడ్డ చాలా తక్కువ బరువుతో పుట్టింది" అని లీనా చెప్పారు.

వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉపాధి లేక, డబ్బులు లేక బిడ్డను ఎలా పోషించాలో తెలియక లీనా దంపతులు సతమతమవుతున్నారు.

అఫ్గాన్ హెల్‌కేర్ వ్యవస్థ మళ్లీ పైకి లేవలేనంత క్షీణిస్తోందని అనేకమంది అఫ్గాన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భవతులు, కొత్తగా తల్లులైనవారు, పసి పాపలపై ఎక్కువ భారం పడుతోంది.

"రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. రేపు ఏం జరుగుతుందో తెలీదు" అంటూ అబిదా వాపోయారు.

(భద్రతా కారణాలతో ఇంటర్వ్యూ ఇచ్చిన వారి పేర్లను మార్చాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)