బహుభర్తృత్వాన్ని అనుమతించాలా? వద్దా? ప్రజల అభిప్రాయాలు కోరిన దక్షిణాఫ్రికా

మువుంబీ ఎండ్జాలమా ప్రతిపాదిత చట్టం దేవుడు వరమిచ్చినట్టుందని అంటున్నారు.
ఫొటో క్యాప్షన్, మువుంబీ ఎండ్జాలమా
    • రచయిత, పూజా ఛబ్రియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మువుంబీ ఎండ్జాలమాకు చిన్న వయసులో వైవాహిక సంబంధాల గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తేవి.

"మీరిద్దరూ మీ జీవితాంతం ఇలాగే కలిసుంటారా?" అని తన తల్లిదండ్రులను అడగడం ఆమెకు ఇప్పటికీ గుర్తుంది.

"మన జీవితంలో మనుషులు కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉండాలని నేను అనుకునేదాన్ని. కానీ, సినిమాల నుంచి, స్థానిక చర్చిల వరకూ అన్నీ మోనోగమీ (ఒకే పెళ్లి చేసుకోవాలని) గురించే చెబుతూ ఉండేవి. ఆ కాన్సెప్ట్ నాకు అసలు అర్థం కాలేదు"అని ఆమె చెప్పారు.

ఇప్పుడు మువుంబీకి 33 ఏళ్లు. ఆమె తనను తాను ఒక పాలీఅమొరస్ (ఒకరికి మించి ఎక్కువమందితో లైంగిక సంబంధాలు), పాన్‌సెక్సువల్ (లింగ బేధం లేకుండా లైంగిక సంబంధాలు) మహిళగా చెప్పుకుంటారు.

తనలాగే ఒకరిని మించి లైంగిక భాగస్వాములు ఉన్న వారికి దక్షిణాఫ్రికాలో ఒక సురక్షిత స్థానాన్ని సృష్టించే పనిలో ఉన్నారు.

''ప్రస్తుతం యాంకర్‌గా పనిచేసే ఒక వ్యక్తితో కలిసుంటున్నాను. మాకు పిల్లలు కూడా ఉన్నారు. నా మరో పార్టనర్‌ కూడా మమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు"

"ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కానీ, భవిష్యత్తులో నేను నా పెళ్లిని ఒకరి కంటే ఎక్కువ మందితో ఊహించుకుంటున్నాను. పాన్‌సెక్సువల్‌ అయిన నేను.. వారు ఆడా, మగా, ఏ లింగం అనేదానితో సంబంధం లేకుండా ఆకర్షణకు గురవుతుంటాను" అని మువుంబీ చెప్పారు.

డర్బన్‌లో స్వలింగ సంపర్కుల ప్రదర్శన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికాలో స్వలింగ సంపర్కుల వివాహాలు, బహుభార్యత్వం ఉంది

ఒకరికంటే ఎక్కువ మంది భర్తలున్న మహిళ

ప్రపంచంలో అత్యంత ఉదారవాద రాజ్యాంగాలున్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇక్కడ స్వలింగ వివాహాలతో పాటు పురుషులు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి కూడా అనుమతిస్తున్నారు.

ఈ దేశం ఇప్పుడు తమ వైవాహిక చట్టాలను మరింత అప్‌డేట్ చేయాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా మహిళలు ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములను కలిగుండేలా బహుభర్తృత్వాన్ని అనుమతించాలా వద్దా అనేదానిపై ప్రజల అభిప్రాయాలు అడిగింది.

దీనిపై దేశంలోని సంప్రదాయ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

"ఇది ఆఫ్రికా సంస్కృతిని నాశనం చేస్తుంది. వారికి పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి. తమ గుర్తింపు గురించి వారికి ఎలా తెలుస్తుంది. మహిళలు ఇప్పుడు పురుషుల పాత్రను తీసుకోలేరు. ఇలాంటిదెప్పుడూ వినలేదు. పురుషుల్లా ఇప్పుడు మహిళలు లొబోలా(కన్యాశుల్కం లాంటిది) చెల్లిస్తారా. మగాళ్లు తమ ఇంటిపేరు పెట్టుకోవాలని అనుకుంటున్నారా" అని ఆ దేశ వ్యాపారవేత్త, టీవీ నటుడు మూసా ఎంసెలెకూ అన్నారు. ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారు.

ఇది సమాజాన్ని నాశనం చేస్తుందని దక్షిణాఫ్రికాలో విపక్షమైన ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమాక్రటిక్ పార్టీ(ఏసీడీపీ) నేత రెవెరెండ్ కెన్నెత్ మెషో లాంటి వారు అంటున్నారు.

"ముందు ముందు నువ్వు తనతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావ్, నాతో గడపడం లేదు అనే గొడవలు కూడా వస్తాయి. ఆ ఇద్దరు మగాళ్లు కొట్టుకోవడం కూడా జరుగుతుంది" అన్నారు.

తన యాంకర్ భాగస్వామితో మువుంబి
ఫొటో క్యాప్షన్, తన యాంకర్ భాగస్వామితో మువుంబి

ప్రజల విశ్వాసాలకు విఘాతం

ఒకరికి మించి భాగస్వాములతో ఉండే మహిళలకు ఇది చాలా కీలకమైన సమయమని మువుంబీ తెలుసుకున్నారు.

"ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. చాలా మంది నమ్మకాలు దెబ్బతిన్నాయి. మగాళ్లు మాత్రం తరతరాలుగా ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలతో కలిసి బహిరంగంగా, సంతోషంగా ఉండవచ్చు. కానీ మహిళలు మాత్రం అలా చేస్తుంటే సిగ్గుపడాలా. మేం చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి" అన్నారు.

నేను 'పాలీఅమొరస్, లేదా 'పాలీ' నని మువుంబీ ఓపెన్‌గా చెప్పుకుంటారు. పాలీగా ఉండడం అంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండడం. కానీ, ఎంతమంది భాగస్వాములను ఎంచుకున్నా, వారికి మద్దతుగా, వారి పట్ల నమ్మకంతో ఉండాలి.

మువుంబీకి ప్రస్తుతం ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. వారిలో యాంకర్‌గా పనిచేసే వ్యక్తితో ఆమె ప్రస్తుతం కలిసి ఉంటున్నారు. తన మరో భాగస్వామితో ఆమె అప్పుడప్పుడూ లైంగిక ఆనందాన్ని పొందడం, రొమాంటిక్‌గా గడపడం లాంటివి చేస్తుంటారు. కానీ అతడిని కలవడం చాలా తక్కువ.

"మేం 'టేబుల్ పాలిమారీ'ని పాటిస్తాం. అంటే అది, ఒకరి భాగస్వామి గురించి మరొకరు తెలుసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మేం తప్పనిసరిగా కలిసి ఉండాల్సిన అవసరం లేదు. కానీ, నేను ఏదైనా ఓపెన్‌గానే చేయాలని అనుకుంటాను" అని ఆమె చెప్పారు.

మువుంబీ మొదట్లో తన కుటుంబానికి ఈ విషయం చెప్పడానికి భయపడ్డారు. కానీ, ఐదేళ్ల క్రితం యాంకర్ పార్టనర్‌ ఎంజూ ఎన్యామెకేలాతో బంధం బలపడగానే, ఆమె తన గురించి అమ్మానాన్నలకు చెప్పేయాలని నిర్ణయించుకున్నారు.

"నా యాంకర్ పార్టనర్ కూడ పాలీనే. అందుకే తను బయట ఇంకొకరితో ఉన్నప్పుడు చూసి, మా ఇంట్లో వాళ్లు కన్‌ఫ్యూజ్ కావడం, ఆయనతో గొడవపడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పేశా" అని ఆమె చెప్పారు.

"ఆ సమయంలోనే మా పాపకు ఐదేళ్లు వచ్చాయి. నేను ఇందులో యాక్టివ్‌గా ఉన్నాను. పాలీగామీ కోసం ప్రచారం చేస్తూ స్థానిక చానళ్లలో కూడా కనిపించేదాన్ని. వేరే వాళ్ల ద్వారా అది వాళ్లకు తెలియడం ఎందుకని నాకు అనిపించింది" అని ఆమె అన్నారు.

మువుంబీ తల్లిదండ్రులతో చివరకు సరే అనిపించుకున్నారు. కానీ, దానికి చాలా సమయం పట్టిందని చెప్పారు. యాంకర్ పార్టనర్‌తో తన నిశ్చితార్థం రోజు తల్లిదండ్రులు ఏమన్నారో కూడా గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలో యాంకర్ భాగస్వామి ఆమె తల్లిదండ్రులకు తమ సంప్రదాయం ప్రకారం 'లోబోలా' ఇచ్చాడు. అంటే అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేస్తున్నందుకు ఆమె కుటుంబానికి వరుడు డబ్బు చెల్లించడం.

"వేరే వాళ్లు ఎవరైనా వచ్చి మీ కూతురిని పెళ్లి చేసుకుంటున్నందుకు డబ్బు తీసుకోండి అంటే మేం తీసుకోవాలా వద్దా.. అని మా అమ్మానాన్నా నన్ను అడిగారు. నేను అది జరిగే అవకాశం ఉంది అన్నాను. వాళ్లకు అది ఎలా అనిపించినా, నిజం ఏంటో నేను వాళ్లకు చెప్పాలనుకున్నా" అన్నారు మువుంబీ.

దక్షిణాప్రికాలో బహుభర్తృత్వ చట్టం

ఫొటో సోర్స్, Getty Images

పితృస్వామ్యం వేళ్లూనుకుంది

దక్షిణాఫ్రికాలోని ప్రస్తుత చట్టాలు పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోడానికి అనుమతిస్తున్నాయి. దీంతో తమకూ సమానత్వం కావాలని, బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయాలని ప్రస్తుతం అక్కడ మహిళలు ఉద్యమం చేస్తున్నారు.

బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ఇప్పుడు దేశ వైవాహిక చట్టాల్లో అతిపెద్ద సవరణ జరుగుతోంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోడానికి ప్రభుత్వం ఒక పత్రం కూడా విడుదల చేసింది. బహుభర్తృత్వాన్ని కూడా తమ ప్రతిపాదనల్లో చేర్చింది.

దేశంలో ప్రస్తుతం చెల్లనివిగా చెబుతున్న హిందూ, ముస్లిం, యూదు, రస్తాఫేరియన్ వివాహాలకు కూడా చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని దేశంలో కోరుతున్నారు.

ప్రభుత్వం కొత్త చట్టాల ప్రతిపాదిన తీసుకురావడాన్ని కోరగానే దేవుడు వరమిచ్చినట్లు మువుంబీ భావిస్తున్నారు. బహుభర్తృత్వం గురించి వ్యక్తమవుతున్న ఆందోళనలు పితృస్వామ్య సమాజంలో పాతుకుపోయి ఉన్నాయన్నారు.

ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ కొల్లిస్ మచోకో కూడా బహుభర్తృత్వం విషయంలో అదే చెప్పారు.

"క్రిస్టియానిటీ, వలస పాలన వచ్చిన తర్వాత దేశంలో మహిళల పాత్ర తగ్గింది. వాళ్లకు సమాన హక్కులు లేకుండా పోయాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడిన సాధనాలలో వివాహం ఒకటి" అని ఆయన అన్నారు.

కెన్యా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియాలో కూడా ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు కలిగుండే ఆచారం ఉందని ఆయన చెప్పారు. గబాన్‌లో బహుభర్తృత్వం ఇప్పటికీ ఆచరిస్తున్నారని, అక్కడి చట్టాలు దానిని అనుమతిస్తున్నాయని చెప్పారు.

"ఇక వారికి పుట్టే పిల్లల గురించి వస్తున్న ప్రశ్న చిన్నదే. వారికి ఎంతమంది పిల్లలు పుట్టినా వారంతా ఆ కుటుంబానికి చెందినవారే అవుతారు" అన్నారు.

దక్షిణాప్రికాలో బహుభర్తృత్వ చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఇది విభిన్నమైన యుద్ధం

తన గత భాగస్వాముల్లో కొందరిలో పితృస్వామ్య భావాలు పాతుకుపోయినట్లు మువుంబీ గుర్తించారు. అప్పటి నుంచి తనలాగే పాలీ అయిన భాగస్వాములతో కలిసి ఉండడమే మంచిదని ఆమె భావించారు.

"చాలా మంది మగాళ్లు నేను పాలీ అయినప్పటికీ, నాతో కలిసుండడం బాగానే ఉంటుందని అన్నారు. కానీ, ఆ తర్వాత వారి నిజ స్వరూపం బయటపడింది" అన్నారు.

"నా లాంటి పాలీమోరీ వీలైనంత ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని చూడరు. మా మనసుకు ఎవరు నచ్చుతారో అలాంటి బంధాల కోసం వెతుక్కుంటారు" అని ఆమె చెప్పారు.

మువుంబీ తన ఇద్దరు భాగస్వాములను ఆన్ లైన్ కమ్యూనిటీ ద్వారా కలిశారు. అది దక్షిణాఫ్రికాలో పాలీ అయినవారందరినీ ఒకచోటుకు చేరుస్తోంది. బహుభర్తృత్వాన్ని చట్టబద్ధం చేయాలని దేశమంతా చర్చ మొదలవడంతో ఆమె తన యాంకర్ భాగస్వామితో కలిసి 'ఓపెన్ లవ్ ఆఫ్రికా' అనే ఒక ఆన్ లైన్ ప్లాట్‌ఫాం రూపొందిస్తున్నారు. తాము ప్రధానంగా 'ఎథికల్ నాన్-మోనోగమీ' కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆమె చెప్పారు.

"ఈ సంఘం నల్లజాతీయులకు అనుకూలంగా ఉంటుంది. కానీ, దీనిలో అందరినీ కలుపుకోవాలని, దానిని మరింత విస్తరించాలని మేం అనుకుంటున్నాం" అన్నారు మువుంబీ.

"ఇది ఒకే భాగస్వామి ఉండడాన్ని వ్యతిరేకించేవారికి ఒక బహుమతి లాంటిది. ఇప్పుడు వాళ్లు కూడా తమకు నచ్చినవారిని వెతుక్కోవచ్చని, ఆత్మవంచనతో జీవించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది.

అన్ని ఉద్యమాలనూ వ్యతిరేకించినట్లే, దీనిని వ్యతిరేకించే వారు కూడా ఎప్పుడూ ఉంటారు.

"నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ పురుషుల అంగీకారం లేకుండా మహిళలు కూడా గర్భనిరోధకాలు ఉపయోగించే హక్కు కోసం పోరాడారు. అప్పుడు అది వేరే పోరాటం, ఇప్పుడు నేను మరో రకం పోరాటం చేస్తున్నాను" అంటారు మువుంబీ.

రిపోర్టర్: పుమ్జా ఫిహ్లానీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)