BiggBoss: సరయు ఎలిమినేషన్‌కు కారణమిదే - ప్రెస్‌రివ్యూ

సరయు

ఫొటో సోర్స్, facebook/StarMaa/Sarayu

తెలుగు రియాల్టీ షో 'బిగ్ బాస్' సీజన్ 5 నుంచి సరయు ఎలిమినేట్ అయినట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.

''తక్కువ ఓట్లు వచ్చిన కారణంగానే సరయు హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్‌లు హౌస్ లోపలికి వెళ్లారు.

తొలి వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఆర్జే కాజల్, రవి, మానస్, జశ్వంత్, సరయు, హమీదా ఉన్నారు.

అయితే సరయుకి తక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున తెలిపారు.

తొలి వారంలోనే దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఆమెను ముగ్గురు నామినేట్ చేశారు'' అని ఈనాడు పేర్కొంది.

యువతి

డిగ్రీ చేశానని నమ్మించిన వరుడితో నిశ్చితార్థం రద్దు చేసుకున్న యువతి

తనకు కాబోయే భర్త డిగ్రీ పూర్తి చేయలేదని తెలిసి ఓ యువతి వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపినట్లు 'సాక్షి' కథనాన్ని ప్రచురించింది.

''ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వల్లాపురానికి చెందిన బీటెక్‌ చదువుకున్న ఓ యువతికి ఈర్లపూడిలోని భాగ్యాతండాకు చెందిన ఇక్బాల్‌తో వివాహం కుదిరింది.

ఇక్బాల్‌ డిగ్రీ చదివినట్లు చెప్పారు. ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈలోగా ఇక్బాల్‌ డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు యువతికి తెలిసింది.

దీంతో ఇక్బాల్ తనను మోసం చేశాడంటూ ఆ యువతి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా ఘర్షణలో యువతి సోదరుడు జాన్‌పాషాకు తీవ్ర గాయాలైనట్లు'' సాక్షి కథనం పేర్కొంది.

వరి

ఫొటో సోర్స్, Getty Images

ఇక నుంచి వరి వేస్తే ఉరే

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై వరి సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది.

''ఒక్క కిలో బాయిల్డ్‌ రైస్‌ను కూడా తాము కొనలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో బాయిల్డ్‌ రైసు మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరిగింది. బాయిల్డ్‌ రైస్‌ను కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన దరిమిలా ఇక వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరివేసుకోవడమే అన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు మాట్లాడుతూ. గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం, ఎఫ్‌సీఐ ద్వారా త్వరగా తీసుకోవాలని, తద్వారా వానాకాలంలో ఉత్పత్తి అయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నాట్లు 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.

GHMC

ఫొటో సోర్స్, Ghmc

లేక్ ప్లాంటేషన్‌కు జీహెచ్ఎంసీ శ్రీకారం

జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు పచ్చని అందాలతో కనువిందు చేయనున్నట్లు 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

''తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా చెరువు కట్టపై ఆహ్లాదపరిచే మొక్కలను నాటేందుకు అధికారులు సిద్ధ్దమయ్యారు.

చెరువు కట్ట, బఫర్‌ ఏరియాతో పాటు లేక్‌ చుట్టూరా విరివిగా ప్లాంటేషన్‌ పనులు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈనెల 15లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువుల సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్‌, ఎంట్రన్స్‌ ఫ్లాజా, లైటింగ్‌, చిల్డ్రన్‌ ప్లే ఏరియా, వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

వలస పక్షులను ఆకర్షించేలా బ్యూటిఫికేషన్‌, పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూలు మొక్కలు, వాకర్స్‌, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర బ్యూటిఫికేషన్‌ పనులు చేపడుతున్నట్లు'' కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)