మొహమ్మద్ అట్టా: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి విమానాన్ని ఎలా హైజాక్ చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2001 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ, సాధారణ రోజు లాగే ప్రారంభమైంది. కానీ ఉదయం 10 గంటలకల్లా ప్రపంచ చరిత్రలోనే దుర్దినంగా మారిపోయింది.
పెర్ల్ హార్బర్ తర్వాత అమెరికాపై జరిగిన ఘోరమైన ఉగ్రదాడికి 9/11 సాక్ష్యంగా నిలిచింది.
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌లోకి రెండు విమానాలు చొచ్చుకెళ్లడంతో 2606 మంది ప్రాణాలు కోల్పోయారు.
పెంటగాన్‌పై జరిగిన దాడిలో మరో 206 మంది, పెన్సిల్వేనియాలో హైజాక్ చేసిన విమానం కూలడంతో మరో 40 మంది మృత్యువాత పడ్డారు. మరణించిన మొత్తం 2,983 మంది పేర్లను న్యూయార్క్‌లో నిర్మించిన మెమోరియల్‌లో నమోదు చేశారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఇదే తొలి ఉగ్రదాడి కాదు. 2003లో దీనిపై జరిగిన దాడిలో ఆరుగురు మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
''9/11 దాడిలో 3000లకు పైగా చిన్నారులు వారి తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ దాడి జరిగిన కొన్ని నెలలకే జన్మించిన దాదాపు 100 మంది చిన్నారులు వారి తండ్రులను చూసే అవకాశమే లేదు. మృతుల సంఖ్యను పక్కనబెడితే, ఆరోజు అమెరికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తోన్న ప్రతీ అమెరికన్ ఈ దాడిలో మరణించినట్లే భావించారు. ఈ ఘటన లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపింది' అని ప్రముఖ పుస్తకం 'ద ఓన్లీ ప్లేన్ ఇన్ ద స్కై, ద ఓరల్ హిస్టరీ ఆఫ్ 9/11'లో గ్యారెట్ గ్రాఫ్ పేర్కొన్నారు.
''అమెరికన్లెవరూ ఆ ఘటన వల్ల కలిగిన షాక్‌ను ఇంకా మరిచిపోలేదు. అది వారి జ్ఞాపకాల్లో ఉండిపోయింది. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించే ప్రదేశంలో ఈ ఘటన జరిగింది' అని ఆయన రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Avid Reader Press/Simon & Schuster
అట్టా మొహమ్మద్ వీలునామా
సెప్టెంబర్ 11న పోర్ట్‌లాండ్ కంఫర్ట్ హోటల్‌లోని 233 గదిలో మొహమ్మద్ అట్టా 4 గంటలకు నిద్రలేచారు. లేవగానే అదే హోటల్‌లో ఉన్న తన సహచరుడు అబ్దుల్ అజీజ్ అల్ ఒమరీకి ఫోన్ చేశారు. షవర్ కింద స్నానం చేసి, బ్లూ షర్ట్‌తో పాటు బ్లాక్ ప్యాంట్ వేసుకున్నారు. ఆ తర్వాత 1996లో తాను రాసుకున్న వీలునామాను ల్యాప్‌టాప్‌లో తెరిచారు.

ఫొటో సోర్స్, Knopf Canada
వీలునామాలో రెండు విషయాలు వింతగా తోచాయి. ఈ విషయాన్ని ' ద సెకండ్ ప్లేన్' అనే పుస్తకంలో మార్టిన్ అమిస్ రాశారు.
''అట్టా తన వీలునామాలో, నా అంత్యక్రియల్లో ప్రజలు పెద్దగా ఏడవడం, అరవడం లాంటివి చేయకూడదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అలాంటి సందర్భంలో నేను పూర్తిగా నిశ్శబ్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నేను చనిపోయాక, నా మృతదేహానికి స్నానం చేయించేవారు కచ్చితంగా చేతికి గ్లౌజులు వేసుకోవాలి. వారు నా ప్రైవేట్ పార్ట్స్‌ను తాకకూడదు. నా అంత్యక్రియల్లో గర్భిణిలతో పాటు, శుభ్రంగా లేని ఎవరూ కూడా పాల్గొనకూడదు'' అని ఆయన వీలునామాలో రాసుకున్నారు.
కానీ ఆయన కోరుకున్నట్లుగా ఏదీ జరగలేదు. ఎందుకంటే ఆయనకు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆయన మృతదేహానికి స్నానం చేయించడం లాంటి సాంప్రదాయ ప్రక్రియలు జరగలేదు.
''అట్టా, ఆయన సహచరుడు ఇద్దరూ 5:33 గంటలకు హోటల్ రూమ్‌లను ఖాళీ చేశారు. వీసా డెబిట్ కార్డుల ద్వారా హోటల్ బిల్ చెల్లించారు. ఏటీఎమ్ నుంచి డ్రా చేసిన డబ్బులతో వాల్‌మార్ట్‌లో షాపింగ్ చేయడంతో పాటు పిజ్జా తిన్నారు. అదే రోజు ఆయన ప్రపంచ వాణిజ్య కేంద్రానికి వెళ్లినట్లు ఎఫ్‌బీఐ నమ్ముతుంది'' అని 'ఆన్ దట్ డే ద డెఫినెటివ్ టైమ్ లైన్' పుస్తకంలో విలియమ్ అర్కిన్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మెటల్ డిటెక్టర్‌లో ఏమీ దొరకలేదు
''హోటల్ నుంచి చెకౌట్ కాగానే కిరాయి తీసుకున్న నీలం రంగు నిస్సాన్ అల్టిమా కార్‌లో 7 నిమిషాల్లో అట్టా, అబ్దుల్ అజీజ్ అల్ ఒమరీ ఎయిర్‌పోర్ట్‌లోని పార్కింగ్‌కు చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయ సిబ్బంది వారి ఫొటోలు తీసుకున్నారు. 5:45 నిమిషాలకు వారిద్దరూ సెక్యూరిటీ చెకింగ్‌లను పూర్తి చేసుకున్నారు.
అప్పుడు అట్టా తన భుజానికి నలుపు రంగు బ్యాగ్‌ను, ఒమరీ చేతిలో కెమెరాతో పాటు క్యామ్‌కార్డర్ లాంటి వస్తువును తీసుకెళ్లారు. వీటిని మెటల్ డిటెక్టర్ ద్వారా పరీక్షించగా అందులో అనుమానించదగిన విషయాలేమీ బయట పడలేదు.

ఫొటో సోర్స్, Getty Images
''సరిగ్గా 6 గంటలకు వారిద్దరూ అమెరికా ఎయిర్‌వేస్ 5930 విమానంలో బోర్డింగ్ తీసుకున్నారు. 19 మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఆ విమానంలో అప్పటికి కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. విమానంలోని 9వ వరుసలో అట్టాకు సీటు కేటాయించారు. ఆ విమానం ఎక్కిన చివరి ప్రయాణికులు వారిద్దరే. 45 నిమిషాల్లో వారు బోస్టన్ లోగన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అక్కడ లాస్ ఏంజెలస్‌కు వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 (ఏఏ 11)కు మారారు. ఏఏ 11లో వారితో పాటు 81 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. సరిగ్గా 7.59 నిమిషాలకు, 767 బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌కు చెందిన ఏఏ 11 విమానం టేకాఫ్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నతనంలో అట్టా చాలా సిగ్గరి
1968 సెప్టెంబర్ 1న ఈజిప్టులోని కఫ్ర్ అల్ షేఖ్‌లో మొహమ్మద్ అట్టా జన్మించాడు. ఆయన చిన్నతనంలో చాలా బిడియంగా ఉండేవారని బంధువులు, స్నేహితులు చెబుతుంటారు.
2001 సెప్టెంబర్ 30న టైమ్ మ్యాగజీన్ ప్రచురించిన 'అట్టా'జ్ ఒడెస్సీ కథనంలో ''చిన్నతనంలో అట్టా ఎక్కువగా చెస్ ఆడుతుండేవాడు. హింసకు తావిచ్చే ఆటలకు దూరంగా ఉండేవాడు. అతను 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉంటాడు. బక్కగా ఉన్నందున అట్టాను 'బుల్‌బుల్' అని పిలిచేవాడినని ఆయన తండ్రి చెప్పినట్లు'' జాన్ క్లాడ్ రాసుకొచ్చారు.
కైరో యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత అట్టా, పై చదువుల కోసం జర్మనీలోని హామ్‌బర్గ్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తరచుగా, సుదీర్ఘ కాలం పాటు యూనివర్సిటీలో కనిపించకుండా పోయేవారు. ఎక్కడికి వెళ్లావు అని అడిగితే, హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లి వచ్చానని చెబుతుండేవారు. ఆయన తిరిగొచ్చినప్పుడల్లా గుబురు గడ్డంతో కనిపించేవారు.
ఆయన కనిపించకుండా పోయిన ఈ సమయంలోనే ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నట్లు జర్మన్ ఇంటెలిజెన్స్ వర్గాలు నమ్ముతున్నాయి.

ఫొటో సోర్స్, Harper Collins
విమానం నడపడంలో శిక్షణ
''అజ్ఞాతం నుంచి తిరిగొచ్చిన తర్వాత అట్టా కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేశారు. అప్పటికి ఆయన పాత పాస్‌పోర్ట్ గడువు ఇంకా ముగియలేదు. ఇలా చేయడం అక్కడ సాధారణమే. ఎందుకంటే పాత పాస్‌పోర్ట్‌ను ముగించడం ద్వారా, వారి గత పర్యటన వివరాలను, ఆధారాలను నాశనం చేయడం కోసమే వారు ఇలా చేస్తారు'' అని 'పర్ఫెక్ట్ సోల్జర్స్ హు దే వర్ వై దే డిడ్ ఇట్' అనే పుస్తకంలో టెరీ మెక్‌డెర్మట్ చెప్పారు.
2000 జూన్ 3న ఆయన ప్రేగ్ నుంచి ఆరు నెలల టూరిస్ట్ వీసా తీసుకొని నెవార్క్ చేరుకున్నారు. ఒక నెల లోపలే ఆయన సహచరులతో కలిసి వెనిస్‌లోని హాప్‌మన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్‌లో విమానం నడపడంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు.
నాలుగు నెలల ఈ శిక్షణ కోసం వారంతా 40 వేల డాలర్లు (రూ. 2,941,072) చెల్లించారు. డిసెంబర్ 21న అట్టాతో పాటు ఆయన సహచరుడు అల్ షెహీ పైలట్ లైసెన్స్ పొందారు.
''సెప్టెంబర్ 11 దాడికి పది రోజుల ముందు అట్టా అకౌంట్‌లో రెండుసార్లు నగదు బదిలీలు జరిగాయి. సెప్టెంబర్ 7న అట్టా ఆయన సహచరుడు అల్ షహీ, మరో వ్యక్తితో కలిసి ఆయ్‌స్టర్ బార్‌తో పాటు హాలీవుడ్ గ్రిల్‌కు వెళ్లారు. వారిలో అట్టా మాత్రమే ఆల్కహాల్‌కు దూరంగా ఉన్నారు. ఆల్కహాల్‌కు బదులుగా క్యాన్‌బెర్రీ జ్యూస్ తాగారు'' అని టైమ్ మ్యాగజీన్ కథనంలో జాన్ క్లాడ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
హైజాక్ గురించి ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన విమాన సిబ్బంది
ఏఏ11 విమానం పైకి ఎగిరిన కొన్ని నిమిషాల వరకు కూడా బోస్టన్ ఎయిర్‌రూట్ ట్రాఫిక్ నియంత్రణలోనే ఉంది. కానీ 8.13 నిమిషాల తర్వాత విమానాన్ని అదుపులోకి తీసుకున్న అట్టా, అతని సహచరుడు విమాన సిగ్నల్స్‌ను ఆపేశారు.
''ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, అట్టా కత్తిని ఉపయోగించి పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. 8.18 గంటలకు విమాన సిబ్బందిలో ఒకరైన బెట్టీ, విమానం హైజాక్‌కు గురైనట్లు అనుమానంగా ఉందని సౌత్ ఈస్ట్రన్ రిజర్వేషన్ సెంటర్, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు ఫోన్ చేసి చెప్పారు. విమానం వెనుక వైపునున్న జంప్ సీట్‌లో కూర్చొని తాను ఫోన్ మాట్లాడుతున్నట్లు బెట్టీ చెప్పారు.
25 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడిన ఆమె, తమ సందేశాలకు కాక్ పిట్ నుంచి ఎలాంటి స్పందన రావట్లేదని, బిజినెస్ క్లాస్‌లోని సీట్ నంబర్ '9బి'లో కూర్చొన్న డేనియల్ లెవిన్‌ను పొడిచేశారని చెప్పినట్లు'' విలియమ్ అర్కిన్ రాసుకొచ్చారు.
ఇజ్రాయెల్ ఆర్మీలో లెవిన్ కొన్నేళ్ల పాటు పనిచేశారు. తన ముందు కూర్చొన్న హైజాకర్‌ను ఆపే క్రమంలో వెనకున్న మరో హైజాకర్‌ను లెవిన్ గుర్తించలేకపోయారని అందరూ చెబుతుంటారు.
10బిలో కూర్చొన్న వ్యక్తి, కాక్‌పిట్‌లోకి చొరబడ్డారని బెట్టీ చెప్పారు. 8.26 గంటలకు అకస్మాత్తుగా 100 డిగ్రీల కోణంలో ప్రయాణించిన విమానం న్యూయార్క్ నగరానికి చేరుకుంది. ఆ సమయంలో విమానం కుదుపులకు లోనైనట్లు బెట్టీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
8.46 గంటలకు నార్త్ టవర్‌పై దాడి
''పైలట్ సీట్‌ను ఆక్రమించిన అట్టా, విమానంలోని ఇంటర్‌క్యామ్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులను ఉద్దేశించి మాట్లాడాలనుకున్నారు. కానీ తప్పుడు బటన్ నొక్కడంతో ఆయన సందేశం కంట్రోల్ రూమ్‌కు చేరింది. ఆ సమయంలో కూడా బెట్టీ ఫోన్‌లో సమాచారమిస్తూనే ఉన్నారు. కానీ విమాన సిబ్బందిలో ఒకరైన స్వీనే, ఫస్ట్ క్లాస్ కేటగిరీలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడం వల్లే, విమానాన్ని కిందకు దించుతున్నారని కంట్రోల్ రూమ్‌తో చెప్పినట్లు '' విలియమ్ అర్కిన్ చెప్పారు.
''విమానం వేగంగా కిందకు వస్తోంది. నీటితో పాటు కింద ఉన్న భవనాలు కూడా కనిపిస్తున్నాయి. కాసేపటికే ఆమె దేవుడా... మేం చాలా కిందకు వచ్చేశాం అని అరిచారు. ఆ వెంటనే భారీ శబ్ధం వినిపించింది. అమెరికా ఆపరేషన్ సెంటర్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయి''
''సరిగ్గా 8.46 గంటలకు ఏఏ 11 విమానం, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని నార్త్ టవర్‌కు చెందిన 93 నుంచి 99 అంతస్తుల మధ్యలోకి దూసుకెళ్లింది. దాదాపు 10 వేల గ్యాలన్ల జెట్ ఇంధనం అక్కడి కార్యాలయాలపై వెదజల్లినట్లు పడింది''

ఫొటో సోర్స్, Getty Images
అంతా అగ్నికీలలే..
ఆ సమయంలో న్యూయార్క్ అగ్నిమాపక శాఖ హెడ్, జోసెఫ్ ఫీఫర్ పక్కనే ఉన్నారు. ఆయన 'ద ఓన్లీ ప్లేన్ ఇన్ ద స్కై' రచయిత గ్యారెట్ గ్రాఫ్‌తో మాట్లాడుతూ 'మన్‌హాటన్‌లోని ఎత్తైన భవనాల కారణంగా ఎలాంటి శబ్ధాలు వినబడవు. కానీ నార్త్ టవర్‌ను విమానం ఢీకొట్టగానే పెద్ద శబ్ధం వచ్చింది. మేం అంతా అప్పుడే పైకి చూశాం'' అని ఆయన చెప్పారు.
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోన్న సార్జెంట్ మైక్ మెక్‌గోవర్న్ కూడా విమానం పేలుడు సంభవించిన సమయంలో శబ్ధాన్ని విన్నారు.
''వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఇప్పుడే 767 విమానం ఢీకొట్టింది' అని ఆయన వెంటనే రేడియో ద్వారా సందేశాన్ని పంపించారు.
ఆయన సందేశం విన్న పోలీస్ చీఫ్ జో ఎస్పోసిటో, 'ఆ విమానం 767కు చెందినదే అని నువ్వెలా చెప్పగలవు?' అని ప్రశ్నించారు.
'నేను ఒకప్పుడు 767 విమాన పైలట్‌గా పనిచేశానని' మెక్ గోవర్న్ బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సమయంలో నార్త్ టవర్‌లోని 81వ అంతస్తులో బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన ఉద్యోగి జీన్ పాటర్ ఉన్నారు. విమాన దాడి దాటికి ఆయన కుర్చిలోనుంచి కింద పడ్డారు. ''ఆ తర్వాత భవనం మొత్తం విపరీతంగా ఊగడం ప్రారంభించింది. ఎక్కడ చూసిన పొగ ఆవరించింది'' అని ఆయన చెప్పారు.
''ఒక వ్యక్తి నావైపు పరిగెత్తుకు రావడం నేను చూశాను. ఆయన ఎలా ఉన్నారంటే 'డీప్ ఫ్రై' చేసినట్లుగా అయిపోయారు. ఆయన చేతులు తెగిపోయాయి. చర్మం ఎక్కడికక్కడ ఊగిపోతుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయన 'హెల్ప్ మీ, హెల్ప్ మీ' అంటూ నా కాళ్ల దగ్గర పడిపోయారు. అక్కడే చనిపోయారు. అప్పుడు నా షర్ట్ మొత్తం రక్తసిక్తం అయిపోయింది'' అని నార్త్ టవర్ 90వ అంతస్తులోని పాస్ కన్సల్టింగ్ గ్రూప్ సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేసిన రిచర్డ్ ఐకెన్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దాడి చేసిన మరో విమానం
17 నిమిషాల తర్వాత, అంటే 9.03 గంటలకు... హైజాక్ అయిన మరో 'ఫ్లైట్ 175' వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. దీంతో 110 అంతస్థులున్న ఆ భవనం, గంటా 42 నిమిషాల్లో పూర్తిగా ధ్వంసమైంది.
మరో విమానం పెంటగాన్ భవనం పశ్చిమ భాగాన్ని ఢీకొట్టింది. దీంతో భవనంలోని కొంత భాగం కూలిపోయింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93 (యూఏ93)ను కూడా హైజాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ వారి ప్రయత్నానికి ప్రయాణికులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలోనే ఆ విమానం 10.03 గంటలకు పెన్సిల్వేనియాలో కూలిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులంతా మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్షం నుంచి కనిపించిన పొగ
ఆ సమయంలో నాటి అధ్యక్షుడు జార్జి బుష్ ఫ్లోరిడాలో ఉన్నారు. ఆయనకు ఈ వార్త తెలియగానే రాజధాని నగరం వాషింగ్టన్ డీసీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆయన భద్రతా సలహాదారు కండోలెజా రైస్... ఆయన ప్రయాణాన్ని విరమించుకొని ఫ్లోరిడాలోనే ఉండాల్సిందిగా బుష్‌కు సూచించారు.
ఆ సమయంలో భూమిపై లేని ఒకే ఒక అమెరికన్, ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ కల్బర్ట్‌సన్. అప్పుడు ఆయన అంతరిక్షంలో ఉన్నారు. ఈ ఘటన కూడా గురించి ఆయనకు ఎలాంటి సమాచారం లేనప్పటికీ, సరిగ్గా అదే రోజు ఫ్రాంక్, భూమిపై ఉన్న సెర్జెంట్ స్టీవ్ హార్ట్‌తో మాట్లాడారు. అక్కడ అంతా బాగానే ఉందా అని అడిగారు.
''భూమిపై ఉన్న వారికి ఇది మంచి రోజు కాదు'' అని హార్ట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కెనడా మీదుగా తిరుగుతోంది.
''నేను న్యూయార్క్ నగరం పైనుంచి, 400 కి.మీ దాటిన కాసేపటికే అక్కడ నల్లటి పొగ రావడాన్ని స్పష్టంగా చూశాను. నా కెమెరాను జూమ్ చేసి చూడగా, మన్‌హటన్ ప్రాంతం అంతా దట్టమైన పొగ ఆవరించి ఉంది. నా కళ్ల ముందరే రెండో టవర్ ధ్వంసమైంది. నా దేశంపై దాడి జరగడంతో చాలా భయపడ్డాను'' అని కమాండర్ ఫ్రాంక్ కల్బర్ట్‌సన్ రాసుకొచ్చారు.
''నేను రెండోసారి అమెరికా భాగం మీదుగా వచ్చినప్పుడు, అమెరికా ఎయిర్‌స్పేస్ మొత్తం నిర్మలంగా కనిపించింది. ఏ విమానం కూడా గాలిలో ఎగరలేదు. అధ్యక్షుడు జార్జి బుష్ ప్రయాణిస్తోన్న ఎయిర్‌ఫోర్స్ విమానం తప్ప మిగిలినవన్నీ నేలపైనే నిలిచిపోయాయి. ఆయన తన సలహాదారు ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా, వాషింగ్టన్ డీసీ వైపు వెళ్తున్నారు'' అని ఆయన రాశారు.








