సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో 2001, సెప్టెంబరు 11న ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసిన ఆత్మాహుతి దళ సభ్యులు న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై దాడి చేశారు.
ఈ దాడిలో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ శతాబ్దంలో ఒక్క అమెరికాకే కాకుండా మొత్తం ప్రపంచానికే అత్యంత విషాదకర ఘటనగా ఆ దాడి మిగిలిపోయింది.
లక్ష్యం ఎవరు?
తూర్పు అమెరికాలో ప్రయాణిస్తున్న నాలుగు విమానాలను హైజాకర్లు ఒకేసారి హైజాక్ చేశారు.
ఆ విమానాలను న్యూయార్క్, వాషింగ్టన్‌లోని ప్రముఖ భవనాలను కూల్చడానికి ఉపయోగించారు.
రెండు విమానాలు న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్)లోకి దూసుకెళ్లాయి.
మొదటి విమానం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8.46కు నార్త్ టవర్‌ను ఢీకొనగా, రెండో విమానం ఉదయం 9.03 నిమిషాలకు సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది.
దాంతో, ఆ భవనాల్లో మంటలు చెలరేగాయి. పై అంతస్తుల్లో ఉన్నవారు ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఆ భవనాల నుంచి వచ్చిన దట్టమైన పొగ నగరాన్నంతా కప్పేసింది.
విమానాలు భవనాలను ఢీకొట్టిన రెండు గంటల్లోనే రెండు టవర్లలోని 110 అంతస్తుల భవనాలను భారీ ధూళి మేఘాలు కమ్మేశాయి.
ఉదయం 9.37 నిమిషాలకు మూడో విమానం పెంటగాన్(అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం) పశ్చిమం వైపు భాగాన్ని ధ్వంసం చేసింది.
నాలుగో విమానం ఉదయం 10.03 నిమిషాలకు పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఆ విమానంతో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనాన్ని ఢీకొట్టాలని హైజాకర్లు ప్రణాళిక వేసినట్లు చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారెంతమంది?
హైజాకర్లు కాకుండా ఈ దాడుల్లో మొత్తం 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది న్యూయార్క్‌లో ఉంటున్నవారే.
నాలుగు విమానాల్లో ఉన్న మొత్తం 246 మంది ప్రయాణికులూ ఈ దాడుల్లో మరణించారు.
ట్విన్ టవర్స్ కూలడంతో 2,606 మంది చనిపోయారు.
పెంటగాన్ దగ్గర 125 మంది మృతిచెందారు.
రెండేళ్ళ క్రిస్టీన్ లీ హ్యాన్సన్ అనే బాలుడు ఈ దాడుల్లో మరణించిన అందరికంటే చిన్నవాడు. తల్లిదండ్రులు పీటర్, షూలతో కలిసి విమానంలో ప్రయాణిస్తూ వారితోపాటూ ప్రాణాలు కోల్పోయాడు.
మరో విమానంలో భార్యతో కలిసి ఒక వివాహానికి హాజరవడానికి వెళ్తున్న 82 ఏళ్ల రాబర్ట్ నార్టన్ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అందరిలోకీ పెద్దవారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ దాడులు జరిగే సమయానికి, ట్విన్ టవర్స్‌లో సుమారు 17,400 మంది ఉన్నారని అంచనా. ఉత్తరం వైపున్న టవర్‌లో విమానం డీకొన్న ప్రాంతానికి పైనున్న వారిలో ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు.
కానీ, సౌత్ టవర్‌లో పేలుడు జరిగిన అంతస్తుకు పైనున్నవారిలో 18 మంది మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు.
ఈ దాడుల్లో మరణించినవారిలో మరో 77 దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు.
న్యూయార్క్ నగరం అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహించే 441 మంది ఫస్ట్ రెస్పాండర్స్‌ను కోల్పోయింది.
వీరిలో కొన్నివేల మంది గాయపడగా, దాడి సమయంలో విషపూరితంగా మారిన శిథిలాల్లో పని చేసిన కొందరు అగ్నిమాపక దళ సభ్యులు తర్వాత రకరకాల వ్యాధులకు గురయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
దాడి చేసిందెవరు?
ఇస్లామిస్ట్ మిలిటెంట్ నెట్ వర్క్ అల్-ఖైదా ఈ దాడులకు అఫ్గానిస్తాన్‌లో ప్రణాళిక రూపొందించింది.
ముస్లిం దేశాల్లో యుద్ధాలకు అమెరికా, దాని మిత్ర దేశాలే కారణమని ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా ఆరోపించింది.
ఐదుగురితో ఉన్న 3 బృందాలు, నలుగురితో ఉన్న ఒక బృందం(పెన్సిల్వేనియాలో కూలిన విమానం) మొత్తం 19 మంది కలిసి ఈ హైజాక్‌లకు పాల్పడ్డాయి.
ప్రతీ బృందంలో పైలట్ శిక్షణ తీసుకున్న ఒక సభ్యుడు ఉన్నారు. వారు ఈ శిక్షణ అమెరికాలోని ఫ్లైయింగ్ స్కూళ్లలోనే తీసుకున్నారు.
వీరిలో 15 మంది హైజాకర్లు సౌదీ అరేబియాకి చెందినవారే. మిగతావారిలో ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒకరు ఈజిప్ట్, ఇంకొకరు లెబనాన్‌కు చెందినవారు ఉన్నారు.

ఫొటో సోర్స్, Jose Jimenez / Getty Images
దాడులకు అమెరికా ఎలా స్పందించింది?
ఈ దాడులు జరిగిన కొన్ని నెలలకే, అల్ ఖైదాను అంతం చేసి బిన్ లాడెన్‌ను వెతికి పట్టుకోడానికి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అఫ్గానిస్తాన్‌పై దాడిని నిర్వహించారు. దీనికి అంతర్జాతీయ కూటమి మద్దతు కూడా లభించింది.
కానీ, చివరకు 2011లో బిన్ లాడెన్ పక్కనే ఉన్న పాకిస్తాన్‌లో ఉన్నట్లు గుర్తించిన అమెరికా సేనలు, అతడిని కాల్చి చంపాయి.
ఈ దాడులకు సూత్రధారిగా చెబుతున్న ఖాలిద్ షేక్ మొహమ్మద్‌ను 2003లో పాకిస్తాన్‌లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన గ్వాంటనామో బేలో అమెరికా అధీనంలోని జైలులో ఉన్నారు. అప్పటి నుంచి ఆయన కోర్టు విచారణ కోసం ఎదురు చూస్తున్నారు.
అల్ ఖైదా ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఈ సంస్థ సబ్-సహారా ఆఫ్రికాలో అత్యంత బలమైనది. కానీ, ఈ సంస్థ సభ్యులు అఫ్గానిస్తాన్‌లో కూడా ఉన్నారు.
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అమెరికా భద్రతా బలగాలు అఫ్గానిస్తాన్ నుంచి వైదొలిగాయి.
దీంతో, ఇస్లామిస్ట్ నెట్‌వర్క్ మళ్లీ బలం పుంజుకుంటుందేమోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
9/11 మిగిల్చిన వారసత్వం
9/11 ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల్లో, విమానాల్లో భద్రతను పటిష్టం చేశారు.
అమెరికాలో విమానాశ్రయాలు, విమానాల్లో భద్రతను పెంచేందుకు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ను సృష్టించారు.
ట్విన్ టవర్స్ కూలిన ప్రాంతం(గ్రౌండ్ జీరో)ను శుభ్రం చేయడానికి 8 నెలల కంటే ఎక్కువ సమయమే పట్టింది.
ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక స్మారక భవనం, మ్యూజియం ఉంటాయి. కూలిన భవనాలను కొత్త డిజైన్‌తో తిరిగి నిర్మించారు.
నిర్మాణం పూర్తయిన వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ఫ్రీడమ్ టవర్) గతంలో కంటే ఎక్కువ ఎత్తుతో ఉంది, గతంలో నార్త్ టవర్ ఎత్తు 1368 అడుగులు కాగా, ప్రస్తుతం ఫ్రీడమ్ టవర్ ఎత్తు 1776 అడుగులు.
పెంటగాన్‌లో ధ్వంసమైన భవనాన్ని ఏడాదిలోపలే తిరగి నిర్మించారు. ఆగస్టు 2002 నాటికి ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేసుకోవడం మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










