అఫ్గానిస్తాన్: మిలిటెంట్లతో పోరాడలేక తజికిస్తాన్ పారిపోయిన అఫ్గాన్ సైనికులు

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ మిలిటెంట్లతో జరిగిన ఘర్షణల తర్వాత 1000 మందికి పైగా అఫ్గాన్ సైనికులు పొరుగున ఉన్న తజికిస్తాన్‌కు పారిపోయారు.
అఫ్గాన్ సేనలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సరిహద్దులను దాటి తమ దేశాన్ని ఆశ్రయించారని తజికిస్తాన్ బోర్డర్ గార్డ్ ప్రకటన చేసింది.
ఇటీవల కాలంలో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌లో అధిక భూభాగాన్ని ఆక్రమించుకోవడంతో పాటు దాడులను కూడా ముమ్మరం చేయడంతో, అఫ్గానిస్తాన్ లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి.
అఫ్గానిస్తాన్‌లో నాటో 20 సంవత్సరాల మిషన్ కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ దాడులు చోటు చేసుకుంటున్నాయి.
సెప్టెంబర్ 11 నాటికి దేశం నుంచి విదేశీ సేనల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావల్సి ఉంది. అయితే, ఇప్పటికే ఉపసంహరణ దాదాపు పూర్తయింది.
ఈ నేపథ్యంలో అఫ్గాన్ మిలిటరీ వ్యవస్థ కూలిపోతుందేమోననే ఆందోళన కూడా ఉంది.
అమెరికాకు, తాలిబన్లకు మధ్య జరిగిన చర్చల తర్వాత దోహా ఒప్పందం కుదిరింది.
దోహా ఒప్పందం ప్రకారం తాలిబన్ల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో అల్ ఖైదా గాని, ఇతర తీవ్రవాద సంస్థలను కూడా తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించబోమని తాలిబన్లు హామీ ఇచ్చారు.
ఇందుకు బదులుగా, అమెరికాతో సహా ఇతర నాటో అనుబంధ దేశాలు తమ సేనలను పూర్తిగా అఫ్ఘాన్ భూభాగం నుంచి ఉపసంహరించడానికి తాలిబన్లతో అంగీకారం కుదిరింది.
కానీ, తాలిబన్లు అఫ్గాన్ సేనలతో పోరాటాన్ని ఆపేందుకు మాత్రం అంగీకరించలేదు. ప్రస్తుతానికి దేశంలో మూడు వంతుల భూభాగం తాలిబన్ల ఆధీనంలోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
"కానీ, ఇది అఫ్గానిస్తాన్ ప్రజలకు ఆందోళన కలిగించే సమయం" అని బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి లైస్ డౌసెట్ అన్నారు. తాలిబన్లు మానవ హక్కులను అణచివేసి, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడి, ఇస్లామిక్ తరహా శిక్షలను సమర్ధిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
‘‘ఉదాహరణకు శిక్షలు పడిన హంతకులను బహిరంగంగా ఉరి తీయడం లాంటి చర్యలను తాలిబన్లు సమర్థిస్తారు. అలాగే, వీరు టెలివిజన్, సినిమాలు చూడటం, సంగీతం వినడాన్ని నిషేధించారు. 10 సంవత్సరాలు నిండిన పిల్లలను స్కూలుకు వెళ్లడాన్ని కూడా వీరు ఆమోదించరు" అని అఫ్గానిస్తాన్ సైనికుడు ఆమె వివరించారు.
"దేశం ఎటు వైపు ప్రయాణిస్తుందనే అంశం పై ఆ దేశ ప్రజలు చాలా అనిశ్చితితో ఉన్నారు. వారి సొంత గ్రామం, పట్టణం, నగరం గురించి మాత్రమే కాకుండా, వారి జీవితాలు, కుటుంబాల భవిష్యత్తు గురించి వారు అనిశ్చితిలో ఉన్నారు" అని లైస్ డౌసెట్ అన్నారు.
కానీ, తిరుగుబాటుదారులను అణచివేసేందుకు తగిన సామర్ధ్యం అఫ్గాన్ సేనలకుందని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అంటున్నారు.
అయితే, ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లోని చాలా మంది సైనికులు తాలిబన్లతో పోరాటాన్ని తప్పించుకునేందుకు పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లను ఆశ్రయిస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
గత మూడు రోజుల్లో అఫ్ఘాన్ సైనికులు తజికిస్తాన్ కు పారిపోవడం ఇది మూడవ సారి కాగా, గత పదిహేను రోజుల్లో ఇది అయిదవ సారి.
దీంతో, తజికిస్తాన్‌లో ఆశ్రయం పొందిన అఫ్గాన్ సైనికుల సంఖ్య సుమారు 1600 మందికి చేరింది.
"ఆదివారం రాత్రి మిలిటెంట్లతో పోరాడిన తర్వాత మరి కొంత మంది అఫ్గాన్ సైనికులు తాజాగా సోమవారం ఉదయం తజికిస్తాన్ ను ఆశ్రయించారు" అని తజికిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఒక ప్రకటనలో తెలిపినట్లు తజిక్ ప్రభుత్వ వార్తా సంస్థ ఖోవర్ ప్రచురించింది.
తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బాదక్షన్, థక్కర్ ప్రాంతాల్లో చాలా వరకు భూభాగాన్ని మిలిటంట్లు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే, పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దు దగ్గర కూడా ఒక అఫ్గాన్ సైన్యం చెక్ పోస్ట్ ను కూడా ఆధీనంలోకి తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి.
ఈ పోరాటం ఉధృత రూపం దాలిస్తే, అక్కడ నుంచి వచ్చే శరణార్ధుల రాకను తట్టుకునేందుకు అఫ్గానిస్తాన్ పొరుగు దేశాలతో పాటు మధ్య ఆసియా దేశాలు కూడా సన్నద్ధమవుతున్నాయి.
అయితే, ఇటీవల పెరిగిన హింసకు తాలిబన్లు బాధ్యులు కాదని తాలిబన్ ప్రతినిధి సుహేల్ షహీన్ బీబీసీకి చెప్పారు.
అఫ్గాన్ సైనికులు పోరాడేందుకు సిద్ధంగా లేకపోవడంతో అఫ్గానిస్తాన్‌లోని చాలా జిల్లాలు తమ ఆధీనంలోకి వచ్చాయని చెప్పారు.
అఫ్గానిస్తాన్ లో అమెరికా నేతృత్వంలో సేనలు 2001లో తాలిబన్లను అధికారం నుంచి తప్పించాయి. అమెరికాలో సెప్టెంబరు 11న జరిగిన దాడులకు వ్యూహ రచన చేసిన ఒసామా బిన్ లాడెన్, ఇతర అల్ ఖైదా నాయకులకు ఈ బృందంఆశ్రయం కల్పించడంతో అమెరికా సేనలు తాలిబన్ల పై దాడి చేసింది. కానీ, తాలిబన్లు అఫ్గాన్ భూభాగాన్ని తిరిగి ఆక్రమించుకోవడం ప్రారంభించారు.
2018లో తాలిబన్లు అమెరికాతో నేరుగా చర్చలు మొదలయ్యాయి.
విదేశీ జిహాదిస్టులు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేందుకు అఫ్గానిస్తాన్ స్థావరం కాబోదని అమెరికా సేనలు భావించిన నేపథ్యంలో తమ సేనలను ఆ దేశం నుంచి ఉపసంహరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
అఫ్గానిస్తాన్ లో 20 సంవత్సరాల పోరాటం. ఎప్పుడేమి జరిగింది?
9/11-అమెరికాపై దాడులు

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అమెరికాలోనే ఎన్నడూ జరగని రీతిలో అత్యంత భారీగా తీవ్రవాద దాడి చేసింది.
నాలుగు కమర్షియల్ ఎయిర్ లైన్లను హైజాక్ చేశారు. అందులో రెండు న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోకి దూసుకుపోయి, ఆ భవనాలను కూల్చేశాయి.
మరొకటి వాషింగ్టన్ లోని పెంటగాన్ భవనం పై దాడి చేయగా, మరొకటి పెన్సిల్వేనియాలో ఒక మైదానంలో కూలిపోయింది.
ఈ దాడిలో సుమారు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు.
అక్టోబరు 07, 2001- తొలి వైమానిక దాడులు
అమెరికా నేతృత్వంలో సేనలు అఫ్గానిస్తాన్‌లో ఉన్న తాలిబన్, అల్ ఖైదా స్థావరాల పై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో కాబూల్, కాందహార్, జలాలాబాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
అయితే, బిన్ లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబన్లు నిరాకరించారు. వారి వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలను అమెరికా సేనలు నాశనం చేశాయి.
నవంబరు 13, 2001- కాబూల్ పతనం
అమెరికా సంకీర్ణ సేనల మద్దతుతో ది నార్తర్న్ అలయన్స్ కాబూల్‌లో ప్రవేశించడంతో, తాలిబన్లు కాబూల్ విడిచిపెట్టి పారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
నవంబరు 13, 2001 నాటికి తాలిబన్లు బలహీనపడటంతో ఇతర నగరాలు కూడా వీరి చేతిలోకి వచ్చాయి.
జనవరి 26, 2004-కొత్త రాజ్యాంగం
సుదీర్ఘ చర్చల తర్వాత అఫ్గాన్ కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాంతో, అక్టోబరు 2004లో అధ్యక్ష ఎన్నికలు జరిగేందుకు రాజ్యాంగం మార్గం సుగమం చేసింది.
డిసెంబర్ 7, 2004- అఫ్గానిస్తాన్ అధ్యక్షునిగా హమీద్ కర్జాయి ఎన్నిక

ఫొటో సోర్స్, Getty Images
పోపల్ జాయ్ దుర్రాని తెగకు నాయకుడైన హమీద్ కర్జాయి కొత్త రాజ్యాంగం ప్రకారం అఫ్గానిస్తాన్ తొలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
ఆయన రెండు పదవీ కాలాల పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.
మే 2006-హెల్మండ్ ప్రాంతానికి వచ్చిన బ్రిటిష్ సేనలు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ దక్షిణ ప్రాంతంలో తాలిబన్లకు శక్తివంతంగా ఉన్న హెల్మండ్ ప్రాంతానికి బ్రిటిష్ సేనలు విచ్చేసాయి.
వారు నిజానికి అక్కడ చేపట్టే పునరుద్ధరణ ప్రాజెక్టుల సహాయార్ధం వచ్చారు. కానీ, అతి త్వరలోనే వారు పోరాటంలోకి దిగాల్సి వచ్చింది.
ఈ ఘర్షణల్లో సుమారు 450 మంది బ్రిటిష్ సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు.
ఫిబ్రవరి 17, 2009
అమెరికా అధ్యక్షుడు ఒబామా అఫ్గానిస్తాన్ కి పంపే సేనల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ఆమోదం తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక దశలో సుమారు 1,40,000 మంది అమెరికా సైనికులు అఫ్గాన్‌లో ఉండేవారు.
ఇరాక్‌లో అమెరికా అనుసరించిన వ్యూహాన్ని పోలినట్లే ఇక్కడ కూడా వారి ముఖ్య ఉద్దేశ్యం పౌరులను సంరక్షించడం, తిరుగుబాటుదారులను చంపడంగా ఉండేది.
మే 02, 2011-ఒసామా బిన్ లాడెన్ మరణం

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నేవీ పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో నిర్వహించిన దాడుల్లో అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ మరణించారు.
బిన్ లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో వదిలినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆపరేషన్‌తో సీఐఏ 10 ఏళ్ళ పాటు సాగించిన లాడెన్ వెతుకులాటకు ముగింపు పలికింది.
పాకిస్తాన్ గడ్డ పై బిన్ లాడెన్ నివసించారనే ఆరోపణలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో పాకిస్తాన్ నమ్మదగిన భాగస్వామి కాదనే అభియోగాలు వినిపించాయి.
ఏప్రిల్ 23, 2013-ముల్లా ఒమర్ మరణం

ఫొటో సోర్స్, Getty Images
తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ మరణాన్ని రెండేళ్ల పాటు రహస్యంగా దాచి పెట్టి ఉంచారు.
ముల్లా ఒమర్ పాకిస్తాన్ లోని కరాచీలో అనారోగ్యంతో మరణించినట్లు అఫ్గాన్ నిఘా సంస్థలు చెప్పాయి.
అయితే, ఈ వాదనలను పాకిస్తాన్ ఖండించింది.
డిసెంబరు 28, 2014-పోరాటాన్ని ఆపిన నాటో
అఫ్గానిస్తాన్‌లో నాటో తమ పోరాటాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించింది. తాలిబన్ల ప్రాబల్యం తగ్గడంతో అమెరికా చాలా వరకు తమ సేనలను ఉపసంహరించింది.
మిగిలిన సైనికులు చాలా వరకు అఫ్ఘాన్ భద్రతా దళాలకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే ఉన్నారు.
2015-తాలిబన్ల రాక

ఫొటో సోర్స్, Getty Images
తాలిబన్లు వరుసగా ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లు, ఇతర దాడులు చేయడం మొదలుపెట్టారు. కాబూల్ లో పార్లమెంట్ భవనం, కుందుజ్ నగరం పై దాడులు నిర్వహించారు. అఫ్గానిస్తాన్ లో ఉన్న మిలిటంట్లు కూడా తమ కార్యకలాపాలను మొదలుపెట్టారు.
జనవరి 25, 2019-మరణాలు
అష్రఫ్ ఘనీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచీ 2019 వరకు 45,000 మందికి పైగా అఫ్ఘాన్ భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారని ఆఫ్గన్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ సంఖ్య ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ.
ఫిబ్రవరి 29, 2020-తాలిబన్లతో అమెరికా ఒప్పందం
అఫ్గానిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఖతార్‌లోని దోహాలో తాలిబన్లతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. మిలిటంట్లు ఈ ఒప్పందానికి కట్టుబడిన పక్షంలో, ఈ ఒప్పందం కుదుర్చుకున్న 14 నెలల లోపు అమెరికా, నాటో అనుబంధ దేశాలు తమ సేనలను అఫ్ఘాన్ భూభాగం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అంగీకరించాయి.
సెప్టెంబర్ 11, 2021- తప్పుకున్న అమెరికా
ఈ అధికారిక గడువు లోపే అమెరికా తమ సేనలు పూర్తిగా ఉపసంహరించుకోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.
కానీ, నాటో అనుబంధ దేశాలు, అమెరికా మిలిటరీ మిషన్ కలిసి అఫ్గాన్ భూభాగంలో తీవ్రవాదాన్ని, అతివాదాన్ని అణచివేయడంలో విఫలమయ్యాయని మాజీ అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయి బీబీసీతో అన్నారు.
అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లు ఎంత త్వరగా వీలయితే, అంత త్వరగా శాంతిని నెలకొల్పేందుకు చర్చలు ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- తంత్ర యోగా పేరుతో అత్యాచారాలు, శివానంద సెంటర్ గుట్టు బయటపెట్టిన బీబీసీ
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








