మీరాబాయి చానూ: రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో విజయం వరకు

ఫొటో సోర్స్, VINCENZO PINTO/AFP/Getty Images
టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ భారత్‌కు తొలి పతకం తెచ్చిపెట్టారు. ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకం గెలిచారు.
49 కేజీల కేటగిరీలో ఆమె ఈ పతకాన్ని గెలిచారు. చైనాకు చెందిన ఝీహు హూ స్వర్ణం గెలుచుకోగా, ఇండోనేషియాకు చెందిన విండీ ఆషా కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.
2016 రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో గెలుపు వరకు మీరాబాయి ప్రయాణం మరచిపోలేనిది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ కథ వేరు..
రియో ఒలింపిక్స్‌కు వెళ్లినప్పుడు మీరాబాయి కథ పూర్తి భిన్నమైనది.
‘‘పూర్తి చేయలేకపోయారు’’ ఈ ఒక్క వాక్యం క్రీడాకారులపై చాలా ప్రభావం చూపిస్తుంది. మానసికంగానూ దెబ్బతీస్తుంది.
మీరాబాయి విషయంలో అదే జరిగింది. ఒలింపిక్స్ బోర్డుపై ‘‘డిడ్ నాట్ ఫినిష్’’అని రాయించుకున్న భారత అథ్లెట్లలో మీరాబాయి రెండోవారు.
మామూలుగా అయితే, ఆ బరువును ఆమె రోజువారీ శిక్షణల్లో భాగంగా తేలిగ్గానే ఎత్తేసేవారు. కానీ ఒలింపిక్స్‌లో ఆమె చేతులు గడ్డ కట్టుకుపోయాయి. రియోలో పోటీ జరుగుతున్నప్పుడు భారత్‌లో అది రాత్రి సమయం. కేవలం కొద్ది మంది మాత్రమే దాన్ని చూశారు.
మరుసటి రోజు ఉదయం వార్తలు చూసేసరికి, అందరి దృష్టిలో మీరాబాయి విలన్ అయిపోయారు. ఆ ప్రభావం మీరాబాయిపై చాలా పడింది. ఆమె కుంగుబాటులోకి వెళ్లిపోయారు. వారంవారం కౌన్సెలింగ్ కూడా తీసుకునేవారు.
ఆ ఓటమి తర్వాత, ఇక గేమ్స్‌కు గుడ్‌బై చెప్పాలని కూడా మీరాబాయి అనుకున్నారు. కానీ మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేశారు.
2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో 48 కేజీల విభాగంలో ఆమె స్వర్ణ పతకం సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్నం కూడా సరిగా తినలేదు..
4.11 అడుగుల ఎత్తుండే మీరాబాయి చానూ ఆరడుగుల ఎత్తుండే వారితో పోటాపోటీగా తలపడతారని ఎవరూ ఊహించరు.
2017 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తన బరువుకు నాలుగింతల ఎక్కువ బరువు, అంటే అక్షరాల 194 కేజీల బరువును ఎత్తి ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
గత 22ఏళ్లలో వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం గెలుచుకున్నది మీరాబాయినే.
తన 48 కేజీల బరువును పెరగకుండా చూసుకునేందుకు మీరాబాయి సరిగా భోజనం కూడా చేసేవారు కాదు. పోటీల వల్ల తన సొంత అక్క వివాహానికి కూడా ఆమె హాజరుకాలేకపోయారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఆమె కంటిలో కనిపించిన కన్నీళ్లు.. 2016 తర్వాత ఆమె అనుభవించిన వేదనకు అద్దంపడుతున్నాయి.

ఫొటో సోర్స్, Dean Mouhtaropoulos/Getty Images
వెదురుకర్రలతో అభ్యాసం
మణిపుర్‌లోని ఓ చిన్న గ్రామంలో 1994లో మీరాబాయి పుట్టారు. చిన్నప్పటి నుంచే ఆమె తన ప్రతిభ చూపేవారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆమె గ్రామం దాదాపు 200 కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడ సరైన సదుపాయాలు కూడా ఉండవు.
అప్పట్లో మణిపుర్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ కుంజురాణి దేవి ఒక స్టార్. ఆమె ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు.
చిన్నప్పటి నుంచీ ఆమె ప్రభావం మీరాబాయిపై ఉండేది. మీరాబాయి తల్లిదండ్రులకు ఆరుగురు పిల్లలు. వీరిలో అందరి కంటే చిన్న మీరాబాయినే. చిన్నప్పటి నుంచే తను వెయిట్ లిఫ్టర్ అవుతానని మీరాబాయి పట్టుబట్టేవారు.
మీరాబాయి పట్టుదలతో 2007లోనే అభ్యాసం మొదలుపెట్టారు. అప్పట్లో ఆమెకు బరువులు ఎత్తేందుకు ఇనుము కడ్డీలు అందుబాటులో ఉండేవికాదు. దీంతో వెదురు కర్రలతో ఆమె అభ్యాసం చేసేవారు.
ట్రైనింగ్ కోసం ఆమె 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. ఇలా బరువులు ఎత్తేవారికి పాలు, చికెన్ తప్పనిసరి. అయితే, వీటిని రోజు తీసుకువచ్చే స్థోమత మీరాబాయి కుటుంబానికి ఉండేదికాదు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు.

ఫొటో సోర్స్, VINCENZO PINTO/AFP via Getty Images
11ఏళ్ల వయసులో ఆమె అండర్ 15 ఛాంపియన్‌గా, 17ఏళ్లకు జూనియర్ ఛాంపియన్‌గా మారారు. కుంజురాణిలా తను కూడా ఛాంపియన్ కావాలని మీరాబాయి కలలు కనేవారు. వాటిని నేడు సాకారం చేసుకున్నారు కూడా.
మీరాబాయి ప్రయాణం ఏ దశలోనూ అంత సులువుగా సాగలేదు. ఆమె తల్లిదండ్రులకు సరిపడా సదుపాయాలు ఎప్పుడూ లేవు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించకపోయుంటే, ఆమె కెరియర్‌కు ముగింపు పలికుండాల్సింది.
అయితే, అలా జరగలేదు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తోపాటు గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల్లోనూ మీరాబాయి పతకాన్ని గెలుచుకున్నారు.
బరువులు ఎత్తడంతోపాటు డ్యాన్స్ అన్నా కూడా మీరాబాయికి ఇష్టమే. ‘‘ఒక్కోసారి ట్రైనింగ్ పూర్తైన తర్వాత, నా గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకుని డ్యాన్స్ వేస్తుంటా. నాకు సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం’’అని బీబీసీ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
మీరాబాయి ఒలింపిక్స్‌లో పథకం సాధించడంపై 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించిన కరణం మల్లీశ్వరి స్పందించారు.
''చాలా సంతోషంగా ఉంది. సంబరంలా అనిపిస్తోంది. 21ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ మనకు పతకం వచ్చింది. మా వెయిట్ లిఫ్టింగ్ ఫ్యామిలీ అంతా వేడుకలు చేసుకుంటున్నాం''అని మల్లీశ్వరి అన్నారు.
''మా అథ్లెట్లకు మంచి రోజులు వచ్చాయని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పతకంతో చాలామంది జూనియర్లు స్ఫూర్తి పొందుతారు.''
''ఒలింపిక్స్‌కు వెళ్లాలని ప్రతిఒక్క అథ్లెట్ కలలు కంటాడు. ఇది అంత తేలిక కాదు. ఎన్నో ఏళ్ల కృషి ఉంటుంది. ఎన్నో గాయాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రతిభను నెమ్మదిగా మెరుగుపరచుకోవాలి''అని ఆమె అన్నారు.
''మీరాబాయి బరువులు ఎత్తడాన్ని నేను జాగ్రత్తగా చూశాను. ఆమెపై అంత ఒత్తిడి ఉన్నట్లు కనిపించలేదు. చాలా విశ్వాసంతో ఆమె ముందుకు వెళ్లింది.''
''రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కల్చర్ బాగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు కూడా పిల్లలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాయి. ప్రత్యేక యూనివర్సిటీలు వస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడతాయి''అని మల్లీశ్వరి అన్నారు.
Please wait...
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- అఖిలేశ్ యాదవ్: అసదుద్దీన్ పార్టీ వల్ల నష్టం లేదు, మైనారిటీల ఓట్లు మాకే
- పాకిస్తాన్లో అఫ్గాన్ రాయబారి కుమార్తెపై దాడి, కిడ్నాప్
- ముంబయిలో భారీ వర్షాలకు ఇళ్లు కూలి 15 మంది మృతి
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
- కోవిడ్ వ్యాక్సీన్: ఆరు నెలలైనా భారత్‌లో టీకా కార్యక్రమం ఎందుకు వేగవంతం కాలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









