అఖిలేశ్ యాదవ్: అసదుద్దీన్ పార్టీ వల్ల నష్టం లేదు, మైనారిటీల ఓట్లు మాకే

అఖిలేష్ యాదవ
    • రచయిత, ముకేశ్ శర్మ
    • హోదా, ఇండియా డిజిటల్ ఎడిటర్, బీబీసీ న్యూస్

వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు శివపాల్ సింగ్ యాదవ్‌ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోడానికి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) సిద్ధమవుతోంది.

సమాజ్‌వాది పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము రైతుల కోసం ఉచిత విద్యుత్ లాంటి పథకాలు కూడా తీసుకురాగలమని చెప్పారు.

అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తమ మైనారిటీ ఓటర్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పిన అఖిలేశ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలం పుంజుకోడానికి ఆ పార్టీ దగ్గర వారికంటూ ప్రత్యేకంగా ఓట్ బ్యాంక్ లేదని అన్నారు.

అఖిలేశ్ యాదవ్‌తో సంభాషణలో ముఖ్యమైన విషయాలు

1. పెద్ద పార్టీలతో పొత్తు వల్ల ఎస్పీ అనుభవం సరిగా లేదు. అందుకే ఇప్పుడు మేం చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం. చిన్నపార్టీలతో కలిస్తే వారికి సీట్లు కూడా తక్కువ ఇవ్వచ్చు. పెద్ద పార్టీలైతే ఎక్కువ స్థానాలు అడుగుతాయి. చిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎస్పీ పెద్ద శక్తిగా అవతరిస్తుంది. వచ్చే ఎన్నికల్లో 350 స్థానాలు గెలుస్తుంది.

2. ఆమ్ ఆద్మీ పార్టీ మాతో కలిసి రావాలని అనుకుంటే సీట్లు, అభ్యర్థులపై ఆలోచిస్తాం. చిన్నాన్న(శివలాల్ యాదవ్) పార్టీ ఉంది. ఆయనతో కూడా మా పార్టీ మాట్లాడుతుంది. ఆయన పోటీ చేసే జశ్వంత్ నగర్ స్థానంలో ఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టదు.

3. బీజేపీ ఓడిపోయేలా ఉంది. ఎందుకంటే వారి మానిఫెస్టోను చెత్తకుండీలో పడేశారు. ఆ మానిఫెస్టోలో ముఖ్యమంత్రి యోగి ఫొటో కూడా లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు రైతుల ఆదాయం ఎంత, వారి ఆదాయం ఎప్పటిలోగా రెట్టింపు అవుతుంది. బీజేపీ వాళ్లు పేదల నుంచి ఓట్లు వేయించుకుని, సంపన్నులు, పారిశ్రామికవేత్తల నుంచి నోట్లు తీసుకుంటారు. ప్రభుత్వ కంపెనీలను అమ్మి బాధపెడతారు.

అఖిలేష్ యాదవ
ఫొటో క్యాప్షన్, ఇంటర్వ్యూ సమయంలో ఏస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌‌తో బీబీసీ ఇండియా డిజిటల్ ఎడిటర్ ముకేశ్ శర్మ

4. యూపీ ప్రభుత్వం ఇప్పటివరకూ మా ప్రభుత్వ హయాంలో ఏమేం ప్రారంభోత్సవాలు చేశామో, వాటినే ప్రారంభిస్తోంది. మేం చేసిన వాటికే శంకుస్థాపనలు చేస్తోంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌-వే వారి అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును ప్రారంభించింది సమాజ్ వాదీ పార్టీనే అయినా, వారు ఇప్పటివరకూ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయారు.

5. కోవిడ్ కాలంలో చేసిన పనులకు ముఖ్యమంత్రి యోగీజీపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపిస్తుండచ్చు. కానీ, కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మేం బయటకు రాలేదనే ఆరోపణలు ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎస్పీ కూడా చాలా పనులు చేసింది. మేం ఆక్సిజన్, మందులు, ఆర్థిక సాయం కూడా అందించాం.

6. కరోనా కాలంలో ముఖ్యమంత్రి ఏయే ప్రాంతాల్లో పర్యటించారో, అక్కడి ఆస్పత్రులన్నీ సమాజ్ వాదీ ప్రభుత్వం నిర్మించినవే. సైఫయీ, బాందా, ఝాన్సీ, గోండా, కోవిడ్ చికిత్సలు జరుగుతున్న గోరఖ్‌పూర్‌ ఆస్పత్రి అన్నింటినీ సమాజ్‌వాది ప్రభుత్వమే నిర్మించింది.

అఖిలేష్ యాదవ

7. నేను టీకాను బీజేపీ వ్యాక్సీన్ అన్న సమయంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో డాక్టర్లు కూడా టీకాపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నేను ఈ రోజుకూ చెబుతున్నా. ప్రభుత్వం మొదట పేదలకు, కార్మికులకు టీకా వేయాలి. టీకా వేసుకోవాల్సి వారిలో నేను ఆఖరి వ్యక్తినే అవుతాను.

8. ఈ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయలేదు, బదులుగా దాని ధర పెంచింది. రైతులకు ఉచిత విద్యుత్ లాంటి సౌకర్యాలు అందిస్తే ఆర్థిక వ్యవస్థ దానికదే ముందుకు వెళ్తుంది. అలాగే, ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే 10 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

9. సమాజ్‌వాదీ ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల లాప్‌టాప్‌లు, ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. ఈసారి ఎన్నికల్లో మేం ఏమేం ప్రకటించబోతున్నామో అప్పుడే చెప్పం. లేదంటే బీజేపీ వాటిని కాపీ కొడుతుంది. వాళ్ల ప్రచార వ్యూహం చాలా వేగంగా ఉంది. వాళ్లు అన్నీ వారు చేస్తున్నట్లే చెప్పుకొంటారు.

అఖిలేష్ యాదవ

ఫొటో సోర్స్, ANI

10. సుప్రీంకోర్ట్ నిర్ణయం తర్వాత రామమందిర నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మందిర నిర్మాణం జరుగుతుంది. కానీ, భూసేకరణ విషయంలో కొంతమంది ప్రశ్నలు సంధించారు. దానికి బీజేపీ లేదా ట్రస్ట్ సభ్యులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరిపై ఆ ప్రశ్నలు వస్తున్నాయో వాళ్లను తొలగించడం లేదంటే వారు రాజీనామా చేయడమో జరగాలి.

11. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ వల్ల ముస్లిం ఓట్లలో ఎలాంటి తేడా ఉండదు. యూపీలో ఇలాంటి పార్టీలు ముందు నుంచీ వస్తూనే ఉన్నాయి. కానీ, మైనారిటీలకు ఎస్పీపై నమ్మకం ఉంది. ఎందుకంటే ఎస్పీ వారి కోసం పనులు చేసింది. బెంగాల్లో ఆ పార్టీ ఏ ప్రభావం చూపలేకపోయినట్లే, ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే, యూపీలో పోటీ నేరుగా ఎస్పీ, బీజేపీ మధ్యే ఉంటుంది.

12. బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి ఎస్పీ మీద కోపంగా ఉన్న విషయానికి వస్తే, ఆ పార్టీ మీద కోపం మాకు రావాలి. ఎందుకంటే, మా ఇంట్లో వాళ్లే ఎన్నికల్లో ఓడిపోయారు. బీఎస్పీ జీరో నుంచి 10కి వచ్చింది. కానీ, పాత విషయాల్లోకి వెళ్లడం సరికాదు.

13. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తోంది. కానీ వారికి ఓట్లెలా వస్తాయి. కాంగ్రెస్‌కు ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నాయో, బీజేపీకి కూడా అవే సిద్ధాంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)