గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'

సుందర్ పిచాయ్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, అమోల్ రాజన్
    • హోదా, మీడియా ఎడిటర్, బీబీసీ

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు.

చాలా దేశాల్లో సమాచార ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని, స్వేచ్ఛను తరచూ తేలిగ్గా తీసుకుంటుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రైవసీ, డేటా, టాక్స్‌కు సంబంధించిన వివాదాలపై కూడా మాట్లాడారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరగబోయే మార్పులు నిప్పు, విద్యుత్ లేదా ఇంటర్నెట్ వల్ల వచ్చే మార్పుల కంటే ప్రభావవంతంగా ఉంటాయని ఆయన చెప్పారు.

సుందర్ పిచాయ్

ఫొటో సోర్స్, Google

చైనా ఇంటర్నెట్ మోడల్‌పై అభిప్రాయం

చైనా ఇంటర్నెట్ మోడల్‌లో అక్కడి ప్రభుత్వం చేతుల్లో చాలా శక్తి ఉంటుందని, నిశిత నిఘా ఉంటుందని, అది ఎంత వరకూ కరెక్టని సుందర్ పిచాయ్‌ని అడిగినప్పుడు, ఆయన చైనా పేరు ప్రస్తావించకుండా ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద దాడి జరుగుతోందని అన్నారు.

అయితే మా ప్రధాన ఉత్పత్తులు, సేవల్లో ఏవీ చైనాలో అందుబాటులో లేవని ఆయన తర్వాత అన్నారు.

సుందర్ పిచాయ్

ఫొటో సోర్స్, AFP

ఆ రెండు భవిష్యత్తును మార్చేస్తాయి

మరో 25 ఏళ్లలో రెండు అంశాల్లో విప్లవం వస్తుందన్న సుందర్ పిచాయ్, అవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పారు.

ఆయన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ "నేను దీనిని మానవాళి రూపొందించిన అత్యంత మెరుగైన టెక్నాలజీగా చూస్తున్నాను. నిప్పు, విద్యుత్, ఇంటర్నెట్ గురించి ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారో, ఇది కూడా అలాగే ఉండబోతోంది. నాకు ఇది వాటికంటే మెరుగ్గా అనిపిస్తోంది" అన్నారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ మనుషుల్లానే పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఒక ప్రత్యేక సమస్యను పరిష్కరించడంలో మనిషిలాగే ఆలోచిస్తుంది. ఇప్పటికే అలాంటి ఎన్నో సిస్టమ్స్ పనిచేస్తున్నాయి.

క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది, పూర్తిగా భిన్నమైన ఒక కాన్సెప్ట్. సాధారణ కంప్యూటింగ్ బైనరీ ఆధారంగా ఉంటుంది. అంటే 0 లేదా 1 వీటి మధ్య ఏదీ ఉండదు. దీనిని బిట్స్ అంటారు.

క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ మీద పనిచేస్తాయి. దీనివల్ల ఒక పదార్థం ఒకే సమయంలో చాలా స్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడం కష్టం. కానీ, ఇది ప్రపంచంలో భారీ మార్పులు తీసుకురావచ్చు.

అయితే ఈ కంప్యూటర్లు అన్ని చోట్లా పనికిరావని పిచాయ్ సహా టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, సుందర్ పిచాయ్ బర్త్ డే :ఫోన్, టీవీ లేని కుటుంబం నుంచి గూగుల్ సీఈఓ దాకా...

టాక్స్ సంబంధించిన అంశాలపై పిచాయ్ ఏమన్నారు

టాక్స్‌కు సంబంధించిన అంశాల్లో గూగుల్ ఆచితూచి స్పందించింది.

చాలా ఏళ్ల నుంచీ, కంపెనీ తన టాక్స్ బాధ్యతలను చట్టబద్ధంగా తగ్గించుకోడానికి అకౌంటెంట్, వకీళ్లకు భారీ మొత్తాలను చెల్లించింది.

ఉదాహరణకు 2017లో గూగుల్ తన 'డబుల్ ఐరిష్, డచ్ శాండ్‌విచ్' వ్యూహం ప్రకారం ఒక డచ్ షెల్ కంపెనీ ద్వారా 20 బిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని బర్ముడాకు పంపించింది.

పిచాయ్ గూగుల్ ఇప్పుడు ఈ స్కీమ్‌ను ఉపయోగించడం లేదని, కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపుదారుల్లో గూగుల్ ఒకటని పిచాయ్ తెలిపారు. అది ఎక్కడ ఉన్నా, ప్రతి దేశంలోని పన్నుల చట్టాలను అనుసరిస్తుందన్నారు.

కార్పొరేట్ గ్లోబల్ మినిమం టాక్స్ పై జరుగుతున్న చర్చపై తాను సంతోషంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, కంపెనీ గత ఒక దశాబ్దంగా ఆదాయంలో 20 శాతం వరకూ పన్నులుగా చెల్లించిందని అది మిగతా కంపెనీలతో పోలిస్తే అధికమని అన్నారు. అందులో ఎక్కువ పన్ను అమెరికాలో చెల్లిస్తున్నట్లు పిచాయ్ చెప్పారు.

డేటా, ప్రైవసీ, సెర్చ్ రంగంలో గుత్తాధిపత్యం లాంటి మిగతా అంశాల గురించి కూడా గూగుల్ విచారణ ఎదుర్కుంటోంది.

గుత్తాధిపత్యం గురించి మాట్లాడిన సుందర్ పిచాయ్, గూగుల్ ఒక ఉచిత ఉత్పత్తి అని వాదించారు. యూజర్స్ సులభంగా వేరే వాటికి వెళ్లవచ్చని అన్నారు. ఫేస్ బుక్ కూడా ఇంతకు ముందు ఇలాంటి వాదనే వినిపించింది.

సుందర్ పిచాయ్

ఫొటో సోర్స్, AFP

భారత్ నా లోనే ఉంది

ఇంటర్వ్యూలో ఆయన్ను మీరు అమెరికనా, లేక భారతీయుడా అని అడిగినప్పుడు, ఆయన సమాధానంగా "నేను అమెరికా పౌరుడిని. కానీ, నాలో భారత్ ఉంది. నేను ఎవరనే దానిలో అది ముఖ్యమైన భాగం" అన్నారు.

సుందర్ పిచాయ్ 1972లో భారత్‌లోని తమిళనాడు రాష్ట్రంలో పుట్టారు. ఆయన, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన బ్రిటన్ కంపెనీ జేఈసీలో పనిచేసేవారు. సుందర్ తల్లి స్టెనోగ్రాఫర్.

చదువు పూర్తైన తర్వాత సుందర్ పిచాయ్‌కు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అడ్మిషన్ లభించింది. అక్కడ ఆయన మెటాలజీలో ఇంజనీరింగ్ చేశారు. అమెరికా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ చేశాక, పిచాయ్ అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బిజినెస్ స్కూళ్లలో ఒకటైన వార్టన్ నుంచి ఎంబీఏ చేశారు.

సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరారు. గూగుల్ 2015లో అల్ఫాబెట్ కంపెనీలో భాగమైంది. అప్పుడు ఆయన ఆ సంస్థకు సీఈఓ అయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)