దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, భయంతో భవనం మీంచి బిడ్డను కిందకు విసిరేసిన తల్లి

డర్బన్‌లో ఒక భవనం మొదటి ఫ్లోర్‌ను లూటీ చేసిన తర్వాత దుండగులు నిప్పు పెట్టడంతో.. భవనం పైనుంచి తన బిడ్డను కిందకు విసురుతున్న తల్లి
ఫొటో క్యాప్షన్, డర్బన్‌లో ఒక భవనం మొదటి ఫ్లోర్‌ను లూటీ చేసిన తర్వాత దుండగులు నిప్పు పెట్టడంతో.. భవనం పైనుంచి తన బిడ్డను కిందకు విసురుతున్న తల్లి

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను గత వారం జైలుకు పంపించిన తర్వాత మొదలైన హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకూ 72 మంది చనిపోయారు.

వీరిలో సోమవారం రాత్రి సొవోటో(దక్షిణాఫ్రికాలో అతిపెద్ద టౌన్‌షిప్)లో ఒక షాపింగ్ సెంటర్‌ లూటీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 10 మంది కూడా ఉన్నారు.

గత గురువారం మొదలైన నిరసన ప్రదర్శనలు శనివారం, ఆదివారం హింసాత్మకంగా మారాయి. షాపింగ్ మాల్‌కు నిప్పు పెట్టారు. షాపులను ధ్వంసం చేశారు.

డర్బన్‌లో ఒక భవనం మొదటి ఫ్లోర్‌ను లూటీ చేసిన తర్వాత దుండగులు నిప్పు పెట్టడంతో ఒక తల్లి తన బిడ్డను భవనం పైనుంచి కిందకు విసురుతున్న దృశ్యాలను బీబీసీ చిత్రీకరించింది. ఆ బిడ్డను కింద ఉన్నవారు క్షేమంగా పట్టుకొన్నారు. ఆ బిడ్డ తిరిగి తల్లి ఒడికి చేరింది.

దక్షిణాఫ్రికాలో అల్లర్లు

ఫొటో సోర్స్, EPA

దక్షిణాఫ్రికా సోషల్ మీడియాలో విధ్వంసం, నిప్పుపెట్టడానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించడానికి సైన్యంను రంగంలోకి దింపింది. భద్రతాదళాలు ఇప్పటివరకూ దాదాపు 800 మందిని అరెస్ట్ చేశారు.

దక్షిణాఫ్రికాలో అల్లర్లు

ఫొటో సోర్స్, EPA

90వ దశకం తర్వాత అత్యంత భయానక హింస

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఈ నిరసన ప్రదర్శనలను 1990 తర్వాత దేశంలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పారు.

లూటీలు ఇలాగే కొనసాగితే, ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పదార్థాల కొరత ఏర్పడవచ్చని పోలీసు విభాగం మంత్రి భోకి సేలే మంగళవారం మీడియాకు చెప్పారు.

అయితే, క్వాజులు-నతల్, గౌతెంగ్ ప్రాంతంలో హింస వల్ల ఇప్పటివరకూ అత్యవసర స్థితి అమలు చేయాల్సిన అవసరం రాలేదని రక్షణ మంత్రి నోజివేవే పిసా కాకులా చెప్పారు.

మరోవైపు, తమ ప్రాంతంలో ఇప్పటివరకూ 26 మంది చనిపోయారని క్వాజులు-నతల్ ప్రీమియర్ సిహలే జీకాలాలా చెప్పారు. గౌతెంగ్ ప్రాంతంలో మరో 19 మంది మృతి చెందారు.

ఒకప్పుడు నెల్సన్ మండేలా స్వస్థలమైన ఈ ప్రాంతంలో చాలా షాపులు లూటీ చేశారని, ఏటీఎంలను ధ్వంసం చేశారని బీబీసీ ప్రతినిధి విమనీ ఖిజే చెప్పారు. రెస్టారెంట్లు, బార్లు, బట్టల షాపులను ఘోరంగా నాశనం చేశారని తెలిపారు.

వీడియో క్యాప్షన్, దక్షిణాఫ్రికా: మంటల్లో చిక్కుకున్న భవనం మీంచి బిడ్డను విసిరేసిన తల్లి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)