Tavolara: ప్రపంచంలోనే అతి చిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?

ఫొటో సోర్స్, Eliot Stein
ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాల గురించి మీరు వినే ఉంటారు. బ్రిటన్ సామ్రాజ్యమైతే, సూర్యుడు అస్తమించనంత పెద్దదిగా ఉండేది. మొఘల్ సామ్రాజ్యం కూడా పెద్దదే. కాబూల్ నుంచి కర్ణాటక వరకు ఇది విస్తరించి ఉండేది.
ఇప్పుడు ప్రపంచలోనే అతి చిన్న సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం.
దీనిలో కేవలం 11 మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ రాజే స్వయంగా పడవ నడుపుతారు. ఆయనకు రెస్టారెంట్ కూడా ఉంది.
ఇక్కడ రాజు నిక్కర్ వేసుకుని మామూలు చెప్పులతో తిరుగుతుంటారు.
ఈ సామ్రాజ్యం పేరు టవోలారా. ఎన్నో ఆసక్తికర విశేషాలకు ఈ రాజ్యం నిలయం.

ఫొటో సోర్స్, Eliot Stein
చిన్న ద్వీపం..
మధ్యధరా సముద్రంలో ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్‌కు సమీపంలో టవోలారా దీవి ఉంది.
టవోలారా అనే చిన్న నగరం చుట్టూ టవోలారా సామ్రాజ్యం విస్తరించి వుంటుంది. ఈ దీవి విస్తీర్ణం ఐదు చ.కి.మీ.
ఈ సామ్రాజ్య చక్రవర్తి పేరు ఆంటోనియో బర్తలివోనీ.
మీరు ఎప్పుడైనా టవోలారాకు వస్తే, ఆంటోనియోను గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చక్రవర్తిలా కనిపించరు. ఆయన బట్టలు కానీ, ఆయన జీవిన శైలి కానీ.. ఏదీ రాజులా కనిపించదు. ఇక్కడ రాజుకు కేవలం ఉచితంగా ఆహారం మాత్రమే లభిస్తుందని ఆంటోనియో చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Chris Jackson/Getty Images
టవోలారాలానే ప్రపంచంలో మరికొన్ని చిన్న దేశాలు, సామ్రాజ్యాలు ఉన్నాయి.
- రెడోండా: ఇంగ్లండ్‌లోని సౌథంప్టన్‌లో ఈ ప్రాంతం ఉంది. పొగాకుపై నిషేధం నుంచి తప్పించుకోవడానికి రెడోండాను స్థానికులు ప్రత్యేక దేశంగా ప్రకటించారు. రెడోండాలో దాదాపు వంద మంది పౌరులు ఉంటారు.
- టోంగా: పసిఫిక్ మహా సముద్రంలో ఈ దేశం ఉంది. దీని విస్తీర్ణం 748 చ.కి.మీ. ఈ దేశంలో 1.6 లక్షల మంది జీవిస్తున్నారు. 1773లో బ్రిటన్‌కు చెందిన జేమ్స్ కుక్ ఈ దీవిని కనుగొన్నారు. దీనికి ఫ్రెండ్లీ ఐలండ్‌గా జేమ్స్ కుక్ నామకరణం చేశారు.
- బ్రూనై: ఇది ఆగ్నేయాసియాలో ఉంటుంది. దీని విస్తీర్ణం 5,765 చ.కి.మీ. ఇక్కడ 4.13 లక్షల మంది జీవిస్తున్నారు. ఇక్కడి ప్రజలపై ఎలాంటి పన్నులూ ఉండవు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బ్రూనై సుల్తాన్ కూడా ఒకరు.
- స్వాజీలాండ్: ఇది ఆఫ్రికాలో ఉంటుంది. దీని విస్తీర్ణం 17,360 చ.కి.మీ. మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు ఈ దేశం నిలయం. దీని జనాభా దాదాపు 13 లక్షలు.
- లెసోతో: ఇది దక్షిణాఫ్రికాలో ఉంటుంది. దీని విస్తీర్ణం 30,000 చ.కి.మీ. ఇక్కడ 20 లక్షల మంది జీవిస్తున్నారు.

ఫొటో సోర్స్, Riccardo Finelli
180వ వ్యవస్థాపక దినోత్సవం
టవోలారా 180వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇంత చిన్న దీవిని సామ్రాజ్యం అంటుంటే మనకు నవ్వొస్తూ ఉండొచ్చు.
కానీ తమది రాజ్యమేనని ఆంటోనియో, ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. దీని వెనుక పెద్ద కథ ఉందని వారు వివరిస్తున్నారు.
ఆంటోనియో ముత్తాతకు ముత్తాత గుసెప్పే 1807లో ఇటలీ నుంచి ఇక్కడకు పారిపోయివచ్చారు. అప్పట్లో ఇటలీ ఇంకా దేశంగా ఏర్పడలేదు. సార్డీనియా మాత్రం ప్రత్యేకమైన రాజ్యంగా ఉండేది. ఇక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని నేరంగా పరిగణించేవారు.
రెండు పెళ్లిళ్లు చేసుకున్న గుసెప్పే.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు టవోలారాకు పారిపోయి వచ్చేశారు.

ఫొటో సోర్స్, REDA &CO srl/Alamy
మేకల్ని వేటాడుతూ..
టవోలారాలో బంగారం వర్ణంలో పళ్లుండే మేకలు ఉంటాయి. ఇలాంటి మేకలు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉండేవని అప్పట్లో ప్రజలు చెప్పుకునేవారు.
ఈ మాటలు అప్పటి సార్డీనియా చక్రవర్తి చార్లో ఆల్బెర్టో చెవిన పడ్డాయి. దీంతో ఈ మేకల్ని వేటాడేందుకు ఆల్బెర్టో టవోలారాకు వచ్చారు.
1836లో ఇక్కడకు వచ్చిన ఆల్బెర్టోకు గుసెప్పే కుమారుడు పవోలో సాయం చేశారు. దీంతో ఈ దీవి మొత్తం తిరిగి ఆల్బెర్టో మేకల్ని వేటాడారు.
‘‘ఇక్కడకు వచ్చినప్పుడు తాను సార్డీనియా రాజునని ఆల్బెర్టో చెప్పారు. దీనికి స్పందనగా నేను టవోలారా రాజునని మా తాత చెప్పారు’’ అని ఆంటోనియో వివరించారు.

ఫొటో సోర్స్, Realy Easy Star/Alberto Maisto/Alamy
మధ్యధరా సముద్రంలో..
టవోలారాలో మూడు రోజులు గడిపిన అనంతరం ఆల్బెర్టో సార్టీనియాకు వచ్చేశారు. అనంతరం టవోలారా తమ రాజ్యంలో భాగంకాదని ఓ ప్రకటన కూడా ఆల్బెర్టో చేశారు.
ఆ తర్వాత పవోలో తన సొంత సామ్రాజ్యాన్ని ప్రకటించుకున్నారు. అప్పట్లో ఇక్కడ కేవలం 33 మంది మాత్రమే ఉండేవారు.
పవోలో మరణానికి ముందే ప్రత్యేకంగా సమాధి కట్టించుకున్నాడు. తను మరణించాక తన సమాధిపై కిరీటం పెట్టాలని ఆయన కోరారు.
నిజానికి బతికున్నప్పుడు పవోలో ఎప్పుడూ కిరీటాన్ని పెట్టుకోలేదు. ఆ తర్వాతి కాలంలో టవోలారా సామ్రాజ్యం గురించి మధ్యధరా సముద్రంలో చాలా దేశాలకు తెలిసింది.

ఫొటో సోర్స్, Realy Easy Star/Alberto Maisto/Alamy
శాంతి ఒప్పందం...
టవోలారా చక్రవర్తులు చాలా దేశాలతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. ఇటలీ వ్యవస్థాపకుడు గుసెప్పే గిరాబాల్డితో చేసుకున్న ఒప్పందం కూడా దీనిలో ఒకటి.
సార్డీనియా రాజు విటోరియో ఇమ్మానుయేల్ 2తో కూడా 1903లో టవోలారా రాజు శాంతి ఒప్పందం చేసుకున్నారు.
19వ శతాబ్దంలో ప్రపంచ దేశాల చక్రవర్తుల ఫోటోలను సేకరించాలని బ్రిటన్‌కు చెందిన క్వీన్ విక్టోరియా ఆదేశించారు. అప్పుడు టవోలారా రాజ కుటుంబం ఫోటోలను కూడా తీసుకెళ్లారు. బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో ఆ ఫోటోలు ఇప్పటికీ కనిపిస్తాయి.
నాటో స్థావరంగా..
1962లో నాటో ఈ ప్రాంతాన్ని తన స్థావరంగా మార్చుకుంది. ఆ తర్వాత దీనిపై సార్వభౌమ అధికారాలను టవోలారా చక్రవర్తులు కోల్పోయారు.
ఇక్కడకు ప్రజల రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. అయితే టవోలారా తమ దేశంలో భాగమని ఇటలీ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు.
అదే సమయంలో టవోలారాను ప్రత్యేక దేశంగా ప్రపంచంలోని ఏ దేశమూ గుర్తించలేదు.
ఆంటోనియో, ఆయన కుటుంబం.. ఇక్కడ పడవ నడుపుకుంటోంది. ఇటలీ నుంచి టవోలారా వచ్చే పర్యటకులకు ఈ పడవే ఆధారం. ఇక్కడి అరుదైన మేకలు, గద్దల్ని చూసేందుకు పర్యటకులు వస్తుంటారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
కుటుంబ వృత్తిగా..
టవోలారాకు చుట్టుపక్కల చాలా సముద్ర జీవులు నివసిస్తుంటాయి. వాటితో ఆడుకునేందుకు చాలా మంది పర్యటకులు వస్తుంటారు. వీరి కోసం ఆంటోనియో, తన మేనల్లుడు పడవ నడుపుతున్నారు. మరో మేనల్లుడు చేపలు పట్టి, పర్యటకులకు ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు.
ఇక్కడకు వచ్చే పర్యటకులకు ఆంటోనియో రెస్టారెంట్‌లోని ఆహారమే ఆధారం. టవోలారాను పాలించడమనేది మా కుటుంబ వృత్తి లాంటిదని ఆంటోనియో చెబుతున్నారు.
పర్యటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆంటోనియో ఆదాయం కూడా పెరుగుతోంది. కానీ, సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్టమని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GIANLUIGI GUERCIA/AFP/Getty Images
లేవగానే శ్మశానవాటికకు వెళ్తారు
ఆంటోనియో రోజూ ఉదయం లేవగానే ప్లాస్టిక్ పువ్వులతో తమ కుటుంబ శ్మశానవాటికకు వెళ్తారు. అక్కడే ఆయన భార్య సమాధి కూడా ఉంది.
మామూలు పువ్వులు తీసుకెళ్తే, మేకలు తినేస్తున్నాయని, అందుకే ప్లాస్టిక్ పువ్వులు తీసుకెళ్తానని ఆయన చెప్పారు. రాజ కుటుంబంలో అందరినీ ఇక్కడే సమాధి చేస్తారని వివరించారు.
ఆంటోనియోతోపాటు ఇక్కడ ఉండేవారందరికీ సాంకేతికంగా ఇటలీ పౌరసత్వం ఉంది. ఒకానొక సమయంలో తనను ఈ ప్రాంతానికి డ్యూక్‌గా గుర్తించాలని ఇటలీకి లేఖ రాద్దామని ఆంటోనియో భావించారు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








