కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం

మణికంఠ

ఫొటో సోర్స్, Manikanta

ఫొటో క్యాప్షన్, కరోనా సోకి కరోనా సేవకుడే మరణించారు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో అనేకమంది నేటికీ దూరంగానే ఉంటున్నారు. కన్నవారు, సమీప బంధువులు కూడా ముఖం చాటేస్తున్నారు. అదే సమయంలో అనేక మంది స్వచ్ఛంద సేవకులు ముందుకొస్తున్నారు. వలంటీర్ గానే సేవలు అందిస్తున్నారు.

గత ఏడాది కరోనా మొదటి వేవ్ లో మొదలుపెట్టి నేటికీ వందల మందికి అంత్యక్రియలు చేసిన బృందాలు కూడా ఉన్నాయి. అలాంటి బృందాలలో రాజమహేంద్రవరానికి చెందిన అమీర్ పాషా టీమ్ కూడా ఉంది.

ఏడాది కాలంగా కోవిడ్ మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న పాషా బృందంలో గత ఏడాది రాజమండ్రికి చెందిన మణికంఠ అనే యువకుడు కూడా సేవలందించారు. ఈ ఏడాది మరి కొందరితో కలిసి మణికంఠ విడిగా కోవిడ్ సేవలందిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఆయనకు కరోనా సోకి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబంలో పాటు వారి బృందంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది.

కరోనా మొదటి వేవ్ సమయంలో అనేకమంది ఏదో చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి మీద అంచనా లేక వెనకడుగు వేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలో కూడా రాజమహేంద్రవరంలో అమీర్ పాషా వంటి వారు ముందుకొచ్చారు. అలాంటి వారికి దుర్గా ప్రసాద్, వీర రాఘవ వంటి అనేక మంది తోడ్పడ్డారు.

ప్రస్తుతం సెకండ్ వేవ్ సమయంలో కొత్తగా మరికొందరు యువకులు వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావడంతో సేవకుల సంఖ్య పెరిగింది. అందులో మణికంఠ కూడా ఒకరు. రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరానికి చెందిన మణికంఠ, తన మిత్రుడు భరత్ రాఘవ ద్వారా కరోనా మృతులకు అంత్యక్రియలు పూర్తి చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. వందల కుటుంబాలకు అలాంటి సహాయం అందించారు.

మణికంఠ

ఫొటో సోర్స్, MaNIKANTA

ఫొటో క్యాప్షన్, మణికంఠ

కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతిని..

సొంతంగా వ్యాన్ కొనుగోలు చేసుకున్న మణికంఠ ప్రతీ రోజూ హెరిటేజ్ పాలు డెలివరీ చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమయం ఉండడంతో దానిని మిత్రులతో కలిసి సమాజ సేవకు వినియోగించాలని సంకల్పించాడు. దానికి అనుగుణంగా కరోనా మృతుల అంత్యక్రియలు చేస్తూ అనేకమందికి సహాయపడ్డారు.

కానీ తన బృందంతో పాటుగా కరోనా బారిన పడిన మణికంఠకు తల్లిదండ్రులు కూడా విజయనగరంలో సోదరుడి ఇంట్లో ఉండడంతో చూసుకునే వారు ఎవరూ లేక ఒంటరి అయ్యారు.

విషయం తెలుసుకున్న సోదరుడు వెంకట స్వామి నాయుడు విజయనగరం నుంచి వచ్చి తమ్ముడిని ఆస్పత్రిలో చేర్చినా ఫలితం దక్కలేదు. ఊపిరితిత్తుల మీద తీవ్రంగా ప్రభావం పడడంతో ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమయ్యి ప్రాణాలు కోల్పోయారని సోదరుడు స్వామి నాయుడు బీబీసీకి తెలిపారు.

తొలుత ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించినా, విశాఖ కేజీహెచ్‌లో ఆయన మరణించినట్టు వివరించారు. 27 ఏళ్ల మణికంఠ అందరికీ సహాయం చేయాలని వెళ్లి, ఆయనే మరణించడంతో పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, తల్లి ఆసరా కోల్పోయారని ఆయన వివరించారు.

ఓ రకంగా మణికంఠ మరణవార్త, కోవిడ్ మృత దేహాలకు అంత్య క్రియలు నిర్వహించేందుకు ధైర్యంగా ముందుకొచ్చేవారిలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. చాలామంది కరోనా మృతదేహాల దగ్గరకి రావడానికి సందేహించారు. వారి వారి కుటుంబాల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని అమీర్ పాషా బీబీసీతో అన్నారు.

అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఎవరైనా సహాయం అడిగితే చేసేందుకు ముందుకు రావడం మొదలయ్యిందని చెప్పారు.

"ఏడాదిన్నరగా అనేక మందికి వారి మతాచారాలను బట్టి అంత్యక్రియలు చేశాం. కొన్ని సార్లు ప్రమాదకరమైన మృతదేహాలు , డీకంపోజ్ కూడా అయిపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయినా అన్ని జాగ్రత్తల మధ్య ఓపికగా తరలించాము. వందల మందికి అంత్యక్రియలు చేసినా ఏమీ జరగకపోవడంతో కొందరిలో నిర్లక్ష్యం , కొంత అజాగ్రత్త వచ్చాయి. అవే చివరకు ప్రమాదానికి కారణమయ్యాయి."

"సరిహద్దుల్లో సైనికులు దేశం కోసం పోరాడతారు. మేము కూడా అదే రీతిలో ప్రజల కోసం నిలబడుతున్నాం. ప్రజా సేవలో మణికంఠ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం గుర్తించాలి. వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రజలపక్షాన నిలబడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధీమా కల్పించాలి. వృద్ధ తల్లితండ్రులున్నారు. వారికి చేదోడు కల్పించడం బాధ్యతగా భావించాలి" అని ఆయన కోరారు.

మణికంఠ అందించిన సేవలకు ఏపీ పోలీసు నుంచి ప్రశంసా పత్రం కూడా లభించింది

ఫొటో సోర్స్, MaNIKANTA

ఫొటో క్యాప్షన్, మణికంఠ అందించిన సేవలకు ఏపీ పోలీసు నుంచి ప్రశంసా పత్రం కూడా లభించింది

అన్ని సందర్భాల్లోనూ అప్రమత్తంగానే ఉండాలి..

కరోనా మృతదేహాల విషయంలో ఆస్పత్రి సిబ్బందికే భారంగా మారిందని ప్రభుత్వ వైద్యశాలల డాక్టర్లు కూడా చెబుతున్నారు. రోగులను ఆస్పత్రిలో చేర్చి, వారు మరణిస్తే కనీసం చివరి చూపుకు కూడా చాలామంది రావడం లేదని రాజమహేంద్రవరం కోవిడ్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

అయితే ఎంతో పెద్ద మనసు చేసుకొని ధైర్యంగా కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సేవకులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

"ఆస్పత్రి మార్చురీ నిండిపోతోంది. మృతదేహాలను తరలించడం మాకు భారం అయ్యేది. అలాంటి సమయంలో స్వచ్ఛంద సేవకుల తోడ్పాటు చాలా ఉపయోగపడింది. వారు ముందుకు రాకపోతే పెద్ద సమస్య అయ్యేది. అయితే స్వచ్ఛంద సేవకులు కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలి. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి. ఆదమరిస్తే ప్రమాదం తప్పదని మణికంఠ అనుభవం చెబుతోంది".

"ముఖ్యంగా కరోనా మృతులను ప్యాక్ చేసిన బ్యాగ్ ఓపెన్ చేయడంలోనూ, శానిటైజ్ చేయడం, పీపీఈ కిట్ ధరించడం సహా అన్నింటా రక్షణ చూసుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యమయినా ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి స్వచ్ఛంద సేవకులు కూడా అలసత్వం ప్రదర్శించడం మంచిది కాదు" అని డాక్టర్ చంద్రశేఖ సూచించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)