తమిళనాడు: తండ్రీకొడుకులు కస్టడీలో చనిపోయిన వీడియోను ఎందుకు తొలగించారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్ర్యూ క్లారెన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల తమిళనాడులో పోలీసుల కస్టడీలో చనిపోయిన తండ్రీకొడుకులకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వల్ల దేశవ్యాప్తంగా ఈ కేసు పతాక శీర్షికల్లో నిలిచింది. రేడియో జాకీ, గాయని సుచిత్రా రామదురై ఆ వీడియోను పోస్ట్ చేశారు.
ఇప్పుడు ఆమె తన ఆ వీడియోను తొలగించారు. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చూశారు.
ఆమె ఆ వీడియోను ఈ మాటలతో ప్రారంభిస్తారు. “హాయ్, నేను సుచిత్ర. నేనొక దక్షిణ భారతీయురాలిని. దక్షిణ భారతదేశంలో జరిగే ప్రతి విషయం, దక్షిణాది అంశంగానే మిగిలిపోవడం చూసి నాకు అసహ్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే మేం దీని గురించి ఇంగ్లిష్‌లో మాట్లాడం కాబట్టి” అన్నారు.
లాక్‌డౌన్ సమయంలో చాలా సేపటివరకూ షాపు తెరిచి ఉంచారనే ఆరోపణలతో 58 ఏళ్ల పి.జయరాజ్, ఆయన కొడుకు 38 ఏళ్ల ఫెనిక్స్ ను అరెస్టు చేసిన పోలీసులు, తర్వాత వారిని కస్టడీలో కొట్టారని ఆరోపణలు వచ్చాయి. మొదట తండ్రిని, తర్వాత ఆయన్ను విడిపించడానికి వచ్చిన కొడుకును దారుణంగా కొట్టారని చెప్పారు. తమిళనాడులో ఇప్పటికీ కరోనా లాక్‌డౌన్ అమలులో ఉంది.
జయరాజ్, ఫెనిక్స్ ను పూర్తిగా రాత్రంతా పోలీసు కస్టడీలోనే ఉంచారు. రెండ్రోజుల తర్వాత ఇద్దరూ చనిపోయారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కొన్ని గంటల తేడాతో చనిపోయారు.
పోలీసు కస్టడీలో ఇద్దరినీ హింసించారని, ఫెనిక్స్ ను లైంగికంగా వేధించారని వారి బంధువులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబ సభ్యుల ఫిర్యాదు, సాక్ష్యుల చెప్పిన విషయాల ఆధారంగా తండ్రీకొడుకులను అక్కడ ఏం చేశారో సుచిత్ర తన వీడియోలో వివరించారు.
ఆ వీడియో చివర్లో ఆమె “వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడదాం. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోను షేర్ చేయండి” అని చెప్పారు.
సుచిత్ర పోస్ట్ చేసిన ఈ వీడియోను రెండు కోట్ల మంది చూశారు. సోషల్ మీడియాలో దీని గురించి జనం తీవ్రంగా స్పందించారు. వీడియో ప్రారంభంలో తమిళంలో ‘ఇద్దరికీ న్యాయం కావాలి’ అని వస్తుంది.
ఆ తర్వాత ఇది దేశవ్యాప్తంగా మీడియాలో కలకలం సృష్టించింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రాంలో ట్రెండవడం మొదలైంది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, వాణిజ్య రంగ ప్రముఖులు, కమెడియన్లు, బాలీవుడ్ ప్రముఖులు దీని గురించి ట్వీట్ చేయడం ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆక్రోశం చూసిన ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. తర్వాత పోలీసు కస్టడీలో హత్య ఆరోపణలతో ఐదుగురు పోలీసులను అరెస్టు కూడా చేశారు.
కొన్నిరోజుల తర్వాత మరో ఐదుగురు పోలీసులను అరెస్టు చేశారు. వీరిలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు.
ఆరోపణలు వచ్చిన పోలీసులను మొదట బదిలీ చేశారు. కానీ తర్వాత ఒత్తిళ్లు పెరగడం, కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.
తర్వాత ఆ వీడియోను తొలగించాలని తమిళనాడు పోలీసులు సుచిత్రా రామదురైను కోరారు. ఆమె(సుచిత్ర) చాలా తప్పుడు పద్ధతుల్లో ఈ అంశాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలూ లేని ఈ ఘటనను సంచలనం చేస్తున్నారు” అని పోలీసులు ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ట్విటర్‌లో ద్వారా జారీ చేసిన ఒక ప్రకటనలో సుచిత్రా రామదురై వీడియో పోలీసులపై ద్వేషం వ్యాపించేలా చేస్తోందని పోలీసులు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులోని ఒక సీఐడీ అధికారి తనను ఆ వీడియో తొలగించాలని కోరారని, వీడియోలో చెప్పిన ఘటనాక్రమం, చనిపోయిన తండ్రీకొడుకుల పోస్టుమార్టం రిపోర్టుతో సరిపోలడం లేదని ఆయన చెప్పారని సుచిత్ర తెలిపారు.
“నేను పోస్టుమార్టం రిపోర్ట్ అడిగినప్పుడు, అది ఒక సీల్డ్ డాక్యుమెంట్ అని, దానిని నేరుగా ఈ కేసును విచారణ చేస్తున్న జడ్జికే అందిస్తామని చెప్పారు, నాకు ఇవ్వడానికి నిరాకరించారు” అని సుచిత్ర బీబీసీకి చెప్పారు.
“అది సీల్డ్ రిపోర్ట్ అయితే, నా వీడియోలో చెప్పినవి, పోస్టుమార్టం వివరాలతో సరిపోలడం లేదని ఆయన తప్పులెలా పట్టుకోగలిగారో, నాకు ఆశ్చర్యంగా ఉంది” అన్నారు.
అయితే, తన వకీలు సలహాతో సుచిత్ర ఆ వీడియోను తొలగించారు.
పోలీసుల క్రూరత్వం భారతదేశంలో ఒక తీవ్ర సమస్యగా మారింది. కస్టడీలో సంభవించే మరణాల గురించి ఎన్జీవోల కన్సార్టియం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దాని ప్రకారం 2019లో భారత్‌లో పోలీసుల అదుపులో మొత్తం 1731 మంది చనిపోయారు. అంటే ప్రతి రోజూ పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో కనీసం ఐదు మరణాలు నమోదయ్యాయి.
దీనిపై బీబీసీతో మాట్లాడిన కర్ణాటకకు చెందిన ఒక మాజీ పోలీస్ ఐజీ గోపాల్ హోసూర్ పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని అన్నారు.
“ఎవరైనా పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, వారు నిస్సహాయ స్థితిలో ఉంటారు. వారిపై అలాంటి పద్ధతిని పాటించడంలో అసలు అర్థం లేదు. మీరు బలప్రయోగం చేయకుండా, మిగతా పద్ధతుల ద్వారా కూడా సాక్ష్యాలు సేకరించవచ్చు” అన్నారు.
అయితే, సుచిత్రా రామదురై వెనక్కు తగ్గలేదు, భయం లేకుండా ముందుకెళ్తున్నారు. అయినా, ఆమె తన వీడియోను తొలగించారు. ఎందుకంటే, తన పనిని తాను పూర్తి చేశానని, ఇప్పుడు ఏదోఒకటి చెప్పి ఎవరినీ మోసం చేయలేరని ఆమె భావిస్తున్నారు.
“ఆ వీడియో ముఖ్యంగా 90వ దశకంలోని తరం వల్లే ఇంతమందిని చేరుకోగలిగింది. మీరు ఇది ఫేక్ అని, కల్లోలం సృష్టించడానికే ఇలా చేశారని చెప్పి ఎవరినీ మోసం చేయలేరు. ఇప్పటి యువతరం అన్నీ అర్థం చేసుకోగలదు. వారు ఇలాంటి మాటలను నమ్మదు” అంటున్నారు సుచిత్ర.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








