మన చేతిరాతను మార్చిన పెన్ను... ఎలా పుట్టింది? దాని చరిత్ర ఏంటి?

పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను
    • రచయిత, స్టీఫెన్ డౌలింగ్
    • హోదా, బీబీసీ కోసం

ఫౌంటెయిన్ (ఇంకు) పెన్నుతో రాత చాలా అందంగా కనిపిస్తుంది. కానీ, ఆ పెన్నులు అప్పుడప్పుడు ఎక్కువ ఇంకు కక్కుతూ చేతులు, కాగితాలను పాడుచేస్తుండేవి. కొన్నిసార్లు సిరా ముద్దలుగా కాగితంపై పడిపోయేది.

చేతికి ఇంకు అంటుకోకుండా వాటితో రాసిన సందర్భాలు చాలా అరుదు. ఒక్కోసారి చొక్కా జేబుల్లోనూ అవి ఇంకును కక్కేసేవి. చొక్కాల మీద మరకలు పడుతూ ఉండేవి.

అయితే, ఈ ఫౌంటెయిన్ పెన్నులను బాల్‌పాయింట్ పెన్నులు భర్తి చేశాయి. 'చేతి రాత' దిశ, గమనాన్నే అవి మార్చేశాయి.

బాల్‌పాయింట్ పెన్ను ఓ గొప్ప ఆవిష్కరణ. పారిశ్రామీకరణ ఊపందుకుని, తయారీ విపరీతంగా పెరిగిన సమయంలో ఈ ఆవిష్కరణ జరగడం చాలా మేలు చేసింది.

మొట్టమొదటగా 1945 అక్టోబర్ 29న న్యూయార్క్ నగరంలోని గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్‌లోకి బాల్ పాయింట్ పెన్నులు వచ్చాయి. అయితే, వీటి వాడకం విస్తృతమవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది.

రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపనీ బాల్‌పాయింట్ పెన్నుల తయారీ మొదలుపెట్టాక ఫౌంటెయిన్ పెన్నులకు పూర్తిగా కాలం చెల్లింది.

బాల్‌పాయింట్ పెన్నుల్లో జిగటగా ఉండే ఒక ప్రత్యేకమైన ఇంకును వాడతారు. ఇది తొందరగా ఆరిపోతుంది. కాగితం వెనకవైపు మచ్చలు పడవు. పెన్ను మొనలో గుండ్రంగా కదిలే చిన్న బాల్‌ ఉంటుంది. రాస్తున్న కొద్దీ ఇది తిరుగుతుంది. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇంకు కిందకు వచ్చి, కాగితం స్థిరంగా పడుతుంది. బాల్ వల్ల ఇంకు ముద్దలు ముద్దలుగా పడకుండా ఉంటుంది.

బాల్‌పాయింట్ పెన్నులు శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ, మొదట్లో వీటి ఖరీదు ఎక్కువగా ఉండేది.

పెన్ను, ఫౌంటెయిన్ పెన్ను

రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ ధర అప్పట్లో సుమారు 900 రూపాయలు ఉండేది. ఇప్పటి విలువ ప్రకారం లెక్కిస్తే దాని విలువ 13 వేల రూపాయలకు పైమాటే.

అయితే, బాల్‌పాయింట్ పెన్ తొలిసారిగా అమెరికాలో మార్కెట్లోకి ప్రవేశించిందిగానీ అదే మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ కాదు. అంతకుముందే దక్షిణ అమెరికాలో ఇలాంటి పెన్ ఉపయోగంలో ఉన్నట్లు ఈ పెన్ తయారుచేసిన అమెరికా కంపెనీ హెడ్ కనుగొన్నారు.

ప్లాస్టిక్ లభ్యత, తయారీ రంగం ఊపందుకోవడం, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండటం, తెలివైన మార్కెటింగ్... ఇవన్నీ బాల్ పాయింట్ పెన్‌కు అనుకూల పరిస్థితులు కల్పించాయి.

బాల్ పాయింట్ పెన్ సృష్టికర్త ఎవరు?

బాల్ పాయింట్ పెన్ సృష్టికర్తగా హంగేరీ-అర్జెంటీనాలకు చెందిన లాస్జ్లో బిరో పేరు చెప్తారు గానీ, ఈ పెన్ అంతకన్నా పురాతనమైందే.

అమెరికాకు చెందిన జాన్ జే లౌడ్ 1888లో బాల్ పాయింట్ పెన్‌పై మొట్టమొదటి పేటెంట్ హక్కు పొందారు. వృత్తి రీత్యా లాయర్ అయిన లౌడ్... చెక్క, తోలు లాంటి కఠినమైన ఉపరితలాలపై కూడా రాయడానికి వీలుగా ఉండే ఇంకు పెన్ కావాలనుకున్నారు. దానికోసం గుండ్రంగా తిరిగే స్టీల్ బాల్‌ను రూపొందించారు. దాన్ని ఒక ఒరలో రాయడానికి వీలుగా అమర్చారు.

"నేను కనిపెట్టింది ఫౌంటెన్ పెన్ కన్నా మెరుగైంది. కఠినమైన ఉపరితలాలపై రాయడానికి అనువుగా ఉండేది" అని దీని పేటెంట్ కోసం పెట్టిన దరఖాస్తులో లౌండ్ వివరించారు.

లాస్జ్లో బిరో
ఫొటో క్యాప్షన్, లాస్జ్లో బిరో

లౌడ్ కనిపెట్టిన పెన్... చెక్క, తోలులాంటి వాటి మీద రాయడానికి అనువుగా ఉన్నప్పటికీ, కాగితంపై రాయడానికి అది పనికిరాలేదు. ఈ పెన్‌కు వ్యాపార విలువ లేదని భావించడంతో ఆయన పేటెంట్ కోల్పోవాల్సి వచ్చింది.

తరువాతి దశాబ్దాల్లో, లౌడ్ తయారుచేసిన్ డిజైన్‌కు మెరుగులు దిద్దడానికి అనేక మంది ప్రయత్నించారు. కానీ, ఎవరూ విజయవంతం కాలేదు.

1930లో లాస్జ్లో బిరో మొట్టమొదటి సారిగా కాగితంపై రాసేందుకు అనువుగా ఉండే బాల్‌పాయింట్ పెన్ రూపొందించారు.

హంగేరీలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న బిరో, అప్పటికి ఫౌంటెయిన్ పెన్నులు వాడి వాడి విసుగు చెందారని లండన్ డిజైన్ మ్యూజియంలో క్యూరేటర్‌గా ఉన్న గెమ్మా కర్టిన్ అన్నారు.

అయితే, ఇంకు పెన్నుల్లో వాడే సిరాను బాల్‌పాయింట్ పెన్నుల్లో వాడడానికి వీలు పడలేదు. బాల్‌పాయింట్ పెన్నుల కోసం ప్రత్యేకమైన సిరాను తయారుచేయవలసి వచ్చింది.

ఫౌంటెయిన్ పెన్నుల్లో వాడే సిరా ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో బాల్‌పాయింట్ పెన్నులకు తొందరగా ఆరిపోయే సిరా కావాలని, పత్రికల ప్రచురణకు వాడే ఇంకు లాంటిది ఇందుకు అనుకూలంగా ఉంటుందని బిరో గ్రహించారు.

ఈ సిరా తయారుచేయడానికి బిరో తన సోదరుడు గ్యోర్జీ సహాయం తీసుకున్నారు. వృత్తిరీత్యా దంతవైద్యులైన గ్యోర్జీ జిగటగా ఉంటూ, సులువుగా వ్యాపిస్తూ, త్వరగా ఆరిపోయే సిరాను కనుగొన్నారు. బాల్‌పాయింట్ పెన్నుల్లో, ఫౌంటెయిన్ పెన్నులకన్నా తక్కువ ఇంకు ఖర్చవుతోందని గమనించారు.

బాల్‌పాయింట్ పెన్నుల్లో బాల్ గుండ్రంగా తిరుగుతూ క్రమ పద్ధతిలో ఇంకు కాగితంపై విస్తరిస్తుంది. రాయడం ఆపేసిన తరువాత ఆ బాల్ కదలకుండా, బిగుతుగా ఉండి సిరా లీక్ అవ్వకుండా, గాలి లోపలికి జొరబడి ఇంకు ఎండిపోకుండా ఉండేలా చూస్తుంది.

పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను

లాస్జ్లో బిరోకు 1938లో బాల్‌పాయింట్ పెన్ మీద పేటెంట్ లభించింది. కానీ అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండడంతో ఈ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేయడం సాధ్యపడలేదు. బిరో, ఆయన సోదరుడు యూదులు కావడంలో యుద్ధ సమయంలో యూరోప్‌ నుంచి పారిపోయి అర్జెంటీనా చేరారు. అక్కడ తనలాగే పారిపోయి వచ్చిన జువాన్ జార్జ్ మెయ్‌నే సహాయంతో బాల్‌పాయింట్ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేశారు.

అర్జెంటీనా భాషలో "బిరోమే"గా పిలిచే బాల్‌పాయింట్ పెన్నును తొలిసారి 1943లో విడుదల చేశారు. ఈ పెన్ డిజైన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను ఆకర్షించింది. ఒక్కసారిగా 30,000 పెన్నులను కొనుగోలు చేశారు. విమానయానంలో, ఆకాశంలో చాలా ఎత్తులో కూడా బాల్‌పాయింట్ పెన్నులను వాడడం సులువయ్యింది. ఇంకు పెన్నులైతే అంత ఎత్తులో ఉండే పీడనం వలన ఇంకు చిమ్ముతాయి.

అయితే, అర్జెంటీనాకు బయట ఈ పెన్నులు ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు.

1945లో అమెరికాలోని ఎవర్‌షార్ప్ కో, ఎబర్‌హార్డ్ ఫాబెర్ కో సంస్థలు కలిసి ఈ పెన్నును అమెరికాలో విడుదల చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ వారి ప్రయత్నాలు అంత వేగంగా సాగలేదు. ఈలోపు అమెరికా వ్యాపారవేత్త మిల్టన్ రెనాల్డ్స్ అర్జెంటీనాలోని బుయెనస్ ఆరిస్ నగరానికి వెళ్లినప్పుడు ఈ పెన్ను చూసి ముచ్చట పడి, వాటిని కొనుగోలు చేశారు. అమెరికాకు తిరిగివచ్చిన తరువాత రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ స్థాపించి ఈ సరికొత్త పెన్నును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి రంగ సిద్ధం చేశారు.

మొదట్లో బిరో రూపొందించిన బాల్‌పాయింట్ పెన్నుకు రెనాల్డ్స్ తగినన్ని మార్పులు చేసి ఆ ఏడాది అక్టోబర్‌లో మార్కెట్లో విడుదల చేశారు.

"మార్కెట్లో విడుదల అయిన సరి కొత్త పెన్నును దాదాపు 900 రూపాయలు పెట్టి కొనడానికి జనం ఎగబడ్డారు" అంటూ టైమ్ మ్యాగజీన్ ఓ కథనంలో రాసింది.

ఈ కొత్త బాల్‌పాయింట్ పెన్నులో రెండేళ్లకొకసారి ఇంకు నింపుకుంటే చాలు. గింబెల్స్ సంస్థ 50,000 పెన్నులను కొనుగోలు చేసి 30,000 పెన్నులను మొదటి వారంలోనే అమ్మేసింది.

టైమ్ మ్యాగజీన్ కథనం ప్రకారం గింబెల్స్‌కు మొదటి ఆరు నెలల్లోనే సుమారు 41 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ప్రస్తుత కాలంలో అది దాదాపు 602 కోట్ల రూపాయలకు సమానం.

'బిరో' (బాల్‌పాయింట్ పెన్) ఇప్పుడు మనందరి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. బాల్‌పాయింట్ పెన్ తెలియని వారు, వాడని వారు ఉండరు.

"ప్రతి ఒక్కరూ ఇష్టపడే డిజైన్ ఇది" అని కర్టిన్ అన్నారు.

మార్సెల్ బిక్
ఫొటో క్యాప్షన్, మార్సెల్ బిక్

మొదటి తరం బాల్‌పాయింట్ పెన్నులు కొంతవరకూ ఫౌంటెయిన్ పెన్నుల శైలిని అనుకరించాయి. లోహాలతో తయారు చేసేవారు. ఫౌంటెయిన్ పెన్నుల్లాగే వీటిల్లో కూడా ఇంకు నింపుకోవాల్సి ఉండేది. అయితే, రెనాల్డ్స్ పెన్నుల్లో రెండేళ్లకోసారి ఇంకు నింపుకుంటే సరిపోయేది.

సరళంగా, మృదువుగా, ఏ రకమైన గందగోళం లేకుండా, ఇంకు కక్కకుండా, కాగితాలు పాడవ్వకుండా రాసే రెనాల్డ్స్ బాల్‌పాయింట్ పెన్నులు వాడడం మొదలెట్టాక... ఫౌంటెయిన్ పెన్నులకు, దానికి ఉన్న తేడా ఏంటో జనాలకు అర్థమైంది.

అయితే, ఫౌంటెయిన్ పెన్నుల రాతలో ఉన్నంత అందం బాల్‌పాయింట్ పెన్నులతో రాదన్నది మాత్రం కొందరి అభిప్రాయం. అయినా బాల్‌పాయింట్ పెన్నులు బాగా సౌకర్యవంతంగా ఉండటంతో, వాటి వాడకం పెరగడం మొదలైంది.

అయితే, ఇంతలో ఓ సమస్య వచ్చి పడింది. బాల్‌పాయింట్ పెన్నులు ఇంతమందిని ఆకట్టుకోవడంతో…ఎవర్‌షార్ప్, ఫౌంటెయిన్ పెన్నులు తయారు చేసే పార్కర్ కంపెనీ సహా అనేక కంపెనీలు బాల్‌పాయింట్ పెన్నులు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. కానీ, జానాలు రీఫిల్స్ కొంటూ, పెన్నులు కొనడం మానేశారు. బాల్‌పాయింట్ పెన్ను ఎన్నో ఏళ్లు వాడొచ్చు. రీఫిల్ మారిస్తే చాలు. దాంతో, ఈ పెన్నులకు ఉన్న మార్కెట్ మందకొడిగా మారింది.

ఈసారి బాల్‌పాయింట్ పెన్నుల పరిణామక్రమంలో మలుపు ఫ్రాన్స్‌ నుంచీ వచ్చింది. బాల్ పాయింట్ పెన్నుల కంపెనీ నడిపిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త మార్సెల్ బిక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడంలో నిపుణులు. బాల్‌పాయింట్ పెన్నులను వాడి పారేసే విధంగా రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తి చేసి, చవగ్గా అందించే పెన్నులను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

'సొసైటె బిక్' అనే సంస్థను స్థాపించి చౌక పెన్నుల ఉత్పత్తి ప్రారంభించారు. ఈ సంస్థ లోగో బాల్‌పాయింట్ పెన్నులో ఉండే 'బాల్ ముఖంగా ఉన్న ఒక బాబు బొమ్మ'తో ఉండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.

"బాల్‌పాయింట్ పెన్నులను ఇవాల్టి స్మార్ట్ ఫోన్లతో పోల్చొచ్చు. వీటిని కొనుక్కోక ముందు, ఏదైనా రాయాలంటే ఒక అనుకూలమైన వాతావరణం ఉండాలి. అనుకూలమైన బల్ల, రాయడానికి వీలుగా ఉండే అన్ని సదుపాయాలు ఉండాలి. కానీ బాల్‌పాయింట్ పెన్‌తో రాయడానికి అవేమీ అక్కర్లేదు. మంచు ప్రదేశాల్లో, వర్షం పడుతున్నప్పుడు, సముద్రం మధ్యలో ఎక్కడైనా, ఎలాగైనా రాయొచ్చు. బాల్‌పాయింట్ పెన్నులకు బ్యాటరీల్లాంటివి అవసరం లేదు. మధ్యలో ఛార్జ్ చేసుకోనక్కర్లేదు. ఎంత చిన్న జేబులోనైనా చక్కగా అమరిపోతాయి. ఇంకు అయిపోయేవరకూ నిరంతరంగా, సులువుగా రాసుకుంటూ ఉండొచ్చు" అంటూ కెనడాకు చెందిన జర్నలిస్ట్ డేవిడ్ సాక్స్ ఈ పెన్నుల విశిష్టతను ప్రశంసించారు.

అయితే, ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప డిజైన్ కలిగిన బాల్ పాయింట్ పెన్నులు కూడా కనుమరుగైపోతున్నాయని, ఇప్పటివరకూ వాటిని కనుగొని ఉండకపోతే, ఈ కాలంలో వాటిని కనుక్కుంటే ప్రపంచంలోనే అతి పెద్ద విషయంగా పరిగణించి ఉండేవారిని సాక్స్ అభిప్రాయపడ్డారు.

బిక్ ఉత్పత్తి చేసిన చౌక పెన్నులు విజయవంతం కావడానికి ఒక ముఖ్య కారణం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరగడం అని చెప్పుకోవచ్చు. తరువాతి కాలంలో ఈ పెన్నులు మరింత చౌక ధరకు లభ్యమవ్వడం మొదలయ్యింది.

రచయిత ఫిలిప్ హెన్షెర్ 2012లో చేతిరాత మీద రాసిన "ది మిస్సింగ్ ఇంక్" పుస్తకంలో బాల్‌పాయింట్ పెన్ విశిష్టతను కొనియాడారు. బిక్, ఈ పెన్నులను చౌకగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చెయ్యడమే కాకుండా, దశాబ్దాల తరబడి నిలిచిపోయేలా వీటి రూపకల్పన చేశారని ప్రశంసించారు.

బాల్‌పాయింట్ పెన్నుల్లో క్రిస్టల్ పెన్నులది విలక్షణమైన డిజైన్. 1950 నుంచీ క్రిస్టల్ పెన్నుల ఉత్పత్తి ప్రారంభమయ్యింది. 2006కి 10వేల కోట్ల క్రిస్టల్ పెన్నులు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

"షడ్భుజిలా ఉండే క్రిస్టల్ పెన్ చేతితో పట్టుకుని రాయడానికి సులువుగా ఉంటుంది. పారదర్శకంగా ఉండటం వల్ల ఈ పెన్నులో ఇంకు ఎంతవరకూ ఉందనేది మనకు తెలుస్తుంది. బిక్ పెన్నులు ఓ అద్భుతం" అని హెన్షెర్ అన్నారు.

బిక్ పెన్నులు ఆఫ్రికా సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయని హెన్షెర్ తెలిపారు.

"బిక్ పెన్నులు ఆఫ్రికా సమాజాన్ని మలుపు తిప్పాయి. బిక్ పెన్నులు ప్రవేశ పెట్టకముందు ఆఫ్రికాలో రాసేందుకు సులభమైన మార్గమే లేదు" అని హెన్షెర్ వివరించారు.

పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను

ఇంత విశిష్టత సాధించిన బాల్‌పాయింట్ పెన్ కూడా ఒక ముఖ్యమైన విమర్శను ఎదుర్కొంది. 1950ల నుంచి వాడి పారేసే వీలున్న బాల్‌పాయింట్ పెన్నులను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేశారు. దీనివలన అపారమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏడాదీ 160 కోట్ల బాల్‌పాయింట్ పెన్నులను వాడి పారేస్తున్నారని అంచనా.

పారేసిన కోట్లకొద్ది పెన్నులన్నీ భూగర్భంలో పేరుకుపోయి ఉంటాయని కర్టిన్ అన్నారు.

"కొన్ని రకాల పెన్నుల్లో మళ్లీ రీఫిల్ వేసుకుని వాడొచ్చు. కాని, మనం దాన్ని పారేసి కొత్తది కొనుక్కుంటాం. ఇది చాలా వింతైన విషయం" అని కర్టిన్ అభిప్రాయపడ్డారు.

అయితే, బాల్‌పాయింట్ పెన్ తయారీదారులకు అవి సృష్టిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన ఉంది. బిక్ కంపెనీ 74% రీసైకిల్ ప్లాస్టిక్‌ను ఉపయోగించి వివిధ రకల పెన్నులను ఉత్పత్తి చేస్తోంది. కొందరు తయారీదారులు వాడిన తరువాత పెన్నులు పారేయకుండా, రీఫిల్ మార్చుకుని మళ్లీ వాడేలా కొనుగోలుదారులను ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు పెన్నులను అట్టతో లేదా లోహంతో తయారుచేస్తున్నారు. అయితే, లోహంతో చేసే పెన్నుల ఖరీదు కాస్త ఎక్కువే!

''ప్రస్తుత డిజిటల్ కాలంలో తెరలు, కాగితాల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయేమో. కానీ, బాల్‌పాయింట్ పెన్నులు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. వాటి స్థానం కోల్పోవు. సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీ పాతదైపోయిందని అంటారు గానీ పెన్నులు పాతవైపోయాయని ఎవరూ అనరు. మార్క్ జుకర్బర్గ్, ఎలోన్ మస్క్ టేబుల్‌పై కూడా కొన్ని బాల్‌పాయింట్ పెన్నులు ఉండే ఉంటాయి" అని సాక్స్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)