వరల్డ్ పోస్ట్ డే: ఉత్తరాల నుంచి వాట్సాప్ సందేశాల వరకూ... : అభిప్రాయం

ఫొటో సోర్స్, India Post/Facebook
- రచయిత, డాక్టర్ శైలజా చందు
- హోదా, బీబీసీ కోసం
పక్క వాటాలో కాత్యాయనికి పెళ్లి కుదిరింది. ఆయనెక్కడో ఉత్తరభారత దేశంలో చలిగా వుండే చోట పని చేస్తున్నాడు.
అదొక గొప్ప వుద్యోగం.
ఆ విషయం మాకెలా బోధ పడిందంటే, పెళ్ళి ఇంకా నాలుగు రోజులున్నదనగా మా వూరి పోష్ఠు బంట్రోతు సుదర్శనం తంతి తెచ్చాడు.
''అత్యవసరమైన ఇబ్బందులొచ్చి పడ్డాయని, హోల్డాలు, ట్రంకు పెట్టే నెత్తిమీంచి దించకుండా, తీసుకెళ్లిన తట్టా బుట్టా విప్పకుండానే వెనక్కి తిరిగిరమ్మ''ని అందులో కబురు.
''ఆహా, ఎంతటి సమర్థుడు, అంటే అక్కడున్న వారంతా చేతకాని చవటలే, ఈయన పెళ్లి మానుకుని వెళ్తే, తప్ప అక్కడ పరిస్థితి చక్కబడదనన్నమాట." వరుడు, వాళ్ల కొంపలు మునక్కుండా కాపాడే మొనగాడని, అందరం తబ్బిబ్బైపోయాము. చిలవలు పలవలుగా చెప్పేసుకున్నాము. ఎంత గొప్ప వుద్యోగం?
వెళితే మళ్ళీ యేనాటికొస్తాడో తెలియదు. పెళ్ళి కానిచ్చేద్దామని పెద్దలంతా నిశ్చయించుకున్నారు. ఒక బలమైన పెట్టుడు ముహూర్తంలో కాయితాల పెళ్లి కానిచ్చేశారు.
కాయితాల పెళ్లి ఇద్దరూ రెండు కుర్చీల్లో కూర్చుని, రెండు కాగితాలు చదువుతారు, రెండు దండలేసుకుంటారు.
అలా ఇరవై, ముప్ఫై రూపాయల్లో ఘనంగా పెళ్లి జరిపించారు.
పెళ్లైన తర్వాత అమ్మాయి , అబ్బాయీ పలకరించుకోలేదు.
మీరిద్దరూ కాసేపు మాట్టాడుకోండి అనగలిగే పెద్ద మనసున్న వారెవరో లేరా పందిట్లో. కొత్త దంపతులు మాట్టాడుకోవడమన్నది విరగబాటు వేషంగా పరిగణించే రోజులవి. టాటా చెప్పుకోవడం మాత్రం తెలిసి చచ్చిందా?
మోటు మడుసులం.
సరే, అమ్మాయి లోపలే వుండిపోయింది. అబ్బాయిని బండెక్కించి వచ్చారు.

ఫొటో సోర్స్, India Post/FB
తర్వాత ఓ నాడు, కోడల్ని చూద్దామని పెళ్లి కొడుకు తల్లి వచ్చింది . ఆమె టీచరుద్యోగం చేసే ఆధునిక మహిళ. చక్కగా ఆరోగ్యకరమైన ములక్కాడ వంటి మనిషి. చాలా మర్యాదగా చూశారామెను. పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు. కోడలిని దగ్గర కూర్చోబెట్టుకుని, ఆ మాటా, ఈ మాటా మాట్టాడుతూ చెంపలు, జుట్టూ సవరించింది.
కాబోయే అత్తగారొచ్చిందోనాడు.
కోడల్నోమాటు చూసి రమ్మని జాబు వ్రాశాడట. ఆ ఇంగ్లాండు కవర్ తీసుకొచ్చింది.
ఆ నీలి లేఖ తెచ్చిన మేఘ సందేశానికి మా ఇల్లంతా పులకరించింది.
ఇత్తడి గ్లాసులో అత్తగారికి కుదురుగా కాఫీ తీసుకెళ్లిన మా కాత్యాయిని ముఖంలో ఆనందం ఇప్పటికీ గుర్తే.
వెళ్లే ముందు యథాలాపంగా అన్నట్టు అన్నదామె. వాడికో జాబు రాయవే పిల్లా అని.
ఆవిడామాట తమాషాకన్నట్లు పిల్ల తరఫు ఆడంగులు తేల్చెయ్యబోతుంటే "విధిగా వ్రాయించండి." అని వియ్యంకుడికే చెప్పింది.
కాత్యాయిని వాళ్ల నాన్న గారు లెక్కల మాష్టారు. మర్నాడు ఓ ఇంగ్లాండు కవర్ తెచ్చి ఇచ్చారు గానీ మథన పడుతూనే వున్నారు. ఈ పిల్ల యేమి వ్రాస్తుందో.
ఒక వేళ పిల్లవాడికి ఆక్షేపణీయమైనవి వ్రాస్తే?
తన పెంపకానికి మచ్చపడదా?
కుటుంబ ప్రతిష్ఠ పెచ్చులూడదా?
ఎనిమిది వరకూ చదువుకున్న పిల్లే కానీ, వుత్తరంలో ఏమి వ్రాయాలో కాత్యాయని కి తెలియలేదు. తల్లి దగ్గరకు వెళ్లి అడిగింది. తల్లికొచ్చిన విద్యలు రెండే. పొయ్యి వూదడం , వంట చెయ్యడం.
అందుకని మాష్టారే కూర్చుని డిక్టేషన్ వలె చెప్పేవారు.

ఫొటో సోర్స్, India Post/FB
‘‘మహారాజశ్రీ శ్రీవారికి,
ఇక్కడంతా క్షేమం.
మా వూరి రథోత్సవం ఘనంగా జరిగింది.
సంబరాలలో అంబుజమ్మకు నూకాలమ్మ పూనింది. గోవర్ధనుడు పొరపాటున కాలుజారి గుండేరులో పడ్డాడు. మహాలక్ష్మి ఎంతో సమయస్ఫూర్తితో చెరువులోకి దూకి దూడ బిడ్డని కాపాడుకుంది.
ఆరోగ్యమైన ఆవుపాలనే తీసుకోండి.
ఎక్కువ సేపు నిద్ర కాయవద్దు.
ఇట్లు
మీ పాద దాసి
కాత్యాయని.’’
డిక్టేషన్ చెప్పి వ్రాయించినా ఒక సారి చూసి ఫెయిర్ చేసేవారు కాత్యాయని వాళ్ల నాన్నగారు. పొల్లులు, వత్తులు సరిగా పెట్టిందోలేదోనని.
లెక్కల మాష్టారైనా, ఆయనకు తెలుగు భాషపై గట్టి పట్టుంది. దండ ధారునికి, దండ ధరుని గల యమ వ్యత్యాసమేమిటో తెలిసిన మనిషి.
ఆ పెళ్లయిన బ్రహ్మచారి భర్త నుండి వచ్చే వుత్తరాలకోసం కాత్యాయిని ఎదురు చూసేది. ఆయన తనుండే వూరి విశేషాలను వ్రాసేవాడు. ఎత్తైన దేవదారు వృక్షాలు, చక్కటి సెలయేళ్లు వుంటాయని, అన్నం దొరకదనీ, రోటీలు తింటారనీ, సబ్జీ నంజుకుంటారని, ఇత్యాది వివరాలుండేవా లేఖల్లో.
ఆ విషయాలు మాకెలా తెలుసేవంటారా?
ఏమోనండి, ఆ రోజుల్లో,
'న వుత్తరం గోప్యమర్హతి'.
కాత్యాయిని కూడా ఆ వివరాలు మాతో పంచుకోవడానికి తెగ వుబలాట పడేది.
అందరూ నిద్రపోయాక, బుడ్డి దీపం దగ్గరగా పెట్టి చదువుకునేది కాత్యాయని. అప్పటికే వంద సార్లు మననం చేసుకోవడం వల్ల ఆమెకు కామాలతో సహా నోటికొచ్చేసినా ఆ అక్షర నక్షత్రాలను లెక్కబెట్టుకునేది. తెల్లవారాక ఆ పారిజాతాలను మళ్లీ యేరుకునేది. మెల్లగా మాష్టారు గారు డిక్టేషన్ చెప్పకుండానే వుత్తరం వ్రాసుకోగల స్థాయి కొచ్చింది కాత్యాయని.
తనకెప్పుడు వుత్తరమొస్తుందో సరిగ్గా తెలిసిపోయేది కాత్యాయిని. తన వుత్తరం ఆయనకెప్పుడు చేరుతుంది, ఆయన తిరుగు టపా వ్రాస్తే, యెన్నాళ్లకు తనకు చేరుతుందో ఖచ్చితంగా లెక్కగట్టగలిగేది.
ఉత్తరం వచ్చేనాడు ఇల్లూ వాకిలీ చక్కగా శుభ్రం చేసి ముగ్గులు పెట్టేది. ఇల్లు కళకళాడుతోందంటే, వుత్తర మహాలక్ష్మి మా ఇంటికి రాబోతుందని. తనతో బాటే మేము కూడా యెదురు చూస్తూ వుండేవాళ్లం.
పోష్టు బంట్రోతు సుదర్శనం ప్రతి రోజూ పదకొండింటికి మా ఇంటిముందు రోడ్డు మీద వెళ్లేవాడు.
ఆశించిన రోజు వుత్తరం రాకపోతే కాత్యాయిని మంచి నీళ్లు ముట్టేది కాదు.
పదకొండు దాటి, గడియారంలో ముల్లు , ఒక్క మిల్లీమీటరు దాటినా మా అందరి గుండెలూ గుబ గుబ లాడేవి.
క్షణమొక యుగం.

ఫొటో సోర్స్, India Post/FB
ఈ వాట్సాపుల్లో గ్రూపులు, సముద్రంలో ద్వీపాల్లా రకరకాల గ్రూపులు, పేర్లు!
కథా కాకరకాయ గ్రూప్,
కవితా బొబ్బట్టు గ్రూప్,
పద్య పెసరట్టు.
సాహిత్యం సాదా అట్టు.
పెద్ద పెద్ద గ్రూపుల్లో ఓ వారం మాట్లాడకపోయినా పెద్ద పట్టించుకోరు.
చిన్న చిన్న గ్రూపుల్లో ఎలా ఉంటుందంటే, ఇద్దరు ముగ్గురు కలిపి గ్రూప్ పెట్టేసి మాట్టాడుతుంటారు.
మనం వెంటనే పలక్కపోతే బాధపడతారు
ఉదాహరణకు, మా అమ్మా, పెద్దమ్మా, కల్సి ఒక గ్రూప్ పెట్టి నన్ను ఇరికించారు.
యాప్‌ల సహాయంతో వాళ్ల ఫొటోలకు మెరుగు దిద్ది నాకు పంపిస్తుంటారు. పేరాచూట్ ఎక్కి నేల మీద దిగుతున్నట్టు, రాకెట్లో కూర్చుని తిరుపతి వెళుతున్నట్టూ, ప్రేమ సింబళ్ల జడి వానలతో వాళ్ల టెక్నో విజ్ఞానం విరాజిల్లుతోంది.
మొట్ట మొదటిసారి ఇ-మెయిల్ గురించి విని పకపకామని నవ్వింది వీళ్లే.
''అదేంటమ్మాయా, ఇక్కడ నొక్కితే , అక్కడ వుత్తరమందడవేంటే? ఇదేఁవి చిత్రమే!''

ఫొటో సోర్స్, Getty Images
మొక్కలేవో పెంచుతున్నారట. వాటికి నీళ్ళు పోశామనీ, తలదువ్వి, జడలేశామనీ రోజూ ఫొటోలు పెడుతుంటారు.
పెరుగు తోటకూరకు హరిత అని పేరు పెట్టారట.
ఎర్రగా వుండే కొయ్యతోటకూరకు అరుణ అని పెట్టమన్నాను.
మొన్న ఎక్కడో చిలక తోక కనపడిందిట. ఒక చెట్టు ఫొటో పెట్టారు.
వాళ్ళిద్దరూ వాయిస్ మెసేజులతో మాట్టాడుకుంటుంటారు.
టైపింగ్ బద్ధకమో, అసలు రాదేమో?
నేను మౌనంగా చూస్తుంటా.
''అమ్మాయి ఏమీ మాట్టాడదేం?''
"చూసిందో లేదో?"
"చూసింది చూసింది. ఏవే, చూసి కూడా మాట్టాడవే? బులుగు టిక్కులు కూడా పడితే!"

ఫొటో సోర్స్, Reuters
బులుగు టిక్కులంటే గుర్తొచ్చింది.
నిన్న జరిగిన మీటింగులో మా డైరెక్టర్ ప్రతిపాదించిన మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయనకొక మెసేజ్ పెట్టాను.
మా అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకునే నియంత అయినందుకు అత్యంత సంస్కారవంతమైన భాషలో అభినందించాను.
ఆయన ధోరణి వల్ల ఎప్పటికప్పుడు మా ప్రాణాలు తోకలో కాపురముంటున్నాయని వివరించాను.
మిర్చి కూర్చిన మెసేజి.
ఆ ఘాటుకి వుక్కిరి బిక్కిరి అయితే చాలు.
తాడో , పేడోనన్న సందిగ్ధావస్థ వీడుతుంది. ఎన్నాళ్లీ గుంజాటన. మొత్తానికి పిల్లిమారాజుకి గంట హారం పంపించి గంట అయింది.
ఆ ఎర్ర మెసేజి చదివినట్టుగా బ్లూ టిక్కులింకా పడలేదు.
గడియారం టిక్కు టిక్కు మంటోంది తప్ప టిక్కులు రావడం లేదు.
క్షణమొక యుగం.
(ఇందులోని పాత్రలు కల్పితం)
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








