కోవిడ్‌: భారత్‌లో కరోనావైరస్ సంక్షోభం మోదీ బ్రాండ్‌ ఇమేజ్‌ను ఎలా దెబ్బతీసిందంటే...

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మోదీ భారత్‌ను లాక్‌డౌన్ నుంచి బయట పడేసి, కోవిడ్ వినాశనం వైపు నడిపిస్తున్నారు" అని బ్రిటన్‌కు చెందిన 'సండే టైమ్స్' మ్యాగజీన్‌లో హెడ్‌లైన్‌గా రాశారు.

ఈ కథనాన్ని 'ది ఆస్ట్రేలియన్' వార్తా పత్రిక పునఃప్రచురిస్తూ ఒక కటువైన సమీక్ష రాసింది.

"అహంకారం, అతి జాతీయవాదం, ప్రభుత్వ అసమర్థత కలిసి సృష్టించిన మహా సంక్షోభంలో భారత ప్రజలు శ్వాస తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ, జనాదరణ కలిగిన ప్రధాని మాత్రం చలి కాచుకుంటున్నారు" అనేది ఆ సమీక్ష సారాంశం.

ఈ వ్యాఖ్యపై భారత్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

కానీ, ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇన్నాళ్లూ ఉన్న జనాదరణ తగ్గిందనేది కాదనలేని వాస్తవం.

అంతర్జాతీయ పత్రికల్లోను, సోషల్ మీడియాలో కూడా భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధించిన వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి.

ఆక్సిజన్ లభించక, పడకలు దొరకక, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఐసీయూ బెడ్లు దొరకక రోగులు పడుతున్న అవస్థలు, తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు, సామూహిక అంత్యక్రియలు, పార్కింగ్ స్థలాలను, పార్కులను శ్మశాన వాటికలుగా మలుస్తున్న తీరు.. వీటన్నిటి గురించి గ్లోబల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ కథనాలన్నీ ప్రధాని మోదీవైపే వేలెత్తి చూపిస్తున్నాయి.

మోదీ తనను తాను సమర్థుడైన పాలకుడిగా, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునే బాధ్యతగల నాయకుడిగా చెప్పుకుంటారుగానీ కరోనా విపత్తును దాటించడంలో ఘోరంగా విఫలమయ్యారని అంతర్జాతీయ పత్రికలు విమర్శిస్తున్నాయి.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

బీటలువారిన ఇమేజ్

"పాలనాదక్షత ఆయన గుర్తింపు అయితే, ఇప్పుడు అనేకమంది దాన్నే ప్రశ్నిస్తున్నారు. ఏం చెయ్యాలో పాలుపోక ప్రభుత్వం చేతులెత్తేయడమో లేక కంగారు పడడమో కాదు... ప్రభుత్వమే ఉన్న పరిస్థితిని దిగాజార్చేస్తోంది" అని రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైంది మోదీ ఒక్కరే కాదు. కానీ ఈ సమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు నిరాశాజనకంగా ఉందని వైష్ణవ్ అన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు, డోనల్డ్ ట్రంప్‌లాగా, బ్రెజిల్ అధ్యక్షుడు జైల్ బోల్సొనారోలాగా మోదీ "కోవిడ్ లేదు" అని వితండవాదం చేయలేదు. కానీ, విపత్కర పరిస్థితులను నివారించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. సెకండ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించినప్పటికీ ఎలాంటి ముందస్తు ఏర్పాట్లూ చేయలేదని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.

అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Getty Images

హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు మోదీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో ఒక నెలపాటు ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టారు. మాస్క్ లేకుండా ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. ర్యాలీల వద్ద లక్షలాదిమంది గుమిగూడారని పొంగిపోయారు.

"ప్రపంచంలో అనేకచోట్ల లాక్‌డౌన్లు విధిస్తుంటే భారత్‌లో ఈ నిర్లక్ష్య ధోరణి షాకింగ్‌గా ఉంది" అని 'ది ఎకానమిస్ట్' ఇండియా ప్రతినిధి అలెక్స్ ట్రావెల్లి అన్నారు.

అంతే కాదు, భారత్ కరోనాను జయించిందని జనవరిలో దావోస్‌లో మోదీ పలికిన మాటలను కొందరు ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నారు.

"ఆయన జాతీయవాద ప్రేరేపణ ఎల్లప్పుడూ సాంకేతిక సామర్థ్యంతో ముడిపడి ఉంటుందని ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. కోవిడ్ సంక్షోభంలో ఆ సాంకేతిక సామర్థ్యం అసలు కనబడకుండా పోయింది" అని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ క్లారీ అన్నారు.

వాస్తవానికి ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోదీకి ఉన్న ఖ్యాతి 2016లో జరిగిన నోట్ల రద్దుతోనే బీటలు వారడం ప్రారంభమైంది.

భారత్‌లో అధిక శాతం ప్రజలు కరెన్సీ నోట్లతోనే వ్యవహారాలు నడుపుతారు. అలాంటిది, నోట్ల రద్దు ప్రకటించగానే ఎంతోమంది రోడ్డున పడిపోయారు.

గత ఏడాది, కోవిడ్‌ను కట్టడి చేయాలంటూ ముందస్తు సూచనలేమీ జారీ చేయకుండా రాత్రికి రాత్రి లాక్‌డౌన్ ప్రకటించారు.

దాంతో అనేకమంది ఉపాధి కోల్పోయారు. వలస కూలీల సంక్షోభం తలెత్తింది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.

ఈ చర్యల వలన కలిగే పర్యవసానాల కన్నా జరిగే మేలే ఎక్కువ అని మోదీ వాదించారు.

నోట్ల రద్దుతో అక్రమ నగదు బయటపడుతుందని, లాక్‌డౌన్‌తో కోవిడ్‌ను అదుపు చేయగలమని నమ్మబలికారు.

కానీ, ప్రస్తుతం తలెత్తిన విపత్తుకు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోలేరని 'ఫారిన్ పాలసీ' ఎడిటర్-ఇన్-చీఫ్ రవి అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

"జీడీపీ గణాంకాలకు వివరణ ఇవ్వొచ్చు. కానీ, సొంత తమ్ముడి చావుకు వివరణ ఇవ్వలేరు. మోదీ తప్పులు చేసినప్పటికీ ఎల్లప్పుడూ తమ కోసం నిలబడతారని, తమను కాపాడతారని భారత ప్రజలు విశ్వసించారు. కానీ, ఈసారి మాత్రం మోదీ ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నారు.

మోదీ ఇమేజ్ బీటలు వారడం మొదలైంది. అది కచ్చితంగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది" అని రవి అగర్వాల్ అన్నారు.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మోదీ ఇమేజ్ తయారు కావడం, కూలడం

"మోదీ అంటే కార్యదక్షత" అని 2012లో 'టైం మ్యాగజీన్' కవర్ పేజి మీద వచ్చింది.

2002లో రైల్లో మంటలు అంటుకుని 60 మంది హిందువులు చనిపోయిన తరువాత గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు. వారిలో ముస్లింలే అధికం.

ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఈ అల్లర్లు జరగడానికి అనుమతించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ మోదీ తోసిపుచ్చారు. తన ఇమేజ్‌కు ఏ మాత్రం నష్టం రాకుండా కాపాడుకున్నారు.

2012 నాటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ "అధికార దక్షత కలిగిన నాయకుడు"గా పేరు తెచ్చుకుని మద్దతుదారులను కూడగట్టుకోగలిగారు.

అయితే, ఆయన "నిరంకుశమైన నాయకుడు", "పేలవమైన ప్రజా ప్రతినిధి" అని కొందరు పెదవి విరిచినప్పటికీ మోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి చెందిందని, వ్యాపారం వృద్ధి చెందిందని ప్రశంసించారు.

కరోనా సాయం

ఫొటో సోర్స్, PA Media

పదమూడేళ్లపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన తరువాత ప్రధాని పదవికి మోదీ పూర్తిగా అర్హులని, భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించగల నాయకుడని అనేకమంది విశ్వసించారు.

"ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను ముందుకు నడిపించడం ఒక రకంగా సులభం. అది చూసి మనమంతా ఆ ప్రలోభంలో పడిపోయాం" అని మోదీ బయోగ్రఫీ రాసిన నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అన్నారు.

కొత్త రోడ్లు, విద్యుత్ లైన్లు, తక్కువ బ్యూరోక్రాటిక్ జోక్యం, ప్రైవేటు పెట్టుబడులు పెరగడం.. ఇవన్నీ గుజరాత్ మధ్యతరగతి, ధనిక ఓటర్లను ఆకర్షించాయి.

అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న, తక్కువ జనాభా గల రాష్ట్రంలో ఇవన్నీ సాధించడం పెద్ద విశేషమేమీ కాదని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.

ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే, గుజరాత్ సామాజిక అభివృద్ధి సూచీలలో మాత్రం పెద్దగా మెరుగుదల కనిపించలేదు.

కరోనా సాయం

ఫొటో సోర్స్, Getty Images

"మోదీకి ఉన్న ఈ ఇమేజ్ ప్రభావంలో మనందరం పడిపోయాం. నేను కూడా ఆ తప్పే చేశాను. మనకు రెడ్ కార్పెట్లే ఉన్నాయి గాని, రెడ్ టేప్స్ లేవని ఓసారి మోదీ అన్నారు. ఇప్పుడు వస్తున్న విదేశీ సహాయానికి రెడ్ కార్పెట్లు ఎక్కడ?" అని ప్రశ్నించారు.

విదేశాల నుంచి భారత్‌కు అందుతున్న సహాయం కస్టమ్స్‌లో చిక్కుకుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

ప్రస్తుత సంక్షోభం మోదీ బలహీనతలను బహిర్గతం చేస్తోదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కిందటి ఏడాది వరకు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత, సామర్థ్యం మాకే ఉన్నాయని కేంద్రం భరోసా కల్పించింది.

ఇప్పుడు ఈ సంక్షోభ సమయంలో బరువు, బాధ్యతలన్నీ రాష్ట్రాలకే వదిలేస్తోంది.

ఉదారంగా వ్యాక్సీన్ వ్యూహాన్ని రూపొందించి ఇతర దేశాలకు డోసులను పంపించారు.

ఇది చాలా నిర్లక్ష్యంతో కూడుకున్న చర్యగా ఇప్పుడు తోస్తోంది. ఎందుకంటే, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వెనకడుగు వేయమని దేశంలోని అతి పెద్ద వ్యాక్సీన్ తయారీదారులపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అయితే, స్వదేశంలో వ్యాక్సీన్ తయారీకీ విదేశాల నుంచే నిధులు సమకూరాయి.

మోదీ మెజారిటీవాదాన్ని ఆయన మద్దతుదారులు ఇప్పటికీ సమర్థిస్తున్నారు. కానీ, ఈ మెజారిటీవాదం కారణంగానే సంక్షోభ సమయంలో కూడా ఆయన ప్రతిపక్షాలతో మాట్లాడలేకపోతున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.

"అన్నిటిపైనా మోదీ తన పేరు, స్టాంప్ ముద్రిస్తూ ఉంటారు. తప్పులు జరిగినప్పుడు కూడా ఆ బాధ్యతను స్వీకరించాలి. మంచి మాత్రమే కావాలి, చెడు వద్దు అనుకుంటే కుదరదు" అని రవి అగర్వాల్ అన్నారు.

మోదీ బ్రాండ్‌కు బీటలు వారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయంగా కూడా మోదీ మంచి బ్రాండ్ ఇమేజ్ సృష్టించారు

గతంలో అమెరికాలోని టెక్సస్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను కూడా మోదీ నీడ కప్పేసిందంటూ ఒక అంతర్జాతీయ పత్రిక మోదీ ఇమేజ్‌ను అభివర్ణించింది.

"దూకుడు గల నాయకుడిగా, ప్రజలకు ఎల్లప్పుడూ కంటికి కనిపించే పాలకుడిగా ఆయన ఇమేజ్ సృష్టించుకున్నారు" అని రవి అగర్వాల్ అన్నారు.

"మోదీ పెంచి పోషించిన జాతీయవాదం స్వదేశంలోనూ, విదేశాల్లో కూడా భారతీయులకు ఒక ఔషధతైలంలా పనిచేసింది. ఆయన నాయకత్వంలో ఇండియా సూపర్ పవర్‌గా ఆవిర్భవించబోతోందని విశ్వసించారు.

ఇప్పుడు చిన్న చిన్న దేశాలైన థాయ్‌లాండ్, వియత్నాం, బంగ్లాదేశ్ కూడా భారత్ కన్నా ఎంతో సమర్థంగా కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొంటున్న తీరును చూసి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నిరాశ చెందుతున్నారు.

తమ విదేశీ మిత్రులకు భారత్‌ను సూపర్ పవర్‌గా, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా చూపించినవారు.... ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను చూసి సిగ్గుపడుతున్నారు" అని రవి అగర్వాల్ వ్యాఖ్యానించారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

మోదీ ఇమేజ్ మళ్లీ పూర్వస్థితికి రాగలదా?

"క్లిష్ట పరిస్థితులను అధిగమించగల రాజకీయ నాయకుడిగా మోదీ నిరూపించుకున్నారు. ఇంతకుముందు కూడా అసాధారణ పరిస్థితుల నుంచి ఆయన బయటపడగలిగారు. కాబట్టి ఇప్పుడు తన ఇమేజ్‌ను మళ్లీ నిర్మించుకోలేరని నేను భావించట్లేదు" అని వైష్ణవ్ అన్నారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలు చేస్తోంది. మీడియాలో వచ్చే ప్రతికూల అంశాలపై స్పందిస్తోంది. ప్రతిపక్షాలతో వాగ్వాదం చేస్తోంది. ట్విటర్‌లో వస్తున్న ప్రతికూల వ్యాఖ్యలపై విరుచుకుపడుతోంది.

భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి "విదేశాలు చేస్తున్న కుట్ర" అని కూడా ఆరోపించింది.

ట్విటర్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకుంది. ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించే విధంగా ట్విటర్‌ను ఒత్తిడి చేసింది.

అయితే, మోదీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఏప్రిల్ 20న ఇచ్చిన ప్రసంగం తప్ప మళ్లీ ఎక్కడా ఆయన కనిపించలేదు.

"కోవిడ్ ప్రారంభంలో భారత ప్రజలకు, మిగతా ప్రపంచానికి తాను ఎలా కనిపించాలో మోదీకి తెలుసు. భారత ప్రజలను కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కించే జనరల్‌లా తనను తాను ప్రదర్శించుకున్నారు. కానీ ఇప్పుడు అలా చూపించుకునే పరిస్థితి లేదు. క్షమాపణ అడగడానికిగానీ సహాయాన్ని అర్థించేందుకుగానీ ఆయనకు ఆసక్తి లేదు" అని వైష్ణవ్ అన్నారు.

మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తరువాత చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. కోవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా విలేఖరుల సమావేశం నిర్వహించలేదు.

"ఆయన్ను ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారు" అని ముఖోపాధ్యాయ అన్నారు.

అయితే, ఇప్పుడు భారత ప్రజలకు ప్రశ్నలు మాత్రమే మిగిలాయి.

పేద ప్రజలకు, తీవ్ర ఆందోళనల్లో ఉన్న మధ్యతరగతివారికి, డబ్బు ఉండీ చికిత్సకు గతి లేక బాధపడుతున్న ధనిక వర్గాలకూ కూడా ప్రశ్నలే మిగిలాయి.

ఆఖరికి, అంకితభావంతో పని చేసే పార్టీ కార్యకర్తలకు కూడా.. ఈ పరిస్థితి దాపురించేవరకూ ప్రధాని ఎందుకు ఊరుకున్నారు అనే ప్రశ్నే వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)