DRDO 'కోవిడ్ మెడిసిన్'కు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదం

ఫొటో సోర్స్, DRDO
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ అండ్ అలయిడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఏఎస్), హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌తో కలసి అభివృద్ధి చేసిన కోవిడ్ మందు అత్యవసర వినియోగానికి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ) ఆనుమతించింది.
కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వారు త్వరగా కోలుకునేందుకు ఈ మందు ఉపయోగపడుతోందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితిని కూడా ఈ ఔషధం తగ్గిస్తోందని కూడా ప్రయోగాలలో వెల్లడైంది.
'2-డియోక్సీ-డి-గ్లోకోజ్' (2-డీజీ)గా వ్యవహరిస్తున్న ఈ యాంటీ-కోవిడ్-19 చికిత్స ఔషధాన్ని కోవిడ్ బాధితుల మీద పరీక్షించినప్పుడు వారిలో అత్యధిక శాతం మందికి ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాల వచ్చాయి. ఈ మందు కోవిడ్ రోగులకు అత్యంత మేలు చేస్తుందని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ డీఆర్‌డీఓ కోవిడ్ చికిత్స కోసం 2-డీజీ మందును అభివృద్ధి చేసే పని ప్రారంభించింది.
కరోనా మొదటి వేవ్ విరుచుకుపడిన 2020 ఏప్రిల్ నెలలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)తో కలసి ఈ మందుపై ప్రయోగాలు చేశారు. ఇది సార్స్-కోవ్-2 వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థంగా పని చేయడమే కాకుండా, వైరస్ పెరుగుదలను అడ్డుకుంటోందని ఈ ప్రయోగాల్లో వెల్లడైంది.
ఈ ఫలితాల ఆధారంగా భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఈ మందును కోవిడ్-19 రోగుల మీద రెండో దశ ప్రయోగాలు చేయడానికి 2020 మే నెలలో అనుమతించింది.

ఫొటో సోర్స్, DRDO
రెండో దశ ప్రయోగాల్లో 2-డీజీ మందు కోవిడ్ పేషెంట్ల మీద సమర్థంగా పని చేస్తున్నట్లు రుజువైంది. గత ఏడాది మే నెల నుంచి అక్టోబర్ దాకా జరిగిన వైద్య ప్రయోగాలు ఈ మందు సురక్షితమని తేలింది. కోవిడ్ బాధితులకు ఈ మందు ఇచ్చినప్పుడు వారిలో చెప్పుకోదగిన మెరుగుదల కనిపించిందని డీఆర్‌డీఓ తెలిపింది. దేశవ్యాప్తంగా ఫేజ్ 2ఏ ఆరు ఆస్పత్రులలో, ఫేజ్ 2బీ 11 ఆస్పత్రులలో నిర్వహించారు. ఈ దశలో 110 మంది కోవిడ్ పేషెంట్లపై ప్రయోగాలు నిర్వహించారు.
కోవిడ్‌కు ఇప్పుడున్న ప్రామాణిక చికిత్సలతో పోల్చితే 2-డీజీ మందు వేగంగా వ్యాధి లక్షణాలను తగ్గిస్తున్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. ఫేజ్-2 ప్రయోగాలు విజయవంతం కావడంతో డీసీజీఐ గత ఏడాది నవంబర్ నెలలో ఫేజ్-3 ప్రయోగానికి కూడా అనుమతించింది.
2020 డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ఆస్పత్రుల్లో 220 మంది కోవిడ్ రోగుల మీద ఈ మందుతో ప్రయోగాలు నిర్వహించారు.
ఈ ప్రయోగాల్లో కోవిడ్ బాధితులు అత్యధిక సంఖ్యలో వ్యాధి లక్షణాల నుంచి కోలుకున్నారు. మూడో రోజునే ఆక్సిజన్ మీద ఆధారపడకుండా స్వయంగా శ్వాసించగలిగారు. అంటే, ప్రామాణిక చికిత్సతో పోల్చితే 2-డీజీ మందుతో కోవిడ్ బాధితులు త్వరగా కోలుకున్నారు.

ఫొటో సోర్స్, DRDO
అలాగే, 65 ఏళ్లు పైబడిన వారిలో కూడా ఇదే రకమైన ఫలితాలు కనిపించాయి. ఈ వివరాలతో కూడిన నివేదిక అందిన తరువాత డీసీజీఐ ఈ మందుకు, ఒక మోస్తరు లేదా తీవ్రమైన కోవిడ్-19 పేషెంట్లకు అత్యవసర స్థితిలో ఇవ్వడానికి అనుమతించింది.
జెనరిక్ మాలిక్యూల్, గ్లూకోజ్ రూపంగా అభివృద్ధి చేసిన ఈ మందును ఉత్పత్తి చేయడం కూడా సులభమేనని, దేశంలో త్వరలోనే భారీయెత్తున అందుబాటులోకి తీసుకురావచ్చని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ మందు పొడి రూపంలో సాషేల్లో లభించనుంది. దీన్ని నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇది కోవిడ్ వైరస్‌తో ఇన్ఫెక్షన్‌కు గురైన కణాలను ఆవహించి వాటి పెరుగుదలని నిరోధిస్తుంది. ఇన్ఫెక్షన్‌కు గురైన కణాల మీద మాత్రమే దాడి చేయగలగడం ఈ మందు ప్రత్యేకత అని పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో డీఆర్‌డీఓ తెలిపింది.
ఆక్సిజన్ కోసం కోవిడ్ పేషెంట్లు భారీ సంఖ్యలో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధం ఎంతో విలువైన మానవ ప్రాణాలను కాపాడగలగుతుందని, దీని వల్ల ఆస్పత్రులో చేరే బాధితుల సంఖ్య కూడా గణనీయంగ తగ్గుతుందని ఈ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








