చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం

లగ్జరీ జెట్ లో చైనా మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో ఇటీవల కాలంలో ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారు
    • రచయిత, వైయీ ఇప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక రోజు భోజనానికి 650 యువాన్‌‌లు (దాదాపు రూ. 7,500) సరిపోతాయా?

సరిపోవని చెప్పారు సూ మాంగ్. హార్పర్స్ 'బజార్ చైనా' మాజీ ఎడిటర్ సూ మాంగ్ ఒక రియాలిటీ షోలో అలా బదులిచారు. ఆ మాటల పై చైనా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అయింది.

"మనం మెరుగైన ఆహారం తినాలి. నేనంత తక్కువ ప్రమాణాలతో తినలేను" అని ఆమె చెప్పారు. ఈ షోలో 15 మంది సెలెబ్రిటీలు 21 రోజుల పాటు కలిసి ఉంటారు.

ఆమె వ్యాఖ్యలకు ఆశ్చర్యం చెందిన నెటిజెన్లు తమకు కేవలం 30 యువాన్‌లే రోజువారీ భోజనానికి అలవెన్సుగా లభిస్తున్నాయని గుర్తు చేశారు.

సూ మాంగ్‌ను "విలాసవంతమైన వస్తువులను ధరించిన చైనా దెయ్యం" అని కూడా పిలుస్తారు. ఆమె మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆమె షోలో గడిపే అన్ని రోజులకూ కలిపి 650 యువాన్‌లు సరిపోవని వివరణ ఇచ్చారు. కానీ, ప్రజలు ఆమె మాటలతో సంతృప్తి చెందలేదు.

"ఆమె వివరణలు ఇవ్వవచ్చు. కానీ, సెలెబ్రిటీలు అందరూ ఉన్నత వర్గానికి చెందిన వారే" అని చైనా సోషల్ మీడియా వేదిక వీబోలో ఒక వ్యక్తి రాశారు.

ఇటీవల కాలంలో ప్రముఖుల సంపద గురించి ప్రజలు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనల్లో ఇదొకటి అని చెప్పవచ్చు.

హార్పర్స్ బజార్ మాజీ ఎడిటర్ సూ మాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హార్పర్స్ బజార్ చైనా మాజీ ఎడిటర్ సూ మాంగ్

ఈ సంవత్సరం మొదట్లో హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ ఫీ చిన్న కూతురు అనాబెల్ యావ్ చాలా కష్టతరమైన జీవితం గడిపానని చెప్పిన మాటలు కూడా ఇంటర్ నెట్‌లో ఆగ్రహం రేకెత్తించాయి.

"నన్ను నేను ఎప్పుడూ ఒక యువరాణిగా భావించలేదు. నేను నా వయసులో ఉన్న తోటివారిలానే ఉన్నాను. నేను మంచి స్కూల్ లో చేరాలంటే చాలా కష్టపడాలి. కష్టపడి చదువుకోవాలి" అంటూ ఆమె సింగింగ్ కెరీర్ లో అడుగు పెట్టడం గురించి ప్రకటిస్తూ విడుదల చేసిన 17 నిమిషాల వీడియో డాక్యుమెంటరీలో చెప్పారు.

ఆమె వీడియోను వీబోలో షేర్ చేశారు. ఈ 23 సంవత్సరాల అమ్మాయి తండ్రికి 1.4 బిలియన్ డాలర్ల విలువ చేసే సంపద ఉంది. ఆమె వినోద వ్యాపార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం తనకు తానే ఇచ్చుకున్న పుట్టినరోజు బహుమతి అని చెప్పుకున్నారు.

అర్హత లేదు

కొన్నేళ్లుగా చైనాలో కోటీశ్వరులు పక్క వారిని అసూయపడేలా చేసేందుకు తమకున్న విలాసవంతమైన కార్లు, హ్యాండ్ బ్యాగ్‌లను ఆడంబరంగా ప్రదర్శించడం అలవాటైన విషయమే.

కానీ, ఇలా తమ హోదాను కావాలని కానీ, మామూలుగా కానీ ప్రదర్శించడాన్ని ప్రజలు ఏహ్యంగా, విరోధ భావంతో చూస్తున్నారు.

కానీ, సూ, యావ్ లాంటి రెండవ తరానికి చెందిన పిల్లలకు ఆకాశాన్ని తాకే ఆదాయాలను పొందే అర్హత లేదనే భావనతో ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుంటారు.

"చాలా మంది తామెంత కష్టపడుతున్నా సంపాదించుకోలేక పోతున్నామని, తాము చేసే పనిని నటీనటులతో పోల్చుకుంటూ ఫిర్యాదు చేస్తారు" అని చైనా మీడియా సంస్కృతి పై పరిశోధన చేస్తున్న డీకిన్ యూనివర్సిటీ డాక్టర్ జియాన్ షూ చెప్పారు.

"దేశంలో కొంత మందికి అవసరానికి మించిన సంపద ఉంటే, కొందరికి చాలా తక్కువ డబ్బు ఉందనే వాస్తవాన్ని చైనా దాచి పెట్టాలని చూస్తోంది. ఆర్థిక వ్యత్యాసాలకు సంబంధించిన గాయాన్ని రగిలించేలా సూ మాంగ్ వ్యాఖ్యలు చేయడమే ప్రజాగ్రహానికి కారణమని మెల్బోర్న్‌లో ఆర్‌ఎంఐటి యూనివర్సిటీ మీడియా స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ హైచింగ్ యూ అన్నారు.

చైనాలో ఆదాయ వ్యత్యాసాలు తీవ్రంగా ఉన్నాయి.

చైనాలో సగటు వార్షిక ఆదాయం 32,189 యువాన్ లు (5,030 డాలర్లు)అంటే నెలకు సుమారు 2,682 యువాన్‌లు ఉందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్పింది. బీజింగ్ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులన్న నగరంగా మారింది.

సంపద గణాంకాలపై పని చేసే హరున్ నివేదిక ప్రకారం చైనాలో సంపన్నులు 2020లో రికార్డు స్థాయిలో 1.5 ట్రిలియన్ డాలర్లను సంపాదించారు. ఇది బ్రిటన్ స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు సగం.

ఆర్థిక అసమానతలు చాలా దేశాల్లో ఉన్నప్పటికీ, చైనాలో అది వికృత రూపంలో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంపన్నులు తమ సంపదను అతిగా, బాహాటంగా ప్రదర్శించడం వల్ల వారిని 'ఏదీ పట్టని వారిగా' ప్రజలు చూస్తున్నారు.

చైనా మాజీ నాయకుడు డాన్గ్ చావ్‌పింగ్ కూడా అందరికీ సమాన సంపద సాధించడమే లక్ష్యం అని చెప్పేవారు. కానీ, అందులో కూడా కొంత మంది వ్యక్తులు, ప్రాంతాలు మాత్రమే ముందు ధనవంతులవుతారనే అర్ధం ఉండేది. చాలా రోజుల వరకు, ప్రజలు కూడా అందరూ సమానంగా సంపన్నులు అవ్వవచ్చనే భావనతో ఉండేవారు.

"కానీ, చైనాలో ప్రపంచీకరణకు ద్వారాలు తెరుచుకున్న 40 సంవత్సరాల తర్వాత కూడా ధనవంతులే మరింత ధనవంతులు అవుతుండగా, మిగిలిన వారు నిరాశతో, ఎటువంటి అధికారం లేకుండా వెనకబడిపోతున్నారు" అని డాక్టర్ షూ చెప్పారు.

"సెలెబ్రిటీలు సమాజానికి మరింత సేవ చేయాలనే అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా వారి విషయంలో ఈ కోపం మరింత ఎక్కువగా వ్యక్తమవుతోంది" అని ఆయన అన్నారు.

ఉదాహరణకు జెంగ్ షుయాంగ్‌కు టీవీలో ఒక పాత్రకు రోజుకు 2 మిలియన్ల యువాన్లు అంటే, ఆ ప్రాజెక్టు మొత్తానికి 16 కోట్ల యువాన్లు చెల్లిస్తున్నట్లు తెలియగానే ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

"ఈ 160 మిలియన్ల యువాన్లు ఏమిటి? నెలకు 6000 యువాన్లు సంపాదించే సగటు ఉద్యోగులు అంత మొత్తం కూడబెట్టాలంటే 2,222 ఏళ్లు పని చేయాలి" అని ఓ విశ్లేషకుడు వీబోలో రాశారు.

జెంగ్ షుయాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెంగ్ షుయాంగ్

అయితే, జెంగ్ అంతకుముందే ఓ వివాదంలో చిక్కుకోవడంతో ప్రజలు అప్పటి నుంచే ఆగ్రహంతో ఉన్నారు. చైనాలో అద్దె గర్భం విధానానికి అనుమతి లేకపోవడంతో ఆమె విదేశాల్లో సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కని వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి.

అత్యధికంగా డబ్బు సంపాదిస్తున్నవారు ఆదర్శప్రాయంగా ఉండకపోవడం కూడా సమస్యాత్మకంగా మారుతోంది.

అందుకే, ప్రముఖ నటి ఫ్యాన్ బింగ్ బింగ్ 2018లో పన్నుల ఎగవేతకు గాను హౌస్ అరెస్టు అయినప్పుడు ఎవరూ సానుభూతి చూపించలేదు.

"ఆడంబరాలను ప్రదర్శించడం సంస్కారం కాదనే భావన వల్ల కూడా వ్యతిరేకత ఎదురవుతోంది" అని నిపుణులు చెబుతున్నారు.

చైనాలో మధ్య తరగతి పెరుగుతుండగా విద్యావంతులు మాత్రం ఈ ఆడంబరాలను ప్రదర్శించేవారిని "హుందాతనం లేనివారిగా లేదా నిమ్న వర్గాల మూలాలు ఉన్న వారిగా పరిగణిస్తారు" అని ఆంక్షియస్ వెల్త్: మనీ అండ్ మొరాలిటీ అమాంగ్ చైనా'స్ న్యూ రిచ్" పుస్తక రచయత డాక్టర్ జాన్ ఆస్బర్గ్ బీబీసీతో చెప్పారు.

లగ్జరీ స్టోర్ ముందు క్యూ కట్టిన చైనా వినియోగదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలాసాల మార్కెట్లో చైనా ఎప్పుడో జపాన్‌ను దాటేసింది

"వారి సామాజిక హోదా పట్ల ఉన్న అభద్రతా భావంతోనే ఇలా చేస్తారు" అని ఆయన అన్నారు.

"కానీ, చైనాలో విలాసవంతమైన జీవితం పట్ల ఉన్న ఆసక్తి ఇప్పట్లో పోదు" అని అన్నారు.

ఆసియా పసిఫిక్‌లో పర్సనల్ లగ్జరీ మార్కెట్‌లో కూడా చైనా ఇప్పటికే జపాన్‌ను అధిగమించింది" అని మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూరో మానిటర్ ఇంటర్నేషనల్ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి అమ్మకాలు తిరిగి మహమ్మారి మునుపు ఉన్న స్థాయికి చేరతాయని అంచనా వేసింది.

అయితే, ఇప్పుడు కొంత మంది ధనవంతులు వారి సంపదను కేవలం తమ వస్తువుల ఫోటోల ద్వారా కాకుండా ముసుగులోనే ప్రదర్శిస్తారు అని డాక్టర్ యూ అన్నారు.

ఉదాహరణకు ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ 'మెంగ్‌కికి77' తన విలాసవంతమైన జీవితం గురించి తరచుగా అప్‌డేట్లను ఇచ్చేవారు. ఒక సారి ఆమె తాను నివసిస్తున్న ఇంటికి దగ్గర్లో ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్ లు లేవని, దాంతో విధిలేక తన భర్త టెస్లా కారు పార్క్ చేసుకునేందుకు ప్రైవేటు గరాజ్ ఉన్న పెద్ద ఇంటిలోకి మారాల్సి వచ్చిందని ఆమె వీబోలో రాశారు.

ఆమె మరో సందర్భంలో తన భర్త పిసినారిగా ఆలోచిస్తున్నారని, కేవలం 30,000 యువాన్ల ఖరీదు చేసే జెగనా ఊలు సూటు కొనుక్కున్నారని వ్యాఖ్యానించారు.

ఇవన్నీ నెటిజన్ల మనసులో ముద్రితమయ్యాయి.

అప్పటి నుంచీ విమర్శకులు ఆమె పోస్టులను "విలాస సాహిత్యం" అనే పేరుతో విమర్శించారు.

ఈ ధోరణి నుంచి బయటపడడానికి సంపన్నులు, ప్రముఖులకు అంత సులభమైన మార్గాలు కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)