మోదీ కేబినెట్: దళిత, వెనుకబడిన వర్గాల మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ లాంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. 43 మంది మంత్రులతో కేబినెట్‌లో మార్పు చేర్పులు చేశారు.

2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీకి బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్ గెలవడం చాలా కీలకంగా మారింది. భారీ పెట్టుబడులు, ఎన్నికల హైప్, టీఎంసీ నేతలను చేర్చుకున్న తర్వాత కూడా బెంగాల్‌ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది.

కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో ఉత్తర్‌ప్రదేశ్ విఫలమైందని, రాష్ట్రంలో అధికారం కేంద్రీకృతం అయ్యిందని, ఠాకూర్ల జోక్యం పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాస్తున్న పరిస్థితి ఉంది.

కొన్ని నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో కేంద్ర కేబినెట్‌లో ఆ రాష్ట్రానికి చెందిన ఏడుగురికి చోటు లభించింది. దీని ద్వారా పార్టీ అక్కడ కులసమీకరణలు సరిచేసే ప్రయత్నాలు చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు.

మంత్రిమండలిలో చోటు దక్కిన వారిలో మహారాజ్‌గంజ్ ఎంపీ, ఆరుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పంకజ్ చౌధరి, అప్నాదళ్ అనుప్రియ పటేల్, ఆగ్రా ఎంపీ ఎస్పీ. బఘేల్, ఐదుసార్లు ఎంపీ అయిన భాను ప్రతాప్ వర్మ, మోహన్‌లాల్‌గంజ్ ఎంపీ కౌశల్ కిశోర్, రాజ్యసభ ఎంపీ బీఎల్ వర్మ, లఖీంపూర్ ఖీరీ ఎంపీ అజయ్ కుమార్ మిశ్రా ఉన్నారు.

అనుప్రియా పటేల్

ఫొటో సోర్స్, AFP

వీరిలో ఒకరే బ్రాహ్మణుడు. మిగతా ఆరుగురు ఓబీసీ, దళిత సమాజాలకు చెందినవారే. వీరంతా యాదవేతరులు లేదా జాటవేతరులు గానీ ఉన్నారు.

పంకజ్ చౌధరి, అనుప్రియ పటేల్ ఓబీసీ కుర్మీ సమాజానికి చెందినవారు కాగా, కౌశల్ కిశోర్ పాసీ కమ్యూనిటీకి చెందిన వారు. జాటవ్ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నది పాసీ సమాజానికే.

బీఎల్ వర్మ లోధ్ అనే వెనుకబడిన కులం నుంచి వచ్చారు. లోధ్ కమ్యూనిటీపై ఆయన ప్రభావం చాలా ఉందని చెబుతారు. మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కూడా లోధ్ సమాజానికి చెందినవారే. భాను ప్రతాప్ వర్మ దళితుడు.

అయితే రాష్ట్రం నుంచి ఏడుగురిని మంత్రులు చేయడం వల్ల ఆ ప్రభావం రాబోవు ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కనిపిస్తుందా?

రాష్ట్రం నుంచి ఇంతమందిని కేంద్ర మంత్రులను చేయడం వల్ల కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని యోగీ ప్రభుత్వంపై పడిన మచ్చ చెరిగిపోతుందా?

కోవిడ్ సెకండ్ వేవ్‌ను కేంద్రం ఎదుర్కున్న తీరుపై నరేంద్ర మోదీ నియోజకవర్గానికి చెందిన చాలామంది ఓటర్లు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాన్యుల మనసులో ఏముందో తెలుసుకోడానికి రెండు సర్వేలు చేశారు. ఈ సర్వేల గణాంకాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ అప్రూవల్ రేటింగ్ పడిపోయినట్లు తేలింది.

మోదీ కేబినెట్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి అపరిచిత ముఖాలా

రాష్ట్రం నుంచి మంత్రులైనవారిలో అనుప్రియ పటేల్ మినహా మిగతావారు అందరికీ తెలిసేంత ప్రముఖులు కాదనే భావన కూడా ఉంది. అయితే వీరందరూ ఇంత తక్కువ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో ఏవైనా మార్పులు తీసుకురాగలరా.

రాష్ట్రంలో కుల సమీకరణలు సరిగా ఉండేలా చూడ్డానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నట్లు లఖ్‌నవూ విలేఖరి ఉమేశ్ రఘువంశీ భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలో రీటా బహుగుణ జోషి, జితేంద్ర ప్రసాద్ లాంటివారి పేరు లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే బ్రాహ్మణ ఓటుబ్యాంకుపై పట్టు సాధించేందుకు వీరిని కేబినెట్‌లోకి తీసుకుంటారని విస్తరణకు ముందు ఊహాగానాలు వచ్చాయని అన్నారు.

"ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న యూపీ నేతలు, బయటివారికి అంత తెలిసినవారు కాకపోయినా, ఆయా ప్రాంతాలపై వారికి మంచి పట్టు ఉంది. వీరు బాగా చదువుకున్నవారు. వారిని ఎంపిక చేయడంపై నేరుగా ఆర్ఎస్ఎస్ ముద్ర ఉంది" అని లఖ్‌నవూ జర్నలిస్ట్ సునీతా అరోన్ చెప్పారు.

మంత్రి పదవులు పొందినవారు తమ ప్రాంతాల్లో అద్భుతంగా పనిచేశారని ఆమె తెలిపారు. తన కొడుకు లివర్ సిరోసిస్ వల్ల చనిపోవడంతో కౌశల్ కిశోర్ యువతతో మద్యం మాన్పించేందుకు ఒక ప్రచారం ప్రారంభించారని, కుర్మీ సమాజానికి చెందిన పంకజ్ చౌధరి పేద, అణగారిన వర్గాల సమాజాల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశారని చెప్పారు.

మోదీ కేబినెట్

ఫొటో సోర్స్, Ani

"కేబినెట్ విస్తరణలో కొన్ని ఆశ్చర్యపరిచేవి కూడా జరిగాయి. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎంపిక బాగుంది" అని ఆమె అన్నారు.

ఎన్నికల సమయంలో కుల సమీకరణల వల్ల ప్రయోజనం ఉంటుందని, అది ఎన్నికల్లో విజయానికి సాయం చేస్తుందనే విషయం బీజేపీకి బాగా తెలుసని జర్నలిస్ట్ రామదత్త్ త్రిపాఠీ భావిస్తున్నారు.

"కేబినెట్‌లో ఆగ్రా, బదాయూ, బుందేల్‌ఖండ్, లఖ్‌నవూ, ఖీరీ ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు. అంటే ఈ ఎంపిక ద్వారా ప్రాంతం, కులం రెండింటినీ బ్యాలెన్స్ చేశారు" అని ఆయన అన్నారు.

మరోవైపు, రైతు ఉద్యమం వల్ల పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు ఎలాంటి నష్టం జరగకుండా అడ్డుకోడానికే బీజేపీ తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించిందని సునీతా ఆరోన్ చెబుతున్నారు.

"బీజేపీ 2024 ఎన్నికలపై కన్నేసింది, 2022లో జరిగే ఎన్నికలు ఆ దిశగా ఒక అడుగు" అని ఆమె తెలిపారు.

సంతోష్ సింగ్ గంగ్వార్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంతోష్ సింగ్ గంగ్వార్‌

సంతోష్ సింగ్ గంగ్వార్‌ను తొలగించడం వల్ల నష్టమా

సంతోష్ సింగ్ గంగ్వార్‌ను కేబినెట్ నుంచి తప్పించడం బీజేపీకి వ్యతిరేకం అవుతుందని సునీతా అరోన్ చెపుతున్నారు. ఎందుకంటే ఆయన గంగ్వార్ సమాజానికి ప్రాతనిధ్యం వహిస్తున్నారని అంటున్నారు.

సంతోష్ సింగ్ గంగ్వార్, యూపీలో కోవిడ్ పరిస్థితిపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ఒక లేఖ రాశారు.

కేబినెట్ జాబితాలో సుపరిచితులైన ఒక బ్రాహ్మణ ముఖం లేకపోవడం కూడా బీజేపీకి వ్యతిరేకం కావచ్చేమోనని సునీతా అరోన్‌ భావిస్తున్నారు.

అజయ్ కుమార్ మిశ్రా ఎంపికపై మాట్లాడిన ఆమె, ఆయన అంత తెలిసిన ముఖం కాదు, పార్టీకి బ్రాహ్మణ ముఖం కూడా కాదు అని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రాహ్మణులు బీజేపీకి దూరమయ్యారనే ఒక భావన ఉంది. జితిన్ ప్రసాద్ పార్టీలోకి రావడంతో ఆయన ఆ దూరం తగ్గించడానికి సాయం అవుతారని భావిస్తున్నారు.

మోదీ కేబినెట్

ఫొటో సోర్స్, Ani

కోవిడ్ మిస్ మేనేజ్‌మెంట్ ఆరోపణల సంగతేంటి

భారత్‌లో అధికారికంగా కోవిడ్ మృతుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆర్థికవ్యవస్థ చతికిలబడింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. రాష్ట్రంలో కోవిడ్ వల్ల తలెత్తిన పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను ప్రపంచమంతా చూసింది.

రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో జరిగిన కేబినెట్ విస్తరణ రాష్ట్రంలో పార్టీకి రాజకీయ లబ్ధిని అందిస్తుందా.

"కేబినెట్ విస్తరణలో యూపీ నేతలకు చోటు దక్కడం, కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితిపై ప్రజాగ్రహం అనేవి రెండూ వేరు వేరు విషయాలు. సెకండ్ వేవ్‌లో కోవిడ్ వల్ల రాష్ట్రంలో నష్టపోని కుటుంబం బహుశా ఏదీ లేదు. దీనివల్ల నిరుద్యోగం పెరిగింది. దిల్లీ, ముంబయి లాంటి పెద్ద నగరాల నుంచి జనం ఉద్యోగాలు వదిలి రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. దాంతో సంపాదన లేకుండా పోయింది" అని అరోన్ అన్నారు.

రామదత్త త్రిపాఠీ కూడా "అవి సమస్యలే, ప్రభుత్వం వాటికి సమాధానం ఇచ్చి తీరాల్సిందే" అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)