ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్‌లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, PA
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రస్తుతం భక్తుల కంటే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బందే ఎక్కువ కనిపిస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో వరుసగా (జూలై 2 నుంచి) మూడు రోజులపాటు అర్ధరాత్రి డ్రోన్లు చక్కర్లుకొట్టడమే ఇందుకు కారణం. రోజూ డ్రోన్లు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌లోని ఎయిర్‌ఫోర్స్ వింగ్ దగ్గర డ్రోన్ల దాడి ఈ అలజడికి కారణమైంది.

ఫొటో సోర్స్, Kurnool police
శ్రీశైలంలో కనిపించిన ఈ డ్రోన్లు ఎవరు అపరేట్ చేస్తున్నారనే విషయంపై ఇప్పటికీ స్పస్టత రాలేదు. గుప్త నిధులు, షూటింగుల కోసం డ్రోన్లను వాడుతున్నారా, లేక తీవ్రవాద కోణం ఏదైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్లు ఉపయోగించే ఫొటో గ్రాఫర్లను విచారిస్తున్నారు.
ఎరుపు, ఆకుపచ్చ రంగు లైట్లతో చక్కర్లు కొట్టినవి నిజంగానే డ్రోన్లా, లేక ఆ ఆకారంలో ఉన్న వేరే వస్తువులా అనే విషయం తేల్చేందుకు స్పెషల్ టెక్నికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీగా పనిచేసిన ఫకీరప్ప (జూలై 8న అనంతరపురం ఎస్సీగా బదిలీ అయ్యారు) చెప్పారు.
అదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రోన్ల వినియోగం, నిబంధనల విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఫొటో సోర్స్, A.lakshminarayana
పోలీసుల దగ్గర ఎన్ని, ప్రజల దగ్గర ఎన్ని?
డ్రోన్ కెమెరాలు దేశంలో, రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? విశాఖలో ఎన్ని డ్రోన్లకు అనుమతి ఉంది? వీటి లైసెన్స్ విధానం ఏమిటి? డ్రోన్ల వినియోగంపై చట్టాలు ఏం చెప్తున్నాయి? అనే అంశంపై బీబీసీ సమచారం సేకరించింది. ఒక పోలీసు ఉన్నతాధికారి దానికి సంబంధించిన వివరాలు చెప్పారు.
"విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు 32 కిలోమీటర్ల బీచ్ రోడ్డుపై డ్రైవ్‌కు వెళ్తే మనకు కనీసం 15 వరకు డ్రోన్ కెమెరాలు ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని సినిమా, టీవీ షూటింగులు, కొందరు ఫొట్రోగ్రాఫర్లు, టూరిస్టులు ఇలా అందరూ డ్రోన్ కెమెరాలను సులభంగా వాడేస్తున్నారు. నిజానికి డ్రోన్ కెమెరాలు ఎంతమంది కొంటున్నారు, ఎవరు వాడుతున్నారనే విషయాలను నమోదు చేసే కార్యక్రమం సరిగా జరగలేదు. అది ఇప్పుడిప్పుడే మొదలైంది" అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 2 వేల డ్రోన్ కెమెరాలు ఉన్నట్లు పోలీసుల లెక్కల్లో ఉందని, అయితే వాస్తవంగా ఉన్నవాటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని అధికారులు చెబుతున్నారు.
"పోలీసుల లెక్కల ప్రకారం ఉన్న డ్రోన్లలో సగం విశాఖలోనే ఉన్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో రాష్ట్రంలో ఉన్న డ్రోన్ల సంఖ్యతో పోలిస్తే 10 శాతం కంటే తక్కువే రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో పోలీసుశాఖ దగ్గర 60 నుంచి 70 డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా డ్రోన్లు ఉన్నాయి" అని తెలిపారు.
విశాఖ జిల్లా సంతపాలెం గ్రామంలో 1100 మంది ఉంటారు. ఈ గ్రామంలో 9 మంది దగ్గర సొంత డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. దీన్ని బట్టి డ్రోన్ కెమెరాలు ఎంత భారీగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అవి ఎందుకు కొంటున్నారో సంతపాలెంలో ఉంటున్న వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ప్రసాద్ చెప్పారు.
"మా గ్రామంలోని పెళ్లిళ్లు, ఫంక్షన్లు, సభలకు కూడా డ్రోన్ కెమెరాలు వాడతాం. సీజన్‌లో డ్రోన్ కెమెరాలు రెంటుకు కూడా తెస్తుంటాం. కొత్త డ్రోన్ రూ. లక్ష నుంచి ఉంటాయి. సెకండ్ హ్యాండ్ అయితే రూ.50 వేల నుంచి దొరుకుతాయి. దానిని రెంట్‌కు ఇచ్చినా, రోజుకు నాలుగైదు వేల రూపాయలు వస్తాయి. అందుకే వీటిని కొనడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే దీనికి పర్మిషన్లు తీసుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఇప్పటీదాకా చేయలేదు. మమ్మల్ని ఎవరు అడగలేదు కూడా" అన్నారు ప్రసాద్.

ఫొటో సోర్స్, A. Lakshmi narayana
ఎయిర్ పోర్టు సమీపంలో 'డ్రోన్ టెస్టింగ్'
విశాఖలో ఇప్పటి వరకు ఒక్క డ్రోన్ కెమెరా కూడా తమ కార్యాలయంలో అధికారికంగా నమోదు కాలేదని నగర పోలీస్ కమిషన్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు.
అయితే ఇప్పడు వాటిపై నిశితంగా దృష్టి పెడుతున్నామని, డ్రోన్లు వినియోగిస్తున్న వారందరితో మాట్లాడి, వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని చెప్పామని ఆయన తెలిపారు.
విశాఖలో డ్రోన్లు విచ్చలవిడిగా ఉపయోగించకుండా నగర పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని, నిబంధనల గురించి చెబుతున్నారని గాజువాక ఫోటోగ్రాఫర్ శేషు చెప్పారు.
"మూడేళ్ల క్రితం కొత్త డ్రోన్ కెమెరా కొన్నాను. దాన్ని టెస్ట్ చేయడానికి విశాఖ ఎయిర్ పోర్టు సమీపంలో ఎగరేశాను. దానిని ఎయిర్ పోర్టు పోలీసులు గమనించారు. నన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పటికి నాకు డ్రోన్ నిబంధనలు తెలియవు. ఇప్పుడు కశ్మీర్, శ్రీశైలంలో డ్రోన్ల హడావిడి తర్వాత నాతో పాటు విశాఖ, గాజువాక ప్రాంతాల్లో ఉన్న ఫోటో గ్రాఫర్లందర్నీ పిలిపించిన పోలీసులు డ్రోన్ నియమ నిబంధనల గురించి చెప్పారు. విశాఖలో నేవీతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన చాలా కార్యాలయాలు, భారీ పరిశ్రమలు ఉండడంతో పర్మిషన్ తీసుకుని డ్రోన్ వాడాలని హెచ్చరించారు" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Abinav Rao varrey
కనిపిస్తే కూల్చేస్తాం: నౌకాదళం
విశాఖలోని తూర్పు నౌకదళ ప్రధాన కార్యాలయం నుంచి అది విస్తరించిన పరిసరాల చుట్టూ పర్యటక ప్రాంతాలే ఉన్నాయి. అవి నిత్యం పర్యటకులతో కిటకిటలాడుతుంటాయి. కోవిడ్ నిబంధనలు కూడా సడలించడంతో ఇప్పుడు వారి సంఖ్య కూడా పెరిగింది.
చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకోడానికి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను తీసుకొచ్చి, డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఇక్కడ టీవీ, సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయి.
విశాఖ తీరం అందాలను బంధించేందుకు సాధారణంగా ఇక్కడ డ్రోన్ కెమెరాలు వాడుతుంటారు.
కశ్మీర్‌లో డ్రోన్ల సంచారంతో తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. అన్ని రకాల డ్రోన్లను నిషేధించింది. ఈస్టు కోస్టు ప్రధాన కేంద్రం యూనిట్లు ఉన్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు.
ఈ ప్రాంతంలో డ్రోన్లు, మానవరహిత ఏరియల్ వెహికల్స్ ఏవి కనిపించినా, వాటిని వెంటనే కూల్చేస్తామని తూర్పు నౌకాదళం హెచ్చరించింది.
వ్యక్తులు, సివిల్ ఏజెన్సీలకు చెందిన డ్రోన్స్, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAV) ను నిషేధిత ప్రాంతాల్లో వాడరాదని...అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నేవీ అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వ విభాగాలు, సంస్ధలు ఏవైనా డ్రోన్లు వినియోగించాల్సి వస్తే డిజిటల్ స్కై వెబ్ సైట్ ద్వారా ముందుగా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతిని డ్రోన్ల వినియోగానికి కనీసం వారం ముందే నేవల్ కమాండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సమర్పించాల్సి ఉంటుందని నౌకదళ అధికారులు స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Abinav Rao varrey
249 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే...
డ్రోన్ల వినియోగంపై రాష్ట్ర పోలీసులు, నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. వీటి వినియోగానికి డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) , స్థానిక పోలీసుల నుంచి తప్పక అనుమతి తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అవి దాదాపు అమలు కావడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో వినియోగించే డ్రోన్లలో 95 శాతం అనుమతులు లేనివేనని పోలీసులు చెప్తున్నారు. అనుమతిలేని డ్రోన్ల విషయంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
500 మీటర్ల వరకు గాల్లో ఎగరగలిగే డ్రోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయని...వీటినే ఎక్కువగా కొంటున్నారని పోలీసులు తెలిపారు. 249 గ్రాముల కంటే ఎక్కువ బరువుండే అన్ని డ్రోన్లనూ డీజీసీఏ దగ్గర రిజిస్టర్ చేయాల్సిందే అని చెప్పారు.
సాధారణంగా పెళ్లిళ్లు, బర్త్ డే వేడుకలతోపాటూ సినిమాలు, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం కూడా డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ లో సైతం డ్రోన్ కెమెరాలు అందుబాటులో ఉండటంతో ఎలాంటి అనుతులు లేకుండా చాలా మంది డ్రోన్లను కొనేస్తున్నారు.
ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్లు ఎక్కువగా వినియోగించే ఫొటో, వీడియో గ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్ మేకర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ముఖ్యంగా పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ఆలయాలు ఉన్న జిల్లాల్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఫొటో సోర్స్, Abinav Rao varrey
కనుచూపు మేరలో ఎగరాలి...
ఉపాధి కోసం, హాబీగా కూడా డ్రోన్‌లతో చిత్రీకరిస్తున్నారని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అంటున్నారు. డ్రోన్ల వినియోగం విషయంలో నియమ నిబంధనలు ఆయన వివరించారు.
"డ్రోన్ ఆపరేట్ చేసేవాళ్లు తప్పనిసరిగా డీజీసీఏ నిబంధనలను పాటించాలి. పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఉపయోగించకూడదు. ఇతరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించకూడదు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పోలీసు స్టేషన్లు, ఎయిర్ పోర్ట్‌ల దగ్గర, మిగతా నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్‌లు వాడకూడదు. కనుచూపు మేరలో మాత్రమే డ్రోన్ ఎగిరేలా నియంత్రిస్తుండాలి. వీటిని పగలు మాత్రమే వినియోగించాలి. డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలి. డ్రోన్ నిషేధిత ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. ఫ్లైయింగ్ నిబంధనలను పాటించాలి" అన్నారు.
"భూమట్టం నుండి 400 అడుగుల(120 మీటర్లు) కంటే ఎక్కువ డ్రోన్లను పైకి ఎగురేయకూడదు. విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌ల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్‌లు వాడకూడదు. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, బహిరంగ కార్యక్రమాలు, జనం ఉన్న స్టేడియంలలో డ్రోన్‌ల వినియోగం పూర్తిగా నిషేధం. 24 గంటల ముందే ఎయిర్ డిఫెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ దాఖలు చేయకుండా విమానాశ్రయాల సమీపంలో డ్రోన్ ఎగరేయకూడదు. ప్రమాదకరమైన పదార్థాలను డ్రోన్లతో తీసుకెళ్లకూడదు. కదిలే వాహనాల నుంచి డ్రోన్ ఎగరవేయకూడదు. డ్రోన్ ఉన్నవాళ్లు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో డ్రోన్ సమాచారంతో పాటు, వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెలియజేయాలి. " అని ఎస్పీ వెంకటఅప్పలనాయుడు చెప్పారు.
అనుమతులు లేని డ్రోన్ల వినియోగంపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, అవి కేవలం పెట్టీ కేసులకే పరిమితమవుతున్నాయి.
డ్రోన్ల వినియోగం నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్లు 287, 263, 336, 337, 338లతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 కింద శిక్షార్హులు.
ఈ కేసుల్లో రూ.6 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. టీనేజర్లు ఎక్కువగా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. దీంతో వీరిపై ఎటువంటి కేసులు పెట్టినా కూడా వారి భవిష్యత్తు నాశనమవుతుంది.
అందుకే డ్రోన్ల అనధికార వినియోగం కేసులు పెట్టే విషయంలో అచితూచి వ్యవహరించాల్సి వస్తోందని ఒక పోలీసు అధికారి చెప్పారు.

'డిజిటల్ స్కై'లో లేకపోతే ఎగరవు...
డ్రోన్ల విషయంలో లైసెన్స్, ఫ్లైయింగ్ పర్మిషన్లు తీసుకునేందుకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఒక యాప్ రూపొందించింది. దీనిని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. దీని పేరు 'డిజిటల్ స్కై'.
ఈ యాప్‌కు సంబంధించిన వివరాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో డ్రోన్ పైలట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్న అభినవ్‌రావు వర్రే బీబీసీకి తెలిపారు.
"డ్రోన్ల రిజిస్ట్రేషన్, ఎగురవేసేందుకు అనుమతులు పొందాలంటే 'డిజిటల్ స్కై'లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్‌తో పాటు టేకాఫ్‌కు అనుమతి ఇవ్వాలన్నా, తిరస్కరించాలన్నా అంతా ఈ ప్లాట్‌ఫాం ద్వారానే జరుగుతుంది. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రోన్‌ను ఎప్పటికప్పుడు 'డిజిటల్ స్కై' ద్వారా పర్యవేక్షిస్తుంటారు. డ్రోన్లు ఉపయోగించడానికి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఫ్లయింగ్ పర్మిషన్‌కు దరఖాస్తు చేయాలి. తర్వాత ఎయిర్‌ట్రాఫిక్‌ను బట్టి దానికి అనుమతి ఇవ్వలా, వద్దా? నిర్ణయిస్తారు. నో పర్మిషన్, నో టేకాఫ్' (NPNT)' అనే టెక్నాలజీ అనుమతి లేని డ్రోన్లను పైకి ఎగరనివ్వదు." అన్నారు.
డిజిటల్ స్కై' లో రిజిస్ట్రేషన్ చేసుకుని, శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తారని, విదేశీయులు భారత్‌లో డ్రోన్ ఉపయోగించకూడదని ఆయన తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నో ఫ్లై జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించకూడదు.
2017లో డీజీసీఏ రూపొందించిన నిబంధనల ప్రకారం డ్రోన్లను నానో, మైక్రో, చిన్నతరహా, మధ్యతరహా, భారీ అని ఐదు కేటగిరీలుగా విభజించారు. వాటిలో నానో, మైక్రో డ్రోన్లను ఎక్కువగా వాడుతున్నారు. వీటికి ప్రత్యేక గుర్తింపు నంబర్(యూఐఎన్), అన్‌మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ పర్మిట్ వంటివి డీజీసీఏ ఇస్తుందని ఆయన వెల్లడించారు.
దేశంలో మొత్తం 20 లక్షలకు పైగా డ్రోన్ కెమెరాలు ఉన్నాయని, రానున్న మూడేళ్లలో డ్రోన్ పైలెట్ లైసెన్స్ కలిగిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

తిరుమలలో డ్రోన్ ఎగరాలంటే...
డ్రోన్లు ఎగిరేందుకు అనుమతులు ఇచ్చే విషయంలో రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లగా విభజించారు. ఏయే ప్రాంతాలు ఏయే జోన్ల కిందకు వస్తాయో టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు బీబీసీకి చెప్పారు.
"ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, హాస్పిటల్స్, రక్షణ రంగ ప్రాంతాలు అన్నీకూడా రెడ్ జోన్ కిందే లెక్క. వీటి మీద లేదా సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్లు వినియోగించకూడదు. ప్రభుత్వం నిషేధించిన ప్రదేశాలు కాకుండా ఇతర ప్రాంతాలు ఎల్లో జోన్ కింద వస్తాయి. అయితే ఇక్కడ పోలీసుల అనుమతితో డ్రోన్లను ఎగరేయవచ్చు. అది కాకుండా గ్రీన్ జోన్లలో ఎలాంటి అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసే అవకాశం ఉంటుంది. ఏపీలో గ్రీన్ జోన్ ఒక్కటే ఉంది. అది పుట్టపర్తి. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లు ఎగరేసుకోవచ్చు’’ అన్నారాయన.
తిరుమలలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఉపయోగించకూడదని పాలరాజు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









