అమెజాన్: ‘అలెక్సా’ పేరున్న అమ్మాయిల తల్లిదండ్రులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు

అలెక్సా పేరున్న వారికి హేళనలు, ఎగతాళి ఎదురవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్ అలెక్సాను చాలామంది ఉపయోగిస్తున్నారు.
    • రచయిత, టిమ్ జోన్స్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

అమెజాన్‌ సంస్థ వర్చువల్ అసిస్టెంట్ అలెక్సా కారణంగా తమ పిల్లలు అవహేళనకు, ఎగతాళికి గురవుతున్నారని కొందరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చాలామంది పేరెంట్స్‌ తమ పిల్లల పేర్లు మార్చుకోగా, కొందరు మాత్రం అలెక్సా అనే పేరును మార్చాలని అమెజాన్‌ను డిమాండ్ చేస్తున్నారు.

పిల్లలకు ఇలా జరగడం బాధాకరమని అమెజాన్ ప్రకటించింది. అలెక్సా పేరుకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయని, వాటిని కూడా వాడుకోవాలని యూజర్లకు సూచించింది.

అలెక్సా అనే పేరును తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూకే వేలమందికి అలెక్సా అనే పేరు ఉంది.

అలెక్సా అనే పేరున్న వారికి సమస్యలు

ఇటీవలి కాలంలో అలెక్సా అనే పదాన్ని చాలామంది తరచూ ఉపయోగిస్తున్నారు. చాలామంది ఇళ్లలో వాయిస్‌ పవర్డ్‌ స్మార్ట్‌ స్పీకర్లు ఉన్నాయి. వీటికి వాయిస్ కమాండ్‌గా అలెక్సా అనే మాటను విరివిగా ఉపయోగిస్తున్నారు.

అమెజాన్ ఎకో, ఎకో డాట్ స్పీకర్లకు సంకేతాలు, సూచనలు ఇవ్వడానికి, ప్రశ్నలు అడగటానికి అలెక్సా అనే పేరును ఉపయోగిస్తున్నారు.

అయితే అలెక్సా పేరున్న వ్యక్తులకు దీనితో సమస్యలు ఎదురవుతున్నాయట.

అలెక్సా అనే పేరుతో జోకులు వేసుకోవడం, సరదాగా కమాండ్లు ఇస్తుండటంతో ఆ పేరున్న వారికి అది ఇబ్బందిగా మారుతోంది.

తన టీనేజ్ కూతురు స్కూల్‌కు వెళుతోందని, అలెక్సా అని పేరు పెట్టడం ఆమెకు సమస్యగా మారిందని హీథర్ (అసలు పేరు కాదు) అనే మహిళ అన్నారు.

తోటి పిల్లలే కాకుండా స్కూల్ టీచర్‌ కూడా తన కూతురు పేరు మీద జోక్స్ వేస్తున్నారని ఆమె ఆరోపించారు.

''అందరూ ఎగతాళి చేస్తున్నారని ఆమె తన పేరు చెప్పుకోవడం కూడా మానేసింది. కొంతమంది పెద్దవాళ్లు కూడా ఆమెపై జోకులు వేస్తున్నారు. ఇది ఆమెను మరింత ఇబ్బంది పెడుతోంది'' అన్నారు హీథర్.

''స్కూలు యాజమాన్యం ఆమెకు ఏ మాత్రం సాయం చేయలేదు. ఎగతాళి చేసే వారిని ఆపకపోగా, ఇలాంటి వాటిని అలవాటు చేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చింది'' అని హీథర్ వాపోయారు.

వర్చుల్ అసిస్టెంట్ కు అలెక్సా అనేది కమాండ్ పదంగా వాడతారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వర్చుల్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడానికి కమాండ్‌గా అలెక్సా పదం వాడతారు.

అలెక్సా ఒక మనిషి పేరు

పేరు కారణంగా ఎగతాళికి గురికావడం తన కూతురి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని హీథర్ అన్నారు. ఈ పరిస్థితులతో తాము విసిగిపోయామని, అందుకే చట్టపరమైన మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నామని హీథర్ వెల్లడించారు.

''పేరు మారిన తర్వాత మా అమ్మాయి పరిస్థితి కాస్త మెరుగు పడింది'' అన్నారు హీథర్.

''అయితే ఆమె స్నేహితులు దూరమయ్యారు. కొత్త స్కూలుకు మారాల్సి వచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని మేం ఎప్పటికీ మర్చిపోము. అమెజాన్ అలెక్సా పేరును పెట్టే ముందు నైతికత గురించి ఆలోచించలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది'' అని అన్నారామె.

ఒక్క యూకేలోనే 25 సంవత్సరాల వయసు లోపు అలెక్సా అనే పేరున్న వారు 4,000 మందికి పైగా ఉన్నారు. వీరిలో చాలామంది హీథర్‌‌లాగా తమ అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

తన కూతురు అలెక్సాకు కేవలం ఆరేళ్లేనని, కానీ చాలామంది ఆమెను అలెక్సా పేరుతో ఆట పట్టించడం మొదలు పెట్టారని షార్లెట్ (అసలు పేరు కాదు) అనే మహిళ చెప్పారు.

''అలెస్కా, ప్లే డిస్కో అంటూ ఎవరో ఒకరు అరుస్తారు. మిగతా వాళ్లు దాన్ని అనుకరిస్తారు. వాయిస్ కమాండ్స్ పేరుతో ఆమెను ఆటపట్టించేవారు'' అని షార్లెట్ చెప్పారు.

''ఒకసారి మేం పార్కుకు వెళ్లాం. ఒకబ్బాయి మా పాపను పదే పదే అలెక్సా పేరుతో కమాండ్స్ ఇస్తూనే ఉన్నాడు. పాపకు కూడా చిరాకేసింది. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటివి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి'' అన్నారు షార్లెట్.

''ఇలాంటి గాడ్జెట్‌లను కొనడం ద్వారా ప్రజలు తమకు తెలియకుండానే సమస్యలను పెంచుతున్నారు. గాడ్జెట్లలో ఉపయోగించే పేర్లు మార్చవచ్చు. కానీ అమెజాన్ ఆ పని చేయదు'' అన్నారు షార్లెట్.

ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై స్పందించిన అమెజాన్ ఒక ప్రకటన చేసింది.

''మనుషులను గౌరవించే విధంగానే మేం మా ప్రోడక్ట్స్‌ను తయారు చేశాం. వస్తున్న అభ్యంతరాలను గమనించాం. ఇలా జరుగుతున్నందుకు చింతిస్తున్నాం. ఏ రూపంలో అయినా ఎదుటి వారిని ఎగతాళి చేయడం, ఏడిపించడం, నొప్పించడం సరికాదు. మేం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని అమెజాన్ తన ప్రకటనలో పేర్కొంది.

అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

'మీ పేరు కోసం పోరాడండి'

2014 సంవత్సరంలో అలెక్సా ప్రారంభమైన తర్వాత ఈ సమస్య ఒక్క యూకేకు మాత్రమే పరిమితం కాలేదు.

అమెరికాలోని మసాచుసెట్స్‌లో నివసించే లారెన్ జాన్సన్ ఒక ప్రచారం ప్రారంభించారు. 'అలెక్సా అంటే మనిషి' అన్నది ఆయన క్యాంపెయిన్‌ నినాదం.

''నా కూతురు అలెక్సాకు 9 సంవత్సరాలు. ఆమె పేరు మీద ఎగతాళి చేయడం, ఆటపట్టించే దశ కూడా దాటి పోయింది. ఇది ఒకరకంగా ఒక వ్యక్తి గుర్తింపును నాశనం చేయడం. ఇప్పుడు అలెక్సా అనే పేరు బానిస లేదా సేవకుడు అనే మాటలకు పర్యాయపదంగా మారింది. అలెక్సా అనే పేరు మనిషిని అవమానించడానికి, హీనంగా చూడటానికి లైసెన్స్‌గా మారింది'' అన్నారు జాన్సన్.

పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడేలా అలెక్సా పేరుతో బుల్లీయింగ్ జరుగుతోందని తల్లిదండ్రులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడేలా అలెక్సా పేరుతో ఏడిపిస్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.

'నైతికం కాదు'

అలెక్సా పేరుతో జరిగే బుల్లీయింగ్ (ఎగతాళి, ఆటపట్టించడం) సెక్సువల్ నేచర్‌లోకి మారిందని జాన్సన్ అన్నారు.

కొందరు పెద్దవాళ్లు కూడా దీని నుంచి సమస్యను ఎదుర్కొంటున్నారు.

అలెక్సా అనే ఓ మహిళ జర్మనీలోని హాంబర్గ్ నగరంలో నివసిస్తున్నారు.

ఆమె తన పేరుతో వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన జోకులను తరచూ వినవలసి వస్తోంది.

''ఆఫీసులో ప్రజెంటేషన్ కోసం నా పేరు పిలవగానే ఎవరో ఒకరు కచ్చితంగా కామెంట్ చేస్తారు'' అన్నారామె.

''ఒక మనిషి పేరును గాడ్జెట్‌ కమాండ్‌గా ఉపయోగించడం సరికాదు. నా పేరు నాకు గుర్తింపునిస్తుంది. అలెక్సా అన్న పేరున్న వాళ్లంతా దీనిపై పోరాడాలి. దీనిపై అమెజాన్ కూడా ఆలోచించాలి'' అన్నారామె.

2016లో అమెజాన్ యూకేలో అలెక్సా గాడ్జెట్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి అలెక్సా అనే పేరుకున్న ప్రజాదరణ తగ్గింది.

2016లో ఇంగ్లాండ్, వేల్స్‌లలో అత్యంత ప్రజాదరణ ఉన్న పేర్ల జాబితాలో అలెక్సా అనే పేరు 167వ స్థానంలో ఉండేది. కానీ 2019 నాటికి అది 920వ స్థానానికి పడిపోయింది.

అలెక్సాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అమెజాన్ చెబుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలెక్సాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అమెజాన్ చెబుతోంది

అలెక్సా ఒక్కటే కాదు

''అలెక్సాకు ప్రత్యామ్నాయంగా అనేక పేర్లను సూచించాము. యూజర్లు అందులోని ఎకో, కంప్యూటర్, అమెజాన్‌లాంటి పేర్లను వాడుకోవచ్చు'' అని అమెజాన్ తెలిపింది.

మనుషుల పేరు వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ఒక్కదానికి మాత్రమే కాదు. ఆపిల్ సంస్థకు చెందిన వాయిస్ అసిస్టెంట్‌ పేరు సిరి.

తన పేరుతో చాలామంది తనను ఆట పట్టిస్తుంటారని సిరి అనే పేరున్న యూకే మహిళ ఒకరు గతంలో బీబీసీతో అన్నారు.

పేర్ల కారణంగాఎగతాళికి, వేధింపులకు గురవుతుంటే దాని నుంచి ఎలా బైటపడాలన్న దానిపై బ్రిటన్‌కు చెందిన సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు చిల్డ్రన్(ఎన్ఎస్‌పీసీసీ) సంస్థ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది.

1. మీరు ఆన్‌లైన్‌లో గానీ, బహిరంగంగా కానీ, వేధింపులకు గురవుతున్నట్లు అనిపిస్తే నమ్మకస్తులైన పెద్దవాళ్లు అంటే టీచర్లు, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలి.

2. ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏడిపించే వ్యక్తులతో పోరాడటం, ఎదురు దాడి లాంటివి చేయవద్దు. దీనివల్ల ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.

3. గొడవలను నివారించడానికి స్నేహితులతో కలిసి ఉండటం, ఒంటరిగా ప్రయాణించకుండా ఉండటం మంచిది.

4. సోషల్ మీడియాలో ఎవరైనా మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే ఫిర్యాదు చేయండి. అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.

5. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాకింగ్‌కు వెళ్లండి, పుస్తకాలు చదవండి. మంచి సంగీతం వినండి. స్నేహితులతో కలిసి తిరగండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)