ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"ఆధార్ కార్డు ఉంటే రూ. 200, పాన్ కార్డు ఉంటే రూ. 300 ఇస్తామన్నారు. పాన్ కార్డు లేకపోతే వారే ఉచితంగా చేసిపెడతామని కూడా చెప్పారు. డబ్బులు ఇస్తున్నారని తెలియగానే, మేం కూడా మా కార్డులు పట్టుకుని వెళ్లాం. వాటిని ఫోటో తీసుకుని, వేలి ముద్రలు వేయించుకుని, ఐదు వందల రూపాయలు ఇచ్చారు. కొందరు వాళ్లని గట్టిగా నిలదీయడంతో ఇద్దరు పారిపోయారు. ఒకర్ని పోలీసులకు అప్పగించారు" అని గాజువాక దయాల్ నగర్ లోని రోడ్డు పక్కన గుడారాల్లో నివసిస్తున్న సుజాత చెప్పారు.
"మా కార్డులు తీసుకుని వాళ్లు కంప్యూటర్ లో ఏవో ఆటలాడతారట. ఇప్పుడు మాకు ఏమౌతుందోనని భయంగా ఉంది. అసలే గుడిసెల్లో బతుకులు మావి" అని ఆమె అన్నారు.
సుజాతలాగా చాలా మంది డబ్బులకు ఆశపడి తమ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇచ్చారు.
ఆధార్, పాన్ కార్డులకు డబ్బులిచ్చి తీసుకుని వాటి ద్వారా సిమ్ కార్డులు తీసుకుని వాటిని తిరిగి అక్రమ కార్యకలాపాల కోసం అమ్మే నలుగురు వ్యక్తులను విశాఖపట్నం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 40 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, VIZAGPOLICE
అసలేం జరిగింది?
గాజువాక నియోజకవర్గ పరిధిలో మొత్తం 1200 చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా ఉపాధి పొందేందుకు దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు.
వీరిలో ఎక్కువ మంది చిన్న ఉద్యోగాలు, దినసరి కూలీలుగానే పని చేస్తుంటారు. బెట్టింగ్, లోన్ యాప్స్, అన్ లైన్ మోసాలకు సైబర్ నేరగాళ్లు వీరినే టార్గెట్ చేస్తున్నారు.
గాజువాకలో ఆధార్, పాన్ కార్డులు తీసుకుని డబ్బులు పంచిన వారు వాటి ద్వారా అకౌంట్లు ఓపెన్ చేసి గేమ్స్ ఆడతారు, లేదంటే ఆ గేమ్స్ ఆడేవారికి ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడంలో సహయపడతారు.
ఇది కూడా మంచి వ్యాపారంగా భావించి చాలా మంది ఈజీ మనీ కోసం ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఆన్ లైన్ రమ్మీ ఆడేవాళ్లకు రూ.3 వేలకు ఒక్కో సిమ్ అమ్ముతున్నారు. తన సెల్ షాపుకి వచ్చిన వారి నుంచి సేకరించిన ఆధార్, పాన్ కార్డుల వివరాలను అన్ లైన్ రమ్మీ ఆడేవారికి అమ్మడం ద్వారా యలమంచిలికి చెందిన సెల్ షాపు నిర్వహకుడు తాతారావు ఈ మోసాలకు తెర తీసినట్లు విశాఖ లాండ్ ఆర్డర్ డీసీపీ ఐశ్వర్య రస్తోగి వివరించారు.

లాగిన్, అకౌంట్ ఓపెనింగ్ కోసమే...
ఆధార్ , పాన్ కార్డు వివరాలు అపరిచిత వ్యక్తులకు ఇవ్వడమంటే మన వ్యక్తిగత సమాచారం మొత్తం వారికి ఇచ్చేసినట్లేనని ఐటీ నిపుణులు చెప్తున్నారు.
ఆధార్ అన్నింటితోనూ లింకై ఉండటంతో... దాని ద్వారా ఎవరి సమాచారాన్నైనా సంపాదించడం సైబర్ నేరగాళ్లు ఈజీగా చేయగలరని హెచ్చరిస్తున్నారు.
"రమ్మీ వంటి ఆన్‌లైన్ గేమ్స్ లేదా బెట్టింగ్ యాప్స్ అకౌంట్లు కావాలంటే ముందుగా రిజిస్టర్ అవ్వాలి. దాని కోసం ఆధార్, పాన్, ఈ-మెయిల్ లేదా ఫేస్ బుక్ అకౌంట్ ఉండాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది.
వివిధ వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సంపాదించి వారి పేరుతో రిజిస్టర్ అవుతారు. ఆధార్, పాన్ ఉంటే చాలు కొత్త అకౌంట్లు ఎన్నైనా ఓపెనింగ్, లాగిన్ చేసేయవచ్చు.
ఆధార్, పాన్, సిమ్ కార్డు... ఈ మూడు చాలు, వారి పేరుతో అపరిచిత వ్యక్తులు ఆర్ధిక మోసాలకు దిగవచ్చు. ఇటువంటి ఫ్రాడ్స్ చేస్తున్నవారు పోలీసులకు దొరికినా...మన అకౌంట్ల నుంచి పోయిన డబ్బుగానీ, మన పేరుతో చేసిన అప్పులకు కానీ ఎవరు బాధ్యత వహించరు" అని పశ్చిమగోదావరి జిల్లాలోని 'ఆశ్రమ్' వైద్య కళాశాల ఐటీ విభాగం మేనేజర్ కిరణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
"ఐదు వందలు ఇస్తామనగానే ఆధార్, పాన్ కార్డులు ఇచ్చేస్తున్నారు. అసలు డబ్బులు ఎందుకు ఇస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. మోస పోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తారు. ఇటువంటి సైబర్ నేరాలను ఎవరు చేస్తున్నారు...? వారు ఎక్కడున్నారు...? వంటి విషయాలు కనుక్కోవడం కష్టం" అని గాజువాకలోని న్యూ పోర్టు పోలీసు స్టేషన్ సీఐ రాము అన్నారు.

ఫొటో సోర్స్, VIZAG POLICE
ఫేక్ జీపీఎస్ తో...
ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో ఆన్లైన్ రమ్మీ, ఇతర బెట్టింగ్ యాప్స్ పై గేమింగ్ యాక్ట్-1974 ప్రకారం నిషేధం ఉంది. అయినా కూడా ఫేక్ జీపీఎస్ యాప్ ల ద్వారా ఆడుతున్నారు.
అయితే, ఫేక్ జీపీఎస్ లను నిర్వాహకులు గంట లేదా ఒకటి, రెండు గేమ్స్ ఆడే లోపు లోకేషన్ ను గుర్తిస్తారు. దాంతో ఆ సిమ్ కార్డులను బ్లాక్ చేస్తారు. దీంతో ఆ ఆన్ లైన్ రమ్మీ లేదా ఇతర నిషేధిత ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వారికి ఎక్కువ సిమ్‌లు అవసరమై, ఇతరుల పేర్లతో తీసుకుంటున్నారు. దీంతో ఈ తరహా సిమ్ కార్డుల అమ్మకం పెద్ద వ్యాపారంగా మారిపోయింది.
"ఆ సిమ్‌ల ద్వారా వివిధ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఒక గేమ్‌లో నలుగురు ఆటగాళ్లు ఉంటారు. వారు ఒకే ప్రాంతానికి చెందినవారై ఉండకూడదు. కొందరు గ్రూపుగా ఏర్పడి ఫేక్ జీపీఎస్ ఆధారంగా ఒకే చోట నుంచి ఆడుతూ...వేర్వేరు ప్రాంతాల నుంచి ఆడుతున్నామని నమ్మిస్తారు. అలా వీళ్లతో ఆడుతున్న వ్యక్తిని మోసం చేసి గెలుస్తారు.
"ఈ తరహా మోసంతో డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, దిల్లీ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన ఈ ఆన్‌లైన్ గేమ్స్ టెక్నాలజీ విస్తృతంగా పెరగడంతో చిన్న చిన్న పట్ణణాలకు సైతం ఈ కల్చర్ పాకింది" అని డీసీపీ రస్తోగి చెప్పారు.

ఫొటో సోర్స్, VIZAG POLICE
ఒకే సిస్టమ్ ఉండాలి...
కొన్ని రకాలైన గేమ్స్, యాప్స్ వాడకంపై దేశమంతా ఒకే విధానం లేదు. ఆన్‌లైన్ రమ్మీ వంటి గేమ్స్‌ను సిక్కిం, నాగలాండ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు నిషేధించాయి. అలా కాకుండా వీటిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోని రాష్ట్రాల్లో వీటికి ఆమోదం ఉన్నట్లే భావించాల్సి వస్తోంది.
లెండింగ్ యాప్స్, బెట్టింగ్ గేమ్స్, రమ్మీ వంటి జూదం తరహా ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో ఒకే విధానం ఉండాలని ఐటీ, సైబర్ నిపుణులు అంటున్నారు.
"స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు గేమ్స్ ఆడండి, డబ్బులు సంపాదించడని మేసేజ్ లు కుప్పలుగా వస్తుంటాయి. దీంతో సరదాగా ఒకసారి ట్రై చేద్దామని దిగి, ఆ తర్వాత అడిక్ట్ అయిపోతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటీ వరకు ఈ యాప్ ల డౌన్ లోడ్లు విపరీతంగా పెరిగాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్ రమ్మీ యాప్ 2021 జనవరి నాటికి 32 కోట్ల డౌన్ లోడ్లు జరిగాయని ఒక అంచనా" అని రమణమూర్తి అన్నారు.
"ఒకే విధానం లేకపోవడం, సాంకేతికత పెరగడంతో వీటిని అడ్డుకోవడం కష్టంగా మారుతోంది. సైబర్ నేరాలకు సంబంధించిన సమగ్రమైన చట్టాలు రూపొందించాలి" అని రే ఇన్ఫోసిస్ ఐటీ టెక్నాలజీస్ ఎండీ రమణమూర్తి బీబీసీతో చెప్పారు.
ఆన్‌లైన్ పేకాట, మనీ లెండింగ్ యాప్‌లు కారణంగా గతంలో విశాఖపట్నంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఒకరు ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ. 25 లక్షలు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. మరో అమ్మాయి వివిధ లెండింగ్ యాప్స్ లో అప్పులు చేసి తీర్చలేక ఇంట్లో వాళ్లకి చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
"నాలుగు రోజుల క్రితం తెలంగాణాలో తొమ్మిదో తరగతి అబ్బాయి తన తండ్రి సెల్ ఫోన్ కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా అకౌంట్లో నుంచి లక్షన్నర రూపాయలు గల్లంతయ్యాయి. ఇలా ఒకవైపు ప్రాణాలు పోతున్నా, మోసాలు జరుగుతున్నా ఆన్‌లైన్ యాప్స్, లింక్స్, గేమ్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం లేదు" అని సీఐ రాము అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








