లైంగిక వేధింపులకు గురైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం

తల్లి న్యాయ పోరాటం
    • రచయిత, సోనా రాయ్
    • హోదా, బాధితుడి తల్లి, బీబీసీ కోసం

అది 2019, ఆగస్టు 16. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందడి ఇంకా కొనసాగుతుంటే.. ఆరోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజుగా మారింది.

నాకు పుణె పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది. మేడమ్, నిందితుడిని దోషిగా నిర్ధారించారు అన్నారు. నేను కాసేపు మౌనంగా ఉండిపోయాను. నాకు అంతా అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. అది నా కొడుకు కోసం నేను చేసిన నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత దక్కిన విజయం. స్కూల్లోని ఒక ప్యూన్ నా బిడ్డను లైంగికంగా వేధించాడు.

అది 2015 ఏప్రిల్‌లో జరిగింది. నా కొడుకు 13 ఏళ్లు వచ్చి కొన్ని వారాలే అయ్యింది. మేం తనను పుణెలోని ఒక ప్రముఖ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాం.

తనను అక్కడ వదిలి ఇంటికి వస్తున్న మొదటి రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. వంద కిలోమీటర్ల రోడ్డు నాకు అనంతంగా అనిపించింది.

మనసు బరువెక్కిన నేను వెనక్కు తిరిగాను. నా కొడుక్కి నేను దూరంగా ఉండడం అదే మొదటిసారి. అన్నీ సర్దుకుంటున్న సమయంలో, నాకు మా అబ్బాయి ఒక ఈమెయిల్ పంపాడు. అందులో స్కూల్లోని ఒక ప్యూన్ తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని రాశాడు.

ఆ మెయిల్‌లో "మమ్మీ... ఈ స్కూల్లో ప్యూన్లు చాలా వింతగా ఉన్నారు. వాళ్లలో ఒకడు నన్ను వెనక నుంచి పట్టుకోడానికి ప్రయత్నించాడు. తన చేతిని నా ప్యాంటు లోపల పెడుతున్నాడు" అన్నాడు.

తల్లి న్యాయ పోరాటం

న్యాయం కోసం పోరాటం

బోర్డింగ్ స్కూల్లో తనను వదిలి కష్టంగా నాలుగు రోజులు గడిపాను. ఆ ఘటనతో నేను షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు.

అప్పుడే వాళ్ల నాన్న నాకు ఫోన్ చేశారు. మా అబ్బాయి ఆయనకు కూడా ఆ ఈ-మెయిల్ పంపించాడు. మేం వెంటనే నవీ ముంబైలోని ఇంటి నుంచి బోర్డింగ్ స్కూలుకు బయల్దేరాం.

నేను నా కొడుకు స్కూల్ ఏరియాలోని పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాను. జరిగిన విషయం గురించి చెప్పాను. పోలీసులు చాలా సహకరించారు. వాళ్లు నేను చెప్పింది వినడమే కాదు, వెంటనే స్కూల్‌ దగ్గరకు వెళ్లారు.

15 నిమిషాల్లో నాకు మళ్లీ అదే పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. మీ అబ్బాయి మాతోపాటూ సురక్షితంగా ఉన్నాడని చెప్పాడు. అది విన్నాక నాకు మనసు కుదుటపడింది. అంతే కాదు వాళ్లు నా కొడుకుతో నన్ను మాట్లాడనిచ్చారు. దాంతో నాకు ప్రాణం లేచొచ్చింది.

బోర్డింగ్ స్కూల్ చేరుకోగానే మేం అక్కడి ప్రిన్సిపల్‌ను కలిశాం. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తికి శిక్ష పడేలా చేస్తానని చెప్పాను. నేను అలా అనడంతో ఆయనకు కోపం వచ్చింది.

ప్రిన్సిపల్ ఆ ప్యూన్‌ను అప్పటికే ఉద్యోగం నుంచి తీసేశాడు. కుటుంబంతో సహా స్కూల్ దగ్గర నుంచి నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆయన బహుశా అతడికి అదే తగిన శిక్ష అనుకుని ఉంటారు. కానీ దానికి, నా తల్లి మనసు సంతృప్తి చెందలేదు.

ఒక లైంగిక నేరస్థుడిని నేను అలా ఎలా వదిలేయగలను.

స్కూల్ ప్రిన్సిపల్‌కు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. స్కూల్ పరువు బజారున పడుతుందని ఆయన అనుకుంటున్నారు. ఆయన ఆందోళను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. లైంగిక వేధింపులపై నేను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను. వాళ్లు ప్యూన్‌ను అరెస్టు చేశారు.

నా కొడుకు కోసం న్యాయ పోరాటం అక్కడనుంచే మొదలైంది. కానీ దానికి ముగింపు నాలుగేళ్ల తర్వాత లభించింది.

నా కొడుకుతో మాట్లాడుతున్న సమయంలో, అదే ప్యూన్ మరికొందరు పిల్లలతో కూడా అలాగే ప్రవర్తించినట్టు తెలిసింది. అతడి వేధింపులకు గురైన వారిలో నా కొడుకు స్నేహితులు కూడా కొందరు ఉన్నారు.

ఆ పిల్లలు ప్యూన్ అలా చేసినట్లు వాళ్ల అమ్మనాన్నలతో ఎప్పుడైనా చెప్పారా, దానికి వాళ్ల పేరెంట్స్ ఏం చేశారు అని నేను మా అబ్బాయిని అడిగాను. తను చెప్పిన జవాబు విని షాకయ్యాను.

వాళ్ల తల్లిదండ్రులు పిల్లలతో దాని గురించి ప్రిన్సిపల్‌కు పిర్యాదు చేయమని చెప్పారట. ఆ పిల్లలు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ప్రిన్సిపల్‌ మాత్రం అతడిని తీసేసి చేతులు దులుపుకున్నారు. అంత జరిగితే, ఎవరైనా మౌనంగా ఎలా ఉండగలరు. లేదంటే, నేనే దీన్ని పెద్ద విషయం చేస్తూ తప్పు చేస్తున్నానా? అని ఆలోచిస్తూ ఉండిపోయాను.

నా కొడుకు ఈమెయిల్ చదివాక, నేను వాళ్ల స్కూలుకు వెళ్లినప్పుడు నాలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరిగాయి. ఒకవైపు నాకు కోపం, ఇంకోవైపు నిస్సహాయంగా అనిపించింది.

నా కొడుకును నేను రక్షించుకోలేకపోయాననే ఆలోచన నన్ను కుంగదీసింది. కళ్ల నుంచి కన్నీళ్లు ఉబుకుతున్నాయి. అవి కోపంతో వస్తున్నాయి.

తల్లి న్యాయ పోరాటం

అమ్మాయి కాదుగా, అబ్బాయే కదా..

ఆ పోరాటంలో నేను దాదాపు ఒంటరిగా చేశాను. నా భర్త నాతో "కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడం ఎందుకు. ఆ ప్రభావం పిల్లాడి చదువు మీద పడుతుంది. మనం కూడా చిక్కుల్లో పడతాం" అన్నారు. నేను దీన్ని అంత పెద్దది చేయడం ఎందుకని మా బంధువులు అన్నారు. "అలా జరిగింది అబ్బాయికే కదా, అమ్మాయి కాదుగా" అన్నారు.

కానీ ఒక తల్లికి తన బిడ్డపై ఎలాంటి భావనలు ఉంటాయో నాకు తెలుసు. దానిని భర్త, బంధువులు అర్థం చేసుకోలేరు.

కేసు కోర్టుకు వెళ్లి దాదాపు రెండేళ్లైంది. మా కేసును ప్రభుత్వ వకీల్ వాదిస్తున్నారు. కోర్టులో ప్రొసీడింగ్స్, తేదీలు, మిగతా ప్రక్రియల గురించి తెలుసుకోడానికి నేను తరచూ ఆయన్ను కలవడానికి వెళ్లేదాన్ని.

నాలుగు గంటలు డ్రైవ్ చేశాక, బాగా అలసిపోయి లాయర్ దగ్గరికి చేరుకునేదాన్ని. నేను నాతోపాటు నా చిన్న కొడుకును కూడా తీసుకెళ్లేదాన్ని. ఎందుకంటే తను చాలా చిన్నవాడు. వాడిని ఇంట్లో ఒంటరిగా వదల్లేను. ఆ తర్వాత మంచి ఎండలోనే కోర్టు పరిసరాల్లో రోజంతా నిలబడాల్సి వచ్చేది. అది నా చిన్న కొడుక్కి చాలా కష్టం అయ్యేది. కానీ ఎలాగోలా ఉండేవాళ్లం.

నా కొడుకు కేసు చూస్తున్న పోలీస్ అధికారి కూడా నాకు చాలా సహకరించేవారు. విచారణ సమయంలో మా దగ్గరకు వచ్చి మాతోపాటే ఉండేవారు. ఆయన లాంటి వారిని చూశాక, నాకు పోలీస్ డిపార్ట్‌మెంటుపై నమ్మకం పెరిగింది.

2018 డిసెంబర్‌లో వాంగ్మూలం ఇచ్చేందుకు నా కొడుకును బోనులోకి పిలిచారు. అది ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఎందుకంటే జీవితంలో మొదటిసారి మేం కోర్టు రూంలోకి వెళ్లాం.

నాకు అది ఒక భయంకరమైన అనుభవం. అప్పుడు మా అబ్బాయికి 16 ఏళ్లు. దోషులు, నేరస్థులు, నిందితులతో నిండిపోయిన కోర్టు రూంలో తను బోనులో నిలబడాల్సి వచ్చింది.

నా కొడుకు కోర్టు రూం లోపల ఉన్న సమయంలో, నేను బయటే ఉండాలని చెప్పారు. ఎందుకంటే తల్లి ఎదురుగా ఉంటే బిడ్డపై ఆ ప్రభావం పడుతుందని జడ్జిగారికి అనిపించింది. కోర్టు రూం బయట నిలబడిన నేను లోపల తొంగి చూడాలని ప్రయత్నించాను. లోపల ఏం జరుగుతోందో ఏదీ వినిపించడం లేదు. కానీ నేను నా కొడుకు లోపల భయపడకుండా నిలబడి ఉండడం కనిపించింది.

నేను ఆ రోజు నా కొడుకు ముఖం ఎప్పటికీ మర్చిపోలేను. తనలో భయంగానీ, ఆందోళనగానీ కనిపించడం లేదు. కానీ ఆ ముఖంలో ఒక బాధ ఉంది.

మేం క్లోజ్డ్ రూంలో విచారణ జరగాలని దరఖాస్తు చేసుండవచ్చు. కానీ మా వకీల్ నాకు దాని గురించి చెప్పలేదు.

రెండు గంటలపాటు నా కొడుకును విచారించినపుడు, ఇబ్బంది పెట్టే చాలా ప్రశ్నలకు తను సమాధానం చెప్పాల్సి వచ్చిందని నాకు తర్వాత తెలిసింది.

నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మొట్ట మొదటిసారి నేను అందరి ముందూ బిగ్గరగా ఏడ్చాను. నా కొడుకును గట్టిగా హత్తుకుని, "నువ్వు ఇలాంటివన్నీ చూడాల్సి వస్తే మనకీ కేసులేవీ వద్దు. నాకు ఇక ఏ న్యాయం అక్కర్లేదు" అన్నాను.

నన్ను పట్టుకున్న నా కొడుకు "మమ్మీ.. మీరు ఫైటర్. పోరాటం చేయకుండానే ఓటమి ఎందుకు ఒప్పుకుంటారు. మనం ఇంత దూరం వచ్చింది, దీన్ని మధ్యలో వదిలేయడానికా" అన్నాడు.

నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. తను కూడా నాతో ఎప్పుడూ "బలమైన అమ్మలే బలమైన కుటుంటాన్ని నిలబెట్టగలరు" అనేది.

బలహీనమైన తల్లి అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. న్యాయ పోరాటం కొనసాగించేందుకు మళ్లీ నిలబడ్డాను.

తల్లి న్యాయ పోరాటం

తర్వాత నా వంతు వచ్చింది. డిఫెన్స్ తరఫు వకీల్ అడిగే ప్రశ్నలకు నేను సమాధానాలు ఇవ్వాలి. నేను కూడా కోపం తెప్పించేలా ఉన్న ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి వచ్చింది. కానీ కన్నీళ్లు నిండిన కళ్లతో నా కొడుకు నా వైపు చూసి, నవ్వుతూ గుడ్‌లక్ అని సైగ చేశాడు.

స్కూల్లో చేరిన నా కొడుకు మొదటిసారి తల్లికి దూరంగా ఉన్నాడని, అందుకే తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని కట్టు కథలు అల్లాడని డిఫెన్స్ వకీల్ వాదించడానికి ప్రయత్నించాడు. ఆయన నా కొడుకును కూడా అలాంటి ప్రశ్నలే అడిగాడు.

కానీ మా అబ్బాయి వాటికి చాలా ప్రశాంతంగా జవాబు చెప్పాడు. "13 ఏళ్ల వయసులోని ఎక్కువ మంది పిల్లలకు లైంగిక వేధింపులు అనే మాటే తెలీదు. నాకు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పడం కంటే, ఆరోగ్యం సరిగా లేదని సాకు చెప్పడం చాలా సులభం కదా" అన్నాడు.

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మా కేసులో వాదనలు విన్న జడ్జి కూడా చాలా మంచివారు. ఆయన మేం ధైర్యంగా చెప్పిన మా మాటలు వినడంతోపాటు, డిఫెన్స్ వకీల్ వేసిన ప్రశ్నలపై చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ అగ్నిపరీక్ష చివరికి ఈ ఏడాది మార్చిలో ముగిసింది. కోర్టు అంతిమ తీర్పు కోసం వేచిచూడాలని మాకు చెప్పింది. అయితే నా కేసు బలహీనమైనది కాదని నాకు తెలుసు. కానీ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం లేదు. అవతలి వారు పైకోర్టుకు కూడా వెళ్లాలని అనుకున్నారు.

ఆగస్టు 16న నా ప్రయత్నం ఫలించింది. కోర్టు ఆ లైంగిక నేరస్థుడికి మూడేళ్ల కఠిన జైలు శిక్ష, పోక్సో యాక్ట్ ప్రకారం జరిమానా విధించింది.

నేను ఆ తీర్పుతో సంతోషించాను. కానీ అక్కడ లైంగిక వేధింపులకు గురైన మిగతా పిల్లలకు ఏ సాయం చేయలేకపోయానే అని బాధగా అనిపించింది. వారి వైపు ఎవరూ నిలబడలేదు. వాళ్ల తల్లిదండ్రులు కూడా.

నా ఈ కథ, బహుశా వారికి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గొంతు వినిపించే ధైర్యాన్ని ఇవ్వాలి. మనం ఇలాంటి లైంగిక వేధింపులు, నేరాలకు వ్యతిరేకంగా నిలబడితే మన పిల్లలు. ముందు తరాల వారికోసం మన సమాజాన్ని కచ్చితంగా మార్చవచ్చు.

వారి రేపు ఎలా ఉండాలో నిర్ణయించడం ఈరోజు మీ వంతు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)